వైకుంఠపాళి లేదా దశపద ప్రాచీన భారతీయ ఆట. క్రీ.పూ 2వ శతాబ్దములో నుండి ఈ ఆట భారతదేశములో ఉన్నదని చారిత్రికులు భావిస్తున్నారు. సాధారణంగా ఇద్దరు మనుషులు ఆడే ఈ ఆట ఒక నలు చదరము పై ఆడతారు. ఈ చదరములో సాధారణంగా 10 అడ్డవరుసలు, 10 నిలువువరుసలతో మొత్తం 100 గడులుంటాయి. అయితే కొన్ని రూపాంతరాలలో 8 అడ్డ నిలువు వరసలు, 12 అడ్డ నిలువు వరుసల చదరాలు కూడా ఉంటాయి. చదరంపై చిత్రించబడి ఉన్న పాములు, నిచ్చెనల (సోపానాలు) అమరిక చదరాన్నిచదరాన్ని బట్టి మారుతుంటుంది. పాములు, సోపానాలు నిర్ధిష్టమైన గడులలో ఉండనవసరం లేదు. చదరం యొక్క పరిమాణము, చదరంలో పాములు, సోపానాల అమరికపై ఆట యొక్క నిడివి ఆధారపడిఉంటుంది.

ప్రాచీనమైన వైకుంఠపాళీ ఆట.

వైకుంఠపాళీ తెలుగు వారికి ప్రత్యేకమయిన ఆట. వైకుంఠపాళీ పటాన్ని పరమపదసోపానపటమని కూడా వ్యవహరిస్తారు. వైకుంఠపాళీ పటంలో 132 గళ్ళు ఉంటాయి. ఈ గళ్ళు రకరకాలయిన బొమ్మలతో అంకెలు వేసి ఉంటాయి. ఈ గళ్ళకు దిగువన పాములు, ఏనుగులు ఉంటాయి. అది పాతాళమనీ, ఆ ఏనుగులు అష్టదిగ్గజాలనీ పైనున్న భూమి (అంకెలు ఉన్న గళ్ళ) ని ఆ ఎనిమిది ఏనుగులూ మోస్తున్నాయనీ హిందువుల విశ్వాసం.

ఆట ప్రారంభించే ముందు ఆటగాళ్ళు తమ తమ ఆటకాయలను పాతాళంలో ఉంచి పందెం వేస్తూ పందాన్ని బట్టి ఆటకాయలను నడుపుతూ ఉంటారు. ఆరు గవ్వలుగాని లేదా పాచికలుగాని పందెం వేస్తూ ఆడుతారు. ఈ ఆటను ఎందరైనా ఆడవచ్చు. అయితే ఆడే వాళ్ళు మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్కరకం ఆటకాయలను ముందుగా ముందే నిర్ణయించుకోవాలి.

వైకుంఠపాళీ పటంలో 16, 19, 30, 41, 52, 63, 74, 79, 87 సంఖ్యలు గల గళ్ళల్లో నిచ్చెనలు ఉన్నాయి. ఏ పందానికైనా ఆటకాయ ఆయా గళ్ళలోనికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న నిచ్చెన సాయంతో పై గడికి చేరుకోవచ్చు. ఉదాహరణకు 16 (సుగుణం) గడిలో ఉన్న నిచ్చెన దగ్గరకు ఆటకాయ వచ్చినప్పుడు ఆ నిచ్చెన సాయంతో 28 (సాలోక్యం) గడిని చేరుకుంటుంది. అలా చేరుకోవడాన్ని 'నిచ్చెన ఎక్కడం' అంటారు. పుణ్యం చేసిన వారికి పుణ్యం దక్కి నిచ్చెనెక్కడమవుతుందని చెబుతారు. అప్పుడు పై పందెం వేసుకునే అవకాశం ఇస్తారు. పై పందెంవల్ల మళ్ళీ నిచ్చెన ఎక్కినత్లయితే మళ్ళీ మరో పై పందెం- ఇలా ఆట కొనసాగుతూ ఉంటుంది.

ఈ పటంలో నిచ్చెనలు ఉన్నట్లుగానే అక్కడక్కడ పాములు కూడా ఉన్నాయి. ఆటకాయ నిచ్చెన పాదం దగ్గరికి వచ్చినప్పుడు పైకి వెళ్ళినట్లే పాము తల దగ్గరికి ఆటకాయ వచ్చినప్పుడు పాము కరిచి/మింగి ఆటకాయ పాము తోక చివరివరకూ కిందికి దిగిపోతుంది. కాగా 26 (ద్వేషం) గడిలో ఉన్నది పాము కరచినప్పుడు దాని తోక ఉన్న 3వ గడికి వచ్చి అక్కడ ఉన్న చిన్న పాము మూలంగా ఆటకాయ పాతాళం చేరుకుంటుంది. ఇట్లు పాముతోక దగ్గరకు రావడాన్ని 'పాము మింగడం' అంటారు. ఇక 106వ గదిలో ఉన్న పెద్ద పాము మింగిందంటే ఆటకాయ ఒకేసారి 1వ గడిని చేరుకుంటుంది. చివరకు 121 గడిలో ఉన్న పామును తప్పించుకుని 122వ గడికి ఆటకాయ చేరుకున్నట్లయితే పుణ్యపథంలో పడ్డట్టే. అలా, ఆ తరువాతనున్న 132వ గడిని దాటి పైనున్న స్వర్గధామన్ని ఆటకాయ చేరుకుంటుంది. అక్కడినుండి చివరివరకూ వెళ్ళి తిరుగుముఖం పట్టి మధ్యనున్న విరాట్ స్వరూపాన్ని చేరుకోవాలి. తిరుగు ముఖం పట్టి, వచ్చేటప్పుడు ఏ పందెంలో సరిగ్గా విరాట్ స్వరూపాన్ని చేరుతుందో ఆ పందెం పడినప్పుడే ఆటకాయ పండినట్లు చెప్పవచ్చును. అంతవరకూ ఆ వరుసలో ముందరికీ వెనుకకూ ఆటకాయను నడుపుతూ ఉండాలి. విరాట్ రూపానికి ఆ వైపూ ఈ వైపూ ఉన్న బొమ్మల్ని ద్వారపాలకులనీ, వారు విరాట్ దర్శనం కాకుండా అడ్డగిస్తూ ఉంటారనీ, అందువల్ల వాళ్ళ చుట్టూ తిరిగిన తర్వాతనే ఆఖరికి విరాట్ దర్శనం అవుతుందని జనశ్రుతి.

వైకుంటపాళి యొక్క సరళత, పోటీలోని చంచల ఉథ్థాన పతన స్వభావాలు చిన్నపిల్లలకు ఎంతో జ్ఞానం నేర్పుతుంది.

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.