ప్రతి సంవత్సరం అక్టోబరు 11న నిర్వహించబడుతోంది. From Wikipedia, the free encyclopedia
అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 11న నిర్వహించబడుతోంది. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి, వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. అమెరికన్ పౌరహక్కుల కార్యకర్త ఎలానార్ రూజ్వెల్ట్, 192 దేశాలు సంతకం చేసిన మానవ హక్కుల ప్రకటనలో స్ర్తీ, పురుష సమానత్వాన్ని ప్రతిబింబించేలా మ్యాన్ అన్న పదాన్ని పీపుల్‌గా మార్చింది. మహిళల ఆత్మగౌరవం కాపాడడం కోసం పోరాటం చేసిన ఎలానార్ రూజ్వెల్ట్ పుట్టిన రోజైన అక్టోబరు 11ను అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది.[1] 2012, అక్టోబరు 11న తొలిసారిగా ఈ దినోత్సవం జరుపబడింది. ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు (విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, హింస, బలవంతపు బాల్య వివాహం)పై, వివక్షతపై అవగాహన పెంచడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం.[2] బాలికలు, యువతులు వారివారి రంగాలలో ప్రచారం, పరిశోధనలకు సంబంధించి సాధించిన అభివృద్ధిని ప్రతిబింబించేలా ఈ దినోత్సవ వేడుకలు జరుగుతాయి.[3]
అంతర్జాతీయ బాలికా దినోత్సవం | |
---|---|
![]() 2014లో జరిగన అంతర్జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బాలికలు | |
యితర పేర్లు | అంతర్జాతీయ బాలికా దినోత్సవం |
రకం | అంతర్జాతీయ |
ప్రాముఖ్యత | విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, హింస, బలవంతపు బాల్య వివాహాలపై, వివక్షతపై అవగాహన పెంచడం |
జరుపుకొనే రోజు | అక్టోబరు 11 |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి సంవత్సరం ఇదేరోజు |
ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవం అవగాహన కలిగిస్తుంది. ప్రపంచ అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రణాళికలలో బాలికలను చేర్చడంగానీ, వారిని పరిగణించడంగానీ చేయడంలేదు, అలాగే వారి సమస్యలను కూడా పట్టించుకోవడంలేదు.[4] వాషింగ్టన్ లోని యునైటెడ్ స్టేట్స్ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ 2014లో అందించిన వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 62 మిలియన్లకు పైగా బాలికలకు విద్య అందడంలేదు.[5] ప్రపంచవ్యాప్తంగా 5 నుండి 14 సంవత్సరాల వయస్సు గల బాలికలు, అదే వయస్సు గల అబ్బాయిల కంటే 160 మిలియన్ గంటలకుపైగా ఇంటి పనుల కోసం తమ సమయాన్ని కేటాయిస్తున్నారు.[6] ప్రపంచవ్యాప్తంగా, నలుగురిలో బాలికల్లో ఒకరికి 18 ఏళ్ళకంటే ముందుగానే వివాహం జరుగుతోంది.[7] 2016, అక్టోబరు 11న, ఐక్యరాజ్యసమితి వుమెన్ గుడ్‌విల్ అంబాసిడర్ ఎమ్మా వాట్సన్, బలవంతపు బాల్య వివాహాలను అంతం చేయాలని ప్రపంచ దేశాలను, కుటుంబాలను కోరింది.[8]
బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియజేయడమేకాకుండా, ఆ సమస్యలు పరిష్కరించబడినప్పుడు జరిగే పరిణామాల గురించి కూడా అవగాహన పెంచడానికి ఈ దినోత్సవం ఉపయోగపడుతోంది. బాలికలను విద్యావంతులను చేసి, బాల్య వివాహాలు తగ్గించడంలో, విద్యను అభ్యసించిన బాలికలు అధిక వేతనాలతో ఉద్యోగాలు పొందడంలో మార్గదర్శకంగా నిలవడం ద్వారా మహిళత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతోంది.[9][10]
ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలు నిర్వహించే ప్లాన్ ఇంటర్నేషనల్ అనే ఒక ప్రభుత్వేతర సంస్థ ప్రాజెక్టుగా ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రారంభమైంది.[11] ప్లాన్ ఇంటర్నేషనల్ రూపొందించిన బికాజ్ ఐ యామ్ ఎ గర్ల్ అనే క్యాంపెయిన్ నుండి అంతర్జాతీయ దినోత్సవ నిర్వహణ, వేడుకల ఆలోచన వచ్చింది. ఇది ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో బాలికలను సంరక్షించే ప్రాముఖ్యతపై అవగాహన పెంచుతుంది. కెనడాలోని ప్లాన్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు కెనడియన్ ఫెడరల్ ప్రభుత్వాన్ని సంప్రదించి మద్దతుదారుల కూటమిని కోరుతూ అంతర్జాతీయంగా అవగాహన పెంచుతూ, చివరికి ఐక్యరాజ్య సమితిని కూడా ఇందులో పాల్గొనాలని కోరింది. [12] ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కెనడా తన తీర్మానంతో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని అధికారికంగా ప్రతిపాదించింది. కెనడా మహిళామంత్రి రోనా అంబ్రోస్ ఈ తీర్మానాన్ని స్పాన్సర్ చేసింది; 55వ ఐక్యరాజ్యసమితి కమిషన్‌లో మహిళల స్థితిగతులపై మద్దతుగా మహిళలు, బాలికల ప్రతినిధి బృందం ప్రదర్శనలు చేసింది. 2011, డిసెంబరు 19న జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో 2012, అక్టోబరు 11న తొలి అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ఆమోదించే తీర్మానానికి ఓట్లు వేయగా, అధికారికంగా బాలికా దినోత్సవం గుర్తించబడిందిని తీర్మానం పేర్కొంది.
ఈ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం ఒక నేపథ్యాన్ని కలిగి ఉంటుంది
2013 నాటికి ప్రపంచవ్యాప్తంగా బాలికా దినోత్సవం సందర్భంగా సుమారు 2,043 కార్యక్రమాలు, వేడుకలు జరిగాయి.[16]
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఈ బాలికా దినోత్సవాన్ని ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. భారతదేశంలోని ముంబైలో జరిగిన కచేరీ వంటి కార్యక్రమాలకు ఐక్యరాజ్యసమితి ఆర్థిక సహాయం అందిస్తుంది.[17] గర్ల్ గైడ్స్ ఆస్ట్రేలియా వంటి ప్రభుత్వేతర సంస్థలు ఈ దినోత్సవం కోసం జరిగే కార్యక్రమాలు, కార్యకలాపాలకు సహకారం అందిస్తాయి.[18] బాలికలు, ఫుట్‌బాల్ దక్షిణాఫ్రికా వంటి స్థానిక సంస్థలు తమ సొంత కార్యక్రమాలను రూపొందించుకున్నాయి, 2012లో అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా టీ-షర్టులను పంపిణీ చేశాయి, 1956లో జరిగిన బ్లాక్ సాష్ మార్చ్‌ను 20,000 మంది మహిళలు గుర్తుచేసుకున్నారు.[19] 2013లో లండన్ సౌత్ బ్యాంక్‌లో ఈ దినోత్సవం సందర్భంగా రోజంతా ఒక కార్యక్రమం జరిగింది, ఇందులో బాడీ గాసిప్ నిర్మించిన నాటక, సినిమా ప్రదర్శనలు జరిగాయి. ఇది శరీర అకృతి, మానసిక ఆరోగ్య సమస్యలపై ప్రచారం చేస్తుంది.[20] వేలాది మంది కార్యకర్తలను, సంస్థలను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి సేజ్ గర్ల్, ఐట్విక్సీ సంస్థలు ఒక అంతర్జాల వేడుకను కూడా రూపొందించాయి.[21]
2016లో లండన్ విమెన్ ఆఫ్ ది వరల్డ్ (వావ్) అనే సంస్థ ఒక వేడుకను నిర్వహించింది, ఇందులో 250మంది లండన్ పాఠశాల బాలికలు, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.[22] 2016లో, యునైటెడ్ స్టేట్స్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా లింగ అసమానతను రూపుమాపడానికి ఒక ప్రకటన విడుదల చేశాడు.[23]
ఈ దినోత్సవంకి సంబంధించిన సమాచారాన్ని, కార్యక్రమాల వివరాలను తెలుసుకోవడానికి సోషల్ మీడియా #dayofthegirl అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తుంది.[24]
Seamless Wikipedia browsing. On steroids.