1857–-58 లో ఉత్తర, మధ్య భారతదేశంలో బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటును మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం అంటారు. ఈ తిరుగుబాటు, వైఫల్యంతో ముగిసింది.[3][4] 1857 మే 10 న మీరట్‌లో సిపాయీలతో మొదలైన తిరుగుబాటు, ఉత్తర గంగా మైదానంలోను, మధ్య భారతంలోనూ పౌర తిరుగుబాటుగా పరిణమించింది.[a][5][b][6] తూర్పు భారతదేశంలో కూడా తిరుగుబాటు ఘటనలు జరిగాయి.[c][7] ఈ తిరుగుబాటు ఆ ప్రాంతాల్లో బ్రిటిషు వారి అధికారాన్ని పెద్దయెత్తున సవాలు చేసింది.[d][8] 1858 జూన్ 20 న తిరుగుబాటుదార్లను ఓడించడంతో ఇది ముగిసింది.[9] హత్యలకు పాల్పడని వారికి తప్ప తిరుగుబాటులో పాల్గొన్న మిగతా వారందరికీ బ్రిటిషు ప్రభుత్వం 1858 నవంబరు 1 న క్షమాభిక్ష మంజూరు చేసింది. యుద్ధం ముగిసినట్లు ప్రకటించినది మాత్రం 1859 జూలై 8 న. ఈ తిరుగుబాటును సిపాయీల తిరుగుబాటు, భారతీయ తిరుగుబాటు, గొప్ప తిరుగుబాటు, 1857 తిరుగుబాటు, భారతీయ పునరుత్థానం, మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం అని అనేక పేర్లతో పిలుస్తారు.[e][10]
మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1912 నాటి ఉత్తర భారతదేశం - తిరుగుబాటు 1957-59 దేశపటం. దీనిలో తిరుగుబాటు కేంద్రాలను చూపించారు. | |||||||||
| |||||||||
ప్రత్యర్థులు | |||||||||
East India Company rebel sepoys Seven Indian princely states
| British Empire East India Company loyalist sepoys Native irregulars East India Company British regulars British and European civilian volunteers raised in the Bengal Presidency
Kingdom of Nepal | ||||||||
సేనాపతులు, నాయకులు | |||||||||
మూస:Country data Mughal Empire బహదూర్ షా జఫర్ 2 నానా సాహిబ్ బఖ్త్ ఖాన్ రాణి లక్ష్మీబాయి తాంతియా తోపే బేగం హజరత్ మహల్ బాబు కన్వర్ సింగ్ ఈశ్వరీ కుమారీ దేవి, తులసీపూర్ రాణి | సర్వసైన్యాధిపతి, భారత్ : జార్జి ఏన్‌సన్ (1797-1857) (1857 మే దాకా) సర్ ప్యాట్రిక్ గ్రాంట్ కోలిన్ క్యాంప్‌బెల్, (1857 ఆగస్టు నుండి) జంగ్ బహదూర్[2] |
భారతీయ సిపాయీలకు బ్రిటిషు అధికారులకూ మధ్యగల జాతీయ, సాంస్కృతిక వైరుధ్యాలు, బ్రిటిషు వారి తీవ్రమైన సాంఘిక సంస్కరణలు, కఠినమైన భూమి శిస్తులు, భూస్వాములు, జమీందార్ల అకృత్యాలు,[11][12] బ్రిటిషు వారి పాలన పట్ల ఉన్న వ్యతిరేకత[f][13] ఈ తిరుగుబాటుకు పురికొల్పాయి. భారత పాలకులైన మొగలాయి, పేష్వాల పట్ల బ్రిటిషు వారికి ఉన్న నిర్లక్ష్య వైఖరి, ఔధ్ విలీనం లాంటి రాజకీయ కారణాలూ భారతీయులలో బ్రిటిషు పాలన పట్ల వ్యతిరేకత కలిగించాయి. చాలామంది భారతీయులు ఈ తిరుగుబాటులో పాల్గొనలేదు. కొంతమంది బ్రిటిషు వారికి మద్దతుగా పోరాడారు కూడా. అధికశాతం ప్రజలు బ్రిటిషు వారి అధికారానికి విధేయులుగా ఉన్నారు.[g][13] ఇరుపక్షాల వైపునా హింస జరిగింది. తిరుగుబాటుదార్లు బ్రిటిషు వారిపైన, వారి స్త్రీలు పిల్లలపైన హింసాకాండ జరపగా, బ్రిటిషు వారు గ్రామాలకు గ్రామాలనే తగలబెట్టారు. ఢిలీ, లక్నో నగరాలను ధ్వంసం చేసారు.[h][13]
ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాటుకు ప్రత్యేకస్థానం ఉంది. దీన్ని బ్రిటిషు సామ్రాజ్యాధికారంపై స్వదేశీ బలాలు చేసిన చారిత్రక తిరుగుబాటుగా పేర్కొన్నారు. కానీ దీనికి భారతదేశంలో మెజారిటీ వర్గం మద్దతు లభించలేదు. ఈ తిరుగుబాటును బ్రిటిషర్లు పూర్తిగా అణచివేయగలిగారు. 1757 ప్లాసీ యుద్ధానంతర సంఘటనలన్నీ బ్రిటిషర్లకు విజయాలను తెచ్చిపెట్టాయి. ప్లాసీ యుద్ధం తరువాత సరిగ్గా ఒక శతాబ్ది కాలానికి జరిగిన ఈ తిరుగుబాటులో అణచివేతకు గురైన ఒక చిన్న వర్గం మాత్రమే బ్రిటిషు ఆధిపత్యాన్ని వ్యతిరేకించి పోరాడింది.
మీరట్‌లో తిరుగుబాటు మొదలయ్యాక, తిరుగుబాటుదార్లు వెంటనే ఢిల్లీ చేరుకుని చివరి మొగల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్‌ను తిరుగుబాటుకు నాయకుడిగా, భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. అప్పటికి అతడి వయసు 80 ఏళ్లు దాటింది. పెద్ద సంస్థానాలైన హైదరాబాదు, మైసూరు, తిరువాన్కూరు, కాశ్మీరులతో పాటు రాజపుటానా లోని చిన్న సంస్థానాలు కూడా ఈ తిరుగుబాటులో పాల్గొనలేదు. బ్రిటిషు గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ మాటల్లో చెప్పాలంటే "తుపానులో నిలబడ్డ బ్రేక్‌వాటర్స్" లాగ ఈ సంస్థానాలు బ్రిటిషు వారికి అండగా నిలబడ్డాయి.[14]
కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా అవధ్‌లో, ఈ తిరుగుబాటు బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా చేస్తున్న దేశభక్తి యుత పోరాటంగా రూపుదాల్చింది.[15] భారతదేశ - బ్రిటిషు సామ్రాజ్యాల చరిత్రలో ఈ తిరుగుబాటు ఒక ముఖ్యమైన మలుపుగా పరిణమించింది.[i][10][16] ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దుకు, భారతీయ సైన్యం, ఆర్థిక వ్యవస్థ, భారతీయ పరిపాలనా వ్యవస్థలను బ్రిటిషు వారు గుర్తించేందుకూ, 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం చేసేందుకూ దారితీసింది.[17] ఆ తరువాత భారతదేశం నేరుగా బ్రిటిషు ప్రభుత్వ పాలనలోకి వచ్చింది.[14] భారతీయులకు బ్రిటిషు వలస రాజ్యాల పౌరులకు ఉండే హక్కులను ఇస్తూ 1858 నవంబరు 1 న విక్టోరియా రాణి ఒక ప్రకటన చేసింది.[j][18][19] తరువాతి దశాబ్దాల్లో బ్రిటిషు పాలకులు ఈ హక్కులను గుర్తించని సందర్భాల్లో భారతీయులు రాణి చేసిన ఆ ప్రకటనను ఉదహరించేవారు.[k][20][l][20]మీరు చదివిన దానిలో 1856 మైనస్ అని చదివారు. అది 1856 నుండి అని ఉండాలి.
తిరుగుబాటు స్వభావం
వి.డి. సావర్కర్ 1909లో లండన్‌లో ప్రచురించిన "First War of Indian Independence" అనే పుస్తకం 1857 తిరుగుబాటు స్వరూప స్వభావాలను ప్రశ్నించింది. దీనిపై జాతీయ వాదులు, చరిత్రకారుల మధ్య చర్చలు మూడు అంశాల చుట్టూ పరిభ్రమించాయి. అవి 1) తిరుగుబాటు అనేది సిపాయీల ప్రతిఘటన (పితూరి). 2) అది జాతీయ పోరాటం లేదా స్వాతంత్య్రం యుద్ధం 3) అది జమీందార్ల అసంతృప్తి, వారి ప్రతిచర్య.
