సంబంధిత పేరుగల మరికొన్ని వ్యాసాల కోసం అయోమయ నివృత్తి పేజీ సాయిబాబా చూడండి.
దక్షిణ భారతదేశం ఆధునిక యుగం | |
---|---|
తన సంతకముతో సత్య సాయిబాబా చిత్రం | |
పేరు: | సత్య సాయిబాబా |
జననం: | నవంబరు 23, 1926 పుట్టపర్తి అనంతపురం జిల్లా ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా |
మరణం: | 2011 ఏప్రిల్ 24 84) | (వయసు
సిద్ధాంతం / సంప్రదాయం: | అద్వైతం |
ముఖ్య వ్యాపకాలు: | మతం, ధర్మం, సమాజం, ఆధ్యాత్మికం, నీతిబోధ |
ప్రముఖ తత్వం: | మత సామరస్యం, సకల ప్రాణుల పట్ల ప్రేమ, religious syncretism, ఆహింస |
ప్రభావితమైనవారు: | ఐసాక్ టిగ్రెట్ట్, నారాయణ కస్తూరి, అబ్దుల్ కలామ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్‌మోహన్ సింగ్, టి.ఎన్.శేషన్, సుషీల్ కుమార్ షిండే, దానా గిల్లెస్పీ, ఆర్నాల్డ్ షుల్మాన్, బిల్ ఐట్కిన్, వ్లాడిమిర్ ఆంటొనోవ్, జొవాన్ బ్రౌన్, ఆలిస్ కోల్ట్రేన్, బెంజమిన్ క్రీమె, మేనార్డ్ ఫెర్గూసన్, పీటర్ ప్రుజాన్, గిరిజా ప్రసాద్ కొయిరాలా,సచిన్ టెండుల్కర్,సునీల్ గవాస్కర్ |
సత్య సాయి బాబా (నవంబరు 23, 1926 - ఏప్రిల్ 24, 2011) భారతీయ ఆధ్యాత్మికవేత్త. ఇతనిని 'గురువు' అని, 'వేదాంతి' అని, 'భగవంతుని అవతారం' అని, షిరిడీ సాయిబాబాయే మరల సత్య సాయిబాబాగా అవతరించాడని పలువురు విశ్వసిస్తారు.[1][2] ఇతని మహిమల పట్ల చాలామందికి అపారమైన విశ్వాసం ఉంది.[3]
సత్యసాయి సంస్థ వారి సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలలో 1200 వరకు సత్యసాయి కేంద్రాలున్నాయి.[4] ప్రపంచ వ్యాప్తంగా సత్యసాయి బాబాను ఆరాధించేవారి సంఖ్య 60 లక్షలు అని ఒక అంచనా కాగా కొందరు భక్తులు ఈ సంఖ్యను "5 నుండి 10 కోట్ల మధ్య" అని చెబుతారు.[5]
జీవితం
సత్యసాయి బాబా, సత్యనారాయణ రాజుగా, 1926 నవంబరు 23న పెద్ద వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతులకి, ఓ నిరుపేద వ్యవసాయ భట్టు రాజుల కుటుంబం లో, అనంతపురం జిల్లా లోని, పుట్టపర్తి అనే కుగ్రామంలో జన్మించాడు. [6] 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మతగురువు[7] సత్యనారాయణ వ్రతం తరువాత పుట్టిన సంతానం కనుక పిల్లవాడికి అలా పేరు పెట్టారు. బిడ్డ పుట్టిన సందర్భంలో ఇంట్లో సంగీత వాద్యాలు వాటంతట అవే మోగాయి అని చెప్పుకుంటారు.[8]
ప్రొఫెసర్ నారాయణ కస్తూరి రచించిన జీవిత కథ ప్రకారం వ్రతం తరువాత ఈశ్వరమ్మకు ఒక నీలిరంగు గోళం వంటి కాంతి తనలో లీనమౌతున్నట్లుగా కల వచ్చింది. తరువాత ఆమె గర్భవతి అయ్యింది.[9] [10] బిడ్డ జననం తరువాత పక్కలో ఒక నాగుపాము దర్శనమిచ్చింది.[11] [12] కొందరు భక్తులు సాయిబాబాను నాగరాజుగా భావిస్తారు.[7] అయితే ఈ అనుభవాల గురించి ఆ సమయంలో ఉన్న వ్యక్తులనుండే విభిన్న కథనాలు వినబడుతున్నాయి.[13]
దగ్గరలో ఉన్న బుక్కపట్నం గ్రామంలో సాయిబాబా ప్రాథమిక విద్య సాగింది.[14] చిన్న వయసులోనే నాటకాలు, సంగీతం, కవిత్వం, నటన వంటి కళలలో ప్రావీణ్యత కనబరచాడు. తరువాత ఉరవకొండ ఉన్నత పాఠశాలలో చదివాడు. మార్చి 8, 1940 న కొంత విచిత్రమైన ప్రవర్తన (తేలు కుట్టినట్లుగా) కనబరచాడు. ఈ సంఘటన తరువాత అతని ప్రవర్తనలో మార్పులు కనబడసాగాయి. సమాధి స్థితిలో ఉన్నట్లుగా ఉండేవాడు. పురాతన శ్లోకాలు చెప్పేవాడు. భోజనం సరిగా చేసేవాడు కాడు. 1940లో తాను షిరిడీ సాయిబాబా (1838-1918కు చెందిన ఫకీరు) అవతారమని ప్రకటించాడు. అదే పేరు తనకు పెట్టుకున్నాడు.[15]
