టి.జి.కమలాదేవి (డిసెంబర్‌ 29, 1930 - ఆగస్టు 16, 2012) (TG Kamala Devi) (ఏ.కమలా చంద్రబాబు)[1] అసలు పేరు తోట గోవిందమ్మ. వివాహం అయ్యాక భర్త పేరు చేరి ఈమె పేరు ఏ.కమలా చంద్రబాబుగా మారింది. ఈమె తెలుగు సినిమా నటి, స్నూకర్ క్రీడాకారిణి. ప్రసిద్ధ నటుడు చిత్తూరు నాగయ్య భార్య జయమ్మకు చెల్లెలు. ఈవిడ స్వస్థలం కార్వేటినగరం. చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈమె నటించిన మొట్ట మొదటి సినిమా చూడామణి. మాయలోకం అనే సినిమా ఈమెకు మంచిపేరు తెచ్చింది. అక్కినేని నాగేశ్వరరావుతో జోడీగా ముగ్గురు మరాఠీలు సినిమాలో నటించింది. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఆలపించిన తొలి యుగళ గీతానికి ఈమె హీరోయిన్‌గా నటించింది. పాతాళభైరవి, మల్లీశ్వరి (హీరోయిన్ ఇష్టసఖి జలజ) లాంటి హిట్‌ సినిమాల్లో నటించింది. ఈమె మల్లీశ్వరిలో కొన్ని పాటలు పాడడంతో పాటు, తరువాతి కాలంలో అనేక మంది నటీమణులకు డబ్బింగ్‌ చెప్పింది. తెలుగుతో పాటు అనేక తమిళ సినిమాల్లో కూడా ఈమె నటించింది.

త్వరిత వాస్తవాలు టి.జి.కమలాదేవి, జననం ...
టి.జి.కమలాదేవి
Thumb
జననంతోట గోవిందమ్మ
డిసెంబర్‌ 29, 1930
కార్వేటినగరం
మరణంఆగస్టు 16, 2012
చెన్నై
వృత్తినటి, స్నూకర్ క్రీడాకారిణి
పదవి పేరునాటక కళా ప్రపూర్ణ
భార్య / భర్తఆవుల చంద్రబాబు నాయుడు
తండ్రికృష్ణస్వామి నాయుడు
తల్లిలక్ష్మమ్మ
మూసివేయి

కమలాదేవి 2012 ఆగస్టు 16 న చెన్నైలో మరణించింది.

వ్యక్తిగతం

టి.జి.కమలాదేవి 1930, డిసెంబర్‌ 29వ తేదీన చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో జన్మించింది. ఈమె తల్లి లక్ష్మమ్మ, తండ్రి కృష్ణస్వామి నాయుడు. కమలాదేవికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. తండ్రి వ్యాపారపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో కుటుంబ సమేతంగా నివాసాన్ని కార్వేటినగరం నుండి పుత్తూరుకు మార్చాడు. తండ్రికి పుత్తూరులో అటవీ శాఖలో పని దొరికింది. కమలాదేవి పుత్తూరు ప్రభుత్వ పాఠశాలలో థర్డ్‌ఫారం వరకు చదివింది. క్రిస్టియన్‌ మిషనరీ తిరిగి ఐదవక్లాస్‌ స్కూల్లో చదివింది. ఏడో ఏట నుండి తల్లి లక్ష్మమ్మ ప్రోత్సాహంతో శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది. ప్రముఖ గాత్ర విద్వాంసుడు చెంచురామయ్య ఈమెకు గురువు. సుమారు మూడేళ్ళ పాటు చెంచుామయ్య వద్ద కమాలాదేవి సంగీతాన్ని అభ్యసించింది. ఈవిడ దాదాపు వంద కీర్తనలు, శృతులు పాడింది.

