శ్రీదేవీ భాగవత పురాణము, ఒక శాక్తేయ పురాణము.[1] ఇదీ, మార్కండేయ పురాణములోని దేవీ మహాత్మ్యము శక్తి ఆరాధనా సంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి.[2] ఇది ఒక ఉప పురాణము అని కొందరు అన్నప్పటికీ, గ్రంథంలో మాత్రం ఇది మహా పురాణము అని ఉంది.[3]

ఈ గ్రంథాలలో పరాశక్తియైన శ్రీమాతయే సకల సృష్టిస్థితిలయకారిణియైన పరబ్రహ్మస్వరూపిణి అని చెప్పబడింది. 7వ స్కంధంలో 33వ అధ్యాయంలో దేవి విరాట్ స్వరూప వర్ణన ఉంది. 35వ, 39వ అధ్యాయాలలో శ్రీమాతను ధ్యానించే, ఆరాధించే విధములు తెలుపబడినాయి. ఇంకా అనేక పురాణ గాథలు, ఆధ్యాత్మిక తత్వాలు, భగవన్మహిమలు ఇందులో నిక్షిప్తం చేయబడినాయి. ఇది త్రిమూర్తులు చేసిన శ్రీదేవీ స్తోత్రాలతో ప్రారంభమౌతుంది.

దీని మూలం వ్యాసుడు రచించిన దేవీ భాగవతము. ఇందులో పద్దెనిమిది వేల శ్లోకాలు, పన్నెండు స్కంధాలు, మూడు వందల పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి. సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము అనే అయిదు లక్షణాలు గల మహా పురాణము.

Thumb

స్కంధాల విభాగం

  • ప్రథమ స్కంధము: ఇందులో దేవీ మహిమ, హయగ్రీవుడు, మథుకైటభులు, పురూరవుడు, ఊర్వశి, శుకుని జననము, సంతతి మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
  • ద్వితీయ స్కంధము: ఇందులో మత్స్యగంధి, పరాశరుడు, వ్యాసుడు, శంతనుడు, గాంగేయుడు, సత్యవతి, కర్ణుడు, పాండవుల జననం, పరీక్షిత్తు, ప్రమద్వర కథ, తక్షకుడు, సర్పయాగం, జరత్కారువు మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
  • తృతీయ స్కంధము: ఇందులో సత్యవ్రతుని కథ, దేవీ యజ్ఞం, ధ్రువసంధి కథ, భారద్వాజుడు, నవరాత్రి పూజ, రామ కథ మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
  • చతుర్థ స్కంధము: ఇందులో నరనారాయణులు, ఊర్వశి, ప్రహ్లాదుడు, భృగు శాపం, జయంతి, శ్రీకృష్ణ చరిత్ర మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
  • పంచమ స్కంధము: ఇందులో మహిషుడు, తామ్రభాషణ, చక్షుర తామ్రులు, అసిలోమాదులతో దేవీ యుద్ధం, రక్తబీజుడు, శుంభ నిశుంభులు మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
  • షష్ఠ స్కంధము: ఇందులో నహుషుని వృత్తాంతం, అడీ బక యుద్ధం, వశిష్టుని రెండవ జన్మ, నిమి విదేహ కథ, హైహయ వంశం, నారదుడు మొదలైన వాని గురిమ్చి వివరించబడ్డాయి.
  • సప్తమ స్కంధము: ఇందులో బ్రహ్మ సృష్టి, సూర్యవంశ కథ, సుకన్య చ్యవనుల చరిత్ర, రేవతుడు, శశాదుడు, మాంధాత, సత్యవ్రతుడు, త్రిశంకు స్వర్గం, దక్షయజ్ఞం, దేవీ స్థానాలు మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
  • అష్టమ స్కంధము: ఇందులో ఆదివరాహం, ప్రియవ్రతుడు, సప్తద్వీపాలు, కులపర్వతాదులు, ద్వీపవృత్తాంతం, సూర్యచంద్రుల స్థితగతులు, శింశిమార చక్రం, అధోలోకాలు, నరకలోక, దేవీపూజ, మధూక పూజావిధి మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
  • నవమ స్కంధము: ఇందులో పంచశక్తులు, పంచ ప్రకృత్యాదుల కథ, కృష్ణుని సృష్టి, సరస్వతీ పూజ, కవచం, స్తుతి, కలి లక్షణాలు, గంగోపాఖ్యానం, వేదవతి, తులసి చరిత్ర, స్వాహా, స్వధ, దక్షిణ, షష్ఠీదేవి, సురభి, రాధా స్తోత్రం మొదలైన విషయాలు వివరించబడ్డాయి.
  • దశమ స్కంధము: ఇందులో వింధ్య గర్వాపహరణ, మనువులు భ్రామరి గురించి వివరించబడ్డాయి.
  • ఏకాదశ స్కంధము: ఇందులో సదాచారం, రుద్రాక్ష కథ, జపమాల, శిరోవ్రతం, సంధ్య, గాయత్రీ ముద్రలు, దేవీ పూజాదులు గురించి వివరించబడ్డాయి.
  • ద్వాదశ స్కంధము: ఇందులో గాయత్రీ విచారము, కవచము, హృదయము, స్తోత్రము, సహస్రనామ స్తోత్రము, గాయత్రి దీక్షా లక్షణము, గౌరముని శాపము, మణిద్వీపం, దేవీ భాగవత ప్రశస్తి గురించి వివరించబడ్డాయి.

తెలుగులో దేవీ భాగవతం గ్రంథాలు

దేవీ భాగవతాన్ని అనేకులు తెలుగులో పద్యరూపంలోను, వచన రూపంలోను, యధానువాదరూపంలోను ప్రచురించారు. అటువంటి కొన్ని గ్రంథాల వివరణ ఇక్కడ ఇవ్వబడింది.

దీనిని కవిరత్న కవికులతిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారు రచించారు. దీనిని బాలసరస్వతీ బుక్ డిపో వారు 2005 సంవత్సరంలో ప్రచురించారు. ఈ సంస్థ వ్యవస్థాపకులు టి.బాలనాగయ్య శ్రేష్ఠి గారికి జగజ్జనని కలలో కనిపించి ఆనతిచ్చిన అనంతరం ఈ గ్రంథాన్ని ఆవిష్కరించినట్లుగా పేర్కొనబడింది. పన్నెండు స్కందములు గల ఈ వచన గ్రంథమును రచించి యామిజాల తల్లిదండ్రులైన శ్రీ కామేశ్వరీ లక్ష్మీనృసింహులకు అంకితమిచ్చారు. దీనిని యామిజాల కవీంద్రులు సులభమైన తెలుగు భాషలోనికి అనువదించారు.

  • తిరుపతి వెంకట కవులు - దేవీభాగవతం - పద్యరూపంలో
  • బేతవోలు రామబ్రహ్మం గారు రాసిన గద్య భాగం కూడా మనకి పుస్తకాల అంగడి లో లభ్యం అవుతున్నాయి. తొందరగా అర్థం చేసుకునే వీలు గా ఈ పుస్తకం ముద్రించబడింది. కేంద్ర సాహిత్య అకాడమీ వారి పురస్కారం అందుకున్న గొప్ప గ్రంధం.

మూలాలు

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.