కస్తూరి వ్రాసిన జీవిత చరిత్ర ప్రకారం 1940 అక్టోబరు 20లో, తన 14 యేండ్ల వయసు అప్పుడు, తన పుస్తకాలు వదిలేసి, "నా భక్తులు నన్ను పిలుస్తున్నారు. నా పని నాకున్నది" అని చెప్పాడు. తరువాత మూడేండ్ల పాటు ఎక్కువ సమయం దగ్గరలోని ఒక తోటలో చెట్టు క్రింద గడిపాడు. అప్పుడే అతనిచుట్టూ ప్రజలు గుమికూడడం మొదలయ్యింది. వారితో అతను భజనలు చేయించేవాడు. ఆ సమయంలోనే తాను ఈ కాలానికి చెందిన అవతారం అని ప్రకటించాడు. అప్పటినుండి సాయిబాబా అదే విషయం చెబుతూ వచ్చాడు. 1942 నాటి బుక్కపట్నం స్కూలు రికార్డులలో అతని పేరు ఉంది.[16]
1944లో అనుచరులు (భక్తులు) ఒక గుడిని కట్టారు. ప్రస్తుతం దానిని "పాత మందిరం" అంటారు.[17][18] ప్రస్తుతం ఆశ్రమమైన ప్రశాంతి నిలయం నిర్మాణం 1948లో మొదలయ్యింది.[19]
1963లో తన ప్రవచనంలో తాను శివుడు, శక్తి ల అవతారమని ప్రకటించాడు[20] అదే ప్రవచనంలో తాను షిరిడీ సాయిబాబా అవతారమనీ, భవిష్యత్తులో ప్రేమ సాయిబాబాగా అవతరిస్తాననీ చెప్పాడు. ఇదే విషయాన్ని 1976లో పునరుద్ఘాటించాడు.[21] నారాయణ కస్తూరి వ్రాసిన జీవిత గాథ "సత్యం శివం సుదరం"లో ప్రేమ సాయిబాబా అవతరణ మైసూరు రాష్ట్రంలో జరుగనున్నదని వ్రాయబడింది.[22] షిరిడీ సాయి బాబా భక్తురాలైన శారదాదేవి కథనం ప్రకారం తన మరణకాలంలో షిరిడీ సాయిబాబా ఆమెకు "తాను మరో ఎనిమిది సంవత్సరాలలో 'సత్య' పేరుతో ఆంధ్రప్రదేశ్లో అవతరిస్తాను" అని చెప్పాడు.[23] (సత్యసాయిబాబా పేరు, జన్మదినం, జన్మ స్థలం ఈ కథనానికి సరిపోతాయి.). సత్య సాయిబాబాకు ఇద్దరు అక్కలు, ఒక అన్న (శేషమరాజు), ఒక తమ్ముడు జానకి రామయ్య) .[24][25] 2003లో జరిగిన ఒక ప్రమాదంలో సత్యసాయిబాబా తుంటి ఎముకకు గాయమయ్యింది. 2005 నాటికి అతను చక్రాలకుర్చీ వాడటం ప్రారంభించాడు. [26]
1958లో సత్య సాయిబాబా అనుచరులు సనాతన సారధి అనే ఆధికారిక పత్రికను ప్రచురించడం ప్రారంభించారు.[19] 1960 నుండి పాశ్చాత్య దేశాలనుండి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉన్నవారు సత్యసాయిని సందర్శించడం అధికం అయ్యింది. ఒక్క 1968లో మాత్రమే ఈశాన్య ఆఫ్రికా ప్రాంతానికి సాయిబాబా భారతదేశం దాటి బయటకు వెళ్ళాడు.[27][28] కాని అతని అనుచరులు, భక్తులు, సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి.
1960లో ఒక ప్రవచనంలో తాను ఈ మానవ రూపంలో ఇంకా 59 సంవత్సరాలు ఉంటానని చెప్పాడు.[29] 1984లో ప్రచురింపబడిన ఒక పుస్తకంలో బాబా ఇలా చెప్పాడని వ్రాయబడింది."నా పాత శరీరంలో నేను ముసలివాడను, బలహీనుడను అయ్యాను గాని ఈ క్రొత్త శరీరంలో అలా కాను."[30]
సాయిబాబాకు 'గీత' అనే పెంపుడు ఏనుగు ఉండేది. గున్నయేనుగుగా అతనికి బహూకరింపబడిన ఆ ఏనుగు ప్రశాంతి నిలయం ఉత్సవాలలో తరచు వాడేవారు. 2007 మే 22లో ఆ ఏనుగు చనిపోయింది. తరువాత 'సత్యగీత' అనే మరో ఏనుగు దాని స్థానంలో ఉంది.
శ్వాసకోశ, మూత్రపిండాల, ఛాతీ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో 2011 మార్చి 28న చికిత్స నిమిత్తం చేర్చబడ్డాడు.[31] దాదాపు నెల రోజులు అయినా ఆయన ఆరోగ్యం మెరుగవ లేదు [32] ఏప్రిల్ 24వ తేదీన ఉదయం 7:40 కి తుది శ్వాస విడిచాడు.[33][34] బాబా పార్థివ దేహానికి వేద మంత్రోచ్ఛరణల మధ్య ఏప్రిల్ 27 వ తేదీన బుధవారం ఉదయం మహా సమాధి జరిగింది. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని కుల్వంత్ హాలు లోనే అన్ని కార్యక్రమాలూ శాస్త్రోక్తంగా జరిగాయి. 2011 జూలై 15 నుంచి సత్యసాయి బాబా మహాసమాధి దర్శనం ప్రారంభించారు.
