Remove ads
From Wikipedia, the free encyclopedia
రినైజెన్స్ (ఆంగ్లం: Renaissance) ఐరోపా ఖండంలో 14-17వ శతాబ్దాలలో ఏర్పడ్డ ఒక సాంస్కృతిక/రాజకీయ/ఆర్థిక/కళా ఉద్యమం.[1] మధ్య యుగాలు అప్పటికే అంతానికి రావటం, తత్వశాస్త్రం, రచన, కళను పునరుద్ధరించటం; ఈ కళకు శాస్త్రీయత ఆపాదించబడటం, కళాభ్యాసంలో ఇది ఒక భాగం కావటం తో రినైజెన్స్ ఆసక్తిని నెలకొల్పింది.[2] మధ్యయుగాలకు, ఆధునిక ఐరోపాకు వారధి వేసిన కీర్తి రినైజెన్స్ సొంతం చేసుకొంది. అనేక మేధావులు, రచయితలు, రాజనీతిజ్ఞులు, శాస్త్రవేత్తలు, కళాకారులు రినైజెన్స్ కాలంలో వృద్ధి లోకి వచ్చారు. రినైజెన్స్ సమయంలో ప్రపంచాన్వేషణ పెరగటం తో, ఐరోపా వాణిజ్యం ఇతర దేశాలకు, వారి సంస్కృతులకు ఆహ్వానం పలికింది.
ఫ్రెంచి భాషలో రినైజెన్స్ అనే పదానికి అర్థం పునర్జన్మ.[2] ఈ కాలావధిలో కళాకారులు మధ్య యుగ కళలకు పున:సృష్టించి, పునర్జన్మను ఇవ్వటం వలన ఈ కళా ఉద్యమానికి వారు ఈ పేరు పెట్టుకొన్నారు.[3]
సా.శ. 476 వ సంవత్సరంలో రోమను సామ్రాజ్యం పతనమైనప్పటి నుండి 14వ శతాబ్దం వరకు వైజ్ఞానిక శాస్త్రం లో, కళలలో ఐరోపా ఖండంలో చాలా పురోగతి సంభవించింది. Dark Ages గా సంబోధించబడే ఈ కాలంలో యుద్ధాలు, అజ్ఞానం, కరువు, ప్లేగు వంటి రోగాల వలన మృత్యువాత వంటి వాటితో ఐరోపా అతలాకుతలం అయ్యింది. ప్రాచీన గ్రీకు, రోమను తత్వాల అభ్యాసం పట్ల అప్పట్లో అనాసక్తత ఉండేది.[1]
12వ శతాబ్దం ప్రారంభం నుండి వరుసగా కొన్ని సాంఘిక, రాజకీయ, మేధో పరివర్తనలు జరిగాయి. ఆధ్యాత్మిక చింతనను, భౌతిక జీవితాన్ని పురోగమింపజేసే స్థిరమైన, ఏకీకృత సూత్రాలను అందుబాటులోకి తేవటంలో రోమన్ క్యాథలిక్ చర్చి-రోమన్ సామ్రాజ్యాల సమష్టి వైఫల్యం, రాచరిక వ్యవస్థలకు ప్రాముఖ్యత పెరగటం, జాతీయ భాషల అభివృద్ధి, పురాతన భూస్వామ్య వవస్థల విచ్ఛిన్నం వంటివి రినైజెన్స్ కు దారులు వేసాయి.[2]
1450 లో గూటెన్ బర్గ్ ముద్రణాలయం స్థాపించబడటంతో ఇటువంటి ఆలోచనలు యావత్ ఐరోపాకు వ్యాపించాయి. తద్వారా సాంప్రదాయిక గ్రీకు/రోమను సంస్కృతి/విలువలు ముద్రించబడి సాధారణ ప్రజానీకానికి పెద్ద ఎత్తున అందుబాటు లోకి వచ్చాయి.
