శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు , తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడు . ఇతను ప్రసిద్ధ సంఘసంస్కర్త దివాన్ బహద్దూర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు సోదరుడు.
రఘుపతి వెంకయ్య నాయుడు స్వస్థానం మచిలీపట్నం. వీరు ప్రఖ్యాత తెలగ వీర యోధుల కుటుంభానికి చెందినవారు. వీరి తండ్రి, తాత ముత్తాతల కాలంనుండీ సైన్యాలలో సేనానాయకులుగా చేసేవారు అలా వీరు ఈస్టు ఇండియా కంపెనీలోనూ, బ్రిటిష్ సైన్యాలలోనూ తెలగ రెజిమెంట్ ల లో సుబేదార్లుగా సేవలందించారు.
వీరు 15 అక్టోబరు 1869లో జన్మించారు. తన 17వ ఏట వెంకయ్య ఫొటోలు తీయడం మొదలుపెట్టాడు. 1910లో ఒక 'క్రోమో మెగాఫోను'ను, 4000 అడుగుల ఫిలిమ్‌ను విదేశాలనుండి తెప్పించుకొని వాటిని ప్రదర్శించడం ఆరంభించారు. ఒక టూరింగ్ టెంట్ ద్వారా ప్రదర్శనలిస్తూ అతను అప్పటి మూగసినిమాలకు సంగీతం వంటి ఆకర్షణలు జోడించేవాడు.
1912లో మద్రాసులో 'గెయిటీ' అనే సినిమా థియేటర్ (ప్రదర్శన శాలను) నిర్మించారు. తరువాత 'క్రౌన్', 'గ్లోబ్' సినిమాహాళ్ళను కూడా నిర్మించారు. తన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్ ను (ఆర్.ఎస్.ప్రకాష్) సినిమా నిర్మాణం నేర్చుకోవడానికి విదేశాలు పంపాడు. ప్రకాష్ జర్మనీ, ఇటలీ, అమెరికా దేశాలు పర్యటించాడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్శకుడు 'సిసిల్ బి డెమిల్లి' (Ceicil B.Demille) 'టెన్ కమాండ్‌మెంట్స్' (Ten Comamndments) చిత్రాన్ని నిర్మిస్తున్నపుడు ప్రకాష్ అతను క్రింద కొంతకాలం పనిచేశాడు.
ప్రకాష్ తిరిగి వచ్చిన తరువాత ఈయన దక్షిణభారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ 'Star of the East' ను స్థాపిచాడు. 1921లో భీష్మప్రతిజ్ఞ మూగచిత్రాన్ని నిర్మించారు (ఇది మూగచిత్రం గనుక "మొదటి తెలుగువాడి సినిమా" అనడం ఉచితం). ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించారు. 'డి కాస్టెల్లో'(De Castello) అనే ఆంగ్లయువతి గంగ పాత్రను ధరించింది. తరువాత ఈ తండ్రీకొడుకులు మత్స్యావతార్, నందనార్, గజేంద్రమోక్షం వంటి మరికొన్ని మూగసినిమాలను తీశారు. తరువాత ప్రసిద్ధులైన సి.పుల్లయ్య, వై.వి.రావులూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
తరువాత తమిళ సినిమా నిర్మాత ఎ.నారాయణన్‌తో కలిసి 'గ్యారంటీడ్ పిక్చర్స్ కార్పొరేషన్' , 'జనరల్ ఫిల్మ్ కార్పొరేషన్' స్థాపించారు. విశ్వామిత్ర, మాయామధుసూదన, పాండవ నిర్వహణ, రాజ్ ఆఫ్ రాజస్థాన్ వంటి మరికొన్ని మూగసినిమాలు తీశారు.
1941 లో తన 72వ ఏట రఘుపతి వెంకయ్య మరణించారు. అప్పులవారికి చాలామొత్తాలు చెల్లించవలసినందున అతని చివరికాలానికి ఏమీ ఆస్తి మిగలలేదు అంటారు.
రఘుపతి వెంకయ్య అవార్డు
ఆయన సేవలను గుర్తించిన అంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1980 వ సంవత్సరములో రఘుపతి వెంకయ్య అవార్డు ను నెలకొల్పినారు. సినీ రంగంలో విశేష కృషి చేసిన వారికి ఈ బహుమతి ప్రధానం చేస్తారు.
వెంకయ్య తరువాత ప్రకాష్ తన సినీ ప్రయోగాలను మరింత ముందుకు తీసుకొని వెళ్ళారు. వెల్లవేసిన తెల్లటి గోడమీద సినిమా 'ప్రొజెక్ట్' చేసేవాడు. అలా దానిని 'గోడమీది బొమ్మ' అనేవారు. ప్రకాష్ కాకినాడ దగ్గర భక్త మార్కండేయ సినిమా తీశారు. అందులో కాకినాడ రాజారత్నం అనే ఆవిడ ఒక ముఖ్యపాత్ర ధరించింది. ఈమే తెలుగు సినిమాకు మొదటి కథానాయిక.
మరికొన్ని విశేషాలు
- దక్షిణభారతదేశంలో మొదటిసారిగా మూకీ కథా చిత్రం ‘కీచకవధ’ 1916 లో నటరాజ మొదలియార్ నిర్మించారు.