సాయిబాబా భక్తుల నమ్మకాలు, ఆచారాలు
ఆశ్రమాలు, మందిరాలు
సత్యసాయిబాబా తన జన్మ స్థలమైన పుట్టపర్తి లోనే నివాసం ఉండేవాడు. ఒకప్పటి ఈ చిన్న గ్రామం బాగా పెరిగిపోయింది. ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం, చైతన్యజ్యోతి అనే ఒక పెద్ద మత ప్రదర్శనశాల (దీని డిజైనుకు పలు అవార్డులు లభించాయి)[35]), ఒక ఆధ్యాత్మిక మ్యూజియమ్, ఒక రైల్వే స్టేషను, ఒక కొండ అంచు క్రీడాంగణం, విమానాశ్రయం, ఇండోర్ క్రీడాంగణం వంటి పెక్కు సదుపాయాలు ఆవిర్భవించాయి.[36] పుట్టపర్తి ఆశ్రమానికి భారతదేశపు ప్రముఖ నాయకులు (అబ్దుల్ కలామ్, వాజ్‌పేయి వంటివారు) అతిధులుగా వచ్చేవారు.[37][38] సత్యసాయిబాబా 80వ జన్మదినోత్సవానికి ప్రపంచం నలుమూలలనుండి 10లక్షలమంది సందర్శకులు వచ్చారని అంచనా. ఇందులో భారతదేశం, 180 ఇతర దేశాలనుండి 13,000 మంది ప్రతినిధులు ఉన్నారు.[39]
సంవత్సరంలో అధికభాగం బాబా నివాసం ప్రశాంతి నిలయంలోనే ఉండేది. వేసవికాలం కొన్నిరోజులు బెంగళూరు లోని "బృందావనం" ఆశ్రమంలో గడిపేవారు. ఎప్పుడైనా కొడైకెనాల్ లోని "సాయి శృతి ఆశ్రమం"కి వెళ్లేవాడు.[40]
సత్యసాయిబాబా మూడు ముఖ్య మందిరాలను స్థాపించాడు - అవి ముంబై లోని "ధర్మక్షేత్రం" లేదా "సత్యం", హైదరాబాదు లోని "శివం", చెన్నై లోని "సుందరం"[41]. బాబా ఆశ్రమాలలో దినచర్య ఉదయం ఓం కార స్మరణ, సుప్రభాతాలతో మొదలవుతుంది. తరువాత వేద పారాయణ, సంకీర్తన, భజనలు జరుగుతాయి. బాబా దర్శనం ఇచ్చేవాడు. [42] దర్శనం సమయంలో బాబా సందర్శకుల, భక్తుల మధ్య నడుస్తూ వారిచ్చే నమస్కారాలను, వినతి పత్రాలను స్వీకరించేవాడు. విభూతిని 'సృష్టించి' పంచేవాడు. కొందరిని ప్రత్యేక దర్శనానికి, మాట్లాడడానికి అనుమతించేవాడు. ఇలా ఏకాంతంగా బాబాతో మాట్లాడి ఆయనకు తమ మనసులోని మాటను విన్నవించుకోవడం భక్తులకు ఎంతో సంతోష దాయకంగా ఉండేది. అటువంటి దర్శన సమయాలలో బాబా భక్తుల మనసుల లోని మాటలను, ఇతర అనూహ్యమైన విషయాలను వెల్లడించేవాడని, అలా భక్తులు ఆశ్చర్యపడేవారట.[43] తన దర్శనం ఆధ్యాత్మిక ప్రయోజనాలను ప్రసాదిస్తుందని మాత్రమే బాబా చెప్పేవాడు.
నా దర్శనం తరువాత ప్రశాంతంగా, ఏకాంతంగా కూర్చొనండి. ఆ ప్రశాంతతలో నా ఆశీర్వాదం సంపూర్ణంగా మీకు లభిస్తుంది. మీ ప్రక్కనుండి నేను నడచినపుడు నా శక్తి మిమ్ములను చేరుతుంది. వెంటనే గనుక మీరు ఇతరులతో మాట్లాడడం మొదలుపెడితే ఆ శక్తి మీకు ఉపయోగం కాకుండా చెల్లాచెదరు కావచ్చును. నా కంటపడిందేదైనా నిస్సంశయంగా చైతన్యవంతమౌతుంది. రోజు రోజుకూ మీలో మార్పులు సంభవిస్తాయి. మీ మధ్యలో నడవడం అనేది దేవతలు సైతం కోరుకొనే సుకృతం. అది నిరంతరం ఇక్కడ మీకు లభిస్తున్నది. అందుకు కృతజ్ఞులు కండి.
మహిమలు
బాబా మహిమల గురించి విస్తృతమైన నమ్మకాలు, వివాదాలు ఉన్నాయి. కొన్ని పుస్తకాలలోనూ, పత్రికా రచనలలోనూ, ఇంటర్వ్యూలలోనూ బాబా అనుచరులు బాబా మహిమల గురించీ, వ్యాధి నివారణ శక్తిని గురించీ తరచు ప్రస్తావించారు.[45] కొన్ని సార్లు భక్తుల అనారోగ్యాన్ని బాబా తాను గ్రహించినట్లుగా చెప్పబడుతున్నది.[46] అను నిత్యం బాబా విభూతిని, కొన్ని మార్లు ఉంగరాలు, హారాలు, వాచీల వంటి చిన్న వస్తువులనూ "సృష్టించి" భక్తులకు పంచిపెడతాడని చెబుతారు.[47]
ప్రపంచ వ్యాప్తంగా భక్తుల ఇళ్ళలో బాబా పటాలు, పూజా మందిరాలు, విగ్రహాలు, పీఠాలనుండి విభూతి, కుంకుమ, పసుపు, పవిత్ర తీర్ధజలం, శివలింగాలు, చిన్న సైజు (ఇత్తడి, బంగారం) దేవతా మూర్తులు, ప్రసాదాలు (తినుబండారాలు), విలువైన మణులు, దారాలు వంటివి లభించడం జరుగుతున్నట్లు అనేక కథనాలున్నాయి.[48] [49] [50] [51] [52] [53]
కిర్లియన్ ఫొటోగ్రఫీ ద్వారా కాంతి పుంజాలను పరిశీలించి, విశ్లేషించడంలో నిపుణుడైనఫ్రాంక్ బారొవస్కీ బాబా కాంతిపుంజాన్ని (aura) పరిశీలించి చెప్పిన అభిప్రాయం - అంతకుముందు తాను పరిశీలించిన ఎవరి కాంతిపుంజాలూ బాబా కాంతి పుంజాలలా లేవు. బాబా సామాన్యమైన వ్యక్తి కాదు. దివ్యపురుషుడై ఉండాలి. బాబా కాంతిపుంజం చాలా విశాలమై దిగంతాలకు వ్యాపిస్తున్నది. ఇంతకు ముందెన్నడూ చూడని బంగారు, వెండి (రంగు) ఛాయలు అందులో కనిపిస్తున్నాయి.[54]
