Remove ads
లియొనార్డో డా వించీ గీసిన ప్రపంచ ప్రఖ్యాత చిత్రం From Wikipedia, the free encyclopedia
మోనా లీసా (ఆంగ్లం: Mona Lisa) ఇటలీకి చెందిన లియోనార్డో డావిన్సీ అనే ప్రాచీన చిత్రకారుడు చిత్రించిన చిత్రపటం. ఈ ఆయిల్ పెయింటింగ్ 16వ శతాబ్దంలో ఇటలీ రినైజెన్స్ కాలంలో తెల్లని పానెల్ మీద చిత్రించినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఫ్రెంచి భాష లో మోనాలిసా ను La Jaconde గా, ఇటాలియన్ భాష లో Gioconda గా వ్యవహరిస్తారు.[1][2]
ఈ చిత్రంలో ఉన్నది ఇటలీలో కులీన వర్గానికి చెందిన లీసా గెరార్డిని అనే మహిళ అని అభిప్రాయపడుతున్నారు. ఈమె ఫ్రాన్సెస్కో లా జియోకొండో అనే వ్యక్తి భార్య. ఈ చిత్రాన్ని 1503 నుంచి 1506 సంవత్సరాల మధ్య చిత్రించబడినట్లు అంచనా వేశారు. కానీ లియోనార్డో 1517 సంవత్సరం వరకు దాని మీదనే పనిచేసినట్లు కూడా కొన్ని వాదనలున్నాయి. ఇటీవలి సైద్ధాంతిక పరిశోధనల ప్రకారం 1513 సంవత్సరం కంటే ముందు ఈ చిత్రం ప్రారంభం అయి ఉండటానికి ఆస్కారం లేదు.[3][4][5][6] ఇది తొలుత ఫ్రాన్సు రాజైన ఫ్రాన్సిన్ - 1 ఆధీనంలో ఉండగా ప్రస్తుతం ఫ్రాన్సు ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుని 1797 నుంచి ప్యారిస్ లోని లూవర్ మ్యూజియంలో ఉంచారు.[7]
ఈ చిత్రపటం ప్రపంచంలో అత్యంత విలువైనదిగా భావించబడుతోంది. 1962లో దీని బీమా విలువ 100 మిలియన్ డాలర్లుగా అంచనా వేయబడి ప్రపంచ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.[8]
పాప్లర్ చెట్టు చెక్క తో చేయబడ్డ పలక పై లెడ్ వైట్ అనే పదార్థంతో నింపటం జరిగింది. [9]
విశాలమైన నుదురు, ఉండీ లేనట్టుగా ఉండే కనుబొమలు.[1] వ్యంగ్యమా, నవ్వా అని వీక్షకుడిని సందిగ్ధం లో పడవేసే చిరునవ్వు.
మోనా లీసా ఎటువంటి ఆభరణాలు ధరించలేదు. తద్వారా లియొనార్డో వీక్షకుడి దృష్టీ కేవలం మోనా లీసా ముఖం పై మాత్రమే కేంద్రీకృతం అయ్యేలా చేశాడు.[9]
నేపథ్యం లో ఉండే వాతావరణం సహజసిద్ధంగా ఉన్నటు కనిపించటం.[1] కంటి నుండి దూరం పెరిగే కొద్దీ ఒక వస్తువుగానీ, ఒక ప్రకృతి సన్నివేశం కానీ మసకబారి, స్పష్టత లోపిస్తుంది. ఈ అంశాన్ని చిత్రీకరించటం లో లియొనార్డో సిద్ధహస్తుడు.
