పర్లాకిమిడి
ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా ముఖ్యపట్టణం From Wikipedia, the free encyclopedia
ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా ముఖ్యపట్టణం From Wikipedia, the free encyclopedia
పర్లాకిమిడి లేదా పర్లాఖేముండి ఒడిషా రాష్ట్రంలో గజపతి జిల్లా ముఖ్యపట్టణము. ఆంధ్రపదేశ్ - ఒడిషా రాష్ట్ర సరిహద్దుకు సమీపంలో మహేంద్రతనయ నది ఒడ్డున ఉన్నదీ పట్టణం.
?పర్లాకిమిడి ఒడిషా • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 18.8°N 84.2°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 145 మీ (476 అడుగులు) |
జిల్లా (లు) | గజపతి జిల్లా జిల్లా |
జనాభా • జనసాంద్రత • ఆడ-మగ నిష్పత్తి |
50,869 (2011 నాటికి) • 14,013/కి.మీ² (36,294/చ.మై) • 988 |
Chairman Of the Municipality | కే. లతాదేవి |
కోడులు • పిన్‌కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • వాహనం |
• 761200 • +91-6815 • OD-20 |
2001 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం, పర్లాకిమిడి జనాభా 42,991. వీరిలో పురుషులు 49%, స్త్రీలు 51% ఉన్నారు. పర్లాకిమిడి సగటు అక్షరాస్యత 69% ఇది జాతీయ సగటు రేటు 59.5%, కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 77%, మహిళల అక్షరాస్యత 61% ఉంది. పర్లాకిమిడిలో 6 సంవత్సరాల కంటే పిన్న వయస్కులు11% మంది ఉన్నారు. 2007 సంవత్సరంలో పర్లాకిమిడి 44,000 జనాభా కలిగి ఉంది. హిందూ మతస్థులు అత్యధిక వర్గం. ఆ తరువాత ఎక్కువగా అవలంభిస్తున్న మతం క్రైస్తవం.
పర్లాకిమిడి మహారాజు కృష్ణ చంద్ర గజపతి నారాయణ దేవ్, ఒడిషాను ఏడు శతాబ్దాల పాటు పాలించిన చారిత్రక తూర్పు గాంగ వంశానికి చెందిన గజపతి రాజుల ప్రత్యక్ష వారసుడు. ఈ వంశపు పాలనలో, ఒడిషా సరిహద్దులు ఉత్తరాన గంగా నది నుండి దక్షిణాన నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి వరకు విస్తరించాయి. 15వ శతాబ్దం రెండవ అర్ధభాగంలోని గజపతి చక్రవర్తి కపిలేంద్ర దేవ గజపతి కుమారులలో ఒకడైన కోలహోమి పర్లాకిమిడి వచ్చి పర్లాకిమిడి యొక్క రాజ కుటుంబాన్ని స్థాపించాడు.
పర్లాకిమిడి, గంజాం జిల్లా యొక్క దక్షిణ భాగంలోని పశ్చిమ మూలన ఉన్న పురాతన జమిందారీ. పశ్చిమాన విశాఖపట్నం జిల్లా, ఉత్తరాన జయపూరు రాష్ట్రం, మలియాలు లేదా గిరిజన సంస్థలుగా పిలవబడే తూర్పు కనుమలు సరిహద్దులుగా కలిగి ఉంది. పర్లాకిమిడి పట్టణం అటవీమయమైన కొండ పాదాల చుట్టూ L ఆకారంలో అల్లుకున్నట్టుగా ఉండటం విలక్షణమైనది. 'L' యొక్క సమాంతర భాగం దక్షిణ దిశగా ఉంది. 'L' యొక్క మూలలో ప్యాలెస్ ఉంది. ఇది అత్యంత సుందరమైన భవన సమూహం. ఈ భవనాలను చిషోమ్ రూపకల్పన చేసి కట్టించాడు. 1936లో ఒడిషా రాష్ట్రం ఏర్పడే సమయంలో పర్లాకిమిడి జమిందారీలోని 70% ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండిపోయింది.[ఆధారం చూపాలి] ఇప్పుడు ఈ ఒరియా మాట్లాడే ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఉన్నాయి.
గజపతి జిల్లా 1992 అక్టోబరు 2న ఏర్పడినది. దీనికి ముందు అది గంజాం జిల్లాలో ఒక డివిజనుగా ఉండేది. ప్రత్యేక ఒడిషా రాష్ట్ర ఏర్పాటుకు, పర్లాకిమిడి సంస్థానము ఒడిషాలో చేరటానికి చేసిన కృషికి గుర్తింపుగా కొత్తగా ఏర్పరచిన జిల్లాకు మహారాజా శ్రీ కృష్ణ చంద్ర గజపతి నారాయణ్ దేవ్, పర్లాకిమిడి సంస్థానపు రాజా (ఒడిషా రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి), పేరు మీదుగా గజపతి జిల్లా అని పేరు పెట్టబడింది.
