From Wikipedia, the free encyclopedia
చిత్రలేఖన చరిత్ర (ఆంగ్లం: History of Painting) అనగా చిత్రలేఖనం యొక్క చరిత్ర. ప్రపంచం లోనే (ఇప్పటివరకు తెలిసిన) మొట్టమొదటి చిత్రలేఖనాల నుండి నేటి వరకు వివిధ కళాఖండాలు, పలువురు చిత్రలేఖకులు, వీరి ఈ చిత్రలేఖనం వెనుక ఉన్న వాస్తవాలు వంటి వాటిని చర్చించే అంశం. చిత్రలేఖన చరిత్ర వివిధ సంస్కృతులు, భౌగోళిక ఖండాలు, శతాబ్దాల గుండా ప్రయాణిస్తూ 21వ శతాబ్దం వరకూ చేరుకొంది.[2]
కొన్ని దశాబ్దాల క్రితం పాశ్చాత చిత్రలేఖనం లో, తూర్పు భౌగోళిక చిత్రలేఖనంలో అభివృద్ధి సమాంతరంగా ఉండేది.[3] ఆఫ్రికన్ చిత్రకళ, యూదుల చిత్రకళ, ఇస్లామిక్ చిత్రకళ, ఇండోనేషియన్ చిత్రకళ, భారతీయ చిత్రకళ, చైనీస్ చిత్రకళ, జపనీస్ చిత్రకళ అన్ని పాశ్చాత చిత్రకళ పై, పాశ్చాత్య చిత్రకళ తిరిగి వీటన్నిటి పై ప్రభావం చూపింది.[4][5][6] మధ్య యుగాల నుండి రినైజెన్స్ వరకు చిత్రకారులు చర్చి లకు, ధనిక వర్గాలకు పని చేసేవారు.[7] కళ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని తత్వవేత్తలు నిర్వచించటం మొదలు అయ్యింది. 19వ శతాబ్దం ప్రారంభంలో ఫ్రెంచి తత్వవేత్త విక్టర్ కజిన్ l’art pour l’art (Art for art's sake) నినాదాన్ని తీసుకువచ్చాడు. ఈ నినాదంతో కళను కేవలం సౌందర్యాన్ని సృష్టించటానికి, కళాదృష్టితో చూడాలి తప్పితే, కళకు సైద్ధాంతికంగా గానీ, నైతికంగా గానీ, సాంఘికంగా గానీ, రాజకీయపరంగా గానీ ఎటువంటి సమర్థన ఉండనవసరం లేదని తెలిపాడు.[8][9]
మానవుడు హోమో సాపియన్ స్థాయి చేరక ముందు చిత్రలేఖన సృష్టి చేసినట్టు దాఖలాలు లేవు.[10] హోమో సాపియన్ స్థాయిలో మనిషి అడవి దున్న, జింక వంటి చిత్రలేఖనాలు గూహలలో చిత్రీకరించటం మొదలు అయ్యింది. 30,000 ఏళ్ళ క్రితం ఇటువంటి చిత్రలేఖనాలు ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా లలో కనుగొనబడ్డాయి. నైఋతి ఫ్రాన్సులో ఈ చిత్రలేఖనాలు అత్యధికంగానూ, అత్యుత్తమమైనవి గానూ గుర్తించబడ్దాయి. దాదాపు 150 గుహలు ఈ చిత్రలేఖనాలతో నింపివేయబడ్డాయి. ఈ గుహల గోడల, పైకప్పుల పై ఎరుపు, ముదురు గోధుమ, పసుపు రంగులతో చిత్రలేఖనాలు వేయబడి ఉన్నాయి. పొడిగా నూరబడ్ద ఖనిజాలు, బహుశా జంతువుల రక్తం, కొవ్వులతో కలిపి ఈ రంగులు చేయబడ్డట్టుగా తెలుస్తోంది. వీటితో క్రూర మృగాల మందలు, గుర్రాలు చిత్రీకరించబడ్డాయి. సాసరు (గుంతగా ఉన్న పళ్ళెం) వంటి రాళ్ళలో జంతువుల కొవ్వుతో దీపం పెట్టినట్టు తెలుస్తోంది. కార్బన్ డేటింగ్ పరీక్షలలో 17,000 సంవత్సరాల క్రితం నుండి 13,000 సంవత్సరాల క్రితం వరకు ఐరోపా ఖండంలో కేవ్ పెయింటింగులు ఉన్నత దశలో ఉన్నట్టు తేలింది. అయితే కేవలం జంతువులు మాత్రం చిత్రీకరించటం ఎందుకు జరిగింది అనే ప్రశ్నకు సరైన సమాధానం అంతు చిక్కటం లేదు. కేవలం అలంకారప్రాయం కాకుండా మతం, ఇంద్రజాలం వంటి అంశాల కోణంలో కూడా వీటి పై పరిశోధన జరుగుతూ ఉంది.
