జంషీద్ కులీ కుతుబ్ షా
From Wikipedia, the free encyclopedia
Remove ads
From Wikipedia, the free encyclopedia
జంషీద్ కులీ కుతుబ్ షా (? - 1550), గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీ వంశానికి చెందిన రెండవ సుల్తాను. ఈయన 1543 నుండి 1550 వరకు పాలించాడు. జంషీద్ కులీ కుతుబ్ షా గోల్కండ రాజ్యపు తొలి స్వతంత్ర పాలకునిగా చెప్పుకోవచ్చు. షా అన్న బిరుదము చేర్చుకొని, గోల్కొండ టంకశాల నుండి సొంత పేరు మీద నాణేలు ముద్రింపజేసిన తొలి కుతుబ్‌షాహీ సుల్తాను కూడా ఈయనే. చరిత్రలో కౄరునిగా చాలా ప్రసిద్ధి చెందినా, రాజ్యాన్ని పఠిష్టపరచి సమర్ధవంతమైన పాలకునిగా రణరంగంలోనూ, దౌత్యరంగంలోనూ నిరూపించుకున్నాడు.[1]
జంషీద్ తండ్రి, సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్, గోల్కొండ సామ్రాజ్యాన్ని స్థాపించి ఆంధ్ర దేశాన్నంతటిని పరిపాలించిన తొలి ముస్లిం పాలకుడయ్యాడు. సుల్తాన్ కులీకి ఆరుగురు కుమారులు. పెద్దవాడు హైదర్ ఖాన్ సుల్తాన్ కులీ కాలంలోనే మరణించాడు. రెండవ వాడైన కుతుబుద్దీన్ యువరాజుగా నియమించబడ్డాడు. మూడవ కుమారుడైన జంషీద్ కులీ, సోదరుడు కుతుబుద్దీన్ కళ్లు పీకేశాడు. జంషీద్ కుతుబుద్దీన్ ను చంపేందుకు ప్రయత్నించాడని సుల్తాన్ కులీ జంషీద్‌ను బంధింపజేశాడు. తనను బంధించినందుకు ప్రతీకారంగా సుల్తాన్ కులీని చంపేందుకు గోల్కొండ ఖిలాదారు మీర్ మహమ్మద్ హమిదానీని పురమాయించాడు. సుల్తాన్ కులీ కోటలోని జామీ మసీదులో ప్రార్థన చేస్తుండగా 1543 సెప్టెంబరు 4న హత్యచేయబడ్డాడు. ఈ విధంగా జంషీద్ సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు కానీ అందరి దృష్టిలో గౌరవహీనుడయ్యాడు.[2] జంషీద్ మరో సోదరుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా, విజయనగరానికి పారిపోయి రామరాయలను ఆశ్రయించాడు.
ఏడేళ్ల పాలనలో చాలాభాగం దక్కన్ సుల్తానులతో పరస్పర కలహాలతోనే గడచింది. అనేకసార్లు ఆదిల్షా, బరీద్‌షాకు వ్యతిరేకంగా ఇమాద్‌షా, నిజాంషాల కూటమికి మద్దతునిచ్చాడు. పాలనా వ్యవస్థను మెరుగుపరచాడు. పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఇరవై రెండు సర్కారులు, జిల్లాలుగా విభజించాడు. సాంస్కృతిక చరిత్రలో జంషీద్ కులీ కుతుబ్ షా పాలనాకాలం ఎలాంటి విలువైన శిల్పకళాభివృద్ధి జరగడానికి వీలులేని అస్తవ్యస్త సమయంగా చిత్రీకరించబడింది. జంషీద్ పాలన కాలంవని చెప్పడానికి ఎలాంటి నిర్మాణాలు కానీ శాసనాలు కానీ కనుగొనబడలేదు. చరిత్రకారులు ఈయన చేపట్టినవి చెప్పబడిన నిర్మాణాలేవి లేవు. ఈయన సంబంధించినదని చెప్పబడుతున్న సమాధి మందిరం కూడా ఈయన సమాధి ఉన్నదని కానీ, దాన్ని జంషీద్ స్వయంగా కట్టించాడనడానికి కానీ కచ్చితమైన ఆధారాలు లేవు.[1]
జంషీద్ గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించగానే బీదర్ సుల్తాను అలీ బరీద్ గోల్కొండపై దండయాత్ర చేశాడు. గోల్కొండ కోటకు ఏడు మైళ్ళ దూరంలో ఉండగా ఆ విషయాన్ని తెలుసుకొన్న జంషీద్ కులీ వెంటనే సైన్యాన్ని కూడగట్టుకొని మెరుపువేగంతో బీదర్ వైపు సైన్యాన్ని కదిలించాడు. ఈ పైఎత్తు ఫలించి అలీ బరీద్ తన రాజధానిని రక్షించుకోవటానికి సేనలను గోల్కొండ నుండి వెనక్కు మరలించాడు. అలీ బరీద్ ముప్పు శాశ్వతంగా వదిలించుకోవటానికి జంషీద్ కులీ బీజాపూరు సుల్తాను ఇబ్రహీం ఆదిల్‌షాతోనూ, అహ్మద్‌నగర్ నవాబు బుర్హాన్ నిజాంషాతో చేతులు కలిపాడు. ఆ సుల్తానులు బీదరుపై ఉన్న పాత కక్షల వల్ల అందుకు సంతోషంగా సమ్మతించారు. బుర్హాన్ నిజాంషా బీదరు ఆధీనంలో ఉన్న కంధార్ (నాందేడ్ జిల్లా) ను ఆక్రమించుకొన్నాడు. అలీ బరీద్, ఆదిల్షాను సహాయం అర్ధించడానికి వస్తే ఆయన్ను బంధించి, ఆదిల్షా బీదరు రాజ్యం యొక్క దక్షిణ భాగాన్ని మొత్తం ఆక్రమించుకున్నాడు. అలీ బరీదును సమర్ధవంతగా గద్దె దించారు కానీ ఆ తర్వాత పరిస్థితులు మరిన్నీ ఎత్తులు, పైఎత్తులు, జిత్తులకు దారితీసాయి.