పర్లాకిమిడి, తూర్పు భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలో ఆగ్నేయ దిక్కున ఉంది. ఇది మహేంద్రతనయ నది ఒడ్డున ఉంది. పర్లాకిమిడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పాతపట్నం అనే పట్టణంతో సరిహద్దు. పట్టణం కొండ ప్రాంతాల్లో ఉంది. అత్యధిక తేమతో ఉపఉష్ణమండల వాతావరణం కలిగి ఉంది. సంవత్సరం పొడవున ఉష్ణోగ్రత 18-48 డిగ్రీ ల సెల్సియస్ మధ్య ఉంటుంది. వేసవిలో అప్పుడప్పుడు విద్యుత్తు అంతరాయం కలిగించే ఉరుములు మెరుపులు, తుఫానులతో చాలా వేడిగా ఉంటుంది. పర్లాకిమిడి నైరుతి రుతుపవనాల వల్ల వర్షం అందుకుంటుంది. సంవత్సరంలో జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలో వర్షపాతం అధికం.
గజపతి జిల్లాలో సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (సి.యు.టి.ఎమ్) రాష్ట్రానికందిస్తున్న సాధారణ విద్యా సేవలు అనేకం. జగన్నాథ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ 1997 లో స్థాపించబడింది. ఈ సంస్థను గ్రామీణ ప్రాంతాలకు సాంకేతిక విద్య తీసుకుని వచ్చి, వివిధ రంగాల పరిశ్రమలకు ఉపయోగపడే అత్యున్నత స్థాయి నైపుణ్యం కల సాంకేతిక సిబ్బందిని తయారుచేసే లక్ష్యంతో ఏర్పాటు చేశారు.
ఎస్.కె.సి.జి కళాశాల రాష్ట్రంలో రెండవ అత్యంత పురాతన విద్యాలయంగా ప్రసిద్ధి చెందినది. దీనిలో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ తదితర అన్ని ప్రధాన విభాగాలు ఉన్నాయి. 1996-97 విద్యా సంవత్సరం నుండి పి.జి. గణితం కోర్సులను, ఎకనామిక్స్, కెమిస్ట్రీ, ఒరియా, వాణిజ్య, జీవశాస్త్రాలలో ఇప్పటికే ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు చేర్చబడింది. ఫిజిక్స్, గణితం, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇంగ్లీష్, ఒరియా, సంస్కృతం, జాగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ లో ఆనర్స్ కోర్సులు కూడా బోధిస్తున్నారు. ఇవేకాక కళాశాల తెలుగు, హిందీ, లాజిక్, వేదాంతం, హోమ్ సైన్స్ వంటి విభాగాలలోను కోర్సులు అందిస్తుంది. ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు కళాశాలలో ఒక కేంద్రాన్ని తెరిచారు. కళాశాలలో 2016 మంది విద్యార్థులు, 83 అధ్యాపక పదవులు ఉన్నాయి. కళాశాల 2001లో శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్నది.
పర్లాకిమిడి మహిళా కళాశాల 1983లో స్థాపించబడింది. తొలుత ఐ.ఏ. కోర్సుకై బెర్హంపూర్ విశ్వవిద్యాలయంతో అనుబంధంగా ఉంది. తరువాత +2 ఆర్ట్స్ కోర్సు కోసం ఒడిషా కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ సెకండరీ విద్యకు అనుబంధంగా ఉంది. 1988 నుండి కళాశాల జి.ఐ.ఏ కింద వచ్చింది. కళాశాల 2003-2004లో ప్రభుత్వం యొక్క శాశ్వత గుర్తింపు పొందింది. పట్టణంలో ఉన్న పాఠశాలలో మహారాజా బాలుర ఉన్నత పాఠశాల కుడా ఒకటి.
పర్లాకిమిడి నగరపాలిక పట్టణం యొక్క పౌర పరిపాలనను బాధ్యత వహిస్తుంది. గజపతి జిల్లా ముఖ్య కేంద్రంగా, పర్లాకిమిడిలో అనేక జిల్లా స్థాయి ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, ఆనేక ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి.
