ఇబ్రాహీం కులీ కుతుబ్ షా
From Wikipedia, the free encyclopedia
ఇబ్రహీం కులీ కుతుబ్‌షా వలీ గోల్కొండను పాలించిన కుతుబ్‌షాహీ వంశానికి చెందిన మూడవ నవాబు. ఈయన 1550 నుండి 1580 వరకు గోల్కొండను పరిపాలించాడు.
ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ | |
---|---|
పరిపాలన | 1550–1580 |
మరణం | జూన్ 2,1580 |
ఇంతకు ముందున్నవారు | సుభాన్ కులీ కుతుబ్ షా |
తరువాతి వారు | మహమ్మద్ కులీ కుతుబ్ షా |
రాజకుటుంబము | గోల్కొండ కోట |
ప్రవాస జీవితం
1543లో ఇబ్రహీం సోదరుడు, జంషీద్ కులీ కుతుబ్ షా, తండ్రిని చంపి, సోదరుని కళ్ళు పీకేసి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. పద్నాలుగేళ్ల వయసులో ఇబ్రహీం కులీ కుతుబ్ షా, దేవరకొండ కోట నుండి తప్పించుకొని బీదర్ చేరుకుని అలీ బరీద్ ఆశ్రయంలో కొన్నాళ్లున్నాడు. ఇబ్రహీం ఏనుగులను, ధనాన్ని కొంత అలీ బరీద్ కాజేయటంతో ఇద్దరి మధ్య అభిప్రాయలేర్పడి, ఇబ్రహీం విజయనగరానికి చేరుకొని రామరాయలను ఆశ్రయించాడు. అక్కడ ఏడేళ్ల పాటు రాజ అతిధిగా జీవించాడు.[1] రామరాయలు ఇబ్రహీం కులీకి ఒక జాగీరును కూడా ఇచ్చాడు. రామరాయల భార్య ఈయన్ను సొంత కొడుకుగా భావించి షెహజాద్ అని పిలిచేది. విజయనగరంలో ఉండగా తెలుగు భాషపై అభిమానం పెంచుకున్నాడు. తరువాత తన పాలనాకాలంలో తెలుగు భాషను ఆదరించి, కవులను పోషించాడు.
రాజ్య సంక్రమణ
1550లో జంషీద్ కులీ కుతుబ్ షా మరణించిన తర్వాత ఏడు సంవత్సరాల బాలుడు సుభాన్‌ను రాజు చేశారు. రాజమాత బిల్కిస్ జమాన్ కోరిక రాజ్యవ్యవహారాలు చూసుకోవటానికి ఐనుల్ ముల్క్‌గా అహ్మద్‌నగర్ నుండి సైఫ్ ఖాన్‌ను గోల్కొండకు పంపించారు. అయితే సైఫ్ ఖాన్ అధికారం మొత్తం తన చేతుల్లోకి తీసుకొని తనే రాజు అవ్వాలనే రాజ్యకాంక్ష పెంచుకున్నాడు. ఇది భరించలేక ముస్తఫా ఖాన్ వంటి కొందరు అధికారులు విజయనగరంలో ఉన్న ఇబ్రహీం కులీకి గోల్కొండకు తిరిగివచ్చి రాజ్యాన్ని చేపట్టవలసిందిగా రహస్య వర్తమానాన్ని పంపారు.
అప్పట్లో గోల్కొండ రాజ్యంలోని కోటలను రక్షించడానికి నాయక్వారీలనే హిందూ సైనికదళముండేది. వారి నాయకుడు జగదేవరావు ధైర్యవంతుడు, చురుకైనవాడు. గోల్కొండలో ఉన్న జగదేవరావు, రాజ్యపాలన పట్టు జారిపోవటము, సైఫ్ ఖాన్ పాలనపై ఉన్న అసంతృప్తిని గమనించి, ఇదే అదనుగా పిచ్చి యువరాజుగా పేరొందిన దౌలత్ ఖాన్ (కులీ కుతుబ్‌షా యొక్క మరో కుమారుడు) ను నామమాత్రపు సుల్తానును చేసి అధికారం చేజిక్కించుకోవాలనుకున్నాడు. ఈ పన్నాగాన్ని పసిగట్టిన సైఫ్‌ఖాన్ జగదేవరావును గోల్కొండ కోటలో బంధించాడు.
