From Wikipedia, the free encyclopedia
తమిళనాడు (గతంలో మద్రాసు రాష్ట్రంగా కొన్నాళ్ళు, మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా కొన్నాళ్ళు ఉండేది) లో భారత స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత హిందీ వ్యాప్తి చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా జరిగిన వరుస ఆందోళనలను తమిళనాడులో హిందీ వ్యతిరేకోద్యమం అని పిలుస్తారు. ఈ ఆందోళనల్లో భారీ ప్రదర్శనలు, దాడులు ఉన్నాయి, రాష్ట్రంలో హిందీకి అధికార హోదా ఏర్పడడానికి వ్యతిరేకంగా పలు రాజకీయ, విద్యార్థి ఉద్యమాలు జరిగాయి.
మద్రాసు ప్రెసిడెన్సీలో సి.రాజగోపాలాచారి నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం హిందీ బోధన అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేయడంతో మొట్టమొదట హిందీ వ్యతిరేకోద్యమం 1937లో జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వులను వెనువెంటనే ఇ.వి. రామస్వామి నాయకర్ (పెరియార్), ప్రతిపక్షమైన జస్టిస్ పార్టీ వ్యతిరేకించారు. మూడు సంవత్సరాల పాటు కొనసాగిన ఆందోళన బహుముఖీనంగా సాగింది, దీనిలో భాగంగా నిరాహారదీక్షలు, సమావేశాలు, పాదయాత్రలు, పికెటింగ్, ఆందోళన వంటి చేశారు. ప్రభుత్వం తీవ్రంగా ప్రతిస్పందించింది, ఇద్దరు ఆందోళనకారులు మృతిచెందగా, పిల్లలు, మహిళలు సహా 1198 మంది అరెస్టయ్యారు. 1939లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా చేశాకా, 1940 ఫిబ్రవరిలో మద్రాసు ప్రెసిడెన్సీ బ్రిటీష్ గవర్నర్ నిర్బంధ హిందీ విద్యాభ్యాసాన్ని ఉపసంహరించారు. యునైటెడ్ కింగ్డం నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం లభించాకా రాజ్యాంగ రచన సందర్భంగా భారత రిపబ్లిక్కు అధికారిక భాషను స్వీకరించడం తీవ్ర చర్చలకు కేంద్ర బిందువు అయింది.
విస్తృతమైన, వేర్వేరు వాదాలతో కూడిన చర్చ తర్వాత భారత దేశానికి అధికారిక భాషగా హిందీని స్వీకరించి, ఆంగ్లాన్ని అనుబంధ అధికారిక భాషగా తాత్కాలికంగా 15 సంవత్సరాల కాల వ్యవధికి ఏర్పరిచారు, ఆ తర్వాత హిందీ ఏకైక అధికారిక భాషగా కొనసాగుతుందన్నది ఏర్పాటు. 1950 జనవరి 26న కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 1965 తర్వాత హిందీని ఏకైక అధికారిక భాషగా చేసే ప్రయత్నం చాలా హిందీయేతర భారత రాష్ట్రాలకు ఆమోదం కాలేదు, వారు ఆంగ్లం వాడకాన్ని కొనసాగించాలని వాదించారు. ద్రవిడ కళగం నుంచి విడిపోయి ఏర్పడ్డ రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కళగం (డిఎంకె) హిందీ వ్యతిరేకతకు యత్నాలకు నేతృత్వం వహించింది. వారి భయాందోళనలు తొలగించేందుకు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1963లో అధికారిక భాష చట్టాన్ని 1965 తర్వాత కూడా ఆంగ్లం వినియోగాన్ని కొనసాగించేలా చేశారు. చట్టంలోని పాఠ్యం డీఎంకెను సంతృప్తిపరచలేదు, అలానే ఈ హామీలు భవిష్యత్ ప్రభుత్వాలు గౌరవించకపోవచ్చన్న సంశయవాదం ప్రారంభమైంది. హిందీని ఏకైక అధికారిక భాషగా మార్చే 1965 జనవరి 26 తేదీన హిందీ వ్యతిరేకోద్యమం మద్రాసు రాష్ట్రంలో అత్యంత వేగం సంతరించుకుంది, కళాశాల విద్యార్థులు ఉద్యమాన్ని సమర్థించసాగారు. 