ఆదిల్షా ఆక్రమించుకొన్న బీదరు ప్రాంతాల మూలంగా ఆయనకు నిజాంషా కంటే కొంత పైచేయి అయ్యింది. ఈ విషయాన్ని నిరసించిన నిజాంషా, ఆదిల్షాను చికాకు పెట్టేందుకు, ఆదిల్షాకు ఆధీనంలో ఉన్న షోలాపూరు కోటపై దండెత్తాడు. ఇద్దరి బలాలు సమానంగా ఉండటంతో ఇబ్రహీం ఆదిల్షా తనకు మద్దతుగా జంషీద్ కులీని సహాయాన్ని కోరాడు. జంషీద్ అందుకు అంగీకరించాడు కానీ, ప్రతిగా అలీ బరీద్ ను విడుదల చేయాలని షరతు పెట్టాడు. ఆదిల్షా, అలీ బరీదును విడుదల చేసిన వెంటనే, జంషీద్ ఆదిల్షాకు సహాయం చేయకుండా బీదరు వెళ్లి అలీ బరీదును ఏ సింహాసనం నుండైతే తను పూనుకొని దించాడో మళ్లీ అదే సింహాసనం ఎక్కించాడు. దీనితో పరిస్థితి యధాస్థితికి చేరుకొని బీజాపూరు, అహ్మద్‌నగర్ మధ్య వైషమ్యాలు కొన్నాళ్ళు చల్లబడ్డాయి.
జంషీద్ ఎప్పుడైనా సిద్ధమే అని కయ్యానికి కాలుదూసే సుల్తాను. ధైర్యశాలి. దక్కను సుల్తానుల మధ్య గొడవల్లో అవసరమైన దానికంటే ఎక్కువగానే తలదూర్చేవాడు. ఈయన పాలనాకాలంలో బీదరు, బీజాపూరు, అహ్మద్‌నగర్ మధ్యన జరిగిన అనేక గొడవల్లో స్వయంగా పాల్గొన్నాడు. ఈయన దౌత్య చతురతతో ఎప్పుడూ గెలిచే పక్షం వైపునే ఉండేవాడు. ఈయన కవి కూడా.
ఈయన మరణించే ముందు రెండు సంవత్సరాల పాటు కాన్సర్‌కు గురయ్యాడు. క్రమంగా క్షీణించి కాన్సర్ బాధను మరిపించేందుకు విలాసాలకు బానిసయ్యాడు. ఈయన ఆరోగ్యంగా ఉన్న రోజుల్లోనే కౄరునిగా పేరొందాడు. కాన్సర్ బాధ కౄరత్వాన్ని మరింత ప్రజ్వలింపజేసి తన పాలనలోని చివరి రోజులు అందరికీ వణుకు పుట్టించే విధంగా సాగాయి. చిన్న చిన్న నేరాలకు కూడా చాలామందికి పెద్ద శిక్షలు వేశాడు. ఏడేళ్ల పాటు పాలించిన జంషీద్ 1550లో మరణించాడు. ఈయన మరణం తర్వాత, జంషీద్ కులీ కుతుబ్‌షా యొక్క ఏడేళ్ల కొడుకు సుభాన్ కులీని గద్దెనెక్కించారు. ఆ తదనంతర పరిస్థితులు అనుకూలించడం వళ్ళ, విజయనగరంలో ప్రవాసంలో ఉన్న ఇబ్రహీం కులీ గోల్కొండకు తిరిగివచ్చి సింహాసనాన్ని అధిష్టించాడు.
కుతుబ్‌షాహీ సమాధిమందిరాల్లో ఈయన సమాధిమందిరంగా భావించబడుతున్న సమాధిమందిరం విశిష్టమైనది. అష్టభుజాకారంగా రెండు అంతస్తులతో తన తండ్రి సమాధికి ఆగ్నేయదిశలో ఉంది. ఒక్కో అంతస్తు చుట్టూ పిట్టగోడలున్నాయి. రెండవ అంతస్తులో ఒక్కో మూలన ఒక చిన్న స్థంబాకార గోపురమున్నది. రెండంతస్థుల పైన ఉన్న పెద్ద గుమ్మటం మాత్రం ఇతర కుతుబ్‌షాహీ సమాధుల శైలిలోనే ఉంది. సమాధి మందిరం లోపల మూడు సమాధులున్నవి. అందులోని పెద్ద సమాధి సుల్తానుది.[3][4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.