ప్రముఖ కవి From Wikipedia, the free encyclopedia
జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఆగస్టు 4, 1912 - జూన్ 21, 1992) 20వ శతాబ్దంలో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు.
కరుణశ్రీ గారి అత్యంత ప్రముఖ కావ్యాలు "పుష్పవిలాపము", "కుంతి కుమారి" అని అనవచ్చును. ఈయన కవితాత్రయము అయిన 'ఉదయశ్రీ', 'విజయశ్రీ',, 'కరుణశ్రీ' అత్యధిక ముద్రణలు కలిగి, ఎనలేని ఖ్యాతి గాంచినవి. పై మూడింటిని తన సున్నిత హృదయము, తర్కమునకుప్రతీక అయిన తన మెదడు,, తన విలువైన జీవితమని అభివర్ణిస్తారు. ఈ మూడు రచనలు, కరుణశ్రీ గారి ప్రకారము సత్యం, శివం,, సుందరం యొక్క రూపాంతరాలుగా పరిగణిస్తారు.
ఈయన కవిత్వము పాఠకులని ఆత్మజ్ఞాన శిఖరాంచులనే కాక సమాజాంతరళాలలోని దుఃఖాన్ని, వాటికి కారణాలని, పరిష్కార మార్గాలని కూడా చూపుతాయి. మనుషులలో ఉత్తమ మార్పుకై, సమాజములో శాంతికై, నైతిక విలువ అను సంపద్వృద్ధికై తన కవిత్వాన్ని వినియోగించారు. ఆందునే ఈనాటికి వారి పద్యాలు జనుల నోటిలో నానుతూనే ఉన్నాయి.
జంధ్యాల పాపయ్య శాస్త్రి | |
---|---|
జననం | జంధ్యాల పాపయ్య శాస్త్రి ఆగస్టు 4, 1912 గుంటూరు జిల్లా, పెదనందిపాడు మండలం, కొమ్మూరు |
మరణం | జూన్ 21, 1992 |
ఇతర పేర్లు | కరుణశ్రీ |
వృత్తి | 20 సం.ల పాటు జంధ్యాల పాపయ్య శాస్త్రి లెక్చరర్ |
ప్రసిద్ధి | సాహిత్యం. |
మతం | హిందూ |
తండ్రి | పరదేశయ్య |
తల్లి | మహాలక్ష్మమ్మ |
కరుణశ్రీ గుంటూరు జిల్లా, పెదనందిపాడు మండలములోని కొమ్మూరు గ్రామములో 1912, ఆగస్టు 4న జన్మించారు. తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి పరదేశయ్య. కొమ్మూరులో ప్రాథమిక, మాగద్యమిక విద్య చదివిన పాపయ్యకు సంస్కృత భాషపై మక్కువ పెరిగింది. భమిడిపాటి సుబ్రహ్మణ్యశర్మ, కుప్పా ఆంజనేయశాస్త్రి వద్ద సంస్కృత కావ్యాలు చదివారు. రాష్ట్ర భాషా విశారద, ఉభయ భాషా ప్రవీణ, హిందీ భాషా ప్రవీణ పరీక్షలలో ఉత్తీర్ణుడై అమరావతి రామకృష్ణ విద్యాపీఠములోనూ, గుంటూరు స్టాల్ గర్ల్స్ హైస్కూలులోనూ, ఆంధ్ర క్రైస్తవ కళాశాలలోనూ అధ్యాపకునిగా పనిచేశారు.
వీరి కలం పేరు ‘కరుణశ్రీ’. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, ఉమర్ ఖయ్యూం వీరి రచనలు. కుంతి కుమారి, పుష్పవిలాపం (ఘంటసాల గానం చేశారు) మొదలైన కవితా ఖండికలు బహుళ జనాదరణ పొందాయి. 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు. మృదుమధురమైన పద్య రచనా శైలి వీరి ప్రత్యేకత. జూన్ 22, 1992లో పాపయ్యశాస్ర్తి పరమపదించారు.
ఈయన రాసిన పుష్పవిలాపం నుంచి రెండు పద్యాలు.