ఐస్లాండ్కు చెందిన మనో విజ్ఞాన శాస్త్రవేత్త ఎర్లెండర్ హెరాల్ద్ సన్ 'నియంత్రిత పరిస్థితులలో' బాబాను అధ్యయనం చేయడానికి ప్రయత్నించాడు కాని అందుకు అనుమతి లభించలేదు. అయినా ఆ శాస్త్రవేత్త బాబా మహిమలగురించి విస్తృతంగా ఇతరులను ఇంటర్వ్యూ చేసి అధ్యయనం చేసి తన పరిశోధనలను ప్రచురించాడు. భక్తులనూ, పూర్వ భక్తులనూ ఇంటర్వ్యూ చేయడం ద్వారా అతనికి అనేక అసాధారణ విషయాలు తెలియవచ్చాయి. బాబా గాలిలో తేలిపోవడం, ఒకచోటనుండి మరోచోట ప్రత్యక్షం కావడం, అదృశ్యం కావడం, రాతిని మిఠాయిగా మార్చడం, నీటిని మరో పానీయం లేదా పెట్రోలుగా మార్చడం, అడిగిన వస్తువులు సృష్టించి ఇవ్వడం, తన దుస్తుల రంగు ఒక్కసారిగా మార్చడం, వ్యాధి నివారణ, కొంత ఆహారాన్ని అధికంగా చేయడం, అనూహ్య దృశ్యాలు, స్వప్నాలు, ఒక చెట్టుపై మరొక కాయలు కాయించడం, ప్రకృతిని నియంత్రించడం, వివిధ దేవతా మూర్తులుగా దర్శనమివ్వడం, తేజోవంతమైన కాంతిని వెదజల్లడం - ఇటువంటి మహిమలు తమ స్వానుభవంగా కొందరు భక్తులు చెప్పారు.[55]. ఈ సంఘటనలలో కొన్ని బైబిల్ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు కనబరచిన మహిమలను పోలి ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు జీవిత కథలో వ్యాధి నివారణ ఒక ముఖ్యమైన మహిమ. బాబా కూడా వ్యాధులు నివారించినట్లు కొందరి అనుభవాలుగా చెప్పబడినా గాని బాబా మహిమలలో ఈ అంశం అంత ప్రముఖమైనదిగా చెప్పబడడం లేదు. [56] [57]
ఈ విధమైన ఘటనలు దివ్య కార్యాలని బాబా చెప్పాడు కాని వాటిని గురించి శాస్త్రీయమైన ప్రయోగ పరిశోధనలు చేయాలన్న శాస్త్రజ్ఞుల కోరికలను తిరస్కరించాడు. ఈ 'మహిమలు' చేతివాటం పనులని విమర్శకులు తరచు అంటూ వచ్చారు. ఏప్రిల్ 1976లో బెంగళూరు విశ్వ విద్యాలయం అప్పటి వైస్ చాన్సలర్, భౌతిక శాస్త్రవేత్త, హేతువాది అయిన డా. హెచ్.నరసింహయ్య "మూఢ నమ్మకాలను, మహిమలను హేతుబద్ధంగా పరిశోధించే సంస్థ"ను స్థాపించాడు. నియంత్రితమైన (ప్రయోగానుకూలమైన) పరిస్థితులలో తన మహిమలను చూపమని ఈ కమిటీ బాబాకు మర్యాదపూర్వకంగా లేఖ వ్రాసింది. ఆ పై మరో రెండు లేఖలు వ్రాసినా బాబా స్పందించలేదు.[58]. వారి విధానం అనుచితంగా ఉన్నదని బాబా అన్నాడు.[59] "ఇంద్రియాలకు లోబడేది విజ్ఞాన శాస్త్రం. అతీంద్రియమైనది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మిక సాధన ద్వారానే దానిని తెలుసుకోవచ్చును. విశ్వంలో అద్భుతాలలో కొద్ది విషయాలను మాత్రమే విజ్ఞానశాస్త్ర్రం వెలిబుచ్చగలిగింది" - అని బాబా అన్నాడు.[59] "ఈ కమిటీ ప్రతికూల భావాలూ, ఈ పనికి వారిచ్చిన ప్రచారమూ, సాయిబాబా పట్ల వారికున్న వ్యతిరేక భావమూ స్పష్టంగా ఉన్నాయి. కనుక కమిటీ ప్రయత్నాలు ముందుకు సాగలేదు అని హెరాల్డ్సన్ వ్రాశాడు. తమ అభ్యర్ధనకు సాయిబాబా మిన్నకుండడాన్నిబట్టి బాబా మహిమలు బూటకమని తేలుతున్నదని నరసింహయ్య అన్నాడు.[60] మొత్తానికి వార్తా పత్రిలలో ఈ విషయమై చాలా కాలం వాద ప్రతివాదాలు నడచాయి.[61] నరసింహయ్య స్థాపించిన కమిటీ 1977లో రద్దయ్యింది.
1992లో కెనడా దేశపు అసమ్మతి వాది డేల్ బేయర్స్టీన్ సాగించిన అధ్యయనం ద్వారా బాబాకు అతీంద్రియ శక్తులున్నాయన్న కథనాలలో వాస్తవం లేదని తెలుస్తున్నది- అని బాబా విమర్శకులలో ఒకడైన అలెక్జాండ్రా నగెల్ 1994లో ఒక వ్యాసంలో పేర్కొన్నాడు - [62]. 1995 లో "Guru Busters", అనే యు.కె. "ఛానల్-4" టెలివిజన్ కార్యక్రమంలో బాబా మహిమలను మోసాలుగా చూపే విడియోటేపును ప్రదర్శించారు. తరువాత ఈ విడియోటేపులను ప్రత్యేక నిపుణులతో విశ్లేక్షణ చేయించారు కాని "మోసం" అని ధ్రువీకరించే ఏ విధమైన ఆధారాలు నిపుణులకు లభింపలేదు.[63]
2000 డిసెంబరు ఇండియా టుడే పత్రికలో ఐంద్రజాలికుడు పి.సి.సర్కార్ జూనియర్ బాబా చేసేవన్నీ మోసాలు అని ఆరోపించాడు.[64].
