From Wikipedia, the free encyclopedia
హోల్కరు రాజవంశం భారతదేశంలో ధంగరు మూలానికి చెందిన మరాఠా రాజవంశం.[1][2][3][4] పేష్వా మొదటి బాజీ రావు ఆధ్వర్యంలో హోల్కర్లు సైనికాధికారులుగా ఉన్నారు. తరువాత 1818 వరకు మరాఠా సామ్రాజ్యంలో స్వతంత్ర సభ్యులుగా మధ్య భారతదేశంలోని ఇండోరు మహారాజులుగా మారారు. తరువాత వారి రాజ్యం బ్రిటిషు ఇండియా రక్షిత రాజ్యంలో ఒక రాచరిక రాజ్యంగా మారింది.
1721 లో మరాఠా సామ్రాజ్యం పేష్వాలు సేవలో చేరిన మల్హరు రావుతో ఈ రాజవంశం స్థాపించబడింది. త్వరగా అది సుబేదారు హోదాకు ఎదిగింది. అనధికారికంగా హోల్కరు మహారాజా అని పిలువబడే పాలకుడి బిరుదుతో రాజవంశం పేరు ముడిపడి ఉంది.
పేష్వా బాజీ రావుకు సేవలందిస్తున్న మరాఠా చీఫు మల్హరు రావు హోల్కరు (1694-1766) రాజవంశం స్థాపించి ఇందోరును పాలించాడు. 1720 లలో ఆయన మాల్వా ప్రాంతంలో మరాఠా సైన్యాలను నడిపించాడు. 1733 లో పేష్వా ఇండోరు పరిసరాలలో 9 పరగణాలను మంజూరు చేశాడు. ఇండోరు టౌన్షిప్పు అప్పటికే కంపెల్కు చెందిన నందలాలు మాండ్లోయి చేత స్థాపించబడిన స్వతంత్ర రాజ్యంగా ఉంది. మరాఠా దళం ఖాన్ నది మీదుగా శిబిరాలు ఏర్పాటు చేసుకుని నందలాలు మాండ్లోయిని గెలుచుకుంది. 1734 లో మల్హరు రావు తరువాత మల్హర్గంజు అనే శిబిరాన్ని స్థాపించాడు. 1747 లో ఆయన తన రాజభవనమైన రాజ్వాడ నిర్మాణాన్ని ప్రారంభించాడు. మరణించే సమయానికి ఆయన మాల్వాలో ఎక్కువ భాగం పరిపాలించాడు. మరాఠా సమాఖ్యలోని 5 స్వతంత్ర పాలకులలో ఒకరిగా గుర్తించబడ్డాడు.
ఆయన తరువాత ఆయన కోడలు అహిల్యబాయి హోల్కరు (r. 1767-1795). ఆమె మహారాష్ట్రలోని చౌండి గ్రామంలో జన్మించింది. ఆమె రాజధానిని నర్మదా నది తీరంలోని ఇండోరుకు దక్షిణంగా మహేశ్వరుకు తరలించింది. రాణి అహిల్యబాయి మహేశ్వరు ఇండోరు లోని హిందూ దేవాలయాలను సమృద్ధిగా నిర్మించి పోషించింది. గుజరాతు తూర్పు ద్వారక నుండి గంగానదిలోని వారణాసి వద్ద ఉన్న కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు ఆమె తన రాజ్యానికి వెలుపల ఉన్న పవిత్ర స్థలాలలో దేవాలయాలను నిర్మించింది.
మల్హరు రావు హోల్కరు దత్తు కుమారుడు తుకోజీ రావు హోల్కరు (1795-1797) రాణి అహల్యాభాయి మరణించించిన తరువాత స్వల్పకాలం వారసత్వంగా రాజపాలన చేసాడు. అహల్యాభాయి పాలనాకాలం అంతటా తుకోజీ రావు హోల్కరు సైనికాధికారిగా ఉన్నాడు.
ఆయన మరణం తరువాత ఆయన కుమారుడు యశ్వంతరావు హోల్కరు (r. 1797-1811) (జస్వంతు రావు అని కూడా పిలుస్తారు) అధికారం స్వీకరించాడు. రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధంలో ఢిల్లీ మొఘలు చక్రవర్తి రెండవ షా ఆలంను బ్రిటిషు వారి నుండి విడిపించేందుకు ప్రయత్నించాడు. కృతజ్ఞతతో ఉన్న షా ఆలం ఆయన ధైర్యానికి గౌరవసూచకంగా ఆయనకు మహారాజాదిరాజ రాజరాజేశ్వర అలీజా బహదూరు అనే బిరుదు ఇచ్చారు.
రాజులను ఏకం చేయడానికి యశ్వంతరావు హోల్కరు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బ్రిటిషు వారితో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆయనను సంప్రదించారు. 1805 డిసెంబరు చివరలో సంతకం చేసిన రాజ్ఘాటు ఒప్పందం ఆయనను సార్వభౌమ రాజుగా గుర్తించింది.