పట్టణం పెద్దగా పారిశ్రామీకరణ చెందలేదు. పర్లాకిమిడిలో ఒకప్పుడు కొమ్ము పనులు, జైఖాదీ సంచి, కేన్, వెదురు పని వంటి హస్తకళలు పెద్ద సంఖ్యలో ఉండేవి. ఇప్పుడు కొన్ని కళాకారుల కుటుంబాలు మాత్రమే కుటుంబవృత్తిని కొనసాగిస్తున్నాయి. చిత్రకార్ సాహీ (కళాకారుల వీధి) బంకమట్టి బొమ్మలు, రాతి శిల్పాలు, నీటిరంగు చిత్రాలకు ప్రసిద్ధిగాంచింది. అయితే, పట్టణం పరిసరాల్లో మాత్రం కొన్ని మధ్య స్థాయి గ్రానైట్ కర్మాగారాలు ఉన్నాయి.
పర్లాకిమిడి, రాష్ట్ర రహదారి 17 ద్వారా ఒడిషా రాష్ట్ర ఇతర భాగాలకు అనుసంధానించబడింది. రాష్ట్ర రహదారి 17 ఒక వైపున బరంపురాన్ని మరోవైపు రాయగడను పర్లాకిమిడితో కలుపుతుంది. సమీప ప్రధాన పట్టణమైన పలాస 40 కిలోమీటర్లు, దానీ తర్వాత సమీప ప్రధాన పట్టణమైన బరంపురం 120 కి.మీ.ల దూరంలో ఉన్నాయి. పర్లాకిమిడికి సమీప జాతీయ రహదారి 5 జంక్షన్ 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప కార్యాచరణ రైల్వే స్టేషను దూరంగా 43 కి.మీ.ల దూరంలో పలాసలో ఉంది. ఈ పట్టణం గుండా నడిచే నారో గేజ్ రైల్వే లైన్ (నౌపాద - గుణుపూర్ రైలు మార్గం అని పిలుస్తారు) బ్రాడ్ గేజుగా మార్చబడి 2010 డిసెంబరు 20 నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. పర్లాకిమిడి నుండి పూరికి ఒక రైలును ప్రారంభించారు. సమీప విమానాశ్రయం విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒ.ఎస్.ఆర్.టి.సి (ఒడిషా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ), ఏ.పి.ఎస్.ఆర్.టి.సి,, ప్రైవేట్ బస్సులు ఒడిషా, ఆంధ్రప్రదేశ్ సమీపంలోని పట్టణాల యొక్క ఇతర భాగాలకు పట్టణాన్ని కలుపుతున్నాయి. పర్లాకిమిడి రోడ్డు ద్వారా భువనేశ్వర్, బరంపురం, రాయగడ, జయపూర్, గుణుపూర్, విశాఖపట్నం, శ్రీకాకుళం, పలాస, భవానీపట్నం, నబ్‌రంగ్‌పూర్, కటక్, రూర్కెలా, మొదలైన ప్రదేశాలకు చక్కగా అనుసంధానించబడింది.
పర్లాకిమిడిలో ఒరియా సంస్కృతి ప్రబలంగా ఉంది. ప్రజలు బాగా మత ప్రభావితులు. దసరా, రక్షాబంధనం (గమ్హ పూర్ణిమ), రథ యాత్ర, హోలీ, గజలక్ష్మి పూజ, గణేశ చతుర్ధి, కాళీ పూజ, సంక్రాంతితో పాటు ఒరియా భండారీ వీధి యొక్క ఠాకురాణి యాత్ర పట్టణంలో జరుపుకునే ప్రధాన హిందూ పండుగలు. వీటితో పాటు క్రిస్మస్ను కుడా పట్టణంలో చాలా అందంగా జరుపుకుంటారు. పర్లాకిమిడి పట్టణం రథ యాత్రకు, గజమున్హా నాట్యానికి ప్రసిద్ధి చెందింది. పౌరణికాల్లోని మహేంద్ర పర్వతం ఇక్కడికి సమీపంలోనే ఉంది.