చిత్రకళలో గుర్తింపదగిన శైలిని మొట్టమొదట సృష్టించింది ఈజిప్టు నాగరికత.[10] పాదాలు, కాళ్లు, ముఖం ప్రక్క నుండి చూస్తే ఎలా ఉంటాయో అలా చిత్రీకరించటం, కానీ మొండెం, భుజాలు, చేతులు, కళ్ళు మాత్రం ముందు నుండి చూస్తే ఎలా ఉంటాయో అలా చిత్రీకరించటం ఈ శైలి ప్రత్యేకత. ఆశ్చర్యకరమైన ఈ శైలి దాదాపు అన్ని ఈజిప్టు చిత్రలేఖనాలలో చూడవచ్చును.
ఈ శైలి చిత్రకారుడికి సౌలభ్యంగా ఉండటం గమనార్హం. శరీరం లోని వివిధ భాగాలను ఏ కోణం నుండి వేయటం అత్యంత సులువో ముందుగానే నిర్ణయింపబడటం వలన చిత్రకారుడికి పని సులువు అవుతుంది.
ఈజిప్టు దేవాలయాలలో శ్మశానాలో సాధారణంగా చిత్రలేఖనాలు మృత్యువు తర్వాత వారు పరలోకాలకు చేసే ప్రయాణం యొక్క సంఘటనలు తెలుపుతూ చిత్రీకరించబడ్డాయి. ఈ ప్రయాణానికి కావలసిన పునీతమైన వివరాలను తెలియజేయటమే వీటి ప్రధాన ఉద్దేశం.
గ్రీస్‌లో ఉన్నత వర్గాల ఇళ్ళ పైకప్పులపై చిత్రలేఖనాలు ఉన్నాయి.[10] ఒక ఎద్దుకు ఇరువైపులా మనుషులు ఉండగా, ఎద్దుకు వెనుక వైపున ఉన్న మనిషి దానిని అదిలిస్తున్నట్టు ముందు వైపున ఉన్న మనిషి దానిని నియంత్రిస్తున్నట్టు, మూడో మనిషి ఎద్దు పైకి ఎక్కుతూ ఉన్నట్టు ఉండే చిత్రలేఖనం క్నోసోస్ ప్రదేశం లోని క్రెటాలో వెలువడింది.
గ్రీకు చిత్రలేఖనం హీరోయిక్ రియలిజం వైపు మళ్ళింది.[10] మానవ శరీరం కంటికి ఎలా కనబడుతుందో సరిగ్గా అలాగే చిత్రీకరించటం మొదలు అయ్యింది. అత్యంత సౌందర్యవంతులు, నాటకీయ సన్నివేశాలు చిత్రీకరించటం జరిగింది. చిత్రలేఖనం చేయబడ్డ కుండీలు చరిత్రకారులు వెలికి తీశారు. గ్రీకుల మధ్య ఇటలీ కళ పై తమదైన ముద్ర వేశారు.