25 జనవరి తేదీన మద్రాసు రాష్ట్రపు దక్షిణాది నగరమైన మదురైలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య జరిగిన చిన్న వివాదం రాజుకుని పూర్తిస్థాయి అల్లర్లు చెలరేగాయి, ఇవి తర్వాత రెండు నెలల పాటు కొనసాగాయి. వీటిలో అనేక హింసాత్మక చర్యలు, లూటీలు, గృహదహనాలు, పోలీసు కాల్పులు, లాఠీఛార్జీలు చోటుచేసుకున్నాయి. ఆందోళనను అణచివేయడానికి మద్రాసు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పారామిలటరీ దళాలను రప్పించాయి; వారి రాకతో ఇద్దరు పోలీసులు సహా అధికారిక అంచనాల ప్రకారం 70 మంది మరణించడం జరిగింది. పరిస్థితిని శాంతపరచడానికి భారత ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి హిందీ భాషేతర రాష్ట్రాలు కోరే వరకూ ఇంగ్లీష్ అధికారిక భాషగా కొనసాగుతుందని హామీనిచ్చారు. అల్లర్లు, విద్యార్థుల ఆందోళన శాస్త్రి హామీ తర్వాత సద్దుమణిగాయి. 1965 నాటి ఆందోళనలు రాష్ట్రంలో ప్రధాన రాజకీయ మార్పులకు కారణమయ్యాయి. డీఎంకె 1967లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందింది, ఆపై మరోమారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి మరెప్పుడూ రాలేకపోయింది.
భారతదేశంలో వందలాది భాషలు ఉన్నాయి.[1] బ్రిటీషు రాజ్ సమయంలో, ఆంగ్లం అధికారిక భాష. భారత స్వాతంత్ర్యోద్యమం 20వ శతాబ్దిలో వేగం పుంజుకున్నప్పుడు హిందుస్తానీని వేర్వేరు భాషా సమూహాలను బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకం చేసేందుకు సామాన్య భాషగా చేసే ప్రయత్నాలు సాగాయి. 1918లో మహాత్మా గాంధీ దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తి చేయడం లక్ష్యంగా దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఏర్పాటుచేశారు. 1925లో భారత జాతీయ కాంగ్రెస్ తన కార్యక్రమాలు, చర్చలను జరపడానికి భాషగా ఇంగ్లీషుని విడిచిపెట్టి హిందుస్తానీని స్వీకరించింది.[2] గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ - ఇద్దరూ హిందుస్తానీ హిందుస్తానీ సమర్థకులు, హిందీయేతర భాషలు మాట్లాడే ప్రావిన్సుల్లో హిందుస్తానీ నేర్చుకోవడం పెరగాలని కాంగ్రెస్ ఆశించింది.[3][4][5] హిందీ లేదా హిందుస్తానీ భాషని సాధారణ భాషగా ఏర్పరిచే ఆలోచన ఇ.వి.రామస్వామి నాయకర్ వంటివారికి రుచించలేదు, ఈ ప్రయత్నాన్ని వారు ఉత్తర భారతీయులు తమిళులపై ఆధిపత్యం చెలాయించేందుకు చేస్తున్న ప్రయత్నంగా భావించారు.[6]
మద్రాసు ప్రెసిడెన్సీలో 1937 ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ గెలుపొందింది. రాజాజీ 1937 జూలై 14న ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన దక్షిణ భారతదేశంలో హిందీ విస్తరణ సమర్థకుడు. 1937 ఆగస్టు 11న[8] అధికారంలోకి వచ్చిన నెల లోపు విధాన ప్రకటన చేస్తూ హిందీ బోధనని మద్రాసు ప్రెసిడెన్సీలోని మాధ్యమిక పాఠశాలల్లో ప్రవేశపెట్టే ఉద్దేశాన్ని వెల్లడించారు.[9] 1938 ఏప్రిల్ 21న ప్రెసిడెన్సీలోని 125 మాధ్యమిక పాఠశాలల్లో హిందీ బోధన తప్పనిసరి చేస్తూ గవర్నమెంట్ ఆర్డర్ (జీవో) జారీచేశారు. ఇ.వి.రామస్వామి నాయకర్ (పెరియార్), ఎ.టి.పన్నీర్‌సెల్వం నాయకత్వంలోని ప్రతిపక్ష జస్టిస్ పార్టీ దీన్ని వ్యతిరేకించాయి. రాజాజీకీ, హిందీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు ప్రారంభించారు.
