Remove ads
కడప జిల్లాలోని గ్రామం From Wikipedia, the free encyclopedia
దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. [1]ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. ఇక్కడ విద్యారణ్యస్వామి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు ప్రక్క దారి చీలిపోతుంది. ఆ మార్గంలో పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని 'మధ్య అహోబిలం' అనీ, శైవులు దీనిని 'మధ్య కైలాసం' అనీ అంటారు. ఆంధ్ర ప్రదేశ్లో ఇదొక్కటే శంకరాచార్య మఠం.
ఈ గ్రామాన్ని గురించి తెలుగులో తొలి యాత్రాచరిత్రగా చెప్పబడే కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావనలున్నాయి. గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రలో ఈ గ్రామంలో 1830 సంవత్సరాంతంలో విడిది చేశారు. ఆ సమయంలో తాను గమనించి గ్రామవిశేషాలను గ్రంథంలో చేర్చుకున్నారు. గ్రంథంలో ఆయన పుష్పగిరి గురించి ఇలా వ్రాశారు: పుష్పగిరి పుణ్యక్షేత్రము. పినాకినీ తీరము. నది గట్టున కొండ వెంబడిగా రమణియ్యమైన యొక దేవస్థల మున్నది. అది హస్తినిక్షేపము చేయతగిన పుణ్యస్థలము. స్మార్త పీఠాధిపతి యయిన పుష్పగిరి స్వాములవారు, అక్కడ మఠము గట్టుకొని నివాసము చేస్తున్నారు. 18 బ్రాహ్మణ గృహములున్నవి. అక్కడి బ్రాహ్మణులు కొంత వేదాంత విచారణ గలవారుగా కనబడుచున్నారు. అన్ని వస్తువులకు పేటకు పోవలెగాని, అక్కడ దొరకవు. నది దాటి ఊరు ప్రవేశించవలెను, మళ్ళీ నది దాటి భాటకు రావలెను. ఊరు రమ్యమైనది.[2]
ఈ ప్రాంతంలో కాంపల్లె అనే గ్రామం ఉండేది. గరుత్మంతుడు ఇంద్రుని అమృతభాండాన్ని తీసుకుని వస్తున్నాడు. ఇంద్రుడు అడ్డగించాడు. ఇరువురికీ పోరాటం జరిగింది. ఆ సమయంలో అమృతభాండం నుంచి కొన్ని చుక్కలు కాంపల్లె సమీపంలోని కోనేటిలో పడ్డాయి. నాటి నుంచి ఆ కోనేటిలో మునిగే వారికి యౌవనం లభించేది, అమరత్వమూ సిద్ధించేది. దేవతలు భయపడి శివుణ్ణి ఆశ్రయించారు. శివుడు వాయుదేవుణ్ణి ఆజ్ఞాపించాడు. వాయువు కైలాస పర్వతం నుంచి ఒక ముక్కను తెచ్చి ఆ కోనేటిలో వేశాడు. అది కోనేటిలో పుష్పం వలె తేలింది. అదే పుష్పగిరి అయింది.
పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీక్షేత్రమంటారు.
పుష్పగిరి శిల్పకళాసంపదకు పేరు. ఆలయం బయటి గోడలపైన ఉండే శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి. అక్కడ ఏనుగుల వరసలు, గుఱ్ఱాల మీద వీరుల విన్యాసాలు రమ్యంగా ఉన్నాయి. భారత రామాయణాల్లోని ముఖ్య ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి. కిరాతార్జున గాథ చిత్రించబడింది. నటరాజ నృత్యం చూసి తీరాలి. ఇక్కడి శిల్పాలలో సౌందర్యం తొణికిసలాడుతూ ఉంటుంది.
శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆద్భుత శిల్ప సౌందర్యంతో అపురూప కట్టడాలతో ఈ క్షేత్రం అలరారుతోంది. పరీక్షిత్తు వంశాన్ని నిర్విర్యం చెయడానికి జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశం పై పుష్పగిరి కొండ పై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర ద్వారా తెలుస్తుంది.
కొండ మీద ఒకే ఆవరణంలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఈ ఆవరణంలోనే ఉమా మహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షిమల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. పుష్పగిరిలోనే పాపవినాశేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమలసంభవేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలున్నాయి. రుద్ర పాదము, విష్ణు పాదము ఈ కొండ మీదనే ఉన్నాయి. .
పుష్పగిరిలో కింద వైద్యనాదేశ్వర, త్రికుటేశ్వర, భీమలింగేశ్వర, కామక్షి అమ్మవారి ఆలయాలున్నాయి. వైద్య నాథేశ్వరుడు, భీమేశ్వరుడు, త్రికూటేశ్వరుడు ఇక్కడ నెలకొని ఉన్నారు. వైద్య నాథేశ్వరాలయంలో శ్రీ కామాక్షి మందిరం ఉంది. వరదలు వచ్చినప్పుడు పెన్న దాటి ఆవలి వైపుకు వెళ్ళలేరు. అప్పుడు ఈవలి వైపు అభినవ చెన్నకేశవ స్వామికి పూజలు జరుగుతాయి పాతాళ గణపతిని దర్శించుకొని పూజలు చేసెందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్ఠించిన శ్రీ చక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు.
పుష్పగిరి శిల్పకళాసంపదకు పేరు. ఆలయం బయటి గోడలపైన ఉండే శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి. అక్కడ ఏనుగుల వరసలు, గుఱ్ఱాల మీద వీరుల విన్యాసాలు రమ్యంగా ఉన్నాయి. భారత రామాయణాల్లోని ముఖ్య ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి. కిరాతార్జున గాథ చిత్రించబడింది. నటరాజ నృత్యం చూసి తీరాలి. ఇక్కడి శిల్పాలలో సౌందర్యం తొణికిసలాడుతూ ఉంటుంది.
పవిత్ర పినాకిని నదీ తీరంలో వెలసి దక్షిణ కాశిగా పేరొందిన పవిత్ర పుణ్యక్షేత్రం పుష్పగిరిలో ఏప్రిల్ 15 నుండి బ్రహ్మొత్సవాలు జరుగును. శ్రీ లక్ష్మి చెన్నకేశవస్వామి, శ్రీ వైద్యనాదేశ్వరస్వామి వార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు 24 వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
శ్రీ లక్ష్మి చెన్నకేశవస్వామికి ఈ ఏప్రిల్ 15 న విష్వక్సేన పూజతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 21 న కళ్యాణోత్సవం, 22 న రథోత్సవం, 23 న ఆశ్వవాహన సేవ, 24 న చక్రస్నానం, పూర్ణాహుతి, పుష్పయాగం నిర్వహిస్తారు.
శ్రీ వైద్యనాదేశ్వరస్వామికి ఏప్రిల్ 15 న మృత్య్సంగ్రహణం, అఖండ దీపారాధన, 21 న కళ్యాణోత్సవం, 22 న రథోత్సవం, 23 న నిత్యహోమం, 24 న చక్రస్నానం నిర్వహిస్తారు. బ్రహ్మొత్సవాలలో మూడు రోజు ల పాటు తిరునాళ్ల జరుగుతుంది.
పుష్పగిరి చెరుకోడానికి మూడు మార్గాలున్నాయి.
వైఎస్ఆర్ జిల్లా విజ్ఞాన విహార దర్శిని - డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి, విద్వాన్ కట్టా నరసింహులు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.