స్ట్రాటోస్ఫియర్
From Wikipedia, the free encyclopedia
స్ట్రాటోస్ఫియర్ అనేది భూమి వాతావరణం లోని రెండవ పొర. ఇది ట్రోపోస్పియరుకు పైన, మీసోస్పియరుకు క్రిందన ఉంటుంది.[1] స్ట్రాటోస్ఫియరు అనేది స్తరీకరించబడిన ఉష్ణోగ్రత పొరలతో కూడిన వాతావరణ పొర. ఇందులో వెచ్చని గాలి పొరలు ఆకాశంలో ఎత్తున, చల్లని పొరలు భూమి ఉపరితలానికి దగ్గరగానూ ఉంటాయి. సూర్యుని అతినీలలోహిత (UV) రేడియేషన్ను ఓజోన్ పొర గ్రహించడం వల్ల ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతూంటుంది.[2] ఉష్ణోగ్రత విలోమం భూమి ఉపరితలానికి దగ్గరగా ఉన్న ట్రోపోస్పియరుతో పోలిస్తే వ్యతిరేకంగా ఉంటుంది -ట్రోపోస్పియరులో ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ట్రోపోస్ఫియరును తెలుగులో ట్రోపో ఆవరణం అనడం కద్దు.
ట్రోపోస్ఫియర్ స్ట్రాటోస్ఫియరుల మధ్య ట్రోపోపాజ్ సరిహద్దు ఉంది. ఇక్కడే ఉష్ణోగ్రత విలోమం మొదలౌతుంది. భూమధ్యరేఖకు సమీపంలో, స్ట్రాటోస్ఫియరు దిగువ అంచు 20 కి.మీ. (66,000 అ.; 12 మై.) వరకు ఉంటుంది. మధ్య అక్షాంశాల వద్ద 10 కి.మీ. (33,000 అ.; 6.2 మై.), ధ్రువాల వద్ద సుమారు 7 కి.మీ. (23,000 అ.; 4.3 మై.) ఉంటుంది.[2] ఉష్ణోగ్రతలు సగటున ట్రోపోపాజ్ వద్ద −51 °C (−60 °F; 220 K) నుండి మెసోస్పియర్ దగ్గర సగటున −15 °C (5.0 °F; 260 K) వరకు ఉంటాయి.[3] ఋతువులు మారుతూంటే స్ట్రాటోస్ఫియరులో ఉష్ణోగ్రతలు కూడా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా ధ్రువ రాత్రి (శీతాకాలం)లో ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉంటాయి.[4] స్ట్రాటోస్ఫియరు లోని గాలులు ట్రోపోస్పియరులోని గాలివేగాలను మించి 60 m/s (220 km/h; 130 mph) కి చేరుకుంటాయి.[4]