ఈజిప్టులోని శ్మశాన పేటికలలో చిత్రలేఖనాలు ఉన్నాయి. వీటినే ఫయ్యూం పోర్ట్రెయిట్ లు అంటారు. రోమన్ ఈజిప్టులో పలువురి స్త్రీ పురుషుల చిత్రలేఖనాలు ఫయ్యూం పోర్ట్రెయిట్ లుగా చిత్రీకరించటం జరిగింది.
రోమన్ సంఘాలలో గోడలు, పైకప్పులు చిత్రలేఖనాలతో అలంకరించటం సాంప్రదాయంగా మారింది.[10]
మహాయాన బౌద్ధం బౌద్ధ సన్యాసులు/భక్తులను గుహల వైపు నడిపించింది. గుహల పైకప్పులు/గోడల పై బుద్ధుడి అది వరకు జన్మలు, అతని సాహసాలు చిత్రీకరించటం జరిగింది. భారత దేశం లోని అజంతా గుహలులో ప్రశాంతంగా ఉన్న బుద్ధుని చిత్రాల నుండి కిక్కిరిసిన జనం మధ్య ఉన్న బుద్ధుని వరకు అనేకానేక చిత్రలేఖనాలు ఉన్నాయి.[10] చైనా లోని దున్ హువాంగ్ ప్రాంతంలో కూడా బౌద్ధ చిత్రలేఖనాలు ఉన్నాయి.
చర్చిల పై కప్పు, గోడల పై క్రైస్తవ సంబంధిత చిత్రపటాలు మొదట బైజాంటీన్ రాజ్యంలో వేయబడ్డవి. ఈ చిత్రపటాలు స్వల్పకాలంలోనే గౌరవమర్యాదలు చూరగొన్నాయి. వీటిని ఎలా చిత్రీకరించాలి, (క్రీస్తు, మేరీ మాత, బోధకులు, ప్రవక్తలు, సన్యాసులు వంటి) పాత్రల క్రమం ఏమిటి అనే వాటి పై కఠినమైన నియమాలు ఉండేవి. నేపథ్యాలు బంగారు పూతలతో, విలాసవంతమైన దుస్తులతో, కిరీటాలతో, ప్రభలతో, గంభీర హావభావాలతో పవిత్రమైన బైజాంటీన్ చిత్రకళ అప్పటి క్రైస్తవ చిత్రకళకు మచ్చుతునక. ఆరాధ్యదైవాలుగా విలసిల్లిన ఈ చిత్రపటాలు 726వ సంవత్సరం నుండి విగ్రహ భంగానికి గురి అయ్యాయి. ఒక శతాబ్దం తర్వాత మరల వీటి చిత్రీకరణ పుంజుకొంది. మెల్లగా ఈ కళ బాల్కన్, రష్యా లకు పాకింది.
ఒక ధనిక ఇటాలియన్ వద్ద చిత్రకారునిగా పని చేస్తోన్న గియొట్టో డి బోండోని అనే చిత్రకారుడు తన చిత్రపటాలతో క్రైస్తవ పురాణాలను కళ్ళకు కట్టినట్టు వివరించాడు.[10] పాత్రల చిత్రీకరణ, నాటకీయ సన్నివేశాల వివరణలతో గియొట్టో వీక్షకులను కట్టి పడేసాడు. చిత్రపటాలలో లోతు, దృక్కోణం, వెలుగు-నీడలు వంటి అంశాలు ఒక వైపు అయితే, మానవ శరీరం, ముఖ కవళికలు చిత్రీకరించటంలో ఔన్నత్యం చూపటం మరొక వైపు.
14వ శతాబ్దానికి చెందిన సైమన్ మార్టిని నుండి 1416 లో ముగ్గురు లింబుర్గ్ సోదరల వరకు ఈ శైలి కొనసాగింది.[10] నాజూకైన, చక్కనైన, సంతోషకరంగా కనబడే, ధీమా గల, దైనందిన జీవితాన్ని ప్రతిబింబించే ఈ శైలి చిత్రలేఖనం యొక్క లక్షణాలు. జర్మనీ, బెల్జియం ల సరిహద్దు లకు చెందిన కళాకారులు రాజులు, వారి రాజప్రాసాదాలు, పనులు చేసుకొంటున్న రైతులను, పౌరాణికాలను ఈ శైలిలో చిత్రీకరించారు. ఈ శైలి చిత్రలేఖనంలో కళాకారునికి చోటు పై నియంత్రణ ఉంటుంది. మానవ చిత్రపటాలను చిత్రీకరించటంలో సహజత్వం, సారళ్యం కనబడుతుంది.