సిపాయీల పితూరి
19వ శతాబ్దం చివర్లో బ్రిటిషు చరిత్రకారులు, కొంతమంది పరిశీలకులు ఈ తిరుగుబాటును ‘సిపాయీల పితూరి’గానే అభిప్రాయపడ్డారు. సిపాయీలు తరుచూ అతి స్వల్ప కారణాలకు సైతం తిరుగుబాటు చేయడం వల్ల జాన్ లారెన్స్, స్మిత్ లాంటి చరిత్రకారులు దీన్ని కేవలం ‘సిపాయీల పితూరి’గా వర్ణించారు. ఈ సంఘటన గురించి ‘పూర్తిగా దేశభక్తి లోపించింది, సరైన స్వదేశీ నాయకత్వం లేదు. మద్దతు లేదు’ అని జాన్, సీలే పేర్కొన్నారు.
టి. ఆర్. హోల్నెస్ అనే చరిత్రకారుడు 1857 తిరుగుబాటును ‘నాగరికత, అనాగరికతల మధ్య జరిగిన సంఘర్షణ’గా పేర్కొన్నాడు. బ్రిటిషర్లకు నాగరికత ఉందని, భారతీయులకు లేదనే అతడి భావం అనేక విమర్శలకు గురైంది.
మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం
20వ శతాబ్దం ప్రారంభంలో ఈ తిరుగుబాటును వి. డి. సావర్కర్ "జాతి స్వతంత్రం కోసం చేసిన ప్రణాళికా బద్ధ యుద్ధం" అని పేర్కొన్నాడు. డా॥ఎస్.ఎన్.సేన్ తన గ్రంథం ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో వి.డి.సావర్కర్ అభిప్రాయాన్ని పాక్షికంగా అంగీకరించాడు. 1857 తిరుగుబాటు మత పోరాటం అనే వాదనను డా॥ఆర్.డి.మజుందార్ అంగీకరించలేదు.
తిరుగుబాటుకు కారణాలు
1857 తిరుగుబాటు వలస పాలనలో అవలంబించిన పద్ధతుల నుంచే ఉద్భవించింది. బ్రిటిషు సామ్రాజ్య విస్తరణ విధానాలు, ఆర్థిక దోపిడి, పరిపాలనా సంస్కరణలు అన్నీ కలసి.. భారతదేశంలోని సంస్థానాలు, సిపాయీలు, జమీందారులు, కర్షకులు, వ్యాపారస్థులు, కళాకారులు, చేతివృత్తులవారు, పండితులు, మిగతా వర్గాల వారికి ఇబ్బందులు కలిగించాయి.
డల్హౌసీ రాజ్యసంక్రమణ సిద్దాంతం (డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్), మొగలులను వారి వారసత్వ స్థలం నుంచి కుత్బ్ కు తరలిపొమ్మనటం ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. ఆయితే తిరుగుబాటుకి ముఖ్య కారణం పి/53 లీ ఎన్‌ఫీల్డ్ రైఫిల్, 557 కాలిబర్ రైఫిళ్ళలో ఆవు, పంది కొవ్వు పూసిన తూటాలను వాడటం. సిపాయీలు ఈ తూటాలను నోటితో ఒలిచి, రైఫిళ్ళలో నింపాల్సి రావటంతో హిందూ ముస్లిం సిపాయీలు వాటిని వాడటానికి నిరాకరించారు. ఆయితే బ్రిటిషు వారు ఆ తూటాలను మార్చామనీ, కొవ్వులను తేనె పట్టునుండి లేదా నూనెగింజలనుండి సొంతంగా తయారు చేసుకోవటాన్ని ప్రోత్సహించామని చెప్పినప్పటికీ అవి సిపాయీలకు నమ్మకాన్ని కలిగించలేక పోయాయి.
రాజకీయ కారణాలు
1757 ప్లాసీ యుద్ధంతో భారతదేశంలో బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ పాలనకు పునాదులుపడ్డాయి. ఆ తర్వాత 1764 బక్సార్ యుద్ధం, దాని ఫలితంగా కుదిరిన 1765 అలహాబాద్ సంధి బ్రిటిషర్లకు భారతదేశంలో దివానీ, పన్నులు వసూలు చేసే హక్కు కల్పించింది.
ఇదే సమయంలో రాబర్ట్ క్లైవు ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు. దీని వల్ల భారతీయ రాజులు, ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత 1798లో గవర్నర్ జనరల్‌గా భారతదేశానికి వచ్చిన లార్‌డ వెల్లస్లీ సైన్యసహకార పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో వెల్లస్లీ అనేక దురాక్రమణలకు పాల్పడ్డాడు. హైదరాబాదు, మైసూర్ లాంటి అనేక స్వదేశీ సంస్థానాలు బ్రిటిషు పాలన కింద తొత్తులయ్యాయి.
1848లో లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్యసంక్రమణ సిద్ధాంతం తీవ్రస్థాయిలో అసంతృప్తి జ్వాలలు రేకెత్తించింది. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రయోగించి డల్హౌసీ సతారా (1848), శంబల్‌పూర్ (1849), బగ ల్ (1850), ఉదయ్‌పూర్ (1852), ఝాన్సీ (1853), నాగపూర్ (1854) లను ఆక్రమించారు. 1856లో పరిపాలనా వైఫల్యం అనే నెపంతో అయోధ్యను ఆక్రమించి బ్రిటిషర్ల దృష్టిలో డల్హౌసీ మంచి పేరు సంపాదించాడు.
ఈ లోప భూయిష్ట విధానాలు భారతీయుల్లో అసంతృప్తి, వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు నానాసాహెబ్‌ను అవమానించిడం, ఝాన్సీలో లక్ష్మీబాయిని అణగదొక్కడం లాంటి వారి పద్ధతులు రెచ్చగొట్టాయి. రిచర్‌డ టెంపుల్ మాటల్లో .. ‘‘రాబర్‌ట క్లైవు భారతదేశంలో బ్రిటిషు అధికారాన్ని తయారు చేస్తే, దాన్ని వెల్లెస్లీ ఒక గొప్ప శక్తిగా తయారు చేశారు. కానీ డల్హౌసీ బ్రిటిష్‌ను భారతదేశంలో ఏకైక శక్తిగా నిలిపాడు’’ అన్నాడు.
ఆర్థిక కారణాలు
బ్రిటిషర్ల మార్కెటిజం, ఆర్థిక సామ్రాజ్యవాదం కూడా 1857 తిరుగుబాటుకు కారణమయ్యాయి. వలస పాలనతో భారతీయ చేతివృత్తులు, కళాకారులు, కర్షకుల ఆర్థిక జీవనంపై ప్రభావం చూపింది. బ్రిటిషు విధానాల వల్ల భారతీయ కుటీర పరిశ్రమలు, వ్యవసాయం తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. బ్రిటిషు పాలనలో వివిధ గవర్నర్ జనరల్‌లు ప్రవేశపెట్టిన జమీందారి, మహల్వారీ, రైత్వారీ పద్ధతులతో రైతులు తీవ్ర కష్టాలకు లోనయ్యారు. 1813 చార్టర్ చట్టంతో బ్రిటను నుంచి ఉత్పత్తులు భారత విపణిని ముంచెత్తాయి. భారతదేశం నుంచి ముడి సరుకులు లండన్‌కు ఎగుమతయ్యేవి. ఉత్పత్తులను ఎగుమతి చేసే భారత్ ముడిసరుకు ఎగుమతి చేసే దేశంగా మారింది. చిన్న పరిశ్రమల యజమానులు వ్యవసాయ కూలీలుగా మారారు. భారత గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ కాలంలో నిర్వహించిన సర్వే చేతివృత్తుల దీనస్థితి గురించి తెలిపింది.
అప్పుడు బెంటింక్ ‘‘భారత భూభాగాలు, చేతి వృత్తుల వారి ఎముకలతో శ్వేత వర్ణమయ్యాయి’’ అని అన్నాడు. ఈ విధంగా అనేక వర్గాల వారి ఆర్థిక స్థితిగతులను బ్రిటిషు విధానాలు దెబ్బతీశాయి. రాజులు, రాకుమారులు ఇతర మంత్రులు, అధికారులు వారికి రావాల్సిన పెన్షన్‌ను నష్టపోయి, సమాజంలో తమ స్థాయిని కోల్పోయారు. ఆ కాలంలో ఏర్పడిన ప్రకృతి వైపరీత్యాలు కూడా భారతీయులను ఆర్థికంగా అధోగతిలోకి నెట్టాయి. భూస్వామ్య వ్యవస్థ నశించింది. ఇబ్బందులు పడిన వర్గాలన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తిరుగుబాటు చేస్తున్న సిపాయీలకు మద్దతు పలికారు.
