Remove ads
రామాయణం లో పాత్ర From Wikipedia, the free encyclopedia
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు వానరవీరులు. వీరి పాత్రలు రామాయణం కిష్కింధకాండములో వస్తాయి. కబంధుడు చేతులను శ్రీరామ చంద్రమూర్తి నరికేశాక కబంధుడు శాప విమోచనము పొంది రామా నీకు స్నేహితుడు అవసరము అందువలన నీవు కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుడితో మైత్రి చేసుకొ అని చెబుతాడు ఆవిధంగా అరణ్యకాండ ముగుస్తుంది కిష్కిందకాండము ప్రారంభిం అవుతుంది. సుగ్రీవుడి పాత్ర కూడా అప్పుడే ప్రారంభం అవుతుంది.
వాలి సుగ్రీవుల జన్మ వృత్తాంతం యుద్ధకాండములో చెప్పబడుతుంది. సుగ్రీవుడు కుంభకర్ణుడు మీదకు యుద్ధానికి వెళ్తుండగా కుంభకర్ణుడు ఒరే సుగ్రీవా నీగురించి నాకు తెలియదనుకొంటున్నావా? అని కుంభకర్ణుడు అన్న మాటలు వృత్తంతంగా వాల్మీకి మహర్షి మనకు రామాయణంలో అందిస్తారు. వాలి, సుగ్రీవుడు వృక్షవ్రజస్సు అనే గొప్ప వానర రాజుకి పుట్టిన ఓరస సంతానం. ఒకసారి వృక్షవ్రజస్సు ఒక తటాకంలో స్నానం చేస్తాడు, ఆ తటాకమునకు ఉన్న శాపప్రభావం వల్ల వృక్షవ్రజస్సు ఒక అప్సరసగా మారిపోతాడు అప్పుడు ఆ ప్రదేశంలో సూర్యుడు, ఇంద్రుడు ఆ అప్సరసగా ఉన్న వృక్షవ్రజస్సు చూసి మోహితుడై వాలభాగం లోను, కంఠభాగంలోను వీర్యాన్ని విడిచి పెడతారు. దానికి వృక్షవ్రజస్సు కంగారు పడుతున్న సమయములో బ్రహ్మ వచ్చి వీర్యం విడవడం వల్ల వాలి సుగ్రీవులు జన్మిస్తారు. వాల భాగములో వీర్యం వదలడం వల్ల వాలి, కంఠ భాగంలో వదిలిన వీర్యం వల్ల సుగ్రీవుడు జన్మిస్తారు. ఈ విషయాన్ని కుంభకర్ణుడు సుగ్రీవుడితో పలికిన మాటలు.
రామాయణంలో అరణ్య కాండ చివరి భాగంలో సుగ్రీవుని పాత్ర పరిచయమౌతుంది. సుగ్రీవుడు గొప్ప వీరుడు, ధర్మపరుడు, నిరంకుశుడు, కొంత చాపల్యం కలిగినవాడు, మిత్ర ధర్మానికి కట్టుబడినవాడుగా రామాయణంలో కనిపిస్తాడు. సుగ్రీవుడు దురదృష్టవశాన తనకంటే చాలా బలవంతుడైన అన్న వాలి క్రోధానికి గురై మరణభయంతో ఋష్యమూక పర్వతంపై బ్రతుకుతూ ఉన్నాడు.
సీతాపహరణంతో హతాశులైన రామలక్ష్మణులు సీతను వెతుకసాగారు. మతంగాశ్రమం సమీపంలో వారికి కబంధుడనే మహాకాయుడైన ఒక రాక్షసుడు ఎదురుపడ్డాడు. అతడు శాపవశాన రాక్షసుడైన గంధర్వుడు. రామలక్ష్మణులు వాడి శరీరాన్ని తగులబెట్టారు. అప్పుడు కబంధుడు సకలాభరుణుడైన గంధర్వుడై హంసల విమానంలో ఆకాశానికి వెళుతూ – "రామా! ప్రస్తుతం నీవు దుర్దశాపన్నుడవు. నీకిప్పుడు ఒక మిత్రుని అవసరం ఉంది. నీవు సుగ్రీవునితో స్నేహం చేసుకొంటే సీతను వెదకడంలో అతను నీకు సహాయపడతాడు. అతను కూడా నీలాగే భార్యా వియోగంతో దుర్దశాపన్నుడై ఉన్నాడు. ఋష్యమూక పర్వతంపై సుగ్రీవుని కలుసుకోవచ్చు. అతని స్నేహంతో రాక్షసులనందరినీ సంహరించి నీ జీవితేశ్వరిని పొందగలవు" అని చెప్పాడు.