14వ శతాబ్దంలో పర్షియాలో ఉద్భవించిన పర్షియన్ మినియేచర్, ప్రధానంగా కాతిగం పై రమణీయ ప్రకృతి దృశ్యాల నడుమ చరిత్ర, యుద్ధం, శృంగారం వంటి వాటిని చిత్రీకరించటం జరిగింది. తర్వాతి కాలంలో ఈ కళ భారతదేశానికి కూడా విస్తరించింది.[10] ఈ సమయంలో ఆసియా, చైనా లను మంగోలియన్ పాలనలో ఉండేవి. పర్షియను కళ పై చైనీయుల ప్రభావం వలన ఈ కళ విస్తరించి ఉండ వచ్చును. తబ్రీజ్ నగరం అంతర్జాతీయ వాణిజ్య దారులకు కేంద్రంగా ఉండటం, 1392 లో తబ్రీజ్ నగరాన్ని క్రూరుడైన తైమూర్ లంగ్ హస్తగతం చేసుకోవటం, తైమూర్ కళాకారులను మాత్రం హింసించకపోవటం వలన ఇక్కడ క్యాలీగ్రఫీ, మినియేచర్ పెయింటింగ్ లు పరిఢవిల్లాయి. తైమూర్, అతని కుమారుడు షారుఖ్, బైసుంకుర్ మిర్జా కళను కళాకారులను పోషించారు. కళ పై వీరు బోధనాంశాలు, కళాశాలలు నెలకొల్పటానికి కృషి చేశారు. 15వ శతాబ్దంలో షారుఖ్ పాలనలో తబ్రీజ్ స్థానే హెరాత్ నగరం కళాదరణకు నోచుకొంది. అప్పటి కళాకారుడు కమాలుద్దీన్ బిహ్జాద అధీనంలో పర్షియన్ కళ కొత్త పుంతలు తొక్కింది. బిహ్జాద్ ఈ మినియేచర్ లో అనిమేషన్ సృష్టించి సఫావిద్ రాజవంశానికి ప్రీతిపాత్రుడయ్యాడు. బిహ్జాద్ శిష్యులు కొందరు ఉత్తర భారతదేశంలో వారి కళను పరిచయం చేశారు.
క్రీస్తు - అతని శిష్యుల మధ్య మానవీయ నాటకీయతను లియొనార్డో ఆవిష్కరించాడు.[10] . రంగును ఉపయోగించటంలో, వెలుగును చిత్రీకరించటంలో సున్నితత్వాన్ని తీసుకువచ్చాడు. రెండు వేర్వేరు వర్ణాలను ఒక గీత ద్వారా వేర్పరచటం కాకుండా, ఈ రెండు వర్ణాలు గీత అవసరం లేకుండా నే ఒక దానిలో ఒకటి కలిసిపోయేలా చేశాడు. దీనినే స్ఫుమాటోగా వ్యవహరించాడు. మోనా లీసాతో బాటు ఇతర కళాఖండాలను ఈ శైలిలో చిత్రకరించాడు.
1505 లో చిరునవ్వులు చిందిస్తూ ఫ్లారెన్స్ కు చెందిన ఫ్రాన్సెస్కో డెల్ జియొకొండో అనే ఒక పట్టు వర్తకుని భార్య అయిన లీసా ఘెరార్డినీను లియొనార్డో స్ఫుమాటో శైలిని ఉపయోగిస్తూ చిత్రీకరించాడు. ఆమె గుర్తింపు వలె, ఆమె నేపథ్యంలో ఉండే సన్నివేశం కూడా ఒక స్వప్నం లాగే ఉండేలా లియొనార్డో ఈ పోర్ట్రెయిట్ ను చిత్రీకరించాడు. 1517 లోఫ్రాన్సుకు చెందిన ఫ్రాన్సిస్ i లియొనార్డోను తమ ఆస్థాన చిత్రకారుడిగా ఆదరించినప్పటి నుండి, మోనా లీసా ఫ్రాన్సులో స్థిరపడింది. ఇప్పటి లూవర్ మ్యూజియంలో ఇంకా వీక్షకులను మంత్ర ముగ్థులను చేస్తూనే ఉంది.