సామాజిక, మత కారణాలు
ఈస్టిండియా కంపెనీ అధికారుల విధానాలు సంప్రదాయ భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావం చూపాయి. 1813 చార్టర్ చట్టం భారతదేశంలో క్రైస్తవ మిషనరీలకు అనుమతి, మత మార్పిడులకు ఆహ్వానమూ పలికింది. ఈ చట్టం భారతీయుల మతజీవనంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది. బలవంత మత మార్పిడులను బహిరంగంగా ప్రోత్సహించారు.
ఇంగ్లీషు విద్యావిధానం ప్రవేశపెట్టారు. కొత్తగా ప్రారంభమైన విద్యాలయాల్లో క్రైస్తవ మత బోధన తప్పనిసరైంది. ప్రాచీన విద్యాలయాలు తమ స్థానాన్ని కోల్పోయాయి. 1833 నుంచి హిందూ, ముస్లింలను బహిరంగంగా క్రైస్తవమతంలోకి చేర్చుకోవడంతో భారతీయ సంప్రదాయాలు దెబ్బతిన్నాయి. భారత సమాజంలో అంతర్లీనమైన ఆచార వ్యవహారాలను బ్రిటిషర్లు రద్దు లేదా మార్పు చేశారు. 1829లో సతీ నిషేధ చట్టం, 1846లో స్త్రీ శిశుహత్యా నిషేధ చట్టం, 1856లో వితంతు పునర్వివాహ చట్టాలు భారతీయుల హృదయాల్లో అభద్రతాభావాన్ని రేకెత్తించాయి. వివిధ రూపాల్లో బాధపడ్డ వర్గాలన్నీ తిరుగుబాటును ప్రోత్సహించాయి.
సైనిక కారణాలు
1853లో కార్ల్ మార్క్స్ "బ్రిటిషర్లు భారతీయ సైనిక సహాయంతో రాజ్యాన్ని స్థాపించి, భారతదేశ సొమ్ముతోనే పాలన కొనసాగించార"ని పేర్కొన్నారు. 1856 నాటికి బ్రిటిషు సైన్యంలో 2,32,234 మంది భారతీయ సిపాయీలున్నారు. కంపెనీ చట్టాలతో వీరు అవమానానికి గురయ్యారు. బ్రిటిషు సైనికులతో సమాన వేతనాలు వీరికి అందలేదు. 1854-1856 మధ్య జరిగిన యుద్ధానికి భారతీయ సైనికులు సముద్రాన్ని దాటాల్సి వచ్చింది. సముద్రం దాటడాన్ని అప్పటి భారతీయ సమాజం అంగీకరించేది కాదు. దీన్ని బ్రిటిషు సైన్యంలోని బ్రాహ్మణ సైనికులు వ్యతిరేకించారు.
లార్డ్ కానింగ్ 1856లో ప్రవేశపెట్టిన సాధారణ సేవా నియుక్త చట్టం భారతీయ సైనికుల్లో అసంతృప్తి కలిగించింది. ముస్లింలు, సిక్కులు, ఇతర భారతీయ సైనికులు కూడా బ్రిటిషర్ల వలే ఉండాలనే చట్టం అమలు చేశారు.
తక్షణ కారణం
డల్హౌసీ తర్వాత భారతదేశానికి గవర్నర్ జనరల్‌గా వచ్చిన లార్డ్ కానింగ్ కాలంలో సైన్యంలో ఎన్‌ఫీల్డ్ తుపాకీలు ప్రవేశపెట్టారు. వీటికి ఉపయోగించే మందుగుండ్లపై (కార్ట్‌రిడ్జిలు) ఆవు కొవ్వు లేదా పందికొవ్వు పూసినట్లు సమాచారం వ్యాప్తి చెందింది. సైనికులు పంటితో బుల్లెట్లకు పూసిన కొవ్వును తొలగించి వాటిని తుపాకీలో దించి కాల్చాలి. సైన్యంలో ఎక్కువ మంది హిందువులు, ముస్లింలే కాబట్టి ఇది వారి మతాచారాల మీద తీవ్ర ప్రభావం చూపింది.
తిరుగుబాటు ప్రస్థానం
ప్రారంభం
1857 మార్చినెలలో 34వ బెంగాలు దేశీయ పదాతి దళానికి చెందిన మంగళ్ పాండే అనే సైనికుడు బ్రిటిషు సార్జంట్ మీద దాడిచేసి అతని సహాయకుని గాయపరచాడు. జనరల్ హెన్రీ మగళ్ పాండేని మతపిచ్చి పట్టినవాడిగా భావించి, అతడిని బంధించమని ఈశ్వరీ ప్రసాద్ అనే జమేదార్ని ఆజ్ఞాపించగా, జమేదార్ అతని ఆజ్ఞని తిరస్కరించాడు. షేక్ పల్టూ అనే అతడు తప్పించి అక్కడ ఉన్న సిపాయీలందరూ మంగళ్ పాండేను అరెస్టు చేసేందుకు తిరస్కరించారు. పాండేని బంధించిన షేక్ పల్టూకు పదోన్నతి ఇచ్చారు. బ్రిటిషు వారు మంగళ్ పాండేని ఏప్రిల్ 7న, జమేదారును ఏప్రిల్ 22 న ఉరితీసారు.
భారతీయ సైనికులందరూ బ్రిటిషర్లపై ఒక్కసారిగా తిరుగుబాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. మే 31ని తిరుగుబాటు రోజుగా నిర్ణయించుకొని, చపాతీలు, కలువ పూలు పంచారు. కానీ విప్లవం మే 10నే ప్రారంభమైంది. మే 8వ తేదీన మీరట్‌లోని 3వ అశ్విక దళంలో ఈ బారు తుపాకీలు ప్రవేశపెట్టారు. కానీ వాటిని ఉపయోగించడానికి నిరాకరించిన భారతీయ సైనికులపై బ్రిటిషర్లు తీవ్ర చర్యలు తీసుకున్నారు. దీంతో 1857 మే 10న సైనికులు అక్కడి అధికారులను చంపి మే 11న ఢిల్లీ చేరుకున్నారు.
తొలి దశ
ఢిల్లీలోని ఎర్రకోటను ఆక్రమించి బహదూర్ షా జఫర్ను భారత దేశ చక్రవర్తిగా ప్రకటించారు. దీనికి అతడు సుముఖంగా లేనప్పటికీ, సైనికులు, అతడి దర్బారులోని ఉద్యోగులూ చేసిన బలవంతం మీద అతడు ఒప్పుకొన్నాడని ఆనాటి చరిత్రకారులు, ఆధునికులూ కూడా భావిస్తున్నారు.[22] షా హిందీ, ఉర్దూ భాషల్లో పండితుడు. జఫర్ అనే కలంపేరుతో రచనలు చేశాడు. గడచిన శతాబ్దాల్లో మొగలుల అధికారం చాలావరకూ క్షీణించినప్పటికీ, ఉత్తర భారతంలో వారి ప్రతిష్ఠ ఇంకా బలంగానే ఉంది.[23] పౌరులు, కులీనులు, ఇతర పెద్దలూ అతడికి విధేయులుగా ఉంటామని ప్రతిజ్ఞ చేసారు. చక్రవర్తి తన పేరిట నాణేలు విడుదల చేసాడు. తమ అధికారాన్ని వెల్లడి చేసే మొగలుల పద్ధతి ఇది. మొగలులతో అనేక యుద్ధాలు చేసిన పంజాబీ సిక్ఖులు తిరిగి మహమ్మదీయ పాలనలోకి వెళ్ళేందుకు ఇష్టపడలేదు. అందుచేత వారు తిరుగుబాటును వ్యతిరేకించారు. తిరుగుబాటు సమయంలో బెంగాలు అంతా దాదాపుగా ప్రశాంతంగానే ఉంది. జఫర్ ఇచ్చిన తిరుగుబాటు పిలుపుకు సామాన్యులు స్పందించిన తీరుకు బ్రిటిషర్లు విస్తుపోయారు.[23]
తొలుత తిరుగుబాటు దార్లు కంపెనీ సైన్యాన్ని తరిమేసి, హర్యానా, బీహార్, కేంద్ర పరగణాలు, ఐక్య పరగణాల్లోని అనేక పట్టణాలను స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ దళాలను కూడదీసుకుని ఎదురుదాడి చెయ్యడం మొదలుపెట్టే సమయానికి తిరుగుబాటు దార్లకు ఒక కేంద్రీయ నాయకత్వం కరువైంది. బఖ్త్ ఖాన్ వంటి నాయకులు కొందరున్నప్పటికీ, తిరుగుబాటుదార్లు ఎక్కడికక్కడ చిన్న చిన్న సంస్థానాధీశుల నాయకత్వంలోనే యుద్ధం చేసారు. వీరిలో కొందరు గట్టిగానే పోరాడినప్పటికీ, మిగతావారు మాత్రం స్వార్థపూరితంగాను, అసమర్ధులుగానూ మిగిలిపోయారు.