పెరియార్ ఆత్మగౌరవ ఉద్యమం, జస్టిస్ పార్టీలు ఈ ఆందోళనలకు మద్దతునిచ్చాయి. మరైమలై అడిగాళ్, సోమసుందర భారతి, కె. అప్పాదొరై, ముడియరసన్, ఇళక్కువనర్ వంటి తమిళ పండితులు కూడా దీన్ని సమర్థించారు. 1937 డిసెంబరులో తమిళ శైవ పండితులు వేలూరులో జరిగిన శైవ సిద్ధాంత మహా సమాజ కాన్ఫరెన్సులో హిందీ బోధనను వ్యతిరేకించి, హిందీ బోధన వ్యతిరేకించిన తొలి సమాజాల్లో ఒకటిగా నిలిచారు.[10] మహిళలు ఆందోళనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూవలుర్ రామమిర్తం, నారాయణి, వ.బ.తమరళ్కని, మున్నగర్ అళగియర్, డాక్టర్ ధర్మంబాళ్, మలర్ ముగతమ్మైయార్, పట్టమ్మాళ్, సీతమ్మాళ్ ఈ ఆందోళన సందర్భంగా అరెస్టైన మహిళల్లో కొందరు.[11] 1938 నవంబరు 13న[12] తమిళనాడు మహిళల సమాఖ్య ఉద్యమానికి మహిళల మద్దతును కనబరిచేందుకు ఓ ప్రదర్శన చేసింది.[13][14] ఆందోళనకారులు తమిళంపై హిందీ, సంస్కృతాలను బ్రాహ్మణులు రుద్దుతున్నారని భావించడంతో బ్రాహ్మణ వ్యతిరేక సెంటిమెంట్లు ఆందోళనలో చోటుచేసుకున్నాయి.[15][16][17][18] సాధారణంగా బ్రాహ్మణ వ్యతిరేకత ఆందోళనలో భాగంగా ఉన్నా, కంచి రాజగోపాలాచారి వంటి కొందరు బ్రాహ్మణులు ఉద్యమంలో పాలుపంచుకున్నారు.[19] మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళ్ మాట్లాడే ముస్లింలు ఉద్యమాన్ని సమర్థించారు, అందుకు భిన్నంగా ఉర్దూ మాట్లాడే ముస్లింలు హిందీ వ్యాప్తికి మద్దతునిచ్చారు. ఆందోళనలో నిరాహారదీక్షలు, [19][20] నిరసన యాత్రలు, ఊరేగింపులు, [2][9][21] హిందీ బోధించే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వాసుపత్రుల ముందు పికెటింగ్, [22] హిందీ వ్యతిరేక సమావేశాలు, హిందీ వ్యతిరేక దినం నిర్వహించడం (1 జూలై[21][23]) నల్ల జెండా ప్రదర్శనలు వంటివి భాగమయ్యాయి. ప్రెసిడెన్సీలోని తమిళం మాట్లాడే జిల్లాలైన - రామనాథపురం, తిరునెల్వేలి, సేలం, తంజావూర్, ఉత్తర ఆర్కాట్ వంటివాటిలో ఆందోళన ఉధృతంగా సాగింది.[9] ఆందోళన కాలంలో ఇద్దరు ఆందోళనకారులు తలముత్తు, నటరాజన్ పోలీస్ కస్టడీలో ప్రాణాలు కోల్పోయారు.[24][25][26]
పాలక పక్షమైన కాంగ్రెస్ పార్టీ హిందీ అంశంపై విభజితమైంది. రాజాజీ, ఆయన మద్దతుదారులు హిందీకి అనుకూలంగా తమ విధానానికి కట్టుబడివుండిపోగా, ఎస్.సత్యమూర్తి, సర్వేపల్లి రాధాకృష్ణన్ వ్యతిరేకించారు. వారు హిందీని ఐచ్ఛికం చేయాలని, తద్వారా తల్లిదండ్రులు కావాలనుకుంటే విద్యార్థులను హిందీ నుంచి మినహాయించే వీలుంటుందని కోరారు. కానీ రాజాజీ తన వైఖరికి దృఢంగా కట్టుబడ్డారు. 