సిస్టీన్ ఛాపెల్ మ్యూరల్ తో మిఖేలేంజీలో కీర్తిని అర్జించాడు. బహుశా ఈ మ్యూరల్ చిత్రలేఖనాలు 1495-1508 మధ్య చిత్రీకరించబడి ఉండవచ్చు. దైవము సృష్టిని ప్రారంభించటం, ఆడాన్ని సృష్టించటం, ఆడం/ఈవ్ లను ఈడెన్ గార్డెను నుండి వెలి వేయటం, ద లాస్ట్ జడ్జిమెంట్ వంటి సన్నివేశాలను మిఖేలేంజీలో కన్నుల పండుగగా చిత్రీకరించాడు. మిఖేలేంజీలో రంగుల వినియోగం, భంగిమల ఎంపిక మ్యానరిజం అనే క్రొత శైలికి బాటలు వేసింది.
వెనీసుకు చెందిన కళాకారులు మూర్తీభవించిన ప్రమాణం అయిన రినైజెన్స్ పై కృషి చేస్తుండగా, ఫ్లారెన్స్, రోంకు చెందిన కళాకారులు దీనికి ప్రతిస్పందనగా మ్యానరిజం అనే ఒక నూతన కళా ఉద్యమం మొదలు పెట్టారు.[10] రినైజెన్స్ లో అభివృద్ధికి తావు లేక పోవటంతో స్వీయ సృహ ధ్యేయంగా మ్యానరిజం ముందుకు సాగింది. రినైజెన్స్ - బరోక్ లకు మ్యానరిజం వంతెనగా వ్యవహరించింది. ఈ శైలి తర్వాతి కాలంలో ఫ్రాన్సు, నెదర్లాండ్స్, ప్రేగ్ లకు విస్తరించింది.
1555 లో పర్షియా బీహ్జాద్ శైలి చిత్రకారులను హుమయూన్ భారతదేశానికి రప్పించాడు. స్వయంగా తానే కాకుండా, యుక్త వయసులో ఉన్న అక్బర్ కు, సమకాలీన చిత్రకళాకారులకు వారి చే శిక్షణ ఇప్పించాడు. ఫలితంగా మొఘల్ శైలి ఉద్భవించింది. పర్షియన్ శైలిలో ఊహాజనితం, అలంకారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండగా, మొఘల్ శైలిలో వాస్తవికత పాళ్ళు ఎక్కువగా కనబడేవి. 1570 లో ఫతేపుర్ సిక్రీలో అక్భర్ వీటిని విస్తృతంగా అధ్యయనం చేశాడు.
సభా సన్నివేశాలు, ఉద్యాన వనాలు, వేటకు వదిలివేయబడ్డ చిరుతపులులు, దాడి చేయబడ్డ కోటలు, అంతులేని యుద్ధాలు అక్భర్ కు నచ్చిన కొన్ని చిత్రపటాలు. తనకు నచ్చినట్లు వేసిన చిత్రకారులను అక్బర్ సన్మానించి తగు పారితోషికాలను ఏర్పాటు చేసేవాడు.
అక్భర్ కుమారుడు జహంగీర్ తండ్రి నుండి ఈ కళను పుణికిపుచ్చుకొన్నా, అభిరుచిలో మాత్రం తేడా ఉండేది. తనకు నచ్చిన ఒక పక్షి యొక్క, లేదా తను రాజకీయంలో పాల్గొన్న ఏదో ఒక సన్నివేశాన్ని యథాతథంగా చిత్రీకరించబడటం ఇష్టపడేవాడు. స్పష్టత, స్థాపన, వివరణాత్మక వాస్తవికతకు పెద్దపీట వేశాడు.
