విభక్తులు వాక్యములోని వేర్వేరు పదములకు అన్వయము కలిగించు ప్రత్యయములు. ఇవి రెండు పదముల మధ్య సంబంధము కలిగించును. వీటినే విభక్తి ప్రత్యయాలు అని కూడా అంటారు. ఈ విభక్తులు ఎనిమిది. అవి:
ప్రత్యయాలు | విభక్తి పేరు |
---|---|
డు, ము, వు, లు | ప్రథమా విభక్తి |
నిన్, నున్, లన్, గూర్చి, గురించి | ద్వితీయా విభక్తి. |
చేతన్, చేన్, తోడన్, తోన్ | తృతీయా విభక్తి |
కొఱకున్ (కొరకు), కై | చతుర్ధీ విభక్తి |
వలనన్, కంటెన్, పట్టి, నుండి | పంచమీ విభక్తి |
కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ | షష్ఠీ విభక్తి. |
అందున్, నన్ | సప్తమీ విభక్తి |
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ | సంబోధన ప్రథమా విభక్తి |
ప్రథమా విభక్తి
- పుంలింగాలయిన, మహద్వాచకాలయిన శబ్దాలకు "డు" వస్తుంది. ఉదా: రాముడు, కృష్ణుడు
- అమహన్నపుంసకములకు, అదంత శబ్దాలకు "ము" వస్తుంది. ఉదా: వృక్షము, దైవము
- ఉకారాంత శబ్దాలకు, గోశబ్దానికి "వు" వస్తుంది. ఉదా: తరువు, ధేనువు, మధువు, గోవు
- బహువచనంలో అన్ని శబ్దాలకు ప్రథమా విభక్త్యర్థంలో "లు" వస్తుంది. ఉదా: రాములు, సీతలు
ద్వితీయా విభక్తి
నిన్, నున్, లన్, గూర్చి, గురించి--- ద్వితీయా విభక్తి
- కర్మార్థంలో ద్వితీయా విభక్తి వస్తుంది. కర్మ యొక్క ఫలాన్ని ఎవడైతే అనుభవిస్తాడో వాడ్ని తెలియజేసే పదం 'కర్మ'. ఉదా: దేవదత్తుడు వంటకమును వండెను.
- కూర్చి, గురుంచి ప్రయోజన నిమిత్తములైన పదములకు వచ్చును. 'ను' కారము గూర్చి యోచించుట యుక్తము. ఇది ఏకవచనమున జ్యంతమగును. బహువచనమున లాంతమగును. ఇందలి ఇకారమును, అకారమును కేవలము సంబంధమును బోధించును.తెలుగు వ్యాకరణములలో జడముల ద్వితీయకు బదులు ప్రథమయును, పంచమికి బదులు నువర్ఞాంత మగు ద్వితీయము వాడుచున్నారు.
- పంచమి- రాముడు గృహమును వెడలెను.
- తృతీయ- కొలను గూలనేసె.
- సప్తమి- లంకను గలకలము.
- చతుర్ధి- రామునకు నిచ్చె.
పై నాలుగు విభక్తులును, నుప్రత్యయమునను, కు ప్రత్యయమునను గతార్ధము లగు చున్నవి.కావున ప్రాచీన కాలమున ను, కు వర్ణకములే తెలుగున గలవని తెలియుచున్నవి.
తృతీయ విభక్తి
చేతన్, చేన్, తోడన్, తోన్--- తృతీయా విభక్తి.
- కర్తార్థంలో తృతీయా విభక్తి వస్తుంది. క్రియ యొక్క వ్యాపారానికి ఎవరైతే ఆశ్రయం అవుతారో వారు కర్త. ఉదా: దేవదత్తుని చేత వంటకము వండబడెను.
తృతీయా విభక్తిలోని నువర్ణాంత లోపంబున జేసి చేత, తోడవర్ణకంబులు నిలుచుచున్నవి. వీనిలో చేత శబ్దము చేయి శబ్దము యొక్క సప్తమ్యరూపముగ గుర్తింపదగినది. అటులనే తోడ శబ్దము తోడు శబ్దము యొక్క సప్తమ్యరూపముగ గుర్తింపదగినది
చతుర్ధీ విభక్తి
కొఱకున్ (కొరకు), కై--- చతుర్ధీ విభక్తి.
- త్యాగోద్దేశ్యముగా ఉన్నప్పుడు చతుర్ధీ విభక్తి వస్తుంది. త్యాగము అంటే ఇవ్వడం. ఉదా: జనకుడు రాముని కొరకు కన్యనిచ్చెను.
కొఱకు+న్ = కొఱకున్. ద్రుతలోపమున కొఱకు అని నిలిచింది.ఇది కొఱ=ప్రయోజనము, కు=నకు అను అర్ధమున నిలిచినట్లుగ కనబడుతున్నది.అటులనే కయి' వర్ణకముసైతము క+అయి అనుదాని విపర్యరూపము.ఇందు అయి అనునది అగు ధాతువు క్త్వార్ధకరూపము.
పంచమీ విభక్తి
వలనన్, కంటెన్, పట్టి--- పంచమీ విభక్తి.
- అపాయ, భయ, జుగుప్సా, పరాజయ, ప్రమాద, గ్రహణ, భవన, త్రాణ, విరామ, అంతర్థ, వారణంబులు అనేవి వేటివలన జరుగుతాయో ఆ పదాలకు పంచమీ విభక్తి వస్తుంది. అందులోనూ 'వలన' అనే ప్రత్యయం వస్తుంది. ఉదా: మిత్రుని వలన ధనంబు గొనియె.