మహా ధనుర్ధారులైన రామలక్ష్మణులను చూచి సుగ్రీవుడు భయం చెందాడు. వారిని గురించి తెలిసికోమని హనుమంతుని పంపాడు. హనుమంతుడు బ్రహ్మచారి రూపంతో వారిని సమీపించి, మంచిమాటలతో వారి వివరాలు కనుక్కొని రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవునివద్దకు తీసికొనివెళ్ళాడు. హనుమంతుని ద్వారా వారి వృత్తాంతాన్ని విని సుగ్రీవుడు రామలక్ష్మణులను స్వాగతించి ఆదరించాడు. సీతాపహరణ వృత్తాంతాన్ని విని, సీతమ్మను వెదకడానికి తాను సహాయపడగలన్నాడు. రాముడూ సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మైత్రి నెరపుకొన్నారు. సీతను వెదకి రామునికి అప్పగిస్తానని సుగ్రీవుడు ప్రతిన బూనాడు.
రాముడు ప్రశ్నించగా సుగ్రీవుడు తనకూ తన అన్నకూ వైరం ఏర్పడిన కారణాన్ని వివరించాడు. కిష్కింధ రాజైన వాలికి సుగ్రీవుడు తమ్ముడు. విధేయుడు. ఒకమారు మాయావి అనే రాక్షసునితో యుద్ధం చేస్తూ వాలి ఒక బిలంలోపలికి వెళ్ళాడు. బిలం వెలుపలే ఉండమని వాలి తన తమ్ముడు సుగ్రీవునికి చెప్పాడు. ఒకమాసం గడచినా వారు వెలుపలికి రాలేదు. రాక్షసుని చేతిలో వాలి మరణించి ఉంటాడని భయపడ్డ సుగ్రీవుడు బిలం ద్వారాన్ని ఒక బండరాతితో మూసి నగరానికి తిరిగివచ్చాడు. మంత్రులు సుగ్రీవుడిని రాజుగా అభిషేకం చేశారు. వాలి తిరిగివచ్చి సుగ్రీవుడిని నిందించి దండించాడు. అతని భార్య రుమను చేబట్టి సుగ్రీవుని రాజ్యంనుంచి తరిమేశాడు. సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తనకు విశ్వాసపాత్రులైన నలుగురు మంత్రులతో తలదాచుకొన్నాడు. మతంగమహర్షి శాపంవలన వాలి ఋష్యమూక పర్వతం సమీపానికి రాడు.
దీనుడైన సుగ్రీవుని కథ విని రాముడు తాను వాలిని సంహరిస్తానని మాట యిచ్చాడు. వాలి అసమాన బల పరాక్రమాల గురించి సుగ్రీవుడు రామునికి వివరించాడు. సుగ్రీవునకు నమ్మకం కలిగించడానికి రాముడు కొండ లాంటి దుందుభి అనే రాక్షసుని కళేబరాన్ని పది క్రోసుల దూరంలో పడేలా తన్నాడు. ఒక్క బాణంతో ఏడు సాల వృక్షాలను ఛేదించాడు. సుగ్రీవుడిని ఆలింగనం చేసుకొని, అతనికి అభయమిచ్చాడు.
రాముడి అండ చూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. రెండు కొండల్లా ఢీకొంటున్న వారిరువురూ ఒకే విధంగా ఉన్నారు. వారిలో వాలి ఎవరో పోల్చుకోలేక రాముడు మౌనంగా ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతనిని తీవ్రంగా దండించి తరిమేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధసమయంలో ఉపేక్షించినందుకు రామునితో నిష్ఠూరంగా మొరపెట్టుకొన్నాడు సుగ్రీవుడు. అసలు కారణం వివరించి రాముడు సుగ్రీవునకు ధైర్యం చెప్పాడు. ఆనవాలుగా ఒక గజపుష్పి లతను సుగ్రీవుని మెడలో అలంకరించాడు. మళ్ళీ సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి కవ్వించాడు. అన్నదమ్ములు మళ్ళీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాలా వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది. కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించసాగింది. ఆ సమయంలోనే రామచంద్రుడు కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్రసమానమైన బాణాన్ని వాలి గుండెలపై కొట్టాడు. వాలి హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయాడు. మళ్ళీ తెలివి తెచ్చుకొని రామునితో భాషించి, తరువాత సుగ్రీవుని పిలచి తన మెడలోని కాంచనమాలను అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తార హితోక్తులను అమలు చేయమన్నాడు. రాఘవుల కార్యాలను అలక్ష్యం చేయవద్దన్నాడు. పిన తండ్రిని కూడా తండ్రిని లాగానే గౌరవించమని అంగదునికి చెప్పాడు. దేశ కాలాలు గుర్తించి ప్రభువు పట్ల విధేయుడై ఉండాలన్నాడు. అందరి వద్దా సెలవు తీసికొని మరణించాడు. సుగ్రీవుడు పశ్చాత్తాపంతో కుమిలి పోయి తాను కూడా మరణిస్తానన్నాడు. అందరినీ ఓదార్చాడు రాముడు రాముని ఆనతిపై రాజుగా సుగ్రీవుడూ, యువరాజుగా అంగదుడూ అభిషిక్తులయ్యారు.