రూబెన్స్, వాన్ డైక్ లు దక్షిణ నెదర్లాండ్స్ యొక్క చిత్రకళ మెళకువలకు అంతర్జాతీయ రాయబారులుగా వ్యవహరిస్తూ ఉండగా ఉత్తర ప్రావిన్సులు కూడా దృశ్య కళలు పై తమదైన ప్రభావాన్ని చూపటం ప్రారంభించాయి.[10] చిత్రకళా చరిత్రలోనే మొట్టమొదటి సారిగా కళను ఆదరించే మధ్య తరగతి కుటుంబాల విపణి పెరగ సాగింది. చిత్రకారులు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవటంతో వివిధ శ్రేణుల్లో చిత్రపటాలు కుప్పలు తెప్పలుగా చిత్రీకరించబడ్డాయి.
17వ శతాబ్దంలో డచ్ చిత్రకారులు స్పృశించని అంశం లేదు. ముఖచిత్రాలు, ప్రకృతి దృశ్యాలు, సముద్రపు దృశ్యాలు, (బైబిల) సంబంధిత) పౌరాణికాలు, చారిత్రక దృశ్యాలు, చిరుదీపాల వెలుగులో ఆగమ్యగోచర బాంధవ్యాలలో చిక్కుకొన్న కొన్ని ప్రత్యేక పాత్రలు, కోలాహలంగా కనబడే చావిళ్ళు, శీతాకాల సంబరాలు, స్టిల్ లైఫ్, మానవ ఉనికి లోని నిరుపయోగాన్ని తెలిపే చెడు ఉపమానాల వంటి అంశాలతో చిత్రలేఖనం జరిగింది.
రినైజెన్స్ తరాతి తరాల చిత్రకారులు సైతం కళలో ప్రేరణ కొరకు శాస్త్రీయ నమూనాలను పరిగణలోకి తీసుకోవటం జరిగింది. గొప్పవారు సైతం పురాతన శైలి దుస్తులను ఆదరించటం ప్రారంభించారు. యుద్ధవీరులు సైతం రోమ్‌లో మోకాళ్ళ వరకు లంగా వలె ఉండే చొక్కాలు ధరించారు.[10]
18వ శతాబ్దంలో కళలో శాస్త్రీయత పట్ల ఆసక్తి పెరిగింది. ఇటలీ లోని పాంపేలో త్రవ్వకాలు జరగటం, రోమను కళ పై ఉన్న ఆసక్తి కాస్తా గ్రీకు వారసత్వ సంపద పైకి మరలటం దీనికి కారణాలు.
గ్రీకు ప్రాచీన కళ అధ్యయనం కోసం 1755 లో దక్షిణ ఇటలీలో పురాతన ప్రదేశాలు (ప్రత్యేకించి పేస్టం, సిసిలీ లు) త్రవ్వకాలు జరిపిన పురాతత్వ శాస్త్రవేత్తలు గ్రీకు కళ సౌందర్యానికి మారు పేరుగా ఉదహరించారు. దీనితో చిత్రకళ, శిల్పకళ ల పై పురాతన గ్రీకు కళ యొక్క ప్రభావం మొదలు అయ్యింది. గ్రీకు పూలకుండీలపై ఉన్న చిత్రలేఖనాల వలె చిత్రీకరణలు చేయటం, గ్రీకు పౌరాణిక పాత్రలను చిత్రీకరించటం నానుడి అయ్యింది. ఫ్రెంచి, బ్రిటన్ దేశాల చిత్రకళ పై నియో క్లాసికిజం యొక్క ప్రభావం స్పష్టమైంది.
