From Wikipedia, the free encyclopedia
పింగళి లక్ష్మీకాంతం(1894-1972), కాటూరి వేంకటేశ్వరరావు(1895-1962) ఇద్దరూ పింగళి కాటూరి కవులు పేరుతో కవిత్వం చెప్పారు. అవధానాలు చేశారు.
పింగళి లక్ష్మీకాంతం 1894, జనవరి 10 న కృష్ణా జిల్లా ఆర్తమూరులో జన్మించాడు. ఈయన స్వగ్రామం చిట్టూర్పు. ఇతడి తల్లిదండ్రులు వెంకటరత్నం, కుటుంబమ్మ. ప్రాథమిక విద్యాభ్యాసం రేపల్లెలో పొందిన తరువాత మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాల, నోబుల్ కళాశాలలో చదివాడు. మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. పట్టా పొందాడు. తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రికి శుశ్రూష చేసి, సంస్కృతాంధ్రాలలో బాగా పఠించి వారి శిష్యులలో అగ్రగణ్యులయ్యాడు. ఇతడు కాటూరి వేంకటేశ్వరరావు తో కలిసి జంట కవిత్వం చెప్పాడు. ఇతడు విడిగా గౌతమ వ్యాసములు, మధుర పండిత రాయము, సాహిత్య శిల్పసమీక్ష, కుమార వ్యాకరణము, నా రేడియో ప్రసంగాలు, ఆత్మలహరి, ఆంధ్ర సాహిత్య చరిత్ర, గౌతమ నిఘంటువు మొదలైన రచనలు చేశాడు. ఇతడు ఉపాధ్యాయుడిగా, ఆచార్యునిగా, ఆంధ్రశాఖ అధ్యక్షునిగా వెంకటేశ్వర, ఆంధ్ర విశ్వవిద్యాలయాలలో పనిచేశాడు. మద్రాసులోని ప్రాచ్యపరిశోధనా విభాగంలో కొంతకాలం పరిశోధనలు చేశాడు. ఇతడు 1972, జనవరి 10వ తేదీన మరణించాడు.
కాటూరి వేంకటేశ్వరరావు 1895, అక్టోబరు 15వ తేదీన కృష్ణాజిల్లా, వుయ్యూరు మండలం, కాటూరు గ్రామంలో రామమ్మ, వెంకటకృష్ణయ్య దంపతులకు జన్మించాడు.[1] ఇతడు బందరులో బి.ఎ. చదివాడు. మహాత్మా గాంధీ ప్రభావంతో సహాయనిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహాలలో పాల్గొని జైలుశిక్షను అనుభవించాడు. ఇతడు ఆంధ్రోపన్యాసకుడిగా, వైస్ ప్రిన్సిపాల్‌గా, ప్రిన్సిపాల్‌గా , కృష్ణా పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. ఇతడు విడిగా గుడిగంటలు, పన్నీటిజల్లు, మువ్వగోపాల (శ్రవ్యనాటికలు), శ్రీనివాస కళ్యణం వంటి రచనలు, దేవ్యపరాధక్షమాపణస్తోత్రం, శివాపరాధక్షమాపణస్తోత్రం,సౌందర్యలహరి, నల్లకలువ, ముగ్గురుమూర్తులు, సీతపెండ్లి, సాహిత్యదర్శనం, మాతృభూమి, ప్రతిజ్ఞాయౌగంధరాయణము, స్వప్నవాసవదత్త మొదలైన అనువాద రచనలు చేశాడు. ఇతడు 1962, డిసెంబరు 25న మరణించాడు.
పింగళి కాటూరి కవులు ప్రప్రథమంగా 1917లో బందరులోని బుట్టాయపేటలోని సీతారామాంజనేయదేవస్థానంలో ఆశువుగా మారుతీశతకాన్ని చెప్పారు. తరువాత వీరు తొలకరి[2] అనే ఖండకావ్యాన్ని ప్రకటించారు. అటుపిమ్మట వీరు సంస్కృతంలో అశ్వఘోషుడు వ్రాసిన సౌందరనందముకు అదేపేరు[3]తో స్వేచ్ఛానువాదం చేశారు[1].
ఈ జంటకవులు బందరు, నెల్లూరు, ముదునూరులలో శతావధానాన్ని చేశారు. ఇంకా బందరు జాతీయ కళాశాలలోను, గుంటూరు జిల్లా అనంతవరములోను, తోట్లవల్లూరులోనూ ఇంకా అనేక చోట్ల అష్టావధానాలు చేశారు.
పూరణ:
దంతుల్ ఘోటకముల్ పదాతులును చెంతం గొల్చిరాన్ వచ్చు దు
ష్యంతు న్గన్గొని కణ్వమౌని యిటు రాజా రమ్మనన్ మీకు మీ
అంతేవాసులకున్ సుఖమ్మెయన నీ యండ స్సుఖంబుండె మా
కాంతారమ్మనియెన్ మునీంద్రుడు చమత్కారంబు దీపింపగన్
విభుడు చెమ్మటలోడ వేడియూర్పులతోడ
రా దగ్గరంజేరి శ్రమలు బాపు
కాంతుండు గవ్వయేన్ గణన సేయకయున్న
నున్నంత పట్టులో యోర్పుజెందు
ముక్కోపియైన్ భర్త నెక్కొని తన్నిన
పాదంబు నొచ్చెగా నాథ యనును
పుట్టంధుడైనను భోగహీనుండైన
మనసిజ సముడిగా మదితలంచు
కాన నిదమిద్ధ మనుచు నెవ్వానికేని
నిర్ణయింపగరాదు, దుర్నీతులతని
లేదటుందురు గాని యవ్వారు కల్గు
టే నిజమ్మైన చచ్చెదరే ధృవంబు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.