దీనికి తోడుగా అంతర్జాతీయ ఆర్థిక రంగంలో ముందడుగు పడటంతో ఐరోపా సంస్కృతి ప్రభావితం కావటం కూడా, రినైజెన్స్ కు దారులు వేసింది.[1]
14వ శతాబ్దంలో హ్యూమనిజం అనే సాంస్కృతిక ఉద్యమం ఐరోపాలో ఊపందుకొంది. మద్య యుగ మేధోవర్గాన్ని పండితులు తమ పాండిత్యం శాసిస్తున్న సమయంలో సాధారణ ప్రజానీకం ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది.[2] 1453 లో కాన్స్టాంటినోపుల్ పతనంతో, హ్యూమనిజం పెల్లుబికింది. దినదిన ప్రవర్థమానం అవుతోన్న ముద్రణ రంగం సాంప్రదాయ గ్రీకు గ్రంథాల ముద్రణ/ పఠనాలను విస్తరించింది.[3] విరివిగా లభ్యం అయిన పౌరాణిక సాహిత్యం ఐరోపా ఖండం మొత్తం వ్యాపించింది. మేధో/మత వర్గాల పై చెరగని ముద్ర వేసింది. మనిషి యొక్క సృష్టికి తానే కేంద్రబిందువు అని, విద్య, కళలు, రచన, విజ్ఞాన శాస్త్రం వంటి వాటిలో మానవ విజయాలను ప్రజలు గౌరవించాలని హ్యూమనిజం బోధించింది. తత్వం లో, వేదాంతంలో సత్యానికి ఉన్న ఐక్యత, అనుకూలత లను తెలిపింది. మధ్యయుగాలు తెలిపినట్లు జీవితం ఒక తపస్సు కాదని, హ్యూమనిస్టులు సృష్టిలో దాగి ఉన్న శ్రమని గుర్తించి ప్రకృతి పై పట్టు సాధించటానికి ప్రయత్నించారు. మనిషి యొక్క ఆత్మను తిరిగి అన్వేషించారు, మానవ మేధస్సుకు మరల పదును పెట్టారు. ఈ సత్యాన్వేషణలో హ్యూమనిస్టులు ఒక సరిక్రొత్త ఆధ్యాత్మిక, మేధో దృక్పథాన్ని ఇవ్వటమే కాకుండా మరొక నూతన జ్ఞాన భాండాగారాన్ని అభివృద్ధి చేసింది.
హ్యూమనిజం యొక్క ప్రధాన ఉద్దేశం: సనాతన ఆచారాలు మనిషిపై రుద్దిన మానసిక కాఠిన్యాల బారి నుండి వారిని కాపాడటం, శోధన/విమర్శలకు ప్రేరణనివ్వటం, మనిషి యొక్క ఆలోచన/సృష్టి లకు అవకాశాన్ని పెంపొందించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించటం.
ఇటలీ లోని ఫ్లోరెన్స్ లో రినైజన్స్ ప్రారంభం అయ్యింది. 1401-28 వరకూ జీవించిన మసాకియో అనే చిత్రకారుడు రినైజెన్స్ చిత్రకళకు ఆద్యుడు.[2] అతని భావనలలోని మేధస్సు, మరువలేనివిగా మిగిలిపోయే అతని కూర్పులు, అతని కళాఖండాలలో ఉట్టిపడే నేచురలిజం; రినైజెన్స్ చిత్రకళలో అతని పాత్రను కీలకం చేశాయి. అతని తర్వాత వచ్చిన రినైజెన్స్ చిత్రకారులు వివిధ దృక్కోణాలలో మానవ శరీర నిర్మాణాన్ని అధ్యయనం చేసి దీనికి మరిన్ని మెరుగులు దిద్ది సైంటిఫిక్ న్యాచురిలజం తీసుకు వచ్చారు.