అలాగే బసవ ప్రేమానంద్ అనే ఔత్సాహిక ఐంద్రజాలికుడు బాబా ఒక కపటి అని ఆరోపించాడు. బంగారు వస్తువులు సృష్టిస్తున్నట్లు చెప్పుకొన్నందున బాబా "గోల్డ్ కంట్రోల్ చట్టాన్ని" ఉల్లంఘిస్తున్నాడని 1986లొ బాబా పై వ్యాజ్యం కూడా దాఖలు చేశాడు. ఈ కేసు కొట్టివేయబడింది. కాని అతీంద్రియ శక్తి చట్టప్రకారం గుర్తించబడలేదని మళ్ళీ ప్రేమానంద్ అప్పీలు చేశాడు.
[65]
బాబా చూపే కొన్ని "మహిమ"లను తాను కూడా చేయగలనని 2004లో Secret Swami అనే బి.బి.సి. కార్యక్రమంలో చెప్పాడు (చేతివాటం ద్వారా కొన్ని వస్తువులు తెప్పించడం, నోట్లోంచి ఒక లింగం తీయడం వంటివి). అయితే కొందరు బాబా విమర్శకులు కూడా బాబాకు కొన్ని అసాధారణ శక్తులున్నాయని అంగీకరిస్తున్నారని అదే కార్యక్రమంలో చెప్పబడింది.[66]
సత్యసాయిబాబా 1971లో "వాల్టర్ కొవాన్"ను పునరుజ్జీవింపజేశాడని కథనం ఉంది. ఇది నమ్మదగినదిగా అనిపించడంలేదని బ్రిటిష్ పాత్రికేయుడు మిక్ బ్రౌన్ తన 1998 రచన The Spiritual Touristలో పేర్కొన్నాడు.[67] [68] [69] [70] లండన్ లో బాబా పటాలనుండి విభూతి రాలడం గురించి కూడా అదే పుస్తకంలో మిక్ బ్రౌన్ చర్చించాడు. ఈ కథనాలలో ఏమీ మోసం గాని, వాటం గాని లేవని అతను అభిప్రాయపడ్డాడు.[71] బాబా సర్వజ్ఞుడనే భావాలగురించి మిక్ బ్రౌన్ చెప్పినది - "బాబా చెప్పిన భవిష్యత్ విషయాలు, బైబులులో చెప్పిన భవిష్యత్ విషయాలు, అసలు జరిగిన విషయాలు - వీటిని skeptics పరిశీలించి ఆయా విషయాలలో పొంతన లేకపోవడం గురించి స్పష్టంగా వ్రాశారు."[72]
అక్టోబరు 2007లో సత్యసాయిబాబా తాను చంద్రునిలో "విశ్వరూపం" చూపుతానని అన్నాడు. వేలాది జనం ఆశ్రమంలో గుమికూడారు. బాబా కూడా అక్కడికి వచ్చి ఒక గంట ఉండి వెళ్ళిపోయాడు. ఏమీ జరుగలేదు.[73]
బోధనలు
నేను దేవుడిని. నీవు కూడా దేవుడివే. తేడా ఏమిటంటే ఈ సంగతి నాకు తెలుసు. నీకు అసలు తెలియదు.
మీ హృదయాలలో ప్రేమ అనే దీపం వెలిగించి దానిని అనుదినం ప్రజ్వలింపజేయడానికే నేను వచ్చాను. నేను ఏదో ఒక మతం తరపున గాని ఒక సంఘం తరపున గాని ప్రచారానికి రాలేదు. ఒక సిద్ధాంతానికి అనుయాయులను ప్రోగుచేయడానికి రాలేదు. నా మార్గంలో గాని, మరో మార్గంలో గాని శిష్యులను, భక్తులను ఆకర్షించడం నా అభిమతం కాదు.... విశ్వవ్యాప్తమైన, ఏకమైన ఆధ్యాత్మిక సూత్రం - ప్రేమ అనే మార్గం, ధర్మం, బాధ్యత - ఈ ఆత్మ సత్యాన్ని చెప్పడానికే వచ్చాను. ... తన గుండెల్లో భగవదైశ్వర్యాన్ని నింపుకోమనీ, నీచమైన అహంకారాన్ని వీడమనీ ప్రతి మతం ఉద్బోధిస్తుంది. వైరాగ్యాన్ని, విజ్ఞతనూ పెంచుకొని మోక్షాన్ని సాధించుకోవడాన్ని నేర్పుతుంది. అన్ని హృదయాలలోనూ వెలిగేది ఒకే ఒక దేవుడు. అన్ని మతాలూ ఆ భగవంతునే కీర్తిస్తున్నాయి. అన్ని భాషలూ ఆ పేరే చెబుతున్నాయి. ప్రేమే భగవంతుని ఆరాధించడానికి అత్యుత్తమమైన మార్గం. ఈ ప్రేమే నేను మీకిచ్చే సందేశం. ఈ ఐక్య భావాన్ని అవగతం చేసుకోండి. (4 జూలై 1968)
ప్రపంచ మానవాళిని సౌభ్రాతృత్వ భావంతో ఏకం చేయడానికి, ఆత్మ సత్యాన్ని ఉద్దీపింపజేయడానికి ఈ సాయి వచ్చాడు. మనిషినీ మనిషినీ జోడించే ఈ దివ్య సంప్రదాయమే విశ్వాధారమైన సత్యం. ఇది తెలుసుకొంటే మనిషి పశుత్వం నుండి ఎదిగి దివ్యత్వం సాధించగలడు (19 జూన్, 1974)
