From Wikipedia, the free encyclopedia
పీసపాటి నరసింహమూర్తి (1920 జూలై 10 - 2007 సెప్టెంబర్ 28) పేరుపొందిన రంగస్థల నటుడు. తెలుగు నాటక రంగంపై శ్రీకృష్ణుడు పాత్రదారిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్న నటుడు. పద్యగానంలో తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకున్న నటుడు.
పీసపాటి నరసింహమూర్తి, విజయనగరం జిల్లా బలిజిపేట మండలం, వంతరాం గ్రామంలో 1920, జూలై 10న జన్మించాడు. ప్రారంభంలో ఆకాశవాణిలో పనిచేశాడు.
1938లో రంగూన్రౌడీ నాటకంలో కృష్ణమూర్తి పాత్ర ద్వారా పీసపాటి నాటకరంగంలోకి అడుగుపెట్టాడు. 1946లో పాండవోద్యోగ విజయాలు నాటకంలో మొదటిసారిగా శ్రీకృష్ణుడి పాత్ర వేశాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇతనికి రెండు పర్యాయాలు సంగీత నాటక అకాడమీలో సభ్యత్వం ఇచ్చి గౌరవించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1993లో ఆయనను కళాప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది. దాదాపు ఏడు దశాబ్దాలపాటు వేలాది ప్రదర్శనలు ఇచ్చిన పీసపాటి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. తిరుపతి వేంకటకవులు, విశ్వనాథ సత్యనారాయణ వంటివారు ఎంతగానో అభినందించారు. ఎన్.టి.రామారావు పీసపాటి నటనను (కృష్ణ పాత్రను) చూసేవాడు.
పాండవోద్యోగ విజయాలతో పాటు గౌతమబుద్ధ, లవకుశ, తారాశశాంకం, చింతామణి లాంటి నాటకాలు అనేకం ఆడినా పీసపాటికి ఎనలేని కీర్తి కృష్ణుని పాత్ర వల్లే వచ్చింది. అత్యుత్తమ కృష్ణునిగా ఉద్యోగవిజయాల నాటక రచయితల్లో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి నుంచి అవార్డు అందుకోవడం, టంగుటూరి ప్రకాశం నటరాజు విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వటం, బిలాస్పూర్లో తెలుగురాని ఒక బెంగాలీ జంట నాటకం చూసి, గ్రీన్ రూమ్లో ఇతనిని తనివితీరా ముద్దాడడం తన జీవితంలో మరపురాని సంఘటనలుగా పీసపాటి పేర్కొన్నాడు.పద్యగానంలో పీసపాటి అనేక మార్పులు తీసుకువచ్చాడు. తెలుగు పౌరాణికాల్లో పద్యాలను సుదీర్ఘమైన రాగాలతో పాడడం అలవాటుగా ఉండేది. ఒక నిముషం పద్యానికి ఐదేసి నిముషాల రాగం తియ్యడం ఆనవాయితీగా ఉండేది. పీసపాటి ఆ పద్ధతిని విడనాడి, అనవసరమైన సాగతీతలను విసర్జించి, సాహిత్యానికి ఎక్కువ విలువ కల్పిస్తూ పద్యం పాడి ప్రజలను అలరించాడు. పీసపాటి కృష్ణుడి వేషధారణలో కూడా మార్పులు తీసుకువచ్చాడు. దేహానికి అంటిపెట్టుకుని ఉండే నీలపు రంగు చొక్కా ధరించి నిజంగా నీలపు కృష్ణుడేననే భ్రమ కల్పించాడు.
పీసపాటి 1987-1993 కాలంలో బొబ్బిలి మండలం, రాముడువలస గ్రామానికి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.రాచిరాజు కృష్ణ మూర్తి ఈయన సమకాలీన సాహితీవేత్త.
పీసపాటి నరసింహమూర్తి 2007, సెప్టెంబర్ 28న మరణించాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.