రాజ్యాభిషేకానంతరం సుగ్రీవుడు ధర్మార్ధవిముఖుడై రేయింబగళ్ళు కామభోగాలలోనే గడుపుతున్నాడు. ఆ సమయంలో హనుమంతుడు సుగ్రీవుని వద్దకు వెళ్ళి – మహావీరా! నీవు రాజ్యాన్ని యశస్సును పొందడానికి కారణభూతుడైన శ్రీరామ చంద్రుని కార్యాన్ని ఉపేక్షించడం తగదు. – అని హితం పలికాడు. సుగ్రీవునికి కర్తవ్యం స్ఫురణకు వచ్చింది. నీలుని పిలిచి, అన్ని దిశలనుండి వానరులను వెంటనే పిలిపించమన్నాడు. పదిహేను రోజుల్లోపు రాని వానరులకు మరణదండన అని శాసించాడు. కాలసర్ప సదృశమైన ధనుస్సు ధరించి క్రోధారుణ నేత్రుడై వచ్చిన లక్ష్మణుని పట్ల వినయంతో తార, సుగ్రీవుడు ఆ రామానుజుని ప్రసన్నం చేసుకొన్నారు. సుగ్రీవుడు తన అపరాధాన్ని మన్నించమని వేడుకొన్నాడు. తన సేనా గణంతో లక్ష్మణుని వెంట శ్రీరాముని చెంతకు వెళ్ళి రాముని పాదాలపై బడ్డాడు. అతనిని రాముడు ఆలింగనం చేసుకొన్నాడు. స్నేహితులిద్దరూ కలసి సీతాన్వేషణా పధకాన్ని సిద్ధం చేసుకొన్నారు.
సుగ్రీవుని ఆజ్ఞపై వినతుడనే వానరులు నలుదిక్కులకూ సీతా మాత అన్వేషణకు వెళ్ళాడు. పడమటి దిక్కుకు సుషేణుడు, అన్ని దిశలలో వెళ్ళేవారికీ వారు వెతక వలసిన స్థలాలను, తీసికొనవలసిన జాగ్రత్తలను సుగ్రీవుడు వివరించి చెప్పాడు. ఒక మాసం లోపు అన్వేషణ పూర్తి కావాలనీ, సీతమ్మ జాడ తెలిపినవారికి తనతో సమానంగా రాజ్య భోగాలు కల్పిస్తాననీ మాట ఇచ్చాడు. దక్షిణం వైపుకు నిర్దేశించిన బృందంలో అంగదుడు, జాంబవంతుడు, నీలుడు, హనుమంతుడు వంటి మహావీరులున్నారు. దక్షిణ దిశవైపు సీతను తీసికొని పోయిన రాక్షసుడు లంకాధిపతి రావణుడే కావచ్చునని సుగ్రీవుని అభిప్రాయం. అది గ్రహించిన రాముడు తన అంగుళీయాన్ని సీతకు ఆనవాలుగా ఇమ్మని హనుమంతునికిచ్చాడు.
సుగ్రీవుని భౌగోళిక జ్ఞానం రాముని ఆశ్చర్య చకితుని చేసింది. దానికి కారణం అడిగాడు. తాను వాలి వలన భయంతో ప్రాణాలు రక్షించుకోవడానికి భూమండలమంతా తిరిగినందువలన ఆ విధంగా లోక పరిచయం అయ్యిందని సుగ్రీవుడు చెప్పాడు. ఒక మాసం కాలానికి తూర్పు, పడమర, ఉత్తర దిశలుగా వెళ్ళిన వానర సేనలు తమ అన్వేషణ ముగించి తిరిగి వచ్చారు. సీత కానరాలేదని చింతాక్రాంతులై మనవి చేశారు.
