భక్తి
From Wikipedia, the free encyclopedia
భక్తి (దేవనాగరి: भक्ति) ఒక పవిత్రమైన భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు.
వైష్ణవులకు భక్తి ప్రక్రియ విష్ణువు, కృష్ణుడు లేదా అతని అవతారాలకు సంబంధించింది.[1] అదేవిధంగా శైవులకు శివుడు, శక్తి లేదా వారి అవతారాలకు సంబంధించింది.
భక్తి యోగం గురించి భగవద్గీతలో వేదాంతాల సారంగా పేర్కొన్నది.[2] నారద భక్తి సూత్రాలు పలురకాల భక్తి విధాల గురించి పేర్కొన్నది.
భక్తిలో రకాలు
భగవంతుని పొందడానికి భాగవతంలో నవవిధభక్తులు అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి. ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉంది. ఆ శ్లోకం:
శ్రవణం కీర్తనం విష్ణోః
స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం
సఖ్యమాత్మ నివేదనం
'పై శ్లోకాన్ని పోతన తెనిగించిన విధం
తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనా
ర్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి స
జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!
అనగా భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి.
- శ్రవణ భక్తి : సత్పుతురుషుల వాక్యాలు, సంద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి వీలవుతుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీనివలన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. పరీక్షిత్తు శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందాడు.
- కీర్తనా భక్తి : భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట కీర్తనా భక్తి. భగవంతుని సాఅక్షాత్కరింప చేసుకోడానికి కీర్తన భక్తి ఉత్తమమైనది. వాల్మీకి, నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, ఆళ్వారులు, నయనార్లు, రామదాసు మొదలైన వారు కీర్తన భక్తితో పరమపదం పొందారు.
- స్మరణ భక్తి : భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించుట స్మరణ భక్తి. ఇది నామస్మరణం, రూపస్మరణం, స్వరూపస్మరణం అని మూడు విధాలు. మునులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, తులసీదాసు త్యాగరాజు మొదలైన వారు స్మరణ భక్తితో ధన్యులైనారు.
- పాదసేవన భక్తి : భగవంతుని సర్వావయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు. వీటిని సేవించడం భక్తులు భగవంతుని పవిత్రసేవతో సమానం. భరతుడు, గుహుడు మొదలైన వారు ఈ పాదసేవ ద్వారా ముక్తులైనారు.
- అర్చన భక్తి : ప్రతిరోజు తులసి పుష్పాదులు, ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చారూపంలో దేవుని పూజించడం అర్చనా భక్తి. మానవులు తాము నమ్ముకున్న భగవంతుని అర్చనా మూర్తులను ప్రతిష్ఠించుకొని పూజాద్రవ్యాలతో ధూప దీప నైవేద్యాలతో దేవతలను అర్చించడం ప్రస్తుత సమాజంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది.
- వందన భక్తి : వందనం అనగా నమస్కారం. తన యందు మనస్సు నుంచి భక్తులై పూజింపుమని, నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్భోవించాడు. ఎన్ని యాగాలు చేసినా, శాస్త్రాలు చదివినా భగవంతుని నమస్కరించని వాడు ఆ ఫలితాన్ని పొందలేడు.
- దాస్య భక్తి : ప్రతి మానవుడు తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడు సేవకుడై, దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి. కులశేఖర అళ్వారు దాస్య భక్తికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. హనుమంతుడు, లక్ష్మణుడు మొదలైన వారు దాస్య భక్తి నాశ్రయించి ముక్తిని పొందారు.
- సఖ్య భక్తి : సఖ్యం అనగా స్నేహం. స్నేహం కలగని మంచిలేదు. భగవంతునితో సఖ్యమేర్పరచుకున్న వారు ధన్యులు. అర్జునుడు, సుగ్రీవుడు మొదలైన వారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతిపాత్రులైనారు.
- ఆత్మ నివేదన భక్తి లేదా ప్రపత్తి : ఆత్మనివేదన మనగా భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నిటికన్నా ఆత్మనివేదన మోక్షమార్గానికి సులభమైన మార్గం. ఈ మార్గాన ద్రౌపతి, గజేంద్రాదులు ముక్తులైనారు.
శివభక్తులు
ప్రాచీనకాలం నుండి ఎందరో భక్తులు పైన పేర్కొన్న వివిధ పద్ధతులలో శివున్ని కొలిచి ముక్తిని పొందారు. వారిలో కొందరు ప్రముఖులు :
ఇవి కూడా చూడండి
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.