పాఠశాల, సంగీతానికి తోడుగా బాల్యం నుండి నాటకాల్లో కూడా నటించింది. ఓసారి కమలాదేవి జ్ఞాన సుందరి నాటకంలో నటిస్తుండగా నాగయ్యతో పాటు పలువురు ప్రముఖులు ఆ నాటకం చూసారు. మరో సంఘటనలో సక్కుబాయి నాటకంలో ఈమె నటనకు ముగ్ధుడైన పిఠాపురం రాజా బంగారపు గొలుసు బహూకరిస్తానని చెప్పినా, సమయానికి ఆయన మెడలో గొలుసు లేకపోవడంతో, మరో కార్యక్రమంలో గొలుసును బహూకరించాడు. ఆంధ్ర సెక్రటరియేట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గుజరాత్, రాజస్థాన్ రాష్టాల్లో రుక్సానా పాత్రను కమలాదేవి 25 సార్లు ధరించింది.

బాల్యం

ఎనిమిదేళ్ళ వయసులో ఎవిఎం వారి నాటి సరస్వతి స్టార్స్‌ తరపున ఓపెన్‌ రికార్డింగ్‌లో ఓ పాట పాడేందుకు తొలిసారిగా చెన్నై వెళ్ళింది. టి.చలపతిరావు ఈమెకు నేను కనలేని జీవితము... అనే పాటను సుమారు 20 రోజుల పాటు నేర్పించి ఓపెన్‌ రికార్డింగ్‌లో పాడించాడు. చిన్న వయస్సులోనే కనకతార, భూపుత్రి, ఐదు పువ్వుల రాణి వంటి పలు నాటకాల్లో ఈవిడ నటించింది. ఈమెకు చిన్నతనం నుండి సినిమాలంటే ఆసక్తి, ఇష్టం ఉండేది. అక్క జయమ్మ వివాహం చిత్తూరు నాగయ్యతో జరగడంతో ఈవిడ మిగతా బాల్యం చెన్నై లోని మైలాపూర్, మాంబళంలలో వారింట్లో కొనసాగింది. అప్పట్లోనే చెన్నై ఆకాశవాణి కేంద్రంలో సంగీత, పౌరాణిక నాటకాలలో, లైట్ మ్యూజిక్ కచేరిలలోను తన ప్రతిభ కనబరిచింది.

బహుముఖ ప్రఙ్ఞాశాలి

రంగస్థలం, చిత్రసీమ, ఆకాశవాణి, క్రీడారంగం వంటి నాలుగు మాధ్యమాల్లో నిలదొక్కుకున్న వ్యక్తి కమాలదేవి. నాటక రంగం ఆమె ప్రధాన వ్యాపకం, అభిమాన రంగం. మద్రాసులో ఉన్న చెన్నపురి ఆంధ్రమహాసభ కార్యక్రమాల వెనుక ఆమె కార్యదీక్ష, దక్షత, ముందుచూపు ఉన్నాయి. 1950లో ఆ సంస్థలో సభ్యత్వం పొంది 1956 నుంచి కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా వివిధ హోదాల్లో సేవ చేసింది.

సినిమాలు

1939వ సంవత్సరంలో పుత్తూరులో వందేమాతరం చిత్ర కథానాయకుడు చిత్తూరు వి.నాగయ్యకు ఘన సన్మానం ఏర్పాటైంది. ఆ సన్మానంలో కమలాదేవి తనకు ఇష్టమైన పాటను ప్రార్థనా గీతంగా పాడినప్పుడు నాగయ్య ఆ ప్రార్థనా గీతాన్ని విని, ఆమె ప్రతిభను గమనించి చెన్నై వెళ్ళాక బి.ఎన్.రెడ్డితో కమలాదేవి గురించి చెప్పి సినిమాలకు సిఫార్సు చేశాడు. నాగయ్య మాటతో, బి.ఎన్.రెడ్డి ఈమెని మద్రాసుకి పిలిపించి పాత్ర ఇద్దామనుకున్నాడు. అయితే ఆ పాత్ర కమలాదేవి చేజారిపోయింది. కాని మరికొద్ది కాలానికే చూడామణి చిత్రంలో ఈమెకు అవకాశం వచ్చింది. చూడామణి చిత్రంతో 1941లో వెండితెరమీద కనిపించిన కమలాదేవి, తరువాతి కాలంలో అనేక చిత్రాల్లో నటించి తన గానంతో, నటనతో ఆంధ్ర, తమిళ ప్రేక్షకులను మైమరిపించింది. ఈమె సినిమాలలో కథానాయకి పాత్ర ధరించకపోయినా, ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించింది. తెనాలి రామకృష్ణ సినిమాలో నటించి హెచ్.ఎం.రెడ్డి ఆశీస్సులు పొందింది. దక్షయజ్ఞంలో రోహిణిగా, సీతారామ జననంలో అహల్యగా నటించింది. అక్కినేని నాగేశ్వరరావు తొలిచిత్రం సీతారామ జననంలో నే ధన్యనైతిని రామా అనే పాట పాడిన ఈమెకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. తరువాత ఈమె పార్వతీ కళ్యాణం, గరుడ గర్వభంగం, మాయలోకం, ముగ్గురు మరాఠీలు, పల్లెటూరు, చక్రపాణి, తోడుదొంగలు, గుణసుందరి కథ, మల్లీశ్వరి, పాతాళభైరవి, చంద్రవంక, పల్లెటూరు వంటి చిత్రాల్లో పాటలు పాడే పాత్రలు, గుర్తింపుగల పాత్రలు ధరించింది.

