మధ్యధరా సముద్రం
అట్లాంటిక్ మహాసముద్రానికి అనుసంధానమై ఉన్న సముద్రం / From Wikipedia, the free encyclopedia
మధ్యధరా సముద్రం అట్లాంటిక్ మహాసముద్రమునకు కలసి ఉన్న ఒక సముద్రం. మధ్యధరా పరీవాహక ప్రాంతంచే చుట్టబడి ఉంది. ఈ సముద్రం పూర్తిగా భూభాగాలచే చుట్టబడివున్నది. ఉత్తరాన ఐరోపా , దక్షిణాన ఆఫ్రికా ఖండాలు గలవు. మధ్యధరా అనగా "భూభాగం మధ్యలో గలది". [1] దీని విస్తీర్ణం దాదాపు 25 లక్షల చదరపు కిలోమీటర్లు లేదా 9,65,000 చ.మైళ్ళు. కానీ ఇది అట్లాంటిక్ మహాసముద్రానికి లంకె (జిబ్రాల్టర్ జలసంధి) కేవలం 14 కి.మీ. వెడల్పు కలిగివున్నది. సముద్రాల అధ్యయన శాస్త్రంలో కొన్ని సార్లు దీనిని, "యూరోఫ్రికన్ మధ్యధరా సముద్రం" అనికూడా అంటారు. పాశ్చాత్య నాగరికత చరిత్రలో ఈ సముద్రం కేంద్ర పాత్ర వహించింది. దాదాపు 5.9 మిలియన్ సంవత్సరాల క్రితం, మధ్యధరా సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం నుండి పూర్తిగా వేరుపడి, మెస్సినియన్ లవణీయ సంక్షోభంలో, 6 లక్షల సంవత్సరాల పాటు పాక్షికంగానో, పూర్తిగానో ఎండిపోయి, తిరిగి 5.3 మిలియన్ సంవత్సరాల క్రితం సంభవించిన జాన్క్లియన్ వరదలో తిరిగి నీటిని నింపుకున్నదని భౌగోళిక ఆధారాలు సూచిస్తున్నాయి.
మధ్యధరా సముద్రం దాదాపు 2,500,000 km2 (970,000 sq mi) మేరకు విస్తరించింది.[2] ఇది భూమి యొక్క పూర్తి సముద్రతలంలో 0.7% శాతం. కానీ అంతటి సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రానికి కలిసే జిబ్రాల్టర్ జలసంధి (అట్లాంటిక్ మహాసముద్రం, మధ్యధరాసముద్రానికి కలుపుతూ, ఐరోపాలోని ఐబీరియన్ ద్వీపకల్పాన్ని, ఆఫ్రికాలోని మొరాకోను విడదీస్తున్న జలసంధి) వద్ద కేవలం 14 km (9 mi) వెడల్పు మాత్రమే ఉన్నది.