1503 లో మొదలు పెట్టబడిన మోనా లీసా ను లియనార్డో 1507 వరకు ఒక కొలిక్కి తేలేకపోయాడు. కొందరు కళా చరిత్రకారుల ప్రకారం 1517 వరకు లియొనార్దో మోనా లీసా కు మెరుగులు దిద్దుతూనే ఉన్నాడు. [1]
ఉత్కంఠభరితమైన మోనా లీసా చిరునవ్వు శతాబ్దాలుగా వీక్షకులను ఆహూతులు చేస్తోంది.[2] 19వ శతాబ్దం వరకు మోనా లీసా కు ఫ్రాన్సులో తప్పితే పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు. సహజత్వం కన్నా భావన, భావోద్రేకం ప్రధానమైన అంశాలుగా కల రొమాంటిసిజం కళాకారులు మాత్రం మోనా లీసా చిరునవ్వును కొనియాడేవారు.
లియొనార్డో ఈ చిత్రపటం ను స్ఫుమోటో పద్ధతిని ఉపయోగించి చిత్రీకరించాడు.[2] అనగా దృశ్యంలో వివిధ అంశాలు గీతల ద్వారా వేర్పరచినట్టు కాకుండా, ఒక వస్తువు మరొక వస్తువు తో ఏకీభవించినట్టు ఉండటం.[1] గ్లేజింగ్ మీడియం లో రంగును స్వల్పంగా నూనెతో కలిపి ఈ తైలవర్ణ చిత్రపటం చిత్రీకరించటం జరిగింది. ఎంత రంగును కలిపితే అంత ప్రభావం రావటానికి, స్వయం ప్రకాశితంగా ఉండటానికి, లోతును చక్కగా చూపటానికి, వీక్షకుడు ఏ కోణం లో చూచినా, చిత్రపటం రంగులు ఆ దిశలో పయనించి కళ్ళకు తాకేందుకు, ఈ సాంకేతిక అంశం వాడబడినట్టు తెలుస్తోంది. కాంట్రాస్టు కొరకు బ్రష్ స్ట్రోకులు చాలా నెమ్మదిగా, మోనా లీసా చర్మం జవసత్వాలలో నిండి ఉండేలా కనబడేటట్లు లియొనార్డో చాలా శ్రమకు ఓర్చి ఈ చిత్రపటాన్ని చిత్రీకరించాడు. [9]
కింగ్ ఫ్రాన్సొయిస్ లియనార్డో ను ఫ్రాన్సు కు ఆహ్వానించి 1518 లో ఈ పెయింటింగు ను కొనుగోలు చేశాడు. [2] 17వ శతాబ్దం లో జరిగిన ఫ్రెంచి విప్లవం లో ఎటువంటి నష్టం వాటిల్లకపోవటం అదృష్టకరం.[1] కొంతకాలం నెపోలియన్ పడకగదిలో కూడా మోనా లీసాకు స్థానం దక్కింది.
21 ఆగష్టు, 1911 లో మొనా లిసా తస్కరించబడింది. ఈ వార్త యావత్ ప్రపంచానికి దావానలం లా వ్యాపించింది. చిత్రపటాన్ని వెదికి తెచ్చి ఇచ్చిన వారికి అద్భుతమైన బహుమతులు ప్రకటించినా ఎటువంటి ఫలితం లేకపోయింది. దీనితో ఫ్రెంచి లూవర్ మ్యూజియం నిర్వహణాధికారికి, ప్యారిస్ నగర పోలీసు అధికారికి ఉద్వాసన తప్పలేదు. అంతర్జాతీయ ప్రసార మాధ్యమాలు ఈ భద్రతా లేమిని ఎగతాళి చేసాయి. ప్రపంచవ్యాప్తంగా మోనా లీసా పై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. [10] తర్వాతి రెండు సంవత్సరాలు ఈ కేసు లో ఎటువంటి పురోగతి కనబడలేదు. ఇటలీకి చెందిన ఒక ఆర్ట్ డీలర్ కు విన్సెంజో పెరూగియా అనే వ్యక్తి ఈ చిత్రపటాన్ని అమ్మకానికి పెట్టగా, సదరు ఆర్ట్ డీలర్ అధికారులను అప్రమత్తం చేశాడు. 7 డిసెంబరు, 1913న ఇటలీ పోలీసులు తాము మోనా లీసాను కనుగొన్నట్లు ప్రకటించారు.[11] తిరిగి వచ్చిన మోనాలిసాకు అంతకంతకూ కీర్తి ప్రతిష్టలు పెరిగాయి![2]
మోనా లీసా మ్యూజియం లో లేదు అని తెలియగానే పోలీసులు రంగం లోకి దిగారు. మ్యూజియం మూసి వేయించి అందరినీ సోదా చేశారు. ఒక వారం పాటుగా గాలింపు చర్యలు ముమ్మరంగా సాగాయి. మ్యూజియం మూసివేతకు గల కారణాలు తెలుపవలసిందిగా ప్రజల నుండి తీవ్ర వత్తిడి వచ్చింది.