పలు ఇతర కళా ఉద్యమాలు, సిద్ధాంతాలు, వైఖరులను కలబోస్తూ సాంప్రదాయ, చారిత్రక కళా రూపాలను తిరస్కరిస్తూ సాంఘిక, ఆర్థిక స్థితిగతులు, మేధోసంపత్తి వైపు ఆధునిక చిత్రకళ అడుగులు వేసింది. దీనిని మాడర్నిజంగా వ్యవహరించారు.[12] ఫ్రాన్సులో 19వ శతాబ్దానికి చెందిన గుస్తవె కోర్బెట్, ఎడువార్డ్ మోనెట్ లు మాడర్నిజం శైలిలో చిత్రలేఖనాలు వేసారు. 1890 నుండి 20వ శతాబ్దం వరకు చోటు చేసుకొన్న సాంకేతిక విప్లవం, పెరిగిన విజ్ఙానం, అవగాహన, సన్నగిల్లిన సాంప్రదాయిక విలువలు, నమ్మకాలు, పాశ్చాత్యం కాని సంస్కృతులు వెలుగుచూడటం వంటి పలు మార్పుల పట్ల ఆధ్యాత్మిక స్పందనే మాడర్నిజం. భౌతిక ప్రపంచంలో కంటికి కనబడే దృశ్యాలను ఉన్నవి ఉన్నట్లుగా వేయకుండా పోవటంతో నైరూప్యత మాడర్న్ ఆర్ట్ లోకి చొచ్చుకొని వచ్చింది. ఫోటోగ్రఫీ రాక, చిత్రలేఖనంలో సారూప్యతకు ప్రాధాన్యాన్ని తగ్గించింది.
మాడర్న్ ఆర్ట్ పై ఆఫ్రికన్ కళ ప్రభావం చూపింది. గుస్తావే, పికాసో వంటి వారు ఆఫ్రికన్ కళ్ గురించి తెలుసుకోవటం, ఆఫ్రికన్ కళ నేపథ్యం, చరిత్ర పెద్దగా తెలియనప్పటీకీ, ఆ కళాఖంఢాల ఆకారాలను, రంగులను, తమ చిత్రకళలోకి చొప్పించటంతో మాడర్న్ ఆర్ట్ లోకి ఆఫ్రికన్ కళ చొరబడింది.[13]
వర్లీ అనే చిత్రకళ (ఆంగ్లం:Warli painting) మహారాష్ట్ర లోని ఆదివాసీ మహిళలచే సృష్టించబడ్డ ఒక సాంప్రదాయిక చిత్రకళ.[14] ముంబై పట్టణపు ఉత్తర శివార్లలో వర్లి, మల్ఖర్ కోలీ అనే గిరిజన తెగలు ఈ చిత్రలేఖనాన్ని సృష్టించాయి. ప్రధానంగా ఇంటి లోపలి వైపు గోడల పై వర్లీ చిత్రకళ చేయబడేది. అక్షరాస్యత తెలియని ఈ తెగలు, ఈ చిత్రకళ ద్వారానే భావవ్యక్తీకరణ చేసేవి. సాంఘిక జీవనం తప్పితే పౌరాణిక పాత్రలు, దృశ్యాలు గానీ, దేవతలను గానీ వర్లీ చిత్రీకరించకపోవటం దీనికి ఉన్న మరొక ప్రత్యేకత. సగటు మనిషి, సాధు జంతువులు, దైనందిన జీవితం లోని దృశ్యాలను మాత్రం వర్లీ అశాస్త్రీయంగా చిత్రీకరించినను, ఈ చిత్రీకరణ ఒక లయబద్ధంగా ఉంటుంది. వేట, నాట్యము, వ్యవసాయం వంటి దృశ్యాలను గుహలపై ఆదిమానవులు చిత్రీకరించిన చారిత్రక శైలిలో చాలా అందంగా చిత్రీకరించబడతాయి. 70వ దశకపు ప్రారంభంలో కానీ ఈ చిత్రకళ గురించి బయటి ప్రపంచానికి తెలియలేదు. సరిహద్దులు దాటి పయనించిన ఈ చిత్రకళ విశ్వవ్యాప్తంగా ఉన్న కళాప్రేమికులు వీటిని సేకరించారు.[15]
Seamless Wikipedia browsing. On steroids.