From Wikipedia, the free encyclopedia
స్వయంవరం మలయాళ భాషలో తీయబడిన చలనచిత్రం. ఇది అడూర్ గోపాలక్రిష్ణన్ దర్శకత్వంలో 1972లో విడుదలైన సినిమా. ఈ సినిమా ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ ఛాయాగ్రాహకుడు (నలుపు తెలుపు) అనే నాలుగు విభాగాలలో జాతీయ చలనచిత పురస్కారాలను గెలుచుకుంది.[1]
స్వయంవరం | |
---|---|
దర్శకత్వం | అడూర్ గోపాలక్రిష్ణన్ |
రచన | అడూర్ గోపాలక్రిష్ణన్ కె.పి.కుమరన్ |
కథ | అడూర్ గోపాలక్రిష్ణన్ |
నిర్మాత | చిత్రలేఖ ఫిలిం కోఆపరేటివ్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఎం.రవివర్మ |
కూర్పు | రమేశన్ |
సంగీతం | ఎం.బి.శ్రీనివాసన్ |
పంపిణీదార్లు | చిత్రలేఖ ఫిలిం కో ఆపరేటివ్ |
విడుదల తేదీ | 24 నవంబరు 1972 |
సినిమా నిడివి | 131 నిమిషాలు |
దేశం | భారత దేశం |
భాష | మలయాళం |
బడ్జెట్ | ₹2,50,000 (US$3,100) |
విశ్వం, సీత ఇద్దరూ అప్పుడే నవజీవన ప్రాంగణంలోకి అడుగు పెట్టిన ప్రేమికులు. పాత సాంప్రదాయాలను పట్టుకుని వేలాడే పెద్దవాళ్ళ అభ్యంతరాలను లెక్క చేయక తమకు తాముగా ఈ విశాలమైన ప్రపంచంలో స్వతంత్రంగా, స్వశక్తితో బ్రతకగలమన్న విశ్వాసంతో ఆ నగరంలోనికి అడుగు పెట్టారు. కానీ ఈ వ్యవస్థలో జీవితం పూలబాట కాదనీ, అనుక్షణం సమస్యల ముళ్ళే ఎదురౌతాయని చాలా ఆలస్యంగా గుర్తించారు ఆ యువదంపతులు!
విశ్వానికి ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు. దగ్గరున్న డబ్బు మాత్రం వాళ్ళ ఆశల్లాగే క్షీణించసాగింది. వ్యయభారాన్ని తగ్గించడం కోసం వాళ్ళు పూరిగుడిసెల వాతావరణంలోకి చేరవలసి వచ్చింది.
విశ్వం తాను చూస్తున్న జీవితాన్ని, సమస్యలను నిజాయితీగా తన రచనలలో ప్రతిబింబిస్తూ రచయితగా ఈ సమాజంలో బ్రతకగలనని అనుకున్నాడు. కానీ ఎదురుదెబ్బ తినక తప్పలేదు. కష్టాలు ఎన్నైనా భరించవచ్చు - కానీ దహించే ఆకలిని ఎలా చల్లార్చడం అన్న పేద ప్రజల సమస్య వాళ్ళకూ ఎదురైంది. విశ్వం తన ఆశయాలకూ ఆదర్శాలకూ సమాధి కట్టవలసి వచ్చింది.
వాళ్ళచుట్టూ బతుకుతున్న వాళ్ళూ ఇలా సమస్యలతో జీవిత పోరాటాన్ని ఎంతోకాలంగా కొనసాగిస్తున్నారు. అయితే ఒక్కొక్కరిదీ ఒక్కొక్క దారి. వితంతువైన జానకమ్మ బియ్యం వ్యాపారం చేస్తుంటే కల్యాణి వేశ్యగా బ్రతుకుతూంది. వాసూ అనే వాడు స్మగ్లర్. వీళ్ళంతా జీవితంలో దగాపడ్డవాళ్లే కానీ మొండిగా జీవించడానికి అలవాటు పడిపోయారు.
విశ్వానికి ఉన్నట్టుండి జబ్బు చేసింది. భర్త బ్రతకాలంటే మందులు కావాలి. కానీ వాళ్ళను ఆదుకోగల స్తోమత అక్కడ ఎవరికుంది? స్వయంవరం లో తానెన్నుకున్న జీవితం ఇలా పరిణమించేసరికి సీత కన్నీరు మున్నీరుగా విలపించింది. కానీ ఆమె ఆవేదన కన్నీళ్ళు విశ్వాన్ని బ్రతికించలేకపోయాయి.
ఇప్పుడామె ఎలా బ్రతకాలి? దగాపడిన ఆమె జీవితం - వాసు, కల్యాణి, జానకమ్మలలా ఇప్పుడు ఏ మార్గాన్ని అనుసరించాలి?
మన సమాజాన్ని ఇలా ప్రశ్నిస్తూ ఈ సినిమా ముగుస్తుంది.[2]
సంవత్సరం | అవార్డు | విభాగము | లబ్దిదారుడు | ఫలితం |
---|---|---|---|---|
1973 | మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం | ఉత్తమ దర్శకుడు | అడూర్ గోపాలక్రిష్ణన్ | ప్రతిపాదించబడింది |
1973 | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు | ఉత్తమ చిత్రం | స్వయంవరం | గెలుపు |
1973 | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు | ఉత్తమ నటి | శారద | గెలుపు |
1973 | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు | ఉత్తమ దర్శకత్వం | అడూర్ గోపాలక్రిష్ణన్ | గెలుపు |
1973 | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు | ఉత్తమ ఛాయాగ్రహణం | ఎం.రవివర్మ | గెలుపు |
1973 | కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు | ఉత్తమ ఛాయాగ్రాహకుడు | ఎం.రవివర్మ | గెలుపు |
1973 | కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు | ఉత్తమ కళాదర్శకుడు | దేవదత్తన్ | గెలుపు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.