అంతర్గత సోదాల వల్ల ప్రత్యక్షంగా ఎటువంటి ఉపయోగం కనబడకపోయినను, పరోక్షంగా ఈ సోదా కొన్ని ఆధారాలు ముందుకు తీసుకువచ్చింది. మోనా లీసా ను తస్కరించింది ఒక కళాకారుడు లేదా కొందరు కళాకారుల గుంపు అని. వీరికి చిత్రపటం నుండి మోనా లీసా ను ఎలా వేరు చేయాలో చక్కగా తెలుసు. అనుమానితులని ఒక్కొక్కరుగా తగ్గించుకొంటూ వచ్చిన విచారణ బృందం చివరకు కళా విమర్శకుడు గుయిలాం అపొలినైర్, మరొక చిత్రకారుడు పాబ్లో పికాసో ను విచారణ చేయవలసిందిగా నిర్ధారించారు. 1912 ఫ్రాన్సు లలిత కళల మంత్రి, "మోనా లీసా తిరిగి వస్తుందనే నమ్మకం ఏ కోశానా లేదు!" అని వ్యాఖ్యానించాడు.[1]
విచారణలో విన్సెంజో ఒక దేశభక్తుడని, ఈ చోరీ వెనుక ఎటువంటి దురుద్దేశ్యం లేదని తేలింది. మోనా లిసా ను ఫ్రెంచి సైన్యాధ్యక్షుడు నెపోలియన్ దుర్మార్గంగా పట్టుకుపోయాడనే అపోహలో ఉండటం, ఆమెను తిరిగి తన స్వదేశానికి రప్పించి తన దేశభక్తిని చాటుకోవాలనుకోవటం వలనే విన్సెంజో ఈ చోరీకి పాల్పడ్డాడని తేలింది.[11] వాస్తవానికి లియొనార్డో ఫ్రెంచి రాజు ఫ్రాన్సోయిస్ కు ఆస్థాన చిత్రకారుడిగా చేరిన తర్వాత స్వయానా అతనికి ఈ చిత్రపటాన్ని బహుమతిగా ఇచ్చాడు. పైగా నెపోలియన్ పలు కళాఖండాలను అప్పటికే దుర్మార్గంగా తరలించినా, అతని జాబితా లో మోనా లీసా ఎప్పటికీ లేదు.[10]
లూవర్ మ్యూజియం లో పలు సంవత్సరాలు గా పని చేస్తున్న విన్సెంజో మ్యూజియం యొక్క వాస్తు, అక్కడి సెక్యూరిటీ, నిర్వహణా బృందాల గురించి చక్కగా తెలుసు. నిర్వహణ కొరకు సోమవారాలు మ్యూజియం మూసివేయబడుతుంది అని కూడా తెలిసిన విన్సెంజో ఆదివారం మధ్యాహ్నమే మ్యూజియం లోకి ప్రవేశించి ఒక చోట తనకు తానే తాళం వేసుకొన్నాడు. సోమవారం ఉదయం పనివారు వేసుకొనే దుస్తులను ధరించి చిత్రపటం వ్రేలాడదీయబడ్డ Salon Carré లోకి ప్రవేశించాడు. పనివారెవ్వరూ లేని సమయం చూసుకొని చిత్రపటాన్ని తీసుకొని దానికున్న ఫ్రేమును బద్దలు కొట్టి ఫ్రేమును అక్కడే వదిలేసి, చక్కగా చిత్రపటంతో దర్జాగా నడుచుకు వెళ్ళి పోయాడు.[11]
విన్సెంజో ఉద్దేశ్యం దేశభక్తి మాత్రమే కావటంతో ఇటలీ అతనికి తేలికపాటి శిక్షను మాత్రం విధించింది.[11]