మీరట్ చుట్టుపట్ల ఉన్న గ్రామీణ ప్రాంతంలో గుర్జర్ల తిరుగుబాటు బ్రిటిషర్లకు అతి పెద్ద బెడద తెచ్చిపెట్టింది. పరీక్షిత్‌గఢ్ లో గుర్జర్లు చౌధురీ కదమ్ సింగ్‌ను తమ నాయకుడిగా ప్రకటించి, కంపెనీ పోలీసులను పారదోలారు. కదమ్ సింగ్ గుర్జర్ 2 వేల నుండి 10 వేల వరకూ ఉన్న పెద్ద సైన్యానికి నాయకత్వం వహించాడు.[24] వలిదాద్ ఖాన్ నాయకత్వంలో బులంద్‌షహర్, మహో సింగ్ నేతృత్వంలో బిజ్‌నోర్ గుర్జర్ల నియంత్రణ లోకి వచ్చాయి. సమకాలికుల నివేదికల ప్రకారం, మీరట్ ఢిల్లీల మధ్య ఉన్న గుర్జర్ల గ్రామాలన్నీ తిరుగుబాటులో పాల్గొన్నాయి. వారికి కొన్ని చోట్ల జలంధర్ మద్దతు లభించింది. జూలై అంతానికి గాని బ్రిటిషర్లు ఈ ప్రాంతంపై నియంత్రణ తెచ్చుకోలేకపోయారు; అది కూడా స్థానిక జాట్‌ల సహాయంతో.[24]
లాహోరుకు చెందిన ముస్లిము పండితుడు ముఫ్తీ నిజాముద్దీన్ బ్రిటిషు వారికి వ్యతిరేకంగా రావ్ తులారామ్‌కు మద్దతు ఇమ్మని ఫత్వా జారీ చేసాడు. ఆ తరువాత, 1857 నవంబరు 16 న, నర్నౌల్ వద్ద జరిగిన పోరులో రావ్ తులారామ్ ఓడిపోయాడు. ముఫ్తీ నిజాముద్దీన్‌ను, అతడి సోదరుడు, బావమరిదినీ బ్రిటిషు వారు అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకువెళ్ళి ఉరితీసారు.[25]
ఢిల్లీ
తిరుగుబాటును అణచడంలో మొదట్లో బ్రిటిషు వారు కొంత మందకొడిగా వ్యవహరించారు. బ్రిటను నుండి సైన్యాలు సముద్రం మీదుగా రావడం కొంత ఆలస్యమైంది. చైనా వెళ్ళే దారిలో ఉన్న కొన్ని దళాలను భారత్‌కు మళ్ళించారు.
మీరట్, సిమ్లాల నుండి బ్రిటిషు దళాలు ఢిల్లీకి బయల్దేరి దారిలో అనేకమంది తిరుగుబాటుదార్లను చంపుతూ కర్నాల్ వద్ద కలుసుకున్నాయి. ఈ రెండు సైన్యాలు నేపాల్ నుండి వచ్చిన రెండు గూర్ఖా దళాలతో కలిసి బద్లీ కే సరాయ్ వద్ద తిరుగుబాటుదార్ల ప్రధాన దళాన్ని ఎదుర్కొన్నాయి.
ఢిల్లీకి ఉత్తరాన స్థావరాన్ని నిర్మించుకుని కంపెనీ దళాలు నగరాన్ని ముట్టడించాయి. జూలై 1 నుండి సెప్టెంబరు 21 దాకా ఈ ముట్టడి కొనసాగింది. అయితే నగరాన్ని చుట్టుముట్టేంత సైన్యం బ్రిటిషు వారి వద్ద లేదు. తిరుగుబాటు సైన్యం బ్రిటిషు సైన్యం కంటే సంఖ్యలో చాలా పెద్దది. ముట్టడిలో ఉన్నది ఢిల్లీయా, బ్రిటిషు సైన్యమా ఆన్నట్టు ఉండేది. తిరుగుబాటుదార్ల నిరంతర దాడులు, రోగాలు, అలసట కారణంగా బ్రిటిషు సైన్యం వెనక్కి తగ్గుతుందేమో అన్నట్టుండేది. ఆగస్టు 14 న పంజాబు నుండి బ్రిటిషు, సిక్ఖు, పఖ్తూన్ దళాలు జాన్ నికోల్సన్ నాయకత్వంలో వచ్చి చేరడంతో బ్రిటిషు సైన్యం బలపడింది.[26][27]
- ధ్వంసమైన జంతర్ మంతర్ ఖగోళ వేధశాల, 1858
- మందు గుళ్ళతో ధ్వంసమైన కాశ్మీరీ గేట్, 1858
- పోరులో ధ్వంసమైన హిందూరావ్ ఇల్లు. ప్రస్తుతం దీన్ని ఆసుపత్రిగా మార్చారు
- శతఘ్ని గుళ్ళు, తుపాకీ కాల్పుల్లో దెబ్బతిన్న ఢిల్లీ బ్యాంక్
సెప్టెంబరు 7 న బ్రిటిషు వారు శతఘ్నులతో గోడలను బద్దలు కొట్టి తిరుగుబాటుదార్ల శతఘ్నులను పట్టుకున్నారు.[28]: 478 సెప్టెంబరు 14 న కాశ్మీరీ గేట్ ద్వారా నగరంలోకి ప్రవేశించేందుకు బ్రిటిషు దళాలు ప్రయత్నించాయి.[28]: 480 నగరంలో కాలుమోపినప్పటికీ బ్రిటిషు దళాలకు అపార నష్టం జరిగింది. జాన్ నికోల్సన్ కూడా మరణించాడు. బ్రిటిషు కమాండరు వెనక్కి తగ్గాలని అనుకున్నాడు. కానీ, అతడి కింది అధికారులు నచ్చజెప్పడంతో పోరు కొనసాగించాడు. ఒక వారంలో బ్రిటిషు దళాలు ఎర్రకోటను పట్టుకున్నాయి. ఢిల్లీ తిరిగి బ్రిటిషు వారి స్వాధీనమైంది. బహదూర్ షా జఫర్ అప్పటికే హుమాయూన్ సమాధికి పారిపోయాడు.
బ్రిటిషు సైన్యాలు నగరంలో దోపిడీలు దౌర్జన్యాలు చేసాయి. అనేకమంది పౌరులను చంపారు. ప్రధాన మసీదును, ఇతర ప్రాంతాలనూ శతఘ్నులతో పేల్చివేసారు. కులీన ముస్లిముల ఇళ్ళను ధ్వంసం చేసారు.
బహదూర్ షా జఫర్‌ను అరెస్టు చేసారు. అతడి కుమారులలో ఇద్దరిని, ఒక మనుమడినీ బ్రిటిషు ఏజెంటు కాల్చి చంపించాడు. ఈ సంగతి తెలిసి బహదూర్ షా మ్రాన్పడి పోయాడు. అతడి భార్య జీనత్ మహల్ మాత్రం ఇక తన కొడుకు జఫర్ వారసుడౌతాడని సంతోషించింది.[29]
కాన్పూరు
కాన్పూర్‌లో తిరుగుబాటు చేసిన నానాసాహెబ్ అసలు పేరు దొండూ పంత్. ఇతడు మరాఠా చివరి పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు. తిరుగుబాటు సమయంలో బితూర్ (కాన్పూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్) లో తన కుటుంబంతో పాటు నివసించేవాడు.
జూన్‌లో జనరల్ వీలర్ నేతృత్వంలో ఉన్న సిపాయీలు తిరుగుబాటు చేసి, యూరపియన్లు ఉంటున్న ప్రాంతాన్ని ముట్టడించారు. ఒక సైనికుడిగా వీలర్‌ను అందరూ గౌరవించేవారు. అతడొక హిందూ స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. తనకున్న ప్రతిష్ఠపైన, నానా సాహిబ్‌తో తనకున్న మంచి సంబంధాల పైనా ఆధారపడి, ముట్టడిని ఎదుర్కోవడంలోను, ఆహారాన్ని నిల్వ చేసుకోవడంలోనూ అతడు కొంత అలసత్వం వహించాడు. మూడు వారాల ముట్టడి తరువాత, వాళ్ల వద్ద మూడే రోజులకు సరిపడా ఆహారం మిగిలి ఉంది.