హనుమంతుని కార్యసాధనాపాటవం వలన సీత జాడ తెలిసింది. తన అన్వేషణలో హనుమంతుడు రామలక్ష్మణులకు, వారికి విధేయుడైన సుగ్రీవునకు జయం ఘోషించాడు. లంకా నగరం ధ్వంసమైంది. రామలక్ష్మణసుగ్రీవులు రావణునిపై యుద్ధానికి నిశ్చయించారు. యుద్ధకాండలో సుగ్రీవుని ధీరత్వమూ, మిత్ర ధర్మమూ, నాయకత్వమూ చాలా ఉదాత్తంగా చూపబడ్డాయి. సీత దుస్థితి విని విచారిస్తున్న రాముని సుగ్రీవుడు ధైర్యం చెప్పి ఓదార్చాడు. రాముని జయం తప్పదన్నాడు. హనుమంతుడు లంకా నగరం రక్షణా వ్వవస్థను విశదంగా తెలిపాడు. తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన కోలాహలంగా దక్షిణ దిశగా పయనించింది. రాముని ఆజ్ఞలో నడచిన ఆ సేనకు నీలుడు సేనా నాయకుడు. సుగ్రీవుడు పాలకుడు. సాగర తీరం చేరిన వానరసేన మరొక సాగరంలా ఉంది. తమ మధ్య వైరం ఏమీ లేదు గనుక రామునికి సాయం చేయవద్దని రావణుడు సుగ్రీవునికి శుకుడనే దూత ద్వారా దౌత్యం పంపాడు. అందుకు సుగ్రీవుడు - "రావణా! నాకు నువ్వు చేసిన సాయం లేదుగనుక నాకు ప్రియుడవు కావు. రామునికి విరోధివి గనుక నాకు కూడా విరోధివే. రాముని కోపానికి గురైనందున నిన్ను రక్షించే శక్తి ముల్లోకాలలోనూ లేదు" అని సమాధానం పంపాడు.
సాగరమును దాటుటకు అద్భుతమైన వారధి నిర్మాణము నలుని పర్యవేక్షణలో జరిగింది. యుద్ధానికి ముందురోజు సువేల శిఖరంపైకి ముఖ్య నాయకులతో వెళ్ళి రాముడు లంకానగరాన్ని పర్యవేక్షించాడు. దూరాన ఒక గోపురాగ్రాన రావణుడు కనిపించాడు. అతనిని చూడగానే క్రోధంతో సుగ్రీవుడు ఎగిరి వెళ్ళి భీకరమైన మల్లయుద్ధం చేశాడు. రావణుడు మాయలు ప్రయోగించడానికి సన్నద్ధమయ్యేసరికి ఒక్కగెంతున తిరిగి వచ్చేశాడు.
"జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః, రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః" అని కపి సేన లంకను ముట్టడించింది. మొదటిరోజు జరిగిన భీకరయుద్ధం చివరిలో ఇంద్రజిత్తు నాగపాశాలతో రామలక్ష్మణులు వివశులయ్యారు. అందరూ హతాశులయ్యారు. సుగ్రీవుడు మాత్రం విభీషణుడిని ఓదార్చి అతనికి లంకాధిపత్యం నిశ్చయమన్నాడు. రామలక్ష్మణులను తీసికొని కిష్కింధకు వెళ్ళమని తన మామ సుషేణుడికి ఆనతిచ్చాడు. తాను రావణుడిని సపుత్ర బాంధవంగా నాశనం చేసి సీతమ్మను తీసుకొని వస్తానన్నాడు. ఇంతలో గరుత్మంతుడు వచ్చి నాగపాశాలనుండి విముక్తులను చేశాడు. యుద్ధంలో అంగదాది మహావీరులతో కలిసి విజృంభించిన సుగ్రీవుడు ఎందరో రాక్షసులను చంపేశాడు. కుంభకర్ణుడితో యుద్ధం జరిగే సమయంలో సుగ్రీవుడు కుంభకర్ణుడి శూలాన్ని తన మోకాటికి అడ్డంగా పెట్టుకొని విరిచేశాడు. అప్పుడు కుంభకర్ణుడు విసిరిన పర్వత శిఖరం తగిలి సుగ్రీవుడు తెలివి తప్పాడు. మూర్ఛపోయిన సుగ్రీవుడిని పట్టుకొని లంకవైపు వెళ్ళాడు కుంభకర్ణుడు. తెలివి తెచ్చుకొన్న సుగ్రీవుడు ఒక్కసారి విదిలించుకొని, రాక్షసుని ముక్కు, చెవులు కొరికివేసి ఒక్కగెంతులో వానర సైన్యం మధ్యకు వచ్చిపడ్డాడు. కుంభుడు సుగ్రీవుని పిడిగుద్దులతో హతుడయ్యాడు. సుగ్రీవుడి దెబ్బకు మహోదరుని తల వ్రక్కలయ్యింది. ఇంకా ఎందరో రాక్షసులు సుగ్రీవుని చేత హతులయ్యారు.
కడకు రాముని బ్రహ్మాస్త్రంతో రావణుడు మరణించాడు. రాముని కోరికపై సుగ్రీవాదులు కూడా అయోధ్యకు వెళ్ళారు. జరిగిన సంగతులు తెలుసుకొని భరతుడు సుగ్రీవునితో -- నీవు నాకు మరొక సోదరుడివి - అన్నాడు. వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. రామునిచేత బహుమతులు స్వీకరించి సుగ్రీవుడు తన సైన్యంతో కిష్కింధకు వెళిపోయాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.