కొమ్ముపని పర్లాకిమిడిలో అత్యంత పురాతన హస్తకళ. కొమ్ముపని కళాకారులను మహారాణాలని పిలుస్తారు. ఈ కళాకారులు గజపతి కృష్ణ చంద్ర దేవ్ మహారాజు యొక్క ఆదరణలో గంజాం జిల్లాలో పిఠల అనే ఒక స్థలము నుండి వలస వచ్చినట్లు తెలపబడింది. కొమ్ముపనిలో ముఖ్యంగా బొమ్మలు, పక్షులు, జంతువులు, భారత పౌరాణిక దృశ్యాల కళాఖండాలను తయారుచేస్తారు. ప్యాలెస్ వీధి కొమ్ముపని అమ్మే దుకాణములకు ప్రసిద్ధి చెందింది. పర్లాకిమిడి యొక్క కొమ్ము పని ఇక్కడి కుటీర పరిశ్రమల యొక్క ప్రధాన ఉత్పత్తులలో ఒకటి. పర్లాకిమిడి యొక్క కొమ్ము కళాఖండాలు కలకత్తా, పంజాబు, కాకినాడ, తిరువనంతపురం యొక్క కొమ్ము పనుల మధ్య ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాడు. కొమ్ము కళాఖండాలు ప్రధానంగా జమీందారీ పొరుగు మలియాల నుండి సరఫరా చేయబడ్డ పశువుల కొమ్ములను ఉపయోగించి తయారు చేశారు. పర్లాకిమిడి మొదటి యొక్క కళాకారులు తొలుత కొమ్ముల నుండి పక్షుల బొమ్మలు తయారు చేసేవారు అయితే క్రమంగా వారు దువ్వెనలు, ఏనుగులు, గుర్రాలు, రొయ్యలు, జగన్నాథుని ప్రతిమలు చేయటం ప్రారంభించారు. ఈ కళాఖండాలను వారు విజయనగరం, రాజమండ్రి, కాకినాడ వంటి ప్రదేశాలకు అమ్మకానికి పంపుతారు. ఈ కొమ్ము వస్తువులు అంతర్జాతీయ మార్కెట్లో కూడా అత్యంత ప్రజాదరణ పొందాయి.
పర్లాకిమిడి యొక్క కళాకారులు, ఏనుగు దంతాలు, ఎముకల నుండి గద్దీలు, మంచాలు వంటి అందమైన వస్తువులు చెక్కుతారు. పర్లాకిమిడి చుట్టూ ఉన్న అడవులలో పెద్ద సంఖ్యలో ఏనుగులు నివసించడంవల్ల ఏనుగుదంతం పర్లాకిమిడిలో విరివిగా లభిస్తున్నది. బ్రిటిషు వారి కాలంలో రాధా కృష్ణ మహారాణా, ఆయన కుమారులు పూర్ణచంద్ర మహారాణా, సురేంద్ర మహారాణా, భాస్కర మహారాణా ఏనుగు దంతపు చెక్కే కళలో నిపుణులు.
క్రికెట్ పట్టణంలోని ప్రధాన క్రీడ. వాలీబాల్, బాస్కెట్బాల్, హాకీ ఇతర ప్రముఖ క్రీడలు. అబ్బాయిలు, అమ్మాయిలు ఇప్పటికీ సాయంత్రం వీధుల్లో సాంప్రదాయ వీధి ఆటలు ఆడటం చూడవచ్చు. పట్టణంలో గజపతి స్టేడియం అనే చిన్న స్టేడియం ఉంది. కాలేజ్ గ్రౌండ్ కూడా క్రికెట్, ఫుట్బాల్ మ్యాచ్లకు అనుకూలమైన వేదిక. కొన్ని జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు జరిపేందుకు అనేక ఇతర పెద్ద ఆట మైదానాలు ఉన్నాయి. క్రికెట్ ప్రధాన ఆట కావడంతో ప్రతి వీధిలో దాదాపు ఆడతారు. ప్రధానంగా శీతాకాలంలో పలు క్రికెట్ క్లబ్బులు, చిన్న స్థాయి నిర్వాహకులు బహుళ జట్టు క్రికెట్ టోర్నమెంట్లను నిర్వహిస్తాయి.
పర్లాకిమిడి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికైన ప్రస్తుత శాసన సభ్యులు నారాయణ రావు. 2009లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఈయన బిజూ జనతా దళ్ (బి.జె.డి) అభ్యర్థిగా పోటీచేసి గెలుచుకున్నాడు. 2004, 2000, 1985 లలో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో పర్లాకిమిడి నుండి భారత జాతీయ కాంగ్రేసుకు చెందిన త్రినాథ్ సాహు గెలుపొందాడు. 1995లో స్వతంత్ర అభ్యర్థిగా ఈయనే సీటును గెలుచుకున్నాడు. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఇతర శాసన సభ్యులులో 1990లో జనతాదళ్ అభ్యర్థిగా ఈ సీటును గెలుచుకున్న దారపు లచ్చన్న నాయుడు,, 1980, 1977లో స్వతంత్ర అభ్యర్థిగా ఈ సీటును గెలుచుకున్న బిజోయ్ కుమార్ జెనా ఉన్నారు. పర్లాకిమిడి బెర్హంపూర్ (లోక్ సభ నియోజకవర్గం) లో భాగంగా ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.