జూన్ 25 న యూరపియన్లను భద్రంగా అలహాబాదు వెళ్ళనిస్తానని నానా సాహిబ్ ప్రతిపాదించాడు. బ్రిటిషు వాళ్ళు అందుకు అంగీకరించారు. 26 రాత్రి వెళ్ళమని నానా చెప్పగా 27 పగలు వెళ్తామని, తమవెంట పిస్తోళ్ళు ఉంచుకుంటామనీ వాళ్ళు షరతు విధించారు. అందుకు నానా అంగీకరించాడు. 27 ఉదయాన్నే యూరపియన్లు తమ నివాసాలు వదలి గంగానదిలో నానా సాహెబ్ సిద్ధం చేసి ఉంచిన పడవల వద్దకు బృందంగా బయలుదేరారు.[30] కంపెనీకి విధేయులుగా ఉన్న అనేక మంది సిపాయీలను - బ్రిటిషు వారి పట్ల వారికున్న విధేయత కారణంగా గాని, వాళ్ళు "క్రైస్తవులుగా మారిపోయారని" గానీ - తిరుగుబాటుదార్లు చంపేసారు. బృందానికి కొద్దిగా వెనకగా నడుస్తున్న కొందరు గాయపడ్డ బ్రిటిషు అధికారులను కూడా చంపేసారు. దాదాపు యూరపియన్లందరూ రేవు వద్దకు చేరుకునేటప్పటికి నదికి రెండు ఒడ్డుల పైనా సిపాయీలు మోహరించి ఉన్నారు.[31] కాల్పులు మొదలయ్యాయి. నావికులు పడవలను వదిలిపెట్టి పారిపోయారు.[32] కొన్ని పడవలను చెక్క బొగ్గులతో తగలబెట్టారు.[33] యూరపియన్లు పడవలెక్కి నదిలోకి పారిపోవాలని ప్రయత్నించారు గానీ మూడు పడవలు మాత్రమే వెళ్ళగలిగాయి. డజను మంది గాయపడిన మగవారితో ఉన్న ఒక పడవ కొంత దూరం పోగలిగినప్పటికీ తిరుగుబాటుదార్లు దాన్ని పట్టుకుని తిరిగి వెనక్కు తెచ్చారు. చివరిలో తిరుగుబాటుదార్లు నీళ్ళ లోకి దూకి, చావకుండా నదిలో ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళను కూడా చంపేసారు.[33] కాల్పులు ఆగాక, బ్రతికి ఉన్న వాళ్ళను చుట్టుముట్టి, వారిలోని మగవాళ్ళను చంపేసారు.[33] ఈ నరమేధం ముగిసేటప్పటికి, దాదాపుగా మగవాళ్ళందరూ చనిపోయారు. మిగిలిన స్త్రీలు, పిల్లలను బందీలుగా పట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్లను కూడా బీబీఘర్ నరమేధంలో చంపేసారు.[34] నలుగు మగవాళ్ళు మాత్రమే - ఇద్దరు ప్రైవేట్ సైనికులు, ఒక లెఫ్టినెంటు, కెప్టెన్ మౌబ్రే థామ్సన్ - తప్పించుకోగలిగారు. మౌబ్రే థామ్సన్ ది స్టోరీ ఆఫ్ కాన్‌పోర్ (లండన్, 1859) అనే పుస్తకంలో ఆనాటి సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా తన అనుభవాలను రాసాడు.
తరువాత జరిగిన విచారణలో, యూరపియన్లను చంపాలనే పథకమేమీ లేదని చెబుతూ తాంతియా తోపే కథనం ఇలా ఉంది: యూరపియన్లు పడవల్లో ఎక్కేసారు. పడవలను పోనిమ్మని సూచిస్తూ తాంతియా తోపే కుడి చెయ్యెత్తాడు. సరిగ్గా అప్పుడు అక్కడున్న గుంపు లోంచి ఎవరో ఈల వేసారు. దాంతో అలజడి రేగింది. సరంగులు పడవల్లోంచి దూకేసారు. తిరుగుబాటుదార్లు విచ్చలవిడిగా కాల్పులు మొదలుపెట్టారు. దగ్గర్లోనే ఉన్న సవాదా కోఠిలో ఉన్న నానా సాహెబ్‌కు ఈ సంగతి తెలిసి కాల్పులను ఆపేందుకు వెంటనే వచ్చాడు.[35] బ్రిటిషు చరిత్రకారులు కొందరు కూడా దీన్ని ఒక అనుకోని హఠాత్ సంఘటనగానే భావించారు; ఎవరో మొదటి కాల్పు కాల్చారు, ఆందోళన చెందిన బ్రిటిషర్లు ఎదురుకాల్పులు మొదలుపెట్టారు, ఇక ఆ తరువాత జరిగిన నరమేధాన్ని ఎవరూ ఆపలేక పోయారు.[36]
బందీలను ముందు సవాదా కోఠికి తీసుకువెళ్ళారు. ఆ తరువాత స్థానిక మేజిస్ట్రేటు గుమాస్తా వద్దకు (బీబీఘర్) తీసుకువెళ్ళారు.[37] అక్కడ ఫతేగఢ్ నుంచి వచ్చిన కాందిశీకులు కూడా ఉన్నారు. మొత్తం ఐదుగురు మగవారు, 206 గురు స్త్రీలు, పిల్లలూ బీబీఘర్‌లో రెండు వారాల పాటు బందీలుగా ఉన్నారు. ఒక వారంలో 25 మంది విరేచనాలు, కలరా కారణంగా చనిపోయారు.[32] ఇదిలా ఉండగా, అలహాబాదు నుండి కంపెనీ దళాలు కాన్పూరుకు బయల్దేరాయి. నానాసాహెబ్ కాన్పూరును కాపాడుకోలేడని జూలై 15 నాటికి స్పష్టమైంది. బందీలను చంపెయ్యాలని నానా సాహెబ్, ఇతర నాయకులూ నిర్ణయించారు. సిపాయీలు ఈ పని చేసేందుకు నిరాకరించగా, ఇద్దరు ముస్లిము కసాయిలు, ఇద్దరు హిందూ రైతులు, నానా అంగరక్షకుడొకరూ కలిసి బీబీఘర్ లోకి వెళ్ళారు. కత్తులు, గొడ్డళ్ళతో వాళ్ళు యూరపియన్లను చంపేసారు.[38] ఆ హత్యాకాండ తరువాత అక్కడి గోడలు రక్తంతో తడిసిన చేతుల మరకలతో నిండిపోయాయి. నేలపై మనుషుల మాంసఖండాలు చెల్లాచెదురుగా పడ్డాయి.[39] చనిపోయిన వాళ్ళను, చనిపోతున్న వాళ్ళనూ దగ్గర్లోని బావిలో పడవేసారు. 15 మీటర్ల లోతున్న బావి, పైనుండి 1.8 మీటర్ల వరకూ నిండిపోయింది [40] మిగిలిన శవాలను గంగానదిలోకి విసిరేసారు.[41]
ఈ క్రూర హంతక చర్యకు చరిత్రకారులు అనేక కారణాలను చెప్పారు: బందీలు ఎవరూ లేరని తెలిస్తే కాన్పూరు వస్తున్న బ్రిటిషు సైన్యం తిరిగి వెళ్ళిపోతుందని భావించి ఇలా ఆదేశించి ఉండవచ్చు. బ్రిటిషు వాళ్ళు కాన్పూరును తిరిగి స్వాధీనం చేసుకున్నాక, వాళ్లకు సమాచారమేమీ తెలియకుండా ఉండేందుకు చేసి ఉండవచ్చు. నానా సాహిబ్‌కు బ్రిటిషు వారితో ఉన్న సత్సంబంధాలను దెబ్బతీసే కుట్రతో కొందరు ఈ పని చేసి ఉండవచ్చు.[42] గంగా నది వద్ద జరిగిన కాల్పుల్లో తాము పాల్గొన్నామని బందీలు గుర్తు పడతారేమోననే భయంతో కొందరు ఇలా చేసి ఉండవచ్చు.[34]
- "జనరల్ వీలర్ క్యాంపు లోని ఆసుపత్రి, కాన్పూరు". (1858). మొదటిసారిగా ఈ ఆసుపత్రి వద్దనే యూరపియన్లు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు.
- 1857 జూన్ 27 న అనేక మంది బ్రిటిషు వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన సతీ చౌరా ఘాట్. 1858 నాటి చిత్రం.
- యూరపియన్ స్త్రీలు, పిల్లలు మరణించిన బీబీఘర్. వాళ్ల శవాలు దొరికిన బావి. 1858.