- అన్యార్థంలో చెప్పేటప్పుడు 'కంటె' అనే వర్ణకం వస్తుంది. అనగా అన్య, ఇతరము, పూర్వము, పరము, ఉత్తరము అనే పదాలతో అన్యము ఉంటే 'కంటె' వస్తుంది. ఉదా: రాముని కంటే నన్యుండు దానుష్కుండు లేడు.
- నిర్ధారణ పంచమిలో కూడా కంటే ప్రత్యయం వస్తుంది. ఉదా: మానహాని కంటే మరణము మేలు: ఇక్కడ 'మానహాని' నిర్ధారణము
- 'పట్టి' అనేది హేతువులయిన గుణక్రియలకు వస్తుంది. హేతువు అంటే కారణం. గుణం హేతువు కావాలి, క్రియ కూడా హేతువు కావాలి. ఉదా: జ్ఞానము బట్టి ముక్తుడగు. ముక్తుడవడానికి కారణము జ్ఞానము
- ‘నుండి’ ఎచటనుండి వచ్చుచుంటిరి, దేవలోకమునుండి పుష్పవృష్టి కురిసెను వంటి వాక్యములలో నుండి పంచమీ విభక్తి ప్రత్యయంగా గ్రహించాలి.
వలనన్ అనునది వలను+అన్ శబ్దముయొక్క సప్తమ్యంత రూపముగ నెన్నదగుచున్నది. ఇక కంటే అను వర్ణకము కు+అంటె అను పద విభాగమున కల్గినరూపముగ తెలియును. పట్టి అను వర్ణకము 'పట్టుధాత్వర్ధక క్త్వార్ధక రూపము'.
షష్ఠీ విభక్తి
కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్--- షష్ఠీ విభక్తి.
- శేషం అంటే సంబంధం. సంబంధం కనిపించినప్పుడు 'యొక్క' అనే విభక్తి వస్తుంది. ఉదా: నా యొక్క మిత్రుడు; వాని యొక్క తమ్ముడు.
- నిర్ధారణ షష్ఠికి 'లోపల' వర్ణకం వస్తుంది. జాతి, గుణ, క్రియ, సంజ్ఞల చేత - ఒక గుంపు నుండి ఒకదాన్ని విడదీయడాన్ని నిర్ధారణ అంటారు. ఉదా: మనుష్యుల లోపల క్షత్రియుండు శూరుండు.
షష్ఠీ విభక్తిలోని 'ఒక్క' శబ్దము 'ఒ' యను ప్రణష్టధాతువుయొక్క ధాతుజన్య విశేషణము. ఇక్కడ ఒ = కూడు, లేక చేరు అని తెలుపును. ఈ ధాతువునకు అరవమున స్వతంత్ర ప్రయోగము ఉంది. అరవమున ఈ ధాతువునకు 'కూడిన, చేరిన, ఒప్పిన' అని అర్థము ఉంది. లోపల- ఇది ఒక్క శబ్దము. ఇది నిర్ధారణ షష్ఠి యందు వచ్చుచున్నది. దీని అర్థమును బట్టి ఇది సప్తమి రూపమనియే చెప్పుచున్నారు. కాని సంస్కృతమున నిర్ధారణమున షష్ఠి ప్రయోగింపబడును. కావున, సామ్యమున ఇది వైయ్యాకరణలుచే ప్రవేశపెట్టినట్లుగా తోచుచున్నది.
సప్తమీ విభక్తి
అందున్, నన్--- సప్తమీ విభక్తి.
- అధికరణంలో సప్తమీ విభక్తి వస్తుంది. అధికరణం అంటే ఆధారం. ఈ ఆధారం 3 విధాలుగా ఉంటుంది. ఔపశ్లేషికం, వైషయికం, అభివ్యాపకం. 'అందు' అనేది మాత్రం వస్తుంది.
- ఔపశ్లేషికం అంటే సామీప్య సంబంధం. ఉదా: ఘటమందు జలం ఉంది.
- వైషయికం అంటే విషయ సంబంధం. ఉదా: మోక్షమందు ఇచ్ఛ ఉంది.
- అభివ్యాపకం అంటే అంతటా వ్యాపించడం. ఉదా: అన్నింటియందీశ్వరుడు కలడు.
- ఉకారాంత జడానికి 'న' వర్ణకం వస్తుంది. జడం అంటే అచేతన పదార్థం. ఉదా: ఘటంబున జలం ఉంది.
సంబోధనా ప్రథమా విభక్తి
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ--- సంబోధనా ప్రథమా విభక్తి.
- ఆమంత్రణం అంటే పిలవడం, సంబోధించడం. ఇది ఎవరినయితే సంబోధించడం జరుగుతుందో - ఆ శబ్దానికి 'ఓ' అనేది వస్తుంది. ఉదా: ఓ రాముడ - ఓ రాములార
- ఓ శబ్దానికి పురుషుని సంబోధించేటప్పుడు 'యి' అనేది, నీచ పురుషుని సంబోధించినప్పుడు 'రి' అనేది, నీచస్త్రీని సంబోధించినప్పుడు 'సి' అనేది అంతాగమాలుగా విభాషగా వస్తాయి. ఉదా: ఓయి రాముడా! ఓరి దుష్టుడా! ఓసి దుష్టురాలా!
మూలాలు
- తెలుగు వ్యాకరణము: మల్లాది కృష్ణప్రసాద్, విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ, 2007.
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.