గోల్కొండ సేనానులు ఇబ్రహీంను రాజ్యం చేపట్టడానికి రావలసిందిగా ఆహ్వానించారు కానీ ఇబ్రహీంకు సైఫ్‌ఖాన్‌ను ఎదుర్కొనేందుకు సైనిక సహాయం కావలసి ఉంది. అటువంటి సహాయం కేవలం నాయక్వారీల నుండి కానీ విజయనగరం రాజునుండి కానీ అందగలదు. విజయనగరం రాజు నుండి సహాయం తీసుకోవటానికి వారు ఇష్టపడలేదు. ఇక నాయక్వారీల నాయకున్ని సైఫ్‌ఖాన్ బంధించడంతో వాళ్లను సైఫ్ ఖాన్ వ్యతిరేకంగా కూడగట్టడానికి అట్టే సమయం పట్టలేదు. నాయక్వారీలతో ఒప్పందం కుదరగానే ఇబ్రహీం విజయనగరం నుండి బయలుదేరి గోల్కొండ రాజ్యపు సరిహద్దులలో కోయిలకొండలో ముస్తఫా ఖాన్, సలాబత్ జంగ్ తదితర సేనానులను కలుసుకొని, కోయిలకొండలోని నాయక్వారీ సైన్యంతో గోల్కొండ వైపు కదిలాడు. ఇబ్రహీం వస్తున్నాడన్న వార్త అందగానే గోల్కొండ కోటలోని నాయక్వారీలు తిరగబడి, సుభాన్ కులీని బంధించి, [2] జగదేవరావును చెరనుండి విడిపించారు. అలా నాయక్వారీలు, ఇతర సేనానుల మద్దతుతో ఇబ్రహీం, సైఫ్ ఖాన్ ను ఓడించి, గోల్కొండను చేజిక్కించుకున్నాడు. యుద్ధంలో ఓడిపోయిన సైఫ్‌ఖాన్ పారిపోయి బీదరులో తలదాచుకున్నాడు. కోటలోకి అడుగుపెట్టి ఇబ్రహీం 1550, జూలై 27న ఇరవై యేళ్ల వయసులో ఇబ్రహీం కులీ కుతుబ్‌షాగా పట్టాభిషిక్తుడయ్యాడు.
తనకు సహాయం చేసిన జగదేవరావును ప్రధానమంత్రిగా నియమించాడు. అయితే కొంతకాలానికి జగదేవరావు ఇబ్రహీం కులీని గద్దెదించి యువరాజు దౌలత్ ఖాన్‌ను సుల్తాను చేసేందుకు పథకం వేశాడు. అది ఇబ్రహీం కులీ కుతుబ్‌షాకు తెలియగానే పాలుపంచుకొన్నవారందరిని హతమార్చాడు. జగదేవరావు బేరారుకు పారిపోయి అక్కడ ఆశ్రయం పొందాడు. 1556లో ఎలగందల్పై దాడిచేశాడు కానీ కుతుబ్‌షా తిప్పికొట్టాడు.[2] జగదేవరావు తన కలలు సాకారం చేసుకోవటానికి బేరారు సరిపోదని గ్రహించి ఒక చిన్న బృందంతో విజయనగరానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో గోల్కొండ రాజ్యం గుండా వెళుతూ అనేక గ్రామాలను నేలమట్టం చేశాడు. ఆయన్ను ఎదిరించడానికి కుతుబ్‌షా ముస్తఫాఖాన్ ను పంపించాడు. ముస్తఫాఖాన్ చేతిలో ఖమ్మంమెట్టు వద్ద ఓడిపోయి జగదేవరావు విజయనగరంలో ఆశ్రయం పొందాడు.