- స్మారకాన్ని నిర్మించిన బీబీఘర్ స్థలం. శామ్యూల్ బర్న్, 1860.
ఈ మారణకాండతో సిపాయీల పట్ల బ్రిటిషు వారి వ్యతిరేక ధోరణి మరింత బలపడింది. ఈ సంఘటన గురించి విన్న బ్రిటిషు ప్రజలు హతాశులయ్యారు. సామ్రాజ్య వ్యతిరేక, భారత అనుకూల వర్గాలు తమకున్న మద్దతును పూరిగా కోల్పోయాయి. మిగిలిన తిరుగుబాటు కాలమంతా బ్రిటిషు వారికి కాన్పూరే రణనినాదమైంది. తిరుగుబాటు అంతాన నానా సాహిబ్ అదృశ్యమయ్యాడు. ఏమయ్యాడో తెలియదు.
బీబీఘర్ మారణకాండకు రెండు వారాల ముందు, అలహాబాదు నుండి వస్తున్న బ్రిటిషు సైన్యం విచక్షణ లేకుండా ప్రజలపై దమనకాండ జరిపింది.[43][44][45] ఫతేపూర్‌లో ఒక గుంపు స్థానిక యూరపియన్లపై దాడిచేసి చంపివేసారు. ఆ నెపంతో, బ్రిటిషు కమాండరు నీల్, గ్రాండ్ ట్రంక్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న గ్రామాలన్నిటినీ తగలబెట్టి, అక్కడి ప్రజలను ఉరితీయాలని ఆదేశించాడు. నీల్ పద్ధతులు "క్రూరం, దారుణం"[46] ఇవి ప్రజలను భయపెట్టకపోగా, అంతకు ముందు తిరుగుబాటులో పాల్గొనని సిపాయీలను కూడా అందుకు పురికొల్పాయి.
నీల్ సెప్టెంబరు 26 న లక్నో జరిగిన యుద్ధంలో మరణించాడు. ఆనాటి కొందరు బ్రిటిషర్లు నీల్‌ను గొప్పగా కీర్తించారు.[47] బ్రిటిషర్లు కాన్పూరును స్వాధీనం చేసుకున్నాక, బందీలుగా పట్టుకున్న సిపాయీలను బీబీఘర్‌కు తీసుకువెళ్ళి అక్కడి గోడలపైన, నేలపైనా ఉన్న రక్తపు మరకలను వాళ్ళ చేత నాకించారు.[48] కొంత మందిని ఉరితీసారు. మరి కొందరిని శతఘ్నులలో పెట్టి పేల్చివేసారు. ఆ సిపాయీలు మారణకాండలో పాల్గొనలేదుగదా అని కొందరు అన్నప్పటికీ, దాన్ని వీళ్ళు ఆపలేదు కదా అని జవాబిచ్చారు. కెప్టెన్ థాంప్సన్ ఈ సంగతిని ధ్రువీకరించాడు.
లక్నో
మీరట్ సంఘటనల తర్వాత వెంటనే అవధ్ (ఔధ్) లో తిరుగుబాటు తలెత్తింది. బ్రిటిషు వారు దాన్ని ఆక్రమించుకుని అప్పటికి ఒక్క సంవత్సరమే అయింది. తిరుగుబాటుదార్లు రెసిడెన్సీ ఆవరణను ముట్టడించారు. లోపల సిపాయీలతో కలిపి మొత్తం 1700 మంది ఉన్నారు. తిరుగుబాటుదార్లు శతఘ్ని దాడులు, తుపాకి కాల్పులు జరిపారు. బ్రిటిషు కమిషనరు సర్ హెన్రీ లారెన్స్ మొదటగా మరణించిన వారిలో ఉన్నాడు. బాంబులతో గోడలను పేల్చి, సొరంగం తవ్వీ లోపలికి వెళ్ళేందుకు తిరుగుబాటుదార్లు ప్రయత్నించారు.[28]: 486 90 రోజుల ముట్టడి తరువాత, రెసిడెన్సీ లోపల 300 మంది సిపాయీలు, 350 మంది బ్రిటిషు సైనికులు, 550 మంది అసైనికులూ మిగిలారు.
ముట్టడిలో ఉన్న బ్రిటిషు వారికి సహాయకంగా ఉండేందుకు సెప్టెంబరు 25 న సర్ హెన్రీ హావెలాక్ నాయకత్వాన ఒక సైనిక దళం కాన్పూరు నుండి లక్నోకు బయలుదేరింది. దారి పొడుగునా వాళ్ళు అనేక మంది తిరుగుబాటుదార్లను ఎదుర్కొని పోరాడుతూ కాన్పూరు చేరుకున్నారు. ఈ చిన్న దళానికి తిరుగుబాటుదార్లను ఎదుర్కొనే శక్తి లేకపోవడం చేత వాళ్ళు కోట లోని దళంతో చేరిపోయారు. అక్టోబరులో మరొక పెద్ద సైన్యం సర్ కోలిన్ క్యాంప్‌బెల్ నాయకత్వాన వచ్చి ముట్టడిని ఎదుర్కొని తిరుగుబాటుదార్లను ఓడించింది. ఆ తరువాత రెసిడెన్సీని ఖాళీ చేయించి బ్రిటిషు వారందరినీ ముందు ఆలంబాగ్‌కు, ఆ తరువాత కాన్పూరుకూ తరలించారు. ఈ క్రమంలో ఆలంబాగ్‌లో కోట కట్టించేందుకు కొంత సైన్యాన్ని ఉంచారు.
అవధ్‌లో తిరుగుబాటును అణచేందుకు 1858 మార్చిలో క్యాంప్‌బెల్ మళ్ళీ భారీ సైన్యంతో లక్నో బయలుదేరాడు. ఆలంబాగ్‌లో ఉంచిన సైన్యాన్ని కలుపుకున్నాడు. అతడికి సహాయంగా జంగ్ బహదూర్ రాణా నేతృత్వంలో పెద్ద నేపాలీ దళం కూడా ఒకటుంది.[49] మార్చి 21 న జరిగిన చివరి యుద్ధంతో క్యాంప్‌బెల్ తిరుగుబాటుదార్లను పారదోలాడు.[28]: 491
ఝాన్సీ
ఝాన్సీ, బుందేల్‌ఖండ్ ప్రాంతంలో మారాఠాల పాలనలో ఉన్న సంస్థానం. 1853 లో ఝాన్సీ రాజు, కొడుకులు లేకుండా మరణించగా, రాజ్యసంక్రమణ సిద్దాంతం కింద ఆ రాజ్యాన్ని బ్రిటిషు రాజ్యానికి కలిపేసుకున్నారు. తమ దత్తపుత్రునికి రాజ్యాధికారం నిరాకరించడాన్ని రాణి లక్ష్మీబాయి ఎదిరించింది. యుద్ధం మొదలు కాగానే ఝాన్సీ తిరుగుబాటుకు ఒక కేంద్రంగా మారింది. కొందరు కంపెనీ అధికారులు, వారి కుటుంబాలతో సహా ఝాన్సీ కోటలో తలదాచుకున్నారు. వారి విడుదలకు రాణి లక్ష్మీబాయి అంగీకరించింది. అయితే, విడుదల కాగానే ఈ కంపెనీ వాళ్ళను తిరుగుబాటుదార్లు ఊచకోత కోసారు. ఈ తిరుగుబాటుదార్లతో రాణికి ఏ సంబంధమూ లేదు; ఆ సంగతిని ఆమె పదేపదే చెప్పినప్పటికీ ఆమె కుట్ర చేసిందన్న అనుమానం బ్రిటిషర్లను వీడలేదు.
1857 అంతానికి బుందేల్‌ఖండ్, తూర్పు రాజస్థాన్ ప్రాంతాల్లో చాలావరకు కంపెనీ నియంత్రణ కోల్పోయింది. ఈ ప్రాంతాల్లోని బెంగాలు సైన్యం కూడా తిరుగుబాటు చేసి, ఢిల్లీ, కాన్పూరుల్లోని యుద్ధాల్లో పాల్గొనేందుకు తరలి పోయింది. ఈ ప్రాంతంలోని అనేక సంస్థానాలు తమలో తాము పోరాడుకోవడం మొదలుపెట్టాయి. 1857 సెప్టెంబరు అక్టోబరుల్లో పొరుగు రాజ్యాల దాడులను రాణి లక్ష్మీ బాయి జయప్రదంగా తిప్పికొట్టింది.
1858 మార్చిలో సర్ హ్యూ రోజ్ ఝాన్సీని ముట్టడించాడు. కంపెనీ సైన్యాలు నగరాన్ని ఆక్రమించగా, రాణి మారువేషంలో తప్పించుకుంది.