మీ అందరిలో సాత్విక భావాన్ని పెంపొందించడమే నా లక్ష్యం. నేనేదో మహిమలు చేస్తున్నాననీ, ఇదీ అదీ సృష్టించి ఇస్తున్నాననీ విని ఉంటారు. అది ముఖ్యం కాదు. సత్వ గుణమే ముఖ్యం. మీకు నేను ఆరోగ్యైశ్వర్యాదులను నేను ప్రసాదించేది మీ అవరోధాలను తొలగించి ఆధ్యాత్మ సాధనపై మనసు లగ్నం చేయాలన్న ఉద్దేశ్యంతోనే. (25 జూలై 1958)
అన్ని మతాలూ వికసించాలి. భగవంతుని వైభవం అన్ని భాషలలోనూ గానం చేయబడాలి. అదే ఆదర్శవంతమైనది. వివిధ మతాల మధ్య భేదాలను గౌరవించండి. కాని ఐక్యత అనే జ్యోతిని ఆరిపోనీయవద్దు
అవతరించుట యనుటలో అర్ధమేమి? జనులపై ప్రీతి వాత్సల్యపరత తోడ వారి స్థాయికి దైవంబు వచ్చు భువికి, జీవ ప్రజ్ఞతో బాటుగా దైవ ప్రజ్ఞ
శ్రీ సత్యసాయి సంస్థ వెబ్ సైటు.[74]
సత్యసాయిబాబా మంచి వక్త. తెలుగులో బాబా ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, బోధనలు అందరికీ అర్ధమయ్యేలాగా, ఉదాహరణలతో కూడి ఉంటాయి.[75] తాను సకల దేవతా స్వరూపుడనైన అవతారమని బాబా చెప్పాడు.[76] అంతే గాకుండా అందరిలోనూ దేవుడున్నాడనీ, అయితే ఆ సంగతి తనకు తెలిసినట్లు ఇతరులకు తెలియడంలేదనీ, అదే ముఖ్యమైన తేడా అనీ చెప్పాడు. ఈ బోధన అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా ఉంది.[59]. మానవులు కామ క్రోధాది వికారాలకు దూరంగా ఉండాలని కూడా బోధించాడు.[59]
సత్యసాయి బాబా బోధనలు సకల మత సమైక్యతను (syncretism వెల్డిస్తాయి. కాని అవి అధికంగా హిందూ మతం సంప్రదాయాలను, విశ్వాసాలను ప్రతిబింబిస్తాయని ఒక పండితుని అభిప్రాయం[77]. తాను అందరిలో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి, వేదాధ్యయనాన్ని సంరక్షించడానికీ అవతరించానని చెప్పాడు.[78].
సత్య సాయి బోధనలలో తరచు కనుపించే మరొక ముఖ్యాంశం - తల్లిదండ్రుల పట్ల భక్తి. మాతృమూర్తులే సమాజాన్ని తీర్చి దిద్దుతారని, స్త్రీలను గౌరవించడం జాతీయ కర్తవ్యమని బోధించాడు.[79]
ప్రపంచ వ్యాప్తంగా సాయి భక్తులు భజనలు చేయడం, ఆయన బోధనలను పఠించడం, సమాజ సేవ చేయడం, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపడుతుంటారు. కాని వారి సంస్థలు "మిషనరీ" వ్యవస్థను పోలి ఉండవు. వాటిలో భక్తి ముఖ్యమైన అంశం.[80] తన గురించిన పబ్లిసిటీని బాబా ప్రోత్సహించడు.[81] సాయి సత్సంగాలలో అన్ని దేవతల, గురువుల భజనలు సాగుతుంటాయి.
సాయి బోధనలననుసరించి సాయి సంస్థ ఐదు మౌలికమైన కర్తవ్యాలను ప్రోత్సహిస్తుంది - అవి సత్యము, ధర్మము, అహింస, ప్రేమ, శాంతి[82]
ఇతర ముఖ్యమైన బోధనలు.[45]
- సేవ, దాన ధర్మాలు
- సకల ప్రాణులపట్ల ప్రేమ
- సాధన
- వృద్ధాప్యంలో
- భగవంతుడే సత్యం. మిగిలినది మాయ
- శాకాహారం
- మద్యం, ధూమపానం, మాదక ద్రవ్యాలనుండి దూరంగా ఉండడం
- సంసారం పట్ల వైరాగ్య భావం, ఇంద్రియ నిగ్రహం.
- ధ్యానం - భగవన్నామ, రూప స్మరణం, భక్తి, జపం, సాధన
- అన్ని మతాలు భగవంతుని కడకు చేరస్తాయన్న విశ్వాసం
- తల్లిదండ్రులు, గురువులు, పెద్దల పట్ల భక్తి
సాయిబాబా బోధనలు ఈ క్రింది నాలుగు ముఖ్య విషయాల ద్వారా అవగతం చేసుకోవచ్చునని అంటారు:
- ఒకటే కులం - మానవత
- ఒకటే మతం - ప్రేమ
- ఒకే భాష -హృదయం
- ఒకే దేవుడు - అంతటా ఉన్నవాడు.