రంగస్థలం

కమలాదేవికి చిన్నతనం నుండి రంగస్థలం అంటే ఎంతో అభిమానం. సతీసావిత్రి, తులాభారం, కీచక వథ వంటి నాటకాలు ఈమెను నటిగా నిలబెట్టాయి. పాఠశాలలోనే కనకతార వంటి నాటకాల్లో నటిస్తూ బాల కళాకారిణి గుర్తింపు పొందింది. లవకుశ సినిమా గ్రామఫోను రికార్డు ఈమెకి మంచి పేరు తెచ్చింది. వయసు పెరిగే కొద్దీ సావిత్రి, వరూధిని, కీచకవధ వంటి నాటకాల్లో ఆడుతూ పాడుతూ నటిస్తూ నటిగా పేరుతో పాటు అనుభవమూ గడించింది. అప్పటి ఆంధ్ర సెక్రటేరియట్ నాటక సమాజం ఆంధ్ర రాష్ట్రంలోనేకాక గుజరాత్, రాజస్థాన్ వంటి ఇతర రాష్ట్రాల్లో ప్రదర్శించిన అలెగ్జాండర్ నాటకంలో కమలాదేవి రుక్సానా పాత్రను 20 మార్లు నటించి, ఆపాత్రకు జీవాన్ని ఇచ్చింది. బళ్ళారి రాఘవ, స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వరరావు, సి.ఎస్.ఆర్‌, ఎ.వి.సుబ్బారావు, రఘురామయ్య, సూరిబాబు, జగ్గయ్య వంటి మహానటుల సరసన కథానాయకిగానో, సహనటిగానో నటించి రంగస్థల చరిత్రలో తన స్థానం పదిలం చేసుకుంది. అన్నా చెల్లెలు, రోషనార, కబీరు, నూర్జహాన్, పరివర్తన వంటి నాటకాలు ఆమెకు ఆంధ్రలోను, కబీరు, నూర్జహాన్ తమిళనాడులోను మంచి పేరు తెచ్చాయి. ఆంధ్ర మహాసభలో ఎన్నో వందల నాటకాలలో నటించింది. నాటకాలలో ఆమెకు ఒక బంగారు పతకం, 25 వెండి పతకాలు లభించాయి. 1983లో కర్నూలులో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఈమెకు నాటక కళా ప్రపూర్ణ బిరుదు ఇచ్చి సత్కరించింది.