1939లో వెళ్ళేకొద్దీ ఆందోళనలకు పోలీసుల ప్రతిస్పందన క్రూరం కావొచ్చింది. ఆందోళన కాలంలో 1198 మంది ఆందోళన కారులు అరెస్టు కాగా వారిలో 1179 మందికి శిక్ష పడింది. (వీరిలో 73 మంది మహిళలు, 32 మంది తమ తల్లుల్ని అంటిపెట్టుకున్న పిల్లలు).[11] పెరియార్‌కు మహిళలను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ప్రేరేపించినందుకు వెయ్యి రూపాయలు జరిమానా, సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించారు. (వైద్య కారణాలను పేర్కొంటూ ఆరు నెలలకే 1939 మే 22న ఆయనను విడుదల చేశారు),[27] అణ్ణాదురైను 4 నెలల పాటు అరెస్టు చేశారు.[28][29] 1939 జూన్ 7న అరెస్టైన ఆందోళనకారులను అందరినీ ఏ కారణాలు వివరించకుండా విడుదల చేశారు.[27] రాజాజీ ఆందోళనకారుల వాదాలను వ్యతిరేకిస్తూ హిందుస్తానీ అనుకూల సమావేశాలు నిర్వహించారు.[9][22] 1939 అక్టోబరు 29న భారతదేశం రెండవ ప్రపంచ యుద్ధంలో చేరుతున్నట్టు ఏకపక్షంగా వైశ్రాయ్ ప్రకటించినందుకు నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా చేసింది, మద్రాసు ప్రొవెన్షియల్ ప్రభుత్వాన్ని గవర్నర్ పాలనలో ఉంచారు. అక్టోబరు 31న పెరియర్ ఆందోళనను విరమిస్తూ, గవర్నర్‌ని తప్పనిసరి హిందీ ఉపసంహరించుకుంటూ ఉత్తర్వులివ్వమని కోరారు.[27] 1940 ఫిబ్రవరి 21న గవర్నర్ ఎర్స్కిన్ తప్పనిసరి హిందీ బోధనను ఉపసంహరించుకుంటూ, దాన్ని ఐచ్ఛికం చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.[30]
1946-50 మధ్యకాలంలో పెరియార్ నాయకత్వంలో ద్రవిడర్ కళగం (డికె) హిందీకి వ్యతిరేకంగా చెదురుమదురు ఆందోళనలు కొనసాగించింది. పాఠశాలల్లో హిందీని తప్పనిసరి సబ్జెక్టుగా ప్రవేశపెట్టినప్పుడల్లా హిందీ వ్యతిరేక ఆందోళనలు సాగాయి, ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో విజయం సాధించాయి.[31] ఈ కాలంలో అతి తీవ్రమైన హిందీ వ్యతిరేక ఆందోళనలు 1948-50 కాలంలో జరిగాయి. భారతదేశం స్వాతంత్ర్యం పొందాకా 1947లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను పాఠశాలల్లో హిందీ బోధన తప్పనిసరి చేయమని కోరింది. మద్రాసు ప్రెసిడెన్సీలో ఒ.పి.రామస్వామి రెడ్డియార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1948-49 విద్యా సంవత్సరంలో హిందీని తప్పనిసరి చేసింది. పై తరగతులకు ప్రమోట్ కావడానికి కనీస మార్కును అర్హతగా ప్రవేశపెట్టారు. పెరియార్ మరోసారి హిందీ వ్యతిరేక ఉద్యమం ప్రారంభించారు. 1948 ఉద్యమాన్ని గతంలో హిందీ అనుకూల విధానం అనుసరించిన గత కాంగ్రెస్ జాతీయవాదులు ఎం.పి.శివజ్ఞానం, వి.కళ్యాణసుందరం కూడా మద్దతునిచ్చారు. 17 జూలైన డికె ఆధ్వర్యంలో హిందీ వ్యతిరేక అఖిల పక్ష సమావేశాన్ని తప్పనిసరి హిందీ బోధన వ్యతిరేకించేందుకు ఏర్పరిచింది. 