- హజరత్ మహమ్మద్ 1400 సంవత్సరాల కిందట భగవంతుని దివ్య వాణిని 'ఖుర్ ఆన్ ' రూపంలో పొందుపరిచాడు.ఇందులోని రెండు పదాలు సలాత్, జకాత్ .అంటే ప్రార్థన, దానధర్మాలు .వీటిని ఆచరించే సమాజానికి ఇస్లాం అని పేరుపెట్టారు. ఇస్లాం అంటే శరణు, శాంతి అని అర్థం. ఎవరు భగవంతునికి శరణాగతులై నిరంతర శాంతితో జీవించడానికి పూనుకుంటారో ఆ సమాజమే 'ఇస్లాం'. (ఈనాడు25.4.2011)
భారతదేశంలో వివిధ వార్తా పత్రికలు సాయిబాబా ఉపదేశాలను తరచు ప్రచురిస్తుంటాయి.[83]
సంస్థలు
నేరుగా సత్య సాయి బాబా అధ్వర్యంలో గాని, అతని సేవా సంస్థల అధ్వర్యంలో గాని పెక్కు విద్యా, సేవా, దాన కార్యక్రమాలు నడుస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 166 దేశాలలో 10,000 సత్యసాయి సేవా సంస్థలున్నాయి.[84]
- ఉన్నత విద్య
ప్రశాంతి నిలయంలోని సత్యసాయి ఉన్నతవిద్యా సంస్థ (Sri Sathya Sai Institute of Higher Learning ప్రస్తుతం దీని పేరు, శ్రీ సత్య సాయి యూనివర్సిటీ) భారతదేశం మొత్తంలో జాతీయ విద్యాప్రమాణ తులనా మండలి ద్వారా "A++" రేటింగ్ పొందిన ఒకే ఒక సంస్థ.[85][86] ఇదే కాకుండా ఒక సంగీత విద్యాలయం, అనంతపురంలో ఒక (మహిళా) ఉన్నత విద్యాలయం ఉన్నాయి.[87]
- వైద్యం
పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ (Sri Sathya Sai Institute of Higher Medical Sciences) 220 పడకలు గల ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావుచే 1991 నవంబరు 22న ప్రారంభింపబడింది. [88] బెంగళూరులోని శ్రీ సత్యసాయి ఇనస్టిట్టూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అన్ని హంగులూ గల 333 పడకల ఆసుపత్రి.[89] ఇది 2001 జనవరి 19న అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయిచే ప్రాంభింపబడింది.[90] ఇవన్నీ పేదవారికి ఉచితంగా వైద్య సదుపాయాలందిస్తున్నాయి. [91] ఏప్రిల్ 2004 నాటికి 2,50,000 మందికి బెంగళూరులో ఉచిత చికిత్స లభించింది. [92] అలాగే బెంగళూరు వైట్‌ఫీల్డ్ల్‌లోని సత్యసాయి జనరల్ హాస్పిటల్ లక్షలాదిమందికి ఉచిత వైద్యం అందించింది.[93] ఇంకా ఎన్నో వైద్యశాలలు గ్రామీణ పేదవారికి వైద్య సదుపాయాలు ఉచితంగా కలుగజేస్తున్నాయి. [84]
- విరాళాలు
సత్యసాయి సంస్థలకు పెద్దమొత్తాలలో విదేశాలనుండి విరాళాలు లభిస్తున్నాయి.[94]
- త్రాగు నీరు
అనావృష్టి ప్రాంతమైన అనంతపురం జిల్లాలో అనేక మంచినీటి ప్రాజెక్టులు లక్షలాది ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నాయి.[95][96] చెన్నై నగరానికి కూడా సత్యసాయి సంస్థల అధ్వర్యంలో 200కోట్ల రూపాయల పైన ఖర్చుతొ నిర్మించిన ఎంతో ఉపయోగకరమైన ప్రాజెక్టులు త్రాగునీరు సరఫరా చేస్తున్నాయి[97] [98] [99] [100][101][102] గోదావరి నదినుండి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు నీరు సరఫరా చేసే ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది.[103] ఇంకా మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలోనూ, మహారాష్ట్ర లోని లాతూర్ జిల్లాలోను పెద్ద ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి లేదా ప్రతిపాదనలో ఉన్నాయి. [96] [96]
- విద్య
ప్రపంచంలో అన్ని దేశాలలోనూ వ్యక్తిత్వాన్ని వికసింపజేసే విద్య (Educare, Education in Human Values) నేర్పే విద్యాలయాలను స్థాపించాలని వారి ఆశయం. ఇప్పటికి 33 దేశాలలో పాఠశాలలు ప్రాంభించారు.[104]
- సాయి సమితులు
దేశ దేశాలలో సాయి సమితులున్నాయి. సత్యసాయి సమితివారి చిహ్నం ఐదు దళాల పద్మం. ఈ ఐదు దళాలు ప్రేమ, శాంతి, సత్యం, ధర్మం, అహింసలకు చిహ్నాలు. (ఇంతకు ముందు ఈ దళాలపై వివిధ మతాల చిహ్నాలుండేవి)
- ప్రచురణలు
సత్యసాయి పబ్లికేషన్స్ ట్రస్ట్ వారు 'సనాతన సారధి' అనే మాస పత్రికతో బాటు 40 భాషలలో వెయ్యికి పైగా పుస్తకాలు ప్రచురించారు. వివిధ దేశాలలో వారి శాఖలున్నాయి. 2001లో "సాయి గ్లోబల్ హార్మొనీ అనే రేడియో స్టేషను ప్రాంభమైంది. [105]
విమర్శలు
సత్య సాయి బాబా మహిమలు, వాటి గురించిన భిన్నాభిప్రాయాలు, విమర్శల గురించి పై భాగంలో కొంత వ్రాయబడింది. ఇవే కాకుండా కొన్ని ప్రత్యేకమైన ఘటనలు బాబా వ్యక్తిత్వాన్ని గురించి, అతని సంస్థల గురించిన సంచలనాత్మకమైన విమర్శలకు కారణమయ్యాయి. జూన్ 6, 1993న నలుగురు వ్యక్తులు చాకులతో సాయిబాబా గదిలోకి దూరారు. ఇద్దరు అనుచరులను చంపారు. ఆ నలుగురు ఆగంతుకులూ చంపబడ్డారు. ఇది వార్తా పత్రిలలో ప్రముఖంగా వచ్చింది. తన 1993 గురు పూర్ణిమ ఉపన్యాసంలో బాబా 'తన అనుయాయుల మధ్య ఉన్న అసూయ ఈ ఘటనకు కారణం' అని బాబా చెప్పాడు కాని అంతకంటే వ్యాఖ్యానించలేదు.[106]. నలుగురు ఆగంతుకులనూ అక్కడే చంపవలసిన అవసరం ఉందా అన్న విషయంపై కూడా పలు వాదోపవాదాలు జరిగాయి. [107]