అప్పటి ఫ్లోరెన్స్ నగరం సాంస్కృతిక చరిత్రలో సుసంపన్నం అయి ఉండటమే కాక ధనవంతులు నివాసముండటం కూడా జరగటం తో, ఈ ధనిక వర్గాలు ఎదుగుతున్న కళాకారులను ప్రోత్సహించేవారు. ప్రత్యేకించి ఫ్లోరెన్స్ ను 60 ఏళ్ళ పాటు పాలించిన మెడిసి వంశం రినైజెన్స్ కు వెన్నుదన్నుగా నిలిచారు.[1] రాజభవనాల, చర్చిల, మఠాల, అలంకరణలకు కావలసిన ఆర్థిక వనరులను వీరు సమకూర్చేవారు.[2]
పలు ఇటాలియన్ రచయితలు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు, మేధావులకు చిరునామాగా మారిన, Dark Age తో పోలిస్తే అనుభవంలో బహు భిన్నంగా ఉన్న ఈ కళా ఉద్యమంలో తాము కూడా భాగస్వాములు అని ప్రకటించుకోవటానికి ఉవ్విళ్ళూరేవాళ్ళు.
రినైజెన్స్ యొక్క వ్యాప్తి మొదట ఇటలీ లోని ఇతర నగరాలైన వెనీస్, మిలాన్, బొలోగ్నా, ఫెర్రారా, రోం వంటి నగరాలకు మాత్రం పరిమితం కాగా, 15వ శతాబ్దానికల్లా ఫ్రాన్సు దాకా చేరి తర్వాత పశ్చిమ, ఉత్తర ఐరోపా లకు సైతం వ్యాపించింది. ఇతర ఐరోపా దేశాలలో రినైజెన్స్ ఆలస్యంగా ప్రవేశించినను, ఆయా దేశాలలో కూడా ఈ కళా ఉద్యమం యొక్క ప్రభావాలు విప్లవాత్మకంగా కనబడ్డాయి.[1]
రినైజెన్స్ యొక్క ప్రభావం లలిత కళలలోనే ఎక్కువ స్పష్టంగా కనబడింది. కళ కూడా విజ్ఞానం యొక్క ఉపశాఖగా, దానికంటూ ఒక విలువ కలిగినదిగా, దైవం యొక్క రూపాలను మానవాళికి ప్రసాదించేది గా, ఈ సృష్టిలో మానవుడి స్థానాన్ని తెలిపేదిగా పరిగణించబడటం ప్రారంభం అయ్యింది. లియొనార్డో డా విన్సీ వంటి కళాకారుల చేతులలో కళ ఒక విజ్ఞాన శాస్త్రంగా కూడా మారిపోయింది. కంటికి కనబడే దృశ్యప్రపంచాన్ని గమనిస్తూ, ఇదే కాలావధిలో అభివృద్ధి చేయబడిన సమతౌల్యం, సామరస్యం, దృక్కోణం వంటి గణిత సిద్ధాంతాలను ఆధారంగా చేసుకొంటూ సాధన చేయవలసి వచ్చింది. మహామహులైన పలు చిత్రకారుల, శిల్పకారుల, నిర్మాణ శాస్త్రవేత్తల కళాఖండాలలో మనిషి యొక్క హుందాతనాన్ని భావంగా చాటే అవకాశం దక్కింది.[2]
రినైజెన్స్ కాలంలో కళ, నిర్మాణ/విజ్ఞాన శాస్త్రాల మధ్య అవినాభావ సంబంధం ఏర్పడింది. వాస్తవానికి ఈ మూడు ఒకదానితో మరొకటి విడదీయలేనంత గాఢంగా పెనవేసుకు పోయాయి. లియొనార్డో డా విన్సీ వంటి కళాకారులు మానవ శరీరాన్ని కంటికి ఇంపుగా పున: సృష్టించేందుకు మానవ శరీర నిర్మాణ శాస్త్రమును అధ్యయనం చేయవలసి వచ్చింది. పెద్ద భవనాలకు