1938-40 ఆందోళనలానే, ఈ ఆందోళనలో కూడా సమ్మెలు, నల్ల జెండా ప్రదర్శనలు, హిందీ వ్యతిరేక హిందీ వ్యతిరేక ఊరేగింపులు వంటివి జరిగాయి. అప్పటి భారత గవర్నర్ జనరల్ అయిన రాజాజీ ఆగస్టు 23న మద్రాసు సందర్శించేందుకు వచ్చినప్పుడు ఆయన పర్యటనని వ్యతిరేకిస్తూ డికె నల్ల జండాల ప్రదర్శన చేశారు. ఆగస్టు 27న పెరియార్, అణ్ణాదురై అరెస్ట్ అయ్యారు. ప్రభుత్వం హిందీపై తన వైఖరి మార్చుకోకపోవడంతో ఆందోళన కొనసాగింది. డిసెంబరు 18న పెరియార్, ఇతర ద్రవిడ కళగం నేతలు మళ్ళీ అరెస్ట్ అయ్యారు. ప్రభుత్వం, ఆందోళనకారుల మధ్య ఓ రాజీ కుదిరింది. ప్రభుత్వం ఆందోళనకారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఆపుచేశారు, 1948 డిసెంబరు 26న ఆందోళన నిలిపివేశారు. క్రమంగా ప్రభుత్వం 1950-51 విద్యా సంవత్సరంలో హిందీ బోధనను ఐచ్ఛికం చేశారు. హిందీ బోధనను ఇష్టపడని విద్యార్థులు ఆ సమయంలో ఇతర పాఠశాల కార్యకలాపాల్లో పాల్గొనడానికి అనుమతించారు.[2][13][32][33]
స్వతంత్ర భారత దేశానికి రాజ్యంగ నిర్మాణం చేసేందుకు 1946 డిసెంబరు 9న భారత రాజ్యాంగ అసెంబ్లీ ఏర్పడింది. భాష విషయంపై రాజ్యాంగ అసెంబ్లీలో తీవ్రమైన వాదాలు జరిగాయి. జాతీయ భాషను స్వీకరించడం, రాజ్యాంగం రాసేందుకు ఎంచుకునే భాష, రాజ్యాంగ అసెంబ్లీలో చర్చలకు ఉపయోగించాల్సిన భాష రాజ్యాంగ నిర్మాతలు చేసిన భాషాపరమైన చర్చల్లో ప్రధాన ప్రశ్నలు.[34] ఒకవైపున హిందీ మాట్లాడే ప్రావిన్సులకు చెందిన అల్గు రాయ్ శాస్త్రి, పండిట్ రఘునాథ్ వినాయక్ ధులేకర్, బాలకృష్ణ శర్మ, పురుషోత్తమ్ దాస్ టాండన్, (అందరూ యునైటెడ్ ప్రావిన్సులకు చెందినవారే), బాబూనాథ్ గుప్త (బీహార్), హరి వినాయక్ పటాస్కర్ (బాంబే), రవిశంకర్ శుక్లా, సేథ్ గోవింద్ దాస్ (సెంట్రల్ ప్రావిన్సులు, బిరార్) ఉన్నారు. వీరు హిందీ అనుకూల సవరణలు ప్రతిపాదించి, హిందీని ఏకైక జాతీయ భాషగా స్వీకరించాలని వాదించేవారు.[35][36] 1946 డిసెంబరు 10న ధులేకర్ మాట్లాడుతూ - హిందుస్తానీ తెలియని ప్రజలకు భారతదేశంలో నివసించే హక్కు లేదు. రాజ్యాంగాన్ని రూపకల్పన చేసేందుకు ఏర్పాటైన సభలో ఉండీ హిందుస్తానీ తెలియనివారు, ఈ అసెంబ్లీ సభ్యులుగా ఉండతగరు. వాళ్ళు అసెంబ్లీ విడిచి వెళ్ళడం ఉత్తమం అన్నారు.[34][37]