1811 లో యశ్వంతరావు హోల్కరు తరువాత నాలుగేళ్ల మహారాజా రెండవ మల్హారావు హోల్కరు. ఆయన తల్లి మహారాణి తుల్సాబాయి హోల్కరు పరిపాలనను చూసుకున్నారు. ఏదేమైనా ధర్మ కున్వరు, బలరాం సేథు పఠాన్లు, పిండారీలు, బ్రిటిషు వారి సహాయంతో తుల్సాబాయి, మల్హారావులను జైలులో పెట్టడానికి కుట్ర పన్నారు. ఫలితంగా గఫూరు ఖాన్ పిండారి 1817 నవంబర్ 9 న రహస్యంగా బ్రిటిషు వారితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. 1817 డిసెంబరు 19 న తుల్సాబాయిని చంపాడు.
ఈ ఒప్పందం 1818 జనవరి 6 న మాండ్సౌరులో సంతకం చేయబడింది. భీమాబాయి హోల్కరు ఈ ఒప్పందాన్ని అంగీకరించలేదు. గెరిల్లా పద్ధతుల ద్వారా బ్రిటిషు వారి మీద దాడి చేస్తూనే ఉన్నారు. ఝాంసీకి చెందిన రాణి లక్ష్మీబాయి భీమాబాయి హోల్కరు నుండి ప్రేరణ పొంది బ్రిటిషు వారి మీద కూడా పోరాడింది. మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధం ముగింపులో హోల్కర్లు తమ భూభాగాన్ని బ్రిటిషు వారికి కోల్పోయారు. సెంట్రలు ఇండియా ఏజెన్సీ రాచరిక రాష్ట్రంగా బ్రిటిషు రాజులో చేర్చారు. రాజధాని భాణపుర నుంచి ఇండోరుకు మార్చారు.
మూడవ మల్హారావు హోల్కరు 1818 నవంబరు 2 న ఇండోరులోకి ప్రవేశించారు. తాంతియా జోగు పిన్నవయస్కుడు కావడంతో ఆయన దివానుగా నియమించబడ్డాడు. పాత రాజభవనాన్ని దౌలతు రావు సింధియా సైన్యం నాశనం చేయడంతో దాని స్థానంలో కొత్త రాజభవనం నిర్మించబడింది. మూడవ మల్హారావు తరువాత మార్తాండరావు 1834 జనవరి 17 న అధికారికంగా సింహాసనం అధిరోహించారు. ఆయన స్థానంలో యశ్వంతరావు మేనల్లుడు హరిరావు హోల్కరు 1834 ఏప్రెలు 17 న సింహాసనం అధిరోహించారు. ఆయన 1841 జూలై 2 న ఖండేరావు హోల్కరును దత్తత తీసుకొని 1843 అక్టోబరు 24 న మరణించాడు. ఖండేరావు అధికారికంగా పాలకుడిగా 13 నవంబర్ 1843 నవంబరు న స్థాపించబడ్డాడు. కాని ఆయన అకస్మాత్తుగా 1844 ఫిబ్రవరి 17 న మరణించాడు. రెండవ తుకోజిరావు హోల్కరు (1835-1886) పాలన 1844 జూన్ 27 న స్థాపించబడింది. 1857 లో జరిగిన భారత తిరుగుబాటు సమయంలో ఆయన బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనీకి విధేయుడుగా ఉన్నాడు. 1872 అక్టోబరులో టి.మాధవరావును ఇండోరు దివానుగా నియమించారు. ఆయన 17 జూన్ 1886 జూన్ 17 న మరణించాడు. ఆయన తరువాత అతని పెద్ద కుమారుడు శివాజీరావు పాలనాబాధ్యత స్వీకరించాడు.
రెండవ యశ్వంతరావు హోల్కరు (1926-1948 పాలన) 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన కొద్దికాలానికే ఇండోరు రాష్ట్రాన్ని పరిపాలించాడు. ఆయన యూనియను ఆఫ్ ఇండియాకు అంగీకరించాడు. ఇండోరు మధ్య భారత్ రాష్ట్ర జిల్లాగా మారింది. ఇది 1956 లో మధ్యప్రదేశు రాష్ట్రంలో విలీనం చేయబడింది.
1948 ఏప్రెలు 22 న ఇండోరు మహారాజా ప్రక్కనే ఉన్న రాచరిక పాలకులతో ఒక ఒప్పందం కుదుర్చుకుని మధ్య భారత్ అని పిలువబడే కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. మధ్య భారత్ 28 మే 1948 న సృష్టించబడింది. జూన్ 16, 1948 న, హోల్కరు సభ పాలించిన ఇండోరు రాచరిక రాజ్యం కొత్తగా స్వతంత్ర భారత రాష్ట్రాలతో విలీనం అయ్యింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.