తళ్ళికోట యుద్ధం/బన్నీ హట్టి యుద్ధం / రాక్షస తంగేడి యుద్ధం
1565లో బహుమనీ సుల్తానులతో కలిసి సమైక్యంగా విజయనగర సామ్రాజ్యంపై యుద్ధం చేశాడు. తళ్ళికోట యుద్ధంలో యవ్వనంలో తనకు ఆశ్రయమిచ్చిన ఆళియ రామరాయలును స్వయంగా సంహరించినట్లు భావిస్తారు. ఈ యుద్ధంలో పాలుపంచుకున్న రాజ్యాలు :బీదర్, బీజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ
కళాపోషణ
కళాపోషకుడిగా ఇబ్రహీం సభలో అనేకమంది కవులకు ఆశ్రమమిచ్చాడు. అందులో పొన్నగంటి తెలగనార్యుడు రచన : యయాతి చరిత్ర (ఇది అచ్చ తెలుగులో రాసిన కావ్యం), , కందుకూరి రుద్రకవి (రచన :తొలి యక్షగానం:- సుగ్రీవ విజయం), నిరంకుశోపాక్యానం , జనార్దనాష్టకం [[అద్దంకి గంగాధరుడు తను వ్రాసిన తపతీ సంవరణోపాఖ్యానమనే ప్రబంధ కావ్యాన్ని ఇబ్రహీం కులీకి అంకితమిచ్చాడు]]. ఈయన్ను తెలుగు కవులు మల్కీభరాము, అభిరామగా అని వ్యవహరించేవారు. సాంప్రదాయంగా వస్తున్న అరబ్బీ, పారశీక కవులతో పాటు తెలుగు కవులను కూడా పోషించాడు. ఇబ్రహీం కులీ ప్రజా సంక్షేమంపై శ్రద్ధవహించాడు. అప్పటివరకు ఇటుకలు, మట్టితో కట్టి ఉన్న గోల్కొండ కోటను రాళ్లు, సున్నంతో కట్టించి కోటను దృఢపరిచాడు. తన అల్లుడు హుస్సేన్ వలీ ఖాన్ పేరు మీద హుస్సేన్ సాగర్ సరస్సును నిర్మింపజేశాడు, ఇబ్రహీంభాగ్ ను అభివృద్ధి పరచాడు. గోల్కొండ కోటలోని మక్కా దర్వాజాపై చెక్కబడిన ఒక శాసనంలో అత్యంత మహోన్నతమైన చక్రవర్తిగా కీర్తించబడ్డాడు. ఇబ్రహీం కులీ షియా మతస్థుడైనా పరమతసహనం పాటించాడు. ఇబ్రహీం కులీ, భాగీరథి అనే తెలుగు వనితను వివాహమాడినాడు. కొంతకాలం అస్వస్థత తర్వాత ఇబ్రహీం కులీ 1580లో మరణించాడు.
వారసులు
1580లో ఇబ్రహీం కులీ చనిపోయేనాటికి ఆరుగురు కుమారులు జీవించి ఉన్నారు. అందులో పెద్దవాడు అబ్దుల్ ఖాదిర్, రెండవ యువరాజు హుస్సేన్ కులీ ఇరవై యేళ్ల వయసువాడు. హుస్సేన్ కులీ చక్రవర్తి కావటానికి మీర్ జుమ్లా తాబా తాబా వంటి అనేకమంది శక్తివంతమైన సేనానులు మద్దతు ప్రకటించారు. అయితే రాయరావు ఆధ్వర్యంలో ఒక దక్కనీ సేనానుల వర్గం, ఒక పన్నాగం ప్రకారం మూడవ కుమారుడైన మహమ్మద్ కులీని సింహాసనమెక్కించారు. అప్పటికి మహమ్మద్ కులీ వయసు పదిహేనేళ్లే. మహమ్మద్ కులీ హిందూ తల్లికి పుట్టినందున రాయరావు మద్దతిచ్చి ఉండవచ్చు.
నిర్మాణాలు
- మౌలాలి గుట్ట ఉన్న మౌలాలి దర్గా (హజ్రత్ అలీ బాబా దర్గా)[3]
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.