విశాలమైన గోపురాలను నిర్మించటానికి గణితములో పట్టు సాధించవలసి వచ్చింది. పలు వైజ్ఞానికావిష్కరణలు అది వరకు ఉన్న అపోహలను పటాపంచలు చేశాయి. గెలీలియో గెలీలి, డెస్కార్టెస్ లు గణితానికి సరిక్రొత్త దృక్కోణాలు చూపించగా, నికోలాస్ కోపర్నికస్ సౌర వ్యవస్థలో కేంద్ర బిందువు భూమి కాదని, సూర్యుడని తేల్చాడు.[1]
రియలిజం (వాస్తవికత), న్యాచురలిజం (సహజత్వం) లు రినైజెన్స్ లో కొట్టొచ్చినట్టు కనబడతాయి. ప్రజలను కళ్ళకు కట్టినట్లుగా సృష్టించటానికి కళాకారులు శ్రమించారు.[1]
దృక్కోణం, వెలుగు-నీడలు, రినైజెన్స్ యొక్క లోతును పెంచాయి. రినైజెన్స్ కళాకారులు వారి కళాఖండాలలో భావోద్రేకాలను చొప్పించే ప్రయత్నం చేశారు.[1]
తమ ప్రతిభను ఉపయోగించి రినైజెన్స్ ద్వారా పలు కళాకారులు, మేధావులు క్రొత్త ఆలోచనలు వెలిబుచ్చగా మరి కొందరు సముద్రాలు దాటి వారి చుట్టూ ఉన్న ప్రప్ంచాన్ని అధ్యయనం చేసుకోవటానికి ప్రయత్నించారు. ఆవిష్కరణ యుగం (Age of Discovery) లో పలు పరిశోధనలు చేయబడ్డాయి. నావికులు ప్రపంచ వ్యాప్తంగా పలు యాత్రలు మొదలు పెట్టారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, భారత దేశం, ఇతర తూర్పు దేశాల పై శోధన మొదలైంది.[1]
రినైజెన్స్ కు మూలం అయిన హ్యూమనిజం అప్పట్లో ఐరోపా వాసులను రోమన్ కాథలిక చర్చి యొక్క పాత్రను ప్రశ్నించేలా చేసాయి. ముద్రణ పెరగటంతో బైబిల్ ముద్రణ గ్రంథ పఠనం కూడా పెరిగాయి. అక్షరాస్యత పెరగటం, ఆలోచనలు విస్తృతం కావటంతో తాము పాటించే మతంలో పరిశీలన, విమర్శ లకు స్థానాన్ని ఇచ్చింది.
16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ అనే జర్మను సన్యాసి, ప్రొటెస్టంట్ రిఫార్మేషన్ ను ముందుండి నడపటంతో కాథలిక్ చర్చిలో చీలికను తెచ్చింది. పలు ఆచారాలను ప్రశ్నించి అవి బైబిలు బోధనలను అనుసరిస్తున్నాయా అని సందేహాన్ని వెలిబుచ్చాడు. తత్ఫలితంగా క్రైస్తవ మతంలో ప్రొటెస్టెంటిజం పుట్టింది.[1]
మానవ శరీర నిర్మాణం, గాలిలో ఎగురగలిగే విధానం, మొక్కల, జంతువుల శరీర నిర్మాణం వంటి పలు శాస్త్రాలను అధ్యయనం చేస్తున్న డా విన్సీకి చిత్రలేఖనం చేయటానికి సమయం ఉండేది కాదు. అయిననూ అతని చే చిత్రీకరించబడ్డ మోనా లీసా, ద వర్జిన్ ఆఫ్ ద రాక్స్, ద లాస్ట్ సప్పర్ వంటి కళాఖండాలు అతనికి పేరు తెచ్చాయి.
