రాయలసీమ లోని దుర్గం From Wikipedia, the free encyclopedia
రత్నగిరి కోట ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో రోళ్ల సమీపంలో రత్నగిరి గ్రామంలో ఉన్న ఒక దుర్గం. రాయలసీమ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుకు సమీపంలో ఉన్న దీనిని సీమ గోల్కొండ అని కూడా అంటారు.[1] భారత ప్రభుత్వం దీనిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా గుర్తించింది.[2]
రత్నగిరి కోట | |
---|---|
రత్నగిరి | |
రత్నగిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్ in భారతదేశం | |
భౌగోళిక స్థితి | 13.81539°N 77.12626°E |
రకము | కోట |
స్థల సమాచారం | |
హక్కుదారు | భారత ప్రభుత్వం |
ఈ కోటకు, ఈ గ్రామానికీ ఇక్కడి రత్నగిరి అనే కొండ పేరిట ఆ పేర్లు వచ్చాయి. ఈ ప్రాంతపు ప్రారంభ చరిత్ర గురించి పెద్దగా తెలియదు.[3] చరిత్రకారులు రత్నగిరిని చాళుక్య రాజు మొదటి విక్రమాదిత్యిని (సా.శ. 655-680) శాసనంలో అదే పేరుతో పేర్కొన్న గ్రామంగా గుర్తించారు. ఈ శాసనం ప్రకారం, గ్రామం నలవాడి విషయం (జిల్లా)లో ఉంది; ఈ జిల్లాకు నాలాల పేరు పెట్టబడి ఉండవచ్చు, అయితే ఇది ఖచ్చితంగా చెప్పలేము. పాండ్యుల, చోళుల పాలనలో ఈ ప్రాంతం ప్రాముఖ్యతను సంతరించుకుంది.[1] జానపద కథల ప్రకారం, విజయనగర సామ్రాజ్యం పతనం తరువాత, కవి అల్లసాని పెద్దన 500 బ్రాహ్మణ కుటుంబాలతో రత్నగిరికి వలస వచ్చాడు.[4]
17 వ శతాబ్దంలో, బీజాపూర్ సుల్తానేట్ సమీపంలోని సీరా పట్టణంపై నియంత్రణ సాధించి, సీరా ప్రభువులను రత్నగిరికి తరలించారు. మాన్యుస్క్రిప్ట్లలో రత్నగిరికి చెందిన అనేక మంది స్థానిక ముఖ్యుల పేర్లు ఉన్నాయి గానీ వారి గురించి సమాచారం పెద్దగా లేదు. ఈ నాయకులలో రంగప్ప నాయుడు, రాయప్ప రాజు, పెద్ద రాయన్న రాజు (1657లో పాలించారు), లక్ష్మణ నాయుడు (1727లో పాలించారు) ఉన్నారు. లక్ష్మణనాయుడు మరాఠాలు విధించిన పన్ను - చౌత్ - వసూలుకు బాధ్యత వహించినట్లుగా తెలుస్తోంది. అతను మరాఠా సామంతుడని ఇది సూచిస్తుంది.[3]
1727 తర్వాత కొంతకాలానికి, మైసూర్ రాజ్యం, ఈ కోటపై నియంత్రణ సాధించింది. అయితే 1746 లో స్థానిక నాయకుల కుటుంబం మైసూరు దళాలను తొలగించింది. తరువాత, మైసూరు పాలకుడు హైదర్ అలీ మళ్ళీ ఈ కోటను స్వాధీనం చేసుకుని, స్థానిక నాయకుణ్ణే దానికి అధిపతిగా నియమించాడు. 1792 లో హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్ సెరింగపట్నం ముట్టడి సమయంలో ఈస్టిండియా కంపెనీతో పోరాటాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు, స్థానిక అధిపతి తిరుగుబాటు చేసి మైసూరు ఆధిపత్యాన్ని పడగొట్టాడు. బ్రిటిషు వారితో సెరింగపట్నం ఒప్పందంపై సంతకం చేసిన తరువాత టిప్పు సుల్తాన్, రత్నగిరి కోటను ముట్టడించి దానిని ధ్వంసం చేశాడు. అతను 6 నెలల సుదీర్ఘ ముట్టడి తర్వాత కోటను స్వాధీనం చేసుకున్నాడు. స్థానిక దండులోని అనేక మంది సైనికులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చాడు.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.