విన్సెంజో వద్ద ఉన్నది కూడా అసలైన మోనా లీసా కాదని, ఎడ్వార్డో మార్క్వెస్ డీ వాలిఫెర్నో అనే ఒక మోసపూరిత వ్యాపారవేత్త చే సృష్టింపబడ్డ పలు నకళ్ళ లో ఒకటి అని దొంగిలించబడ్డ మోనా లీసా తన వద్ద ఉందని, పలు నకళ్ల తో వాలిఫెర్నో వ్యాపారం నడిపేవాడని వదంతులు ఉన్నవి.[11] విన్సెంజో కూడా వాలిఫెర్నో మనిషే అని, వాలిఫెర్నో ఆదేశాల మేరకే విన్సెంజో మోనా లీసా ను దొంగిలించాడన్నవి కూడా ఈ వదంతులలో భాగాలు. వాలిఫెర్నోకు అప్పగించిన అసలైన మోనా లీసాను విన్సెంజో మరల దొంగిలించి ఇటలీ బయలుదేరాడు. విచారణ లో విన్సెంజో వాలిఫెర్నో గురించి పెదవి విప్పకపోవటానికి కారణం, తాను దేశభక్తుడను అనే నమ్మకాన్ని కలిగించటం కోసం కూడా వదంతులే.
నాజీలు కూడా మోనా లీసాను తస్కరించే ప్రయత్నం చేశారు కానీ, ఇది ముందు గానే పసిగట్టిన ఫ్రాన్స్ అప్పటికే అసలు చిత్రపటాన్ని వేరొక చోట భద్రపరచి, మ్యూజియం లో నకలును ఉంచారన్నది ఒక వాదన.[10] ఈ వాదన, అసలు ప్రస్తుతం లూవర్ మ్యూజియం లో ఉన్నది అసలైన చిత్రపటమేనా అనే సందేహానికి తావు ఇస్తుంది.
27 ఆగస్టు 1939 నుండి మోనా లీసా అజ్ఙాతం లో ఉంది. 16 జూన్ 1945 కు గానీ తిరిగి లూవర్ మ్యూజియం కు రాలేదు. రెండవ ప్రపంచ యుద్ధం జరిగినన్ని నాళ్ళు మోనా లీసా ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు.[10]
30 ఇంచిల పొడవు, 20 ఇంచిల వెడల్పు గల ఈ చిత్రపటం మ్యూజియం లో నియంత్రిత వాతావరణం (43 డిగ్రీల ఫారెన్హీట్ 50% ఆర్ద్రత) లో ఒకటిన్నర ఇంచిల మందం ఉన్న బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుక భద్రపరచబడి ఉన్నది. [1] చిత్రపటానికి కొన్ని అడుగుల ముందు ఉన్న బ్యారియర్ వద్దే సందర్శకులను ఆపివేయటం జరుగుతుంది.
సందర్శకుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని, మ్యూజియం లోని అతి పెద్దదైన గది Salle des États లో ఈ చిత్రపటం ఉంచబడినట్లు స్వయానా మ్యూజియం వెబ్ సైటు లో చెప్పుకొచ్చింది.[2] 2005 నుండి ఈ భద్రతా ప్రమాణాలు అమలు లో ఉన్నాయి. కాన్వాస్ పై కాకుండా దళసరి చెక్క పలకపై చిత్రీకరించటం వలన చిత్రపటం చెక్కులు చెదిరింది. పలక పై చీలిక కూడా రావటం తో మున్ముందు మరే రకమైన నష్టం వాటిల్లకుండా ఈ భద్రతా ఏర్పాటులు చేసినట్టు మ్యూజియం స్పష్టం చేసింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.