Remove ads
From Wikipedia, the free encyclopedia
బూర్గుల రంగనాథరావు (1917 అక్టోబరు 12 - 2008 జూలై 24) తెలుగు కథా రచయిత, కవి.[1] అతను హైదరాబాదు ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు కుమారుడు.
బూర్గుల రంగనాథరావు 1917 అక్టోబరు 12న జన్మించాడు. 1940లో మద్రాసు లయోలా కళాశాలలో డిగ్రీ చేశాడు. పూనేలోని ఫెర్గూసన్ కళాశాల నుండి బి.ఎల్ చేసాడు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో డిప్యూటీ సెక్రటరీ హోదాలో పనిచేశాడు. తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, మరాఠి, ఉర్దూ, హిందీ భాషలలో ప్రావీణ్యం పొందాడు. వీరు పలు గ్రంథాలు రచించడమే కాకుండా ఆకాశవాణి నుంచి వీరి చాలా కథలు, నాటికలు ప్రసారమయ్యాయి. సత్య సాయిబాబాపై రామకృష్ణారావు రచించిన శతకము "పుష్పాంజలి"లో పద్యాలు చేర్చి శతకం పూర్తిచేశాడు.[2]
అతను "సాధన సమితి" ని ప్రారంభించి 939-50 ప్రాంతాల్లో అంజలి, ప్రత్యూష, పాలవెల్లి, రంగవల్లి లాంటి 18 గ్రంథాలు వెలువరించాడు. వాహ్యాళి (1943) కథలు, అభియానం (1995) కవితలు రాశాడు. తిరుప్పావై, ఆళవన్దార్ స్తోత్రం, ముకుందమాల, గోదాస్తుతి లాంటి స్తోత్ర వాఙ్మయాన్ని తెలుగులోకి అనువదించాడు. అతను చేసిన సాహితీ వ్యాసంగాన్నంతా రెండు సంపుటాలుగా వెలువరించాడు. గోష్ఠి అనే కథానికలో భాషాపరమైన భేదాలను చక్కగా చిత్రించాడు. ఉర్దూ పద బాహుళ్యంతో కూడిన తెలంగాణ తెలుగు, ఆంగ్ల పదాలతో కూడిన ఆంగ్లేయాంధ్రం లేదా బ్రిటీషాంధ్రం, గ్రాంథికాలను కలగలిపి ఒక సినీ నటి ఇతివృత్తాన్ని వినిపిస్తాడు[3]. అతని కథల్లో వివిధ యుద్ధాల్లో బలి అయిన వారి పరిస్థితి, రాచరిక స్థితి, హిందు మహమ్మదీయ ఘర్షణలు, ప్రణయాలు - పునర్వివాహాలు, కుటుంబ సంబంధాలు కనిపిస్తాయి. వ్యావహారికం, గ్రాంథికం రెండు జమిలీగా సాగుతూ సమకాలీన సమాజ స్థితిగతులను ప్రతిఫలిస్తాయి. అతను "అభియానం" కవితా సంకలనాన్ని రాసాడు. అందులో అతను 934 నుండి 1946 దాకా రాసిన కవితలు, వివిధ నాయకులకు సమర్పించిన అభినందన పద్యాలు, కాశీనాథుని నాగేశ్వరరావు, నేతాజీ సుభాష్ బోసుల అస్తమయం వేళ రాసిన స్మృతి పద్యాలు ఉంటాయి.[4]
అతను తన తండ్రిగారైన బూర్గుల రామకృష్ణారావు రచనలను ప్రచురించడానికి కృషి చేశాడు. అతను 2008 జూలై 24న మరణించాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.