ఝాన్సీ, కల్పీ ల నుండి పారిపోయిన లక్ష్మీబాయి, కొందరు మరాఠా వీరులూ కలిసి, సిందియాలను ఓడించి గ్వాలియరును స్వాధీనం చేసుకున్నారు. సింధియాలు బ్రిటిషు వారికి సన్నిహితులు. ఇది తిరుగుబాటును ప్రజ్వలింపజేసేదేమో గానీ, ఈ లోపునే సర్ హ్యూ రోజ్ నేతృత్వంలోని సైన్యం గ్వాలియరుపై దాడి చేసింది. అప్పుడు జరిగిన యుద్ధంలో రెండవ రోజున, జూన్ 17 న, రాణి లక్ష్మీబాయి మారణించింది. తరువాతి మూడు రోజుల్లో కంపెనీ సైన్యం గ్వాలియరును తిరిగి వశపరచుకుంది. ఈ చివరి యుద్ధంలో ఆమె వర్ణనను గమనించిన కొందరు వ్యాఖ్యాతలు ఆమెను జోన్ ఆఫ్ ఆర్క్‌తో పోల్చారు.[50] లక్ష్మీబాయి గురించి సర్ హ్యూ రోజ్ ‘‘1857 తిరుగుబాటులో అత్యంత ఉత్తమమైన, ధైర్యమైన నాయకురాలు’’ అని పొగిడాడు
ఇండోర్
ఇండోర్‌లో ఉన్న నాటి కంపెనీ రెసిడెంటు కల్నల్ హెన్రో మార్లన్ డ్యురండ్ ఇండోర్లో తిరుగుబాటు వస్తుందనడాన్ని కొట్టిపారేసాడు.[51] అయితే, జూలై 1 న హోల్కారు సైన్యంలోని సిపాయీలు తిరుగుబాటు చేసి, బ్రిటిషు ఆఫీసర్లతో కూడిన భోపాల్ దళంపై కాల్పులు జరిపారు. వాళ్ళను ఎదుర్కొనేందుకు కల్నల్ ట్రావెర్స్ ముందుకు పోగా, అతన్ని అనుసరించేందుకు భోపాల్ పదాతి దళం తిరస్కరించింది. భోపాల్ శతఘ్ని దళం కూడా తిరస్కరించి, తమ తుపాకులను యూరపియన్ల మీద ఎక్కుపెట్టింది. ఇక చేసేదేమీ లేక, డ్యురండ్ యూరపియన్లందరినీ సమీకరించి, తప్పించుకున్నాడు. ఈలోగా 39 మంది యూరపియన్లను చంపేసారు.[52]
బీహార్
బీహారులో తిరుగుబాటు ఆ రాష్ట్ర పశ్చిమ ప్రాంతం లోనే ఎక్కువగా జరిగింది. అయితే, గయ జిలాలో కూడా దోపిడీలు, దౌర్జన్యాలూ జరిగాయి.[53] తిరుగుబాట్లలో పాల్గొన్న ప్రధాన వ్యక్తుల్లో ఒకరు జగదీష్‌పూర్ జమీందారు, 80ఏళ్ళ కన్వర్ సింగ్. అతడి జమీని బ్రిటిషు వారు జప్తు చేసే పనిలో ఉన్నారు. అతడు తిరుగబాటును ఎగదోసి, దానికి నాయకత్వం వహించాడు.[54] అతడి తమ్ముడు, సేనాధ్యక్షుడూ ఇందుకు సహకరించారు.[55]
జూలై 25 న దీనాపూర్ సైనిక స్థావరంలో తిరుగుబాటు రాజుకుంది. తిరుగుబాటుదార్లు అర్రా నగరం వైపు సాగిపోయారు. అక్కడ, వారితో కన్వర్ సింగ్, అతడి సైన్యం కలిసింది.[56] బోయిల్ అనే బ్రిటిషు రైల్వే ఇంజనీరు అలాంటి దాడుల నుండి రక్షణగా ఉండేందుకు ముందుచూపుతో తన నివాసంలో ఒక భవంతిని నిర్మించుకుని ఉన్నాడు.[57] తిరుగుబాటుదార్లు అర్రాకు చేరుకునేటప్పటికి యూరపియన్లందరూ బోయిల్ ఇంటిలో తలదాచుకున్నారు.[58] తిరుగుబాటుదార్లు ఆ ఇంటిని ముట్టడించారు. రెండు మూడు వేల మంది తిరుగుబాటుదార్లు జరిపే ముట్టడిని ఎదుర్కొనేందుకు వారివద్ద 50 మంది విధేయ సిపాయీలు ఉన్నారు.[59]
వీళ్ళను రక్షించేందుకు దీనాపూర్ నుండి 400 మందిని అర్రాకు పంపించారు. ఈ దళాన్ని దారిలోనే తిరుగుబాటుదార్లు అడ్డుకుని వెనక్కు పారదోలారు. బక్సార్ వైపు నదిలో ప్రయాణం చేస్తున్న బ్రిటిషు దళం ఒకటి బక్సార్ చేరుకోగానే అర్రా ముట్టడి వార్త తెలిసింది. ఆ దళ నాయకుడు మేజర్ విన్సెంట్ ఐర్, వెంటనే దళాన్ని ఆయుధాలనూ పడవల్లోంచి దింపి అర్రా వైపు సాగిపోయాడు. అటు వెళ్ళవద్దని అతడికి ఆదేశాలు వచ్చినప్పటికీ అతడు పట్టించుకోలేదు.[60] ఆగస్టు 2 న అర్రాకు 9.7 కి.మీ. దూరాన ఉండగా తిరుగుబాటుదార్లు వాళ్ళపై మెరుపుదాడి చేసారు. అప్పుడు జరిగిన పోరులో బ్రిటిషు దళం గెలిచింది.[59] ఆగస్టు 3 న మేజర్ ఐర్ తన దళంతో సహా ముట్టడి ఇంటిని చేరుకుని ముట్టడిని చెదరగొట్టాడు.[61][62]
మరికొన్ని దళాలను పొందాక, మేజర్ ఐర్ కన్వర్ సింగ్‌ను వెంబడించి జగదీష్‌పూర్ చేరుకున్నాడు. అప్పటికే కన్వర్ సింగ్ తప్పించుకున్నాడు. ఐర్ సింగ్ ఇంటిని, అతడి సోదరుల ఇళ్ళనూ ధ్వంసం చేసాడు.[59] గయ, నవాడా, జెహానాబాద్ జిల్లాల్లో కూడా హుసేన్ బక్ష్ ఖాన్, గులామ్ ఆలీ ఖాన్, ఫతే సింగ్ వంటి వారి నాయకత్వంలో తిరుగుబాట్లు జరిగాయి.[63]
తిరుగుబాటు తదనంతర పరిణామాలు
1857 తిరుగుబాటు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య మలుపుగా చెప్పవచ్చు. బ్రిటిషు వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను రద్దుచేసి విక్టోరియా రాణి పరిపాలనను ప్రవేశపెట్టారు. భారత పాలనావ్యవహారాలను చూసుకోవటానికి వైస్రాయిని నియమించారు. ఈవిధంగా భారతదేశం నేరుగా బ్రిటిషు పాలనలోకి వచ్చింది. తన పాలనలో భారతదేశ ప్రజలకు సమాన హక్కులు కల్పిస్తానని బ్రిటిషు రాణి ప్రమాణం చేసింది, అయినప్పటికీ బ్రిటిషు వారిపట్ల భారత ప్రజలకు అనుమానాలు తొలగలేదు.
బ్రిటిషు వారు తమ పాలనలో అనేక రాజకీయ సంస్కరణలను ప్రవేశపెట్టారు. భారతదేశంలోని అగ్రవర్ణాల వారిని, జమీందారులను పరిపాలనలో భాగస్వాములను చేసారు. భూ ఆక్రమణలకు స్వస్తి పలికారు, మతవిషయాలలో ప్రభుత్వ జోక్యం నిలిపివేసారు. భారతీయులను ప్రభుత్వ ఉద్యోగాలలోకి అనుమతించారు, అయితే ఆచరణలో క్రిందితరగతి ఉద్యోగాలకే పరిమితం చేసారు. సైన్యంలో బ్రిటిషు సైనికుల నిష్పత్తిని పెంచారు. ఫిరంగులు మొదలయిన భారీ అయుధాలను బ్రిటిషు సైనికులకే పరిమితం చేసారు. బహదూర్‌షాను దేశ బహిష్కృతుని గావించి బర్మాకి తరలించారు. 1862 లో అతను బర్మాలో మరణించటంతో భారత రాజకీయాలలో మొగలుల వంశం అంతమైందని చెప్పవచ్చు. 1877 లో బ్రిటన్ రాణి, తనను భారతదేశానికి రాణిగా ప్రకటించుకుంది.