సీ|| నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
ప్రాణము తీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
మానసమం దెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై
ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచు_కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేని వారు మీ యాడువారు
తెలుగు అకాడెమి పురస్కారము - 29 ఏప్రిలు, 1985 (మద్రాసు)
రసమయి పురస్కారము - 1987 జూన్ 27 (హైదరాబాదు)
ఆభినందన పురస్కారము - 1987 సెప్టెంబరు 21 (హైదరాబాదు)
శుభాంగి పురస్కారము - 1989 జనవరి 27 (హైదరాబాదు)
ఆభిరుచి పురస్కారము - 9 ఏప్రిలు 1989 (ఒంగోలు)
నలం కృష్ణరాయ పురస్కారము - 17 ఏప్రిలు 1989 (బాపట్ల)
సింధూజ పురస్కారము - 1989 నవంబరు 8 (సికిందరాబాదు)
డా|| పైడి లక్ష్మయ్య పురస్కారము - 1989 జూన్ 24 (హైదరాబాదు)
మహామంత్రి మాదన్న పురస్కారము - 1990 మార్చి 16 (హైదరాబాదు)
యార్లగడ్డ రంగనాయకులు పురస్కారము - 1990 అక్టోబరు 26 (మద్రాసు)
డా|| బూర్గుల రమకృష్ణారావు పురస్కారము - 1991 మార్చి 13 (హైదరాబాదు)
- "సుభాషిణి" అను మాసపత్రికకు 1951-1953 కాలములో సంపాదకునిగా పనిచేసారు.
- జాతీయ రచయితల గోష్ఠి (క్రొత్త ఢిల్లె, 1961 జనవరి 24) లో పాల్గొన్నారు
- పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా గారి "దైవ సన్మానము", 1972 సెప్టెంబరు 25న పుట్టపర్తిలో.
- ప్రత్యేక సభ్యత్వము, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి, 1977 జనవరి 29న హైదరాబాదులో.
- బంగారుపుష్ప సన్మానము, పుత్తడి కంకణధారణా సన్మానము, 1982 జూన్ 27న విజయవాడలో.
- ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి పురస్కారము, 1983 జనవరి 30న.
- "మెన్ ఆఫ్ లెట్టెర్స్" సభ్యత్వం, 1984 ఏప్రిల్ 1న.
- గౌరవ రాష్ట్రపతి శ్రీ జ్ఞాని జైల్ సింఘ్ చేతులమీదుగా సన్మానము, 1987 ఏప్రిల్ 25న.
- "ఊదయశ్రీ" స్వర్ణోత్సవం,, "విజయశ్రీ", "కరుణశ్రీ"ల రజతోత్సవము, గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నం. తా. రామారావుగారి చేతులమీదుగా, 27 జూన్, 1987న.
- "తెలుగు బాల" అను పుస్తకము 1,25,000కు పైగా ప్రతులు, 50,000కు పైగా ఉదయశ్రీ, 25,000కు పైగా విజయశ్రీ, కరుణశ్రీ ప్రతులు అమ్ముడయినాయి.
- "ఫుష్పవిలాపము", "కుంతికుమారి",, "ఆనంద లహరి" కావ్యములు ఆంగ్లములోనికి డా|| అమరేంద్ర గారు, హిందీ లోనికి డా|| సూర్యనారాయభాను గారు అనువదించారు.
- గానగంధర్వులు ఘంటసాల వేంకటేశ్వరరావు గారు "అద్వైత మూర్తి", "సంధ్యశ్రీ", "పుష్పవిలాపము", కుంతికుమారి", "అంజలి", "కరుణామయి",, "ప్రభాతి" కావ్యములను గానము చేసారు.
- "భువన విజయము" నాటకములో ముక్కు తిమ్మనగాను, "భారతావతరణము" నాటకములోలో నన్నయ్యగాను, "ఇందిరమందిరము" నాటకములో చేమకూర వేంకట కవి గాను,, "బ్రహ్మసభ" నాటకములో పోతన గాను పాత్రధారణ చేసారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.