పక్షులు రెండు కాళ్ళు, రెక్కలు కలిగియుండి ఎగురగలిగే, అండోత్పాదక జంతువులు. తెలుగు భాషలో పక్షి పదానికి వికృతి పదము పక్కి. ప్రపంచ వ్యాప్తంగా ఇంచుమించుగా 10,000 జాతుల పక్షులున్నాయి. ఇవి అతిచిన్న పరిమాణం నుండి 6 అడుగుల వరకూ ఉన్నాయి. దొరికిన శిలాజాల ప్రకారం పక్షులు జురాసిక్ యుగం (150-200 మిలియన్ సంవత్సరాల పూర్వం) నుండి పరిణామం చెందాయి. పక్షులకు సంబంధించిన విజ్ఞాన శాస్త్రాన్ని 'ఆర్నిథాలజీ' (ornithology) అంటారు. ప్రతి సంవత్సరం మే నెల రెండవ శనివారం అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం నిర్వహించబడుతుంది.[1]
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి.
ఎగరడానికి అనుకూలంగా ఉండడానికి దేహం సాధారణంగా కదురు ఆకారంలో ఉండి కుదించినట్లు అమరి ఉంటుంది. వాయుగోణులు ఉండటం వల్ల తేలికగా ఉంటుంది. పూర్వాంగాలు రెక్కలుగా మార్పుచెంది ఉంటాయి. చరమాంగాలు పెద్దవిగా ఉండి జీవి దేహం బరువును మోయడానికి తోడ్పడతాయి. ఆహార సంగ్రహణ, ఈదడం, చెట్టు కొమ్మలను పట్టుకోవడం మొదలయిన వాటికి చరమాంగాలు ఉపయోగపడతాయి.
శరీరం ఈకలతో కప్పబడి ఉంటుంది. ఇవి బాహ్య అస్థిపంజరంలో భాగంగా ఉంటాయి. ఇవి నాలుగు రకాలు. అవి: 1.కాటోర్ ఈకలు, 2. పైలోప్లూమ్ లు, 3. క్విల్ ఈకలు, 4. డేన్ ఈకలు.
వీటిలో ఒకే ఒక గ్రంథి (తైల గ్రంథి లేదా ప్రీన్ గ్రంథి) తోకపై ఉంటుంది. ఇది క్విల్ ఈకలపై మైనపు పూతను ఏర్పరుస్తాయి.
పక్షుల అస్థిపంజరంలోని ఎముకలు వాతలాస్థులు. అస్థి మజ్జ ఉండదు. మోనో కాండైలిక్ కపాలం ఉంటుంది. విషమ గర్తి కశేరుకాలు ఉంటాయి. పర్శుకలు ద్విశిరోభాగంతో ఉంటాయి. కొన్ని కశేరుకాలు కలియడం వల్ల సంయుక్త త్రికం (Synsacrum) ఏర్పడుతుంది. ఉరోస్థి ఉదర మధ్య భాగంలో కెరైనా ఉండి ఉడ్డయక కండరాలు అతుక్కోవడానికి తోడ్పడుతుంది. అంసఫలకం (Scapula) పట్టాకత్తి ఆకారపు ఎముక. జత్రుకలు రెండూ కలిసి ఫర్కులా లేదా విష్ బోన్ ఏర్పడుతుంది.
కండర వ్యవస్థ వైహాయన జీవనానికి అనుకూలంగా రూపాంతరం చెందింది. రెక్కల విధినిర్వహణలో తోడ్పడే కండరాలను ఉడ్డయక కండరాలు (Flight muscles) అంటారు.
ఆహారవాహిక అన్నాశయంగా విస్తరించి ఆహార పదార్ధాల నిల్వకు తోడ్పడుతుంది.
నాలుగు గదుల గుండె ఉంటుంది. సిరాసరణి, మూలమహాధమనులు ఉండవు. కుడి దైహిక చాపం ఉంటుంది.
ఊపిరితిత్తులు స్పంజికాయుతంగా ఉంటాయి. ఇవి 9 వాయుగోణులను కలిగి ఉంటాయి. పక్షులలో స్వరపేటిక వల్ల కాక ఉబ్బిన వాయునాళం ప్రాథమిక శ్వాసనాళికలకు మధ్య గల శబ్దిని (Syrynx) ద్వారా శబ్దం ఉత్పత్తి అవుతుంది.
మూత్రపిండాలు అంత్యవృక్కాలు. మూడు లంబికలను కలిగి ఉంటాయి. మూత్రాశయం ఉండదు. యూరిక్ ఆమ్లం విసర్జక పదార్థం.
పక్షులు మానవులకు ముఖ్యమైన ఆహారము. వీటిలో ముఖ్యమైనవి కోడి, కోడి గుడ్లు. ఇవే కాకుండా బాతు, టర్కీ కోడి, ఈము మొదలైన పక్షుల మాంసం కూడా తినబడేవి. పురాతన కాలంలో పక్షుల్ని వేటాడేవారు,[2] దీనిమూలంగా కొన్ని పక్షి జాతులు అంతరించిపోయాయి.[3]
చిలుక, మైనా మొదలైన రంగురంగుల అందమైన పక్షులను పెంచుకుంటారు. ఈ రకమైన వ్యాపారం కోసం కొన్ని అరుదైన పక్షులు స్మగ్లింగ్ చేయబడి అంతరించిపోయాయి.[4]
కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడానికి ఉపయోగించారు. పావురాలను వార్తాహరులుగా 1వ శతాబ్దంలో ఉపయోగించేవారు. కొన్ని రకాల పక్షులను వేటకోసం, చేపల్ని పట్టడానికి వాడేవారు.[5]
జంతువులలో ప్రయోగాల కోసం ఎక్కువగా కోళ్ళు, పావురాలను ఉపయోగిస్తారు. ఇవి ముఖ్యంగా జీవ శాస్త్రం, మానసిక శాస్త్రంలో వాడతారు.
Simeone A, Navarro X 078X2002000200012&lng=es&nrm=iso&tlng=en "Human exploitation of seabirds in coastal southern Chile during the mid-Holocene."] Rev. chil. hist. nat75 (2): 423–31