- సినిమా థియేటర్లు కట్టడంలో, సినిమాలు తియ్యడంలో వెంకయ్య పడిన కష్టాలూ, అవస్థలూ అన్నీ ఇన్నీ కావు. ఎలక్ట్రిసిటీ ఇన్‌స్పెక్టర్లూ, శానిటరీ ఇన్‌స్పెక్టర్లూ ప్రతీసారీ వచ్చి ‘అది మార్చు, ఇది మార్చు’ అని పేచీలు పెట్టేవారుట. ఒక థియేటర్ కట్టడానికి అంగీకరించి, లైసెన్స్ ఇచ్చిన తర్వాత కూడా అధికారులు ఏవో అవాంతరాలు, అభ్యంతరాలు చెప్పేవారనీ, అలా ఒక థియేటర్ , నిర్మాణం మధ్యలో ఆగిపోయి తీవ్రమైన నష్టం కలిగించిందనీ, ఈ బాధలు భరించలేక ఇంకొకరైతే, ఈ వ్యాపారానికి స్వస్తి చెప్పేవారనీ, తాను పట్టుపట్టి అంతుచూడాలనుకున్నాననీ, సాధించగలిగాననీ - వెంకయ్య రాసుకున్నారు.
- ‘భీష్మప్రతిజ్ఞ’ తర్వాత వెంకయ్య, ప్రకాశ్ కలిసి గజేంద్రమోక్షం, మహాత్మా కబీర్‌దాస్, స్టేజ్‌గర్ల్, కోవలన్ వంటి మూకీలు ఎన్నో తీశారు. ఈ మూకీలకి ఉత్తరభారతదేశంలో మంచి గిరాకీ వుండేది. అయినా కంపెనీకి ఆర్థికమైన నష్టాలు కలగడంతో 1924 లో ‘కోర్ట్’ చేతిలోకి వెళ్లిపోయింది! ప్రకాశ్ వేరే కంపెనీలకి కొన్ని చిత్రాలు డైరెక్టు చేశారు. 1931లో టాకీ వచ్చిన తర్వాత కూడా మూకీల నిర్మాణం కొనసాగింది. మద్రాసులో తయారైన చివరి మూకీచిత్రం ‘విష్ణులీల’ . 1932 లో ప్రకాశే డైరెక్టు చేశారు. ఐతే, ‘భీష్మప్రతిజ్ఞ’కి ముందే ప్రకాశ్ ‘మీనాక్షి కళ్యాణం’ అన్న చిత్రం తీస్తే కెమెరా సరైనది కానందువల్ల ఆ బొమ్మ రానేలేదుట! మళ్లీ విదేశాలువెళ్లి వేరే కెమెరా కొనుక్కొచ్చి ముందుగానే ప్రయోగాలు చేసి, ‘భీష్మప్రతిజ్ఞ’ తీశారు. ఇలాంటి ఆర్థికమైన నష్టాలూ, శ్రమతో కలిగిన కష్టాలూ ఎన్నో. అందుకే, దక్షిణ భారతదేశంలోని సినిమా అభివృద్ధికి ప్రకాశ్ ‘మేజర్ ఫోర్స్’ అని అప్పటి జర్నలిస్టులూ, రచయితలూ కొనియాడారు.
- ప్రకాశ్ దగ్గర పనిచేసిన సి. పుల్లయ్య, వై.వి. రావు దర్శకులై తెలుగుచిత్రాలు తీస్తూవుండగా, ప్రకాశ్ తమిళచిత్రాలే ఎక్కువగా తీశారు. 1938 - 39 ప్రాంతాల ‘బారిస్టర్ పార్వతీశం’, ‘చండిక’ చిత్రాల్ని ప్రకాశ్ చేపట్టారు. బళ్లారి రాఘవాచార్య, కన్నాంబ వంటి నటులతో, ‘చండిక’ నిర్మిస్తే, హాస్య సన్నివేశాలతో ‘బారిస్టర్ పార్వతీశం’ నిర్మించారు. రెండూ 1940లో విడుదలైనాయి.
- ప్రకాశ్ మంచినటుడు. సైలెంట్ సినిమాల్లో ముఖ్యపాత్రలే వేశారు గాని, టాకీల్లో వెయ్యలేదు. ‘ఆయన నటించి చూపితేనే, నేను ’పార్వతీశం‘ పాత్ర చెయ్యగలిగాను’ అని పార్వతీశం పాత్రధారి, ప్రకాశ్ సహాయకుడు అయిన లంక సత్యం చెప్పేవారు.
- తానే దర్శకనిర్మాతగా ‘తారాశశాంకం (1941), బభ్రువాహన (1942 ) లో చిత్రాలు తీశారు ప్రకాశ్. ఆయనా శంకరరెడ్డి (’లవకుశ‘, ’రహస్యం‘ చిత్రాల నిర్మాత) కలిసి 1951 లో ’మాయపిల్ల ‘ తీశారు. ప్రకాశ్ డైరెక్టు చేసిన ఈ చిత్రంలో కుమారి ద్విపాత్రాభినయం చేసింది.
- 1956లో ప్రకాశ్ ’మూన్రుపెణగళ్‘ తమిళచిత్రం ,’ దేవసుందరి‘ తెలుగుచిత్రం ప్రారంభించారు. ’మూన్రుపెణగళ్‘ ఆ సంవత్సరంలోనే విడుదలైంది గాని ఆయన మృతి చెందడంతో ’దేవసుందరి‘ మాత్రం 1960లో విడుదలైంది.
- రఘుపతి వెంకయ్య, రఘుపతి సూర్యప్రకాశ్ తెలుగు సినిమా పరిణామ మార్గదర్శకులు. తండ్రీ కొడుకులిద్దరూ సినిమా కోసమే కష్టపడ్డారు. నష్టపడ్డారు.
ఇవి కూడా చూడండి
మూలాలు
వనరులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.