150వ వార్షికోత్సవం
భారత ప్రభుత్వం 2007 సంవత్సరాన్ని "ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామ"పు 150 వ వార్షికంగా జరుపుకుంది. ఆ సంవత్సరం భారతీయ రచయితలు రాసిన అనేక పుస్తకాలు విడుదలయ్యాయి. అమరేష్ మెహ్రా రాసిన వార్ ఆఫ్ సివిలైజేషన్స్ వీటిలో ఒకటి. ఇదొక వివాదాస్పద పుస్తకం. అనురాగ్ కుమార్ రాసిన రీకాల్సిట్రాన్స్ అనేది మరొక పుస్తకం.
2007 లో కొందరు బ్రిటిష్ సైనికులు, పౌరులు, (వారిలో కొందరు ఆ తిరుగుబాటులో మరణించిన సైనికుల బంధువులు) లక్నో ముట్టడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించేందుకు ప్రయత్నించారు. అయితే, జాతీయవాద భారతీయ జనతా పార్టీ మద్దతుతో ప్రదర్శనలు జరుగుతాయని, అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయనీ భావించి, వారు ఆ ప్రయాణం మానుకున్నారు.[64] అయినప్పటికీ సర్ మార్క్ హావెలాక్ తన పూర్వీకుడైన జనరల్ హెన్రీ హావెలాక్ సమాధిని దర్శించుకున్నాడు.[65]
ఇవీ చూడండి
- 1857 భారత తిరుగుబాటు పేర్లు
- 1922-24 మన్య విప్లవం
- విజాగపటం తిరుగుబాటు - 1780 లో విశాఖపట్నంలో సిపాయీలు చేసిన తిరుగుబాటు
- వెల్లూరు తిరుగుబాటు - 1806 లో వెల్లూరులో సిపాయీలు చేసిన తిరుగుబాటు
- అల్లూరి సీతారామరాజు
- కొమరం భీమ్
- ఉత్తర సర్కారుల్లో ఐరోపా వారి యుద్ధాలు
బయటి లింకులు
- Detailed Map: The revolt of 1857-1859, Historical Atlas of South Asia, Digital South Asia Library, hosted by the University of Chicago
- Period illustrations related to Nanssahib, E. Prof F Pritchett, Columbia University
- Sepoy Blog, A day by day account of 1857 Rebellion Archived 2020-11-27 at the Wayback Machine
- First War of Independence – Sify
- 1857 first freedom fight:: १८५७ :: अखंड भारतम्
- 1857 was not the first war of Independence
- Development of Situation-January to July 1857 – Maj (Retd) AGHA HUMAYUN AMIN from WASHINGTON DC defencejounal.com Archived 2006-12-09 at the Wayback Machine
- The Library of Congress (US) – Research Centers – Country Study – India @ 1857
- Alexander Ganse World History at KMLA – Mutiny 1857
- The Sepoy War of 1857 – Emory.edu Archived 2013-01-14 at the Wayback Machine
- The Indian Mutiny BritishEmpire.co.uk
- Paintings related to events of 1857 Archived 2012-08-14 at the Wayback Machine
- British Army Official Records of the Era
- Karl Marx, New York Tribune, 1853–1858, The Revolt in India marxists.org
- In Pictures: Rare images of the 1857 uprising in India, BBC News, 12 May 2007
- India Rising National Army Museum (UK)
- A Great British Tradition Archived 2011-05-16 at the Wayback Machine, John Newsinger on the Great Indian Rebellion, Socialist Review, May 2007.
- Narrative of Munshi Jeewan Lal
- India's secret history: 'A holocaust, one where millions disappeared...'
నోట్స్
- "1857 తిరుగుబాటు చాలావరకు గంగా మైదానపు ఉత్తర ప్రాంతానికి, మధ్య భారతానికీ పరిమితమైంది."[5]
- "1857 తిరుగుబాటు గంగా మైదానపు ఉత్తర ప్రాంతానికి, మధ్య భారతానికీ పరిమితమైంది."[6]
- "హింస చాలావరకు గంగా మైదానపు ఉత్తర ప్రాంతం, మధ్య భారతం లోనే జరిగినప్పటికీ, ఇది ఉత్తర తూర్పు ప్రాంతాలకూ పాకిందని ఈమధ్య జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది."[7]
- "1857 నాటి సంఘటనల ప్రత్యేకత, వాటి తీవ్రత. కొద్ది కాలం పాటు గంగామైదాన ప్రాంతంపై బ్రిటిషు వారి ఆధిపత్యాన్ని సవాలు చేసాయి."[8]
- "1857–58 మధ్య జరిగిన సంఘటనలు ప్రతిఘటన, తిరుగుబాటు, పితూరీ, మొదటి స్వాతంత్ర్య సంగ్రామం, అంటూ అనేక రకాలుగా వర్ణించారు. (దీనిపై జరిగిన చర్చలు, సామ్రాజ్య చరిత్ర ఎంత వివాదాస్పద మవుతుందో తెలుపుతాయి) ...(page 63)"[10]
- "ఉత్తర భారతంలోని చలా భాగంలో భారతీయ సైనికులు, గ్రామీణ జనాభా పాలకులపై తమకున్న అపనమ్మకాన్ని, వారి పట్ల తమ విరక్తినీ ప్రదర్శించారు.. ... ఈ కొత్త పాలకులు అభివృద్ధి అంటూ చెప్పిన కబుర్లను చేతల్లో చూపించలేదు."[13]
- "వేరువేరు కారణాల వల్ల అనేక మంది భారతీయులు బ్రిటిషు వారికి వ్యతిరేకంగా అయుధాలు పట్టారు. మరో వంక అనేక మంది బ్రిటిషు వారి తరపున పోరాడారు. మెజారిటీ భారతీయులు మాత్రం దీనితో సంబంధం లేనట్లు ఉన్నారు. అందుచేత వివరణలు దృష్టి కేంద్రీకరించాల్సింది.., తిరుగుబాటుదార్లను ప్రేరేపించినదేమిటి అనే దానిపైన."[13]
- మనిషి పడిన దురవస్థల పరంగా చూస్తే ఈ తిరుగుబాటు ఖరీదు ఎంతో ఎక్కువ. పోరాట ఫలంగాను, బ్రిటిషు వారి దోపిడీల వల్లనా ఢిల్లీ, లక్నో నగరాలు ధ్వంసమయ్యాయి. అవధ్ వంటి చోట్ల ఎదిరించిన గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలకు గ్రామాలనే తగలబెట్టారు. చేతికందిన తిరుగుబాటుదార్లను, వారి మద్దతుదార్లనూ చంపేసారు. సిపాయి రెజిమెంట్లలోని బ్రిటిషు అధికారులతో పాటు,బ్రిటిషు పౌరులను, స్త్రీలు, పిల్లలతో సహా చంపేసారు.the British officers of the sepoy regiments."[13]
- "1857–58 కాలంలో జరిగిన సంఘటనలు, ... బ్రిటిషు ఇండియా చరిత్రపైనే కాక, మొత్తం బ్రిటిషు సామ్రాజ్య వాదం పైనే తీవ్ర ప్రభావాన్ని చూపాయి."[10]
- "1858 లో విక్టోరియా రాణి చేసిన ప్రకటన భారత లౌకికవిధానానికి పునాది వేసింది. తరువాత శతాబ్దం పాటు వలస భారతంలో మత రాజకీయాల గమనాన్ని నిర్దేశించింది. ... మతాతీతంగా పౌరులందరికీ సమాన హోదాను ఇచ్చింది. మత వ్యవహారాల్లో రాజ్యం జోక్యం లేకుండా చేసింది. ఈ ప్రకటనకు రాజ్యాంగ బద్ధత లేనప్పటికీ అనేక తరాల భారతీరులు తమ మత స్వేచ్ఛను కాపాడుకునేందుకు ఈ ప్రకటనను ఉదహరించారు." (page 23)[18]
- "In purely legal terms, (the proclamation) kept faith with the principles of liberal imperialism and appeared to hold out the promise that British rule would benefit Indians and Britons alike. But as is too often the case with noble statements of faith, reality fell far short of theory, and the failure on the part of the British to live up to the wording of the proclamation would later be used by Indian nationalists as proof of the hollowness of imperial principles. (page 76)"[20]
- "Ignoring ...the conciliatory proclamation of Queen Victoria in 1858, Britishers in India saw little reason to grant Indians a greater control over their own affairs. Under these circumstances, it was not long before the seed-idea of nationalism implanted by their reading of Western books began to take root in the minds of intelligent and energetic Indians."[21]
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.