హిందీని జాతీయ భాషగా గుర్తించాలన్న దానికి అనుకూలంగా ఉన్న రాజ్యాంగ సభ సభ్యుల్లో కూడా రెండు శిబిరాలున్నాయి: టాండన్, శివశంకర్ శుక్లా, గోవింద్ దాస్, సంపూర్ణానంద్, కె.ఎం.మున్షీ వంటివారితో కూడిన హిందీ శిబిరం ఒకటి, జవహర్లాల్ నెహ్రూ, అబుల్ కలాం ఆజాద్ లతో కూడిన హిందుస్తానీ శిబిరం మరొకటి.[38] రాజ్యాంగ సభలో దక్షిణ భారతదేశానికి చెందిన సభ్యులు - టి.టి.కృష్ణమాచారి, జి. దుర్గాబాయ్, టి.ఎ. రామలింగం చెట్టియార్, ఎన్.జి.రంగా, ఎన్. గోపాలస్వామి అయ్యంగార్ (అందరూ మద్రాసు ప్రెసిడెన్సీకి చెందినవారే), ఎస్.వి.కృష్ణమూర్తి రావు (మైసూర్) వంటివారు హిందీని జాతీయ భాషగా స్వీకరించడాన్ని వ్యతిరేకించారు. ఈ హిందీ వ్యతిరేక పక్షం వారు ఇంగ్లీషుని అధికారిక భాషగా కొనసాగించడానికి మొగ్గుచూపారు.[38][39]
కృష్ణమాచారి చేసిన ఈ కింది వ్యాఖ్యల్లో వారి భావాలు గమనించవచ్చు:
గతంలో మేము ఇంగ్లీష్ భాషపై అయిష్టత కలిగివుండే వాళ్ళం. దాని మీద నేనెందుకు అయిష్టత పెంచుకున్నానంటే - నాకు ఏమాత్రం అభిరుచీ లేని షేక్స్పియర్నీ, మిల్టన్ నీ చదువుకోవాల్సి వచ్చింది. మేము హిందీ బలవంతంగా నేర్చుకోవాల్సి వస్తే, నా వయసు కారణంగా నేను దాన్ని నేర్చుకోకపోవచ్చు, అంతేకాక నా మీద పెట్టే నిర్బంధం వల్ల కూడా నేను నేర్చుకోను. ఇలాంటి అసహనం వల్ల మనకు అవసరమైన బలమైన కేంద్రం-కేంద్రంలోని భాష మాట్లాడని ప్రజలపై బానిసత్వం అన్న భయం కూడా కలుగుతుంది. కనుక నా ఉత్తరప్రదేశ్ స్నేహితులు పూర్తి ఇండియా కావాలో, హిందీ-ఇండియా కావాలో తేల్చుకోవాలి. ఎంపిక వాళ్ళదే[34][40]
మూడేళ్ళ చర్చల తర్వాత 1949 చివరిలో రాజీ కుదిరింది.[4][41] దాన్ని మున్షీ-అయ్యంగార్ ఫార్ములా (కె.ఎం.మున్షీ, గోపాలస్వామి అయ్యంగార్ల పేర్ల మీద) గా పిలిచారు, ఇది అన్ని గ్రూపుల డిమాండ్లకూ నడుమ సయోధ్య తీసుకువచ్చింది.[42][43] భారత రాజ్యాంగంలోని పదిహేడవ భాగం ఈ రాజీ ఫార్ములాకు అనుగుణంగా రాశారు. దానిలో జాతీయ భాష గురించి ఏ ప్రస్తావన లేదు. ఐతే యూనియన్ అధికార భాషలను మాత్రం నిర్వచించింది.:[39][44] దేవనాగరి లిపిలోని హిందీ భాష భారత యూనియన్‌కు అధికార భాష అవుతుంది. పదిహేనేళ్ళ పాటు ఆంగ్లం అన్ని అధికారిక కార్యకలాపాలకు ఉపయోగిస్తారు (ఆర్టికల్ 343). ఐదు సంవత్సరాల తర్వాత హిందీని ఏకైక అధికారిక భాషగా చేసేందుకు, క్రమంగా ఆంగ్ల భాష ఉపయోగాన్ని తగ్గించడానికి మార్గాలను సూచించేందుకు భాషా కమిషన్ని ఏర్పాటుచేస్తారు. (ఆర్టికల్ 345). ఆంగ్లాన్ని అన్ని చట్టపరమైన, న్యాయపరమైన అవసరాలకు - కోర్టు కార్యకలాపాలు, బిల్లులు, చట్టాలు, రూల్స్, నిబంధనలు వంటివాటన్నిటికీ ఉపయోగిస్తారు (ఆర్టికల్ 344). రాష్ట్రాల నడుమ, రాష్ట్రాలకు కేంద్రానికి నడుమ అధికారిక కమ్యూనికేషన్ యూనియన్ అధికారిక భాషలోనే జరుగుతుంది (ఆర్టికల్ 348). హిందీ వాడకం, విస్తరణ వంటివాటికి సహకరించడం యూనియన్ విధి (ఆర్టికల్ 351).
1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్రమైంది, 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.