ఇంకా ప్రైవేటుగా తనను సందర్శించ వచ్చిన వారి పట్ల సాయిబాబా లైంగిక ప్రవర్తన గురించిన 'ఫిర్యాదులు' కూడా తరచు వివాదాస్పదమయ్యాయి. [108]) [107] [109] [110] ముఖ్యంగా పాశ్చాత్య దేశాల పత్రికలలోనూ, టివి ఛానళ్ళలోనూ ఈ విషయమై విమర్శనాత్మకమైన కథనాలు వెలువడ్డాయి. [66] ఈ కథనాల గురించిన స్పందనలు కూడా తీవ్రంగానే వచ్చాయి. సాయి బాబాకు పెద్ద పెద్ద వారి అండదండలుండడం వలన అతనిపై ఫిర్యాదులను సరిగా పరిశోధంచడంలేదనేది విమర్శ. సాయిబాబాకు ఉన్న అసాధారణమైన ప్రతిష్ఠ వల్లనే లేనిపోని అపవాదులు వస్తున్నాయనీ, ఇవి నిష్పాక్షికమైన పరిశోధనలో నిలబడవనీ స్పందన. సాయి బాబా ప్రచారం కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదనీ, పాశ్చాత్యులు తమకున్న అపోహలతో ఇలాంటి నిందలకు ఒడిగడుతున్నారనీ ప్రముఖ పాత్రికేయుడు కుష్వంత్ సింగ్ అన్నాడు.[64] [66][107] [111] అలాగే సాయిబాబాను నమ్ముకొన్న ముగ్గురు వ్యక్తులు వివిధ సందర్భాలలో ఆత్మహత్య చేసుకోవడం పై గురించి కూడా పలు వివాదాలున్నాయి. [112]
సాధారణంగా ఇటువంటి విమర్శలకు సాయిబాబా స్పందించడం జరుగలేదు. కాని 2000లో ఒక ఉపన్యాసంలో 'కొందరు ధన ప్రలోభాలకు లోబడి ఇటువంటి అపనిందలు వేస్తున్నారు' అని చెప్పారు.[113] [107] [107][114]
విమర్శలకు సమాధానాలు
2001 డిసెంబరులో అటల్ బిహారీ వాజపేయి (అప్పటి ప్రధాన మంత్రి), పి.ఎన్.భగవతి ( సుప్రీం కోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి), రంగనాధ మిశ్రా (జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్, సుప్రీం కోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి), నజ్మా హెప్తుల్లా (ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ ప్రెసిడెంట్, య.ఎన్.డి.పి. ప్రముఖ మానవ అభివృద్ధి దౌత్యవేత్త), శివరాజ్ పాటిల్ (లోక్ సభ పూర్వ స్పీకర్, కేంద్ర కాబినెట్ మంత్రి) కలసి సంతకం చేసిన అధికారిక లేఖను పబ్లిక్‌గా విడుదల చేశారు. ఇందులో సాయబాబాకు వ్యతిరేకంగా వస్తున్న అపనిందల దాడి "అసంబద్ధం, నిరాధారం, బాధ్యతా రహితం" అని వాటిని ఖండించారు.[115]
బిల్ ఐట్కిన్ అనే సాయి భక్తుడు, ధార్మిక విశ్లేషకుడు, యాత్రికుడు,"Sri Sathya Sai Baba: A life" అనే పుస్తక రచయిత చెప్పిన ప్రకారం బాబా మీద అపనిందలు అధికంగా బాధ్యతా రహితమైనవి, దురుద్దేశ్య పూర్వకమైనవి. పరిశిలనకు నిలవనివి. బి.బి.సి. వంటి ఛానళ్ళు ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించడానికి కారణం 'చర్చి' వ్యవస్థకు పోటీ నిలవ గలిగే ఉద్యమాల పట్ల వారికున్న అనాదరణా భావమే. బాబాను విమర్శించేవారు ఎక్కువైనప్పుడల్లా బాబాను ఆరాధించే వారు మరింతగా పెరుగుతున్నారు. [116]
ముఖ్యంగా లైంగిక ప్రవర్తన గురించిన బి.బి.సి.లో వచ్చిన నిందలు పూర్తిగా ఆధార రహితమని అశోక్ భగాని వివరించాడు. ఎందుకంటే ప్రైవేటు దర్శన సమయంలో కుటుంబ సభ్యులు గాని, మిత్రులు గాని తప్పక భక్తునికి తోడుగా ఉంటుంటారు.[117] కేవలం ఇద్దరు పాశ్చాత్యుల కథనం ఆధారంగానే Secret Swami అనే బిబిసి డాక్యుమెంటరీ తయారయ్యిందనీ, తన దీర్ఘకాలిక పరిశీలన ప్రకారం అటువంటి ఘటనలకు అవకాశమే లేదనీ మరొక విద్యార్థివివరించాడు.[117]
పుట్టపర్తి ఆశ్రమం సెక్రటరీ కె.చక్రవర్తి ఇటువంటి నిందలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించాడు. మహా పురుషుల జీవితాలలో వివాదాలు రాకపోలేదనీ, ఇదంతా బాబా లీల అనీ, వివాదాలు వచ్చినా బాబా పట్ల ఆరాధన పెరుగుతూనే ఉన్నదనీ బాబా అనువాదకుడు కుమార్ అన్నాడు .[109]. తాను పరిశీలించిన ప్రకారం బాబా ప్రవర్తనలో ఏ మాత్రం అసభ్యత లేదనీ, తాను స్వయంగా బాబా అసాధారణ శక్తులను చూచాననీ డెన్మార్క్‌కు చెందిన తోర్‌బ్జార్ మెయెర్ అన్నాడు.[118]
రాజకీయ వివాదం
2007 జనవరిలో ఆంధ్ర ప్రదేశ్‌ను విభజించడం, తెలంగాణాను ఏర్పరచడం పాపమని సత్యసాయిబాబా అన్న మాటలు స్థానికంగా రాజకీయ దుమారాన్ని సృష్టించాయి.[119] ఇందుకు నిరసనగా తెలంగాణా రాష్ట్ర సమితి నాయకుడు కె.చంద్రశేఖరరావు, ఇతర తెలంగాణా వాదులు బాబాను తీవ్రంగా విమర్శించారు. పెద్దపెట్టున నిరసన ప్రదర్శనలు జరిగాయి. బాబా అనుయాయుల ద్వారా ప్రతి ప్రదర్శనలు కూడా జరిగాయి. [120][121]
స్మరణలు
- 2022 లో కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి జిల్లా
చిత్రమాలిక
- 1940 లలో సత్యసాయిబాబా
- 1948 లో చిత్రం
- 1948 లో భక్తులతో ఉన్న దృశ్యం
- 1996 లో చిత్రం
- సత్యసాయిబాబా సమాధి,పుట్టపర్తి
- సత్యసాయి ప్రసంగం-1996లో
- 1946 లో తెప్పోత్సవం సందర్భంగా బాబా
మూలాలు
బయటి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.