మైఖేలేంజిలో చెక్కిన శిల్పాలు పీటా (Pieta), డేవిడ్ లు సాంకేతిక సామర్థ్యం, మానవ శరీర నిర్మాణంలో కొలతలు కలగలిపితే అవతరించే అద్భుతమైన సృష్టికి, వాటి ద్వారా వ్యక్తీకరించగలిగే భావోద్వేగాలకు మచ్చుతునకలుగా మిగిలిపోయాయి. సిస్టీన్ ఛాపెల్ లో మైఖేలేంజిలో వేసిన మ్యూరల్ చిత్రపటం అత్యంత సంక్లిష్టమైన క్రిస్టియన్ థియాలజీని నియోప్లాటోనిక్ ఆలోచనాతత్వాన్ని కలబోతకు కీర్తిప్రతిష్ఠలను అందుకొంది.
రఫాయెల్ చిత్రీకరణ అయిన ద స్కూల్ ఆఫ్ ఏథెన్స్ అరిస్టాటిల్, ప్లేటో వంటి తత్వవేత్తల ఆలోచనలను కొందరు మేధావులు చర్చిస్తోన్న చిత్రపటం. తొలుత రఫాయెల్ పై లియొనార్డో ప్రభావం కనబడినా, తర్వాత రఫాయెల్ ఈ ప్రభావం నుండి బయటపడి సామరస్యం, స్పష్టతలతో తనదైన శైలులను తీసుకువచ్చాడు.
చిత్ర/శిల్పకళలకు మాత్రమే పరిమితం కాకుండా హై రినైజెన్స్ సంగీతం, భవన నిర్మాణ శాస్త్రాలకు సైతం వ్యాపించింది.
డా విన్సీ, మైఖేలాంజెలో, రఫాయెల్ ల మధ్య పోటీ హై రినైజెన్స్ కు దారి తీసింది. ముగ్గురి మధ్యన గట్టి పోటీ ఉన్నను అన్ని శాస్త్రాలలో ప్రావీణ్యుడైన డా విన్సీ యే రినైజెన్స్ మ్యాన్ గా గుర్తింపబడ్డాడు. మైఖెలేంజిలో తన సృజనా శక్తి, మానవ శరీరం భావోద్రేకాల వ్యక్తీకరణకు ఉపయోగించదగ్గ ఒక వాహనం అని తెలిపే ప్రాజెక్టులు చేపట్టి; రఫాయేల్ శాస్త్రీయ అంశాలైన సామరస్యం, అందం, నైర్మల్యాలతో డా విన్సీకి గట్టి పోటీ ఇచ్చారు.[2]
15వ శతాబ్దపు చివరిలో చోటు చేసుకొన్న పలు పరిణామాలతో రినైజెన్స్ కనుమరుగు అయ్యింది. స్పానిష్, ఫ్రెంచి, జర్మను దండయాత్రల వలన, పలు యుద్ధాల వలన అంతరాయాలు, అస్థిరలతలు నెలకొన్నాయి. వాణిజ్య మార్గాలలో మార్పులు చోటు చేసుకోవటంతో ఆర్థిక వనరులు కొరవడ్డాయి. కౌంటర్-రిఫార్మేషన్ అనే ఉద్యమంతో కేథలిక్ చర్చిలు ప్రొటెస్టెంటు రిఫార్మేషన్ న్య్ వ్యతిరేకిస్తూ కళాకారులను కట్టడి చేశాయి. ఈ కట్టడి మరణ శిక్షల దాకా వెళ్ళటంతో రినైజెన్య్స్ మేధావులు సాహసించలేకపోయారు. దీనితో సృజనాత్మకత కుంటుపడింది. 17వ శతాబ్దానికి రినైజెన్స్ పూర్తిగా తుడుచిపెట్టుకుపోయింది.[1]
రినైజెన్స్ కళా ఉద్యమం ఐరోపా చరిత్రలోనే ఒక అపూర్వమైన ఘట్టంగా, ఉత్తేజకరమైన కాలావధిగా కొందరు కళా విమర్శకులు కొనియాడితే, మధ్యయుగ చిత్రకళతో పోలిస్తే దీనిలో పెద్ద ప్రత్యేకత ఏమీ లేదని మరి కొందరు విమర్శిస్తారు.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.