ఆకాశవాణిలో

ఈమె తొలినుండి ఆకాశవాణి ఆస్థాన గాయని. ప్రయాగ నరసింహశాస్త్రి ప్రేరణతో రేడియోలో లలిత సంగీతం, నాటకాలు, నాటికలు, సంగీత రూపకాల్లో పాడుతూ శ్రోతల ప్రశంసలందుకుంది. 1945 నుంచే ఆకాశవాణిలో 'ఎ' గ్రేడ్ కళాకారిణిగా గుర్తింపు పొంది బాలాంత్రపు రజనీకాంతరావు, వింజమూరి అనసూయ, సీత, రావు బాల సరస్వతీదేవి, మల్లిక్, టంగుటూరి సూర్యకుమారి తదితరులతో కలసి చాలా మార్లు గానం చేసింది. అనార్కలి నాటకంలో ఆవుల చంద్రబాబునాయుడు అనే మద్రాసు కార్పొరేషన్ వాటర్ వర్క్స్ విభాగం ఇంజినీరుతో కలసి నటించింది. అలా నటిస్తున్నప్పుడే ఇద్దరి పరిచయం, ప్రణయంగా మారి పరిణయంగా రూపుదాల్చింది. 1946 అక్టోబరులో ఆయనతో పెళ్ళయిన తరువాత కమలాదేవి సినిమాలకు దూరమైంది. మొదట మాంబళంలో వుండే కమలాదేవి దంపతులు 1947లో షెనాయ్ నగర్ వెళ్ళారు. అప్పటినుంచి కమాలాదేవి అక్కడే ఉంటోంది.

ఆటలు

1947లో సరదాగా ఆమె బిలియర్డ్స్ నేర్చుకుంది. ఇంకో కథనం ప్రకారం 54 సంవత్సరాల వయసులో తొలిసారిగా స్నూకర్ ఆడటం ప్రారంభించింది[2]. 1956లో ఆస్ట్రేలియా ఛాంపియన్ బాబ్ మార్షల్ తో బెంగళూరులో తలపడింది. ఆ తరువాత అఖిలభారత ఛాంపియన్ సెల్వరాజ్ తో క్వార్టర్ ఫైనల్ లో పోటీపడింది. 1994, 1995లలో బెంగళూరులో జరిగిన స్నూకర్ పోటీలలో విజేతగా నిలిచింది. తిరిగి 1994లో ఓపెన్ బిలియర్డ్స్, స్నూకర్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లోనూ విజేతగా నిలిక్చింది. జమ్మూలో జరిగిన జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో కూడా ఈమె ఆడింది. బిలియర్డ్స్ ఆడి, విజేత అయిన మొదటి భారత స్త్రీ, కమలాదేవి. బిలియర్డ్స్ ఆటలో 1991లో జెంషెడ్ పూర్ లో, ఆ తరువాత 1995 బెంగుళూరులో జరిగిన జాతీయస్థాయి పోటీలలో విజేతగా నిలచింది. దాదాపు 80 సంవత్సరాల వయసులో ఇప్పటికీ స్నూకర్ పోటీలలో పాల్గొంటుంది[3].

ఇతర విశేషాలు

సినిమాల జాబితా

కమలాదేవి దాదాపు 50 తెలుగు, తమిళ సినిమాలలో నటించింది[2]. ఈ జాబితా అసమగ్రము.

నటిగా
సంవత్సరముసినిమాభాషపాత్ర
1941దక్షయజ్ఞంతెలుగురోహిణి
1941చూడామణితెలుగు
1942బాలనాగమ్మతెలుగుమందుల మాణిక్యం
1942సీతారామ జననం[5]తెలుగుఅహల్య
1943గరుడ గర్వభంగంతెలుగు
1945మాయలోకంతెలుగు
1946ముగ్గురు మరాఠీలు[6]తెలుగు
1947కంజన్తమిళంమరగతం
1949గుణసుందరి కథతెలుగుపార్వతీ దేవి
1951మల్లీశ్వరితెలుగుఇష్టసఖి జలజ
1951పాతాళభైరవితెలుగు
1951చంద్రవంకతెలుగు
1952పల్లెటూరుతెలుగు
1954తోడుదొంగలుతెలుగురాముని భార్య
1954చక్రపాణితెలుగుమనవరాలు
1956తెనాలి రామకృష్ణతెలుగు
1958పార్వతీ కళ్యాణంతెలుగు
1967కంచుకోటతెలుగు
1968అసాద్యుడుతెలుగు
1968బంగారు పంజరంతెలుగు
1968బంగారు సంకెళ్లుతెలుగు
1969కథానాయకుడుతెలుగు
1970పెత్తందార్లుతెలుగు
1970పెళ్లి కూతురుతెలుగు
1975అభిమానవతితెలుగు
నేపథ్యగాయనిగా

మూలాలు

వనరులు, లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.