తమలపాకు లేదా నాగవల్లి భారతదేశంలో విరివిగా ఉపయోగించే తాంబూలంలో ముఖ్యమైన భాగం. ఈ ఎగబ్రాకే మొక్కను తేమగల వేడి ప్రదేశాలలో పెంచుతారు. ఇది పైపరేసి కుటుంబానికి చెందింది.[1]
దీని ఔషథ ధర్మాల మూలంగా కొద్దిగా ఉద్దీపనలు కలిగించేదిగా ముఖ్యమైంది.
బీటిల్, అనే పదం తమిళ పదమైన వెట్టిల నుండి వచ్చింది. ఈ పదం పోర్చుగీసు ద్వారా వచ్చింది. దీనిని పానా ఆకులని ఉత్తర భారతదేశంలో పిలుస్తారు.[2]
తమలపాకు దక్షిణ, అగ్నేయ ఆసియాలోనూ, పాకిస్తాన్[3] నుండి న్యూగినియా[4] వరకూ విస్తృతంగా పండిస్తారు. బంగ్లాదేశ్ లో రైతులు దీనిని "బరుయి" అని పిలుస్తారు.[5] ఈ తమలపాకులు పండించే క్షేత్రాన్ని "బరౌజ్" అని పిలుస్తారు. ఈ "బరౌజ్" వెదురు కర్రలతోనూ, కొబ్బరి ఆకులతోనూ కంచె కడతారు.
తమలపాకు సంవత్సర వర్షపాతం 750-1500 మి.మీ. కలిగి, 10-40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గలిగిన ప్రాంతాలు అనువైనవి. నీరు ఇంకే సారవంతమైన లేటరైట్, ఎర్ర గరప నేలలు వీటి సాగుకు అనువైనవి.[6] ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఆధిక దిగుబడిని ఇచ్చే కపూరి రకాలను పండిస్తున్నారు.
మే-జూన్ నెలలలో భూమిని బాగా దున్ని చదునుచేసి ఎకరాకు 16-20 కిలోల అవిశ విత్తనాలను సాలుకు మీటరు దూరంలో ఉంచి వత్తుగా విత్తాలి. ఈ అవిశ విత్తనాలను ఉత్తరం, దక్షిణం దిక్కులకు మాత్రమే విత్తుకోవాలి.
విత్తిన 2 నెలల తర్వాత సాళ్ళ మధ్య మట్టిని చెక్కి అవిశ మొదళ్ళ వద్ద వేసి కయ్యలు చేసి వాటి మధ్య 50 సెం.మీ. లోతు 20 సెం.మీ. వెడల్పు గల గుంతలను 20 సెం.మీ. ఎడంలో తీసి ఎకరాకు 20,000 తమలపాకు తల తీగలను 6-8 కణుపులు ఉండేటట్లు ఎన్నుకొని తీగలను నాటే ముందు 0.5% బోర్డో మిశ్రమం+250 పి.పి.యం స్ట్రెప్టోసైక్లిన్ మిశ్రమంలో 10 నిమిషాలు శుద్ధిచేసి నాటుకోవాలి. ఈ విత్తనపు తీగలను ఆరోగ్యవంతమైన తోట నుండి సేకరించాలి. నాటడానికి ముందుగా నీరు పెట్టే కాలువలు, మురుగునీరు కాలువలను చేసుకోవాలి. చలి, ఎండాకాలాల్లో తోటల చుట్టూ గాలులు సోకకుండా దడులు కట్టాలి.
తీగలు నాటిన మొదటి ముడు రోజుల వరకు రెండు పూటలా నీరు కట్టాలి. తర్వాత రోజూ ఒక పూట (సాయంత్రం) మాత్రమే కట్టాలి. ఆ తర్వాత రోజు మార్చి రోజు 3 సార్లు సాయంత్రం వేళ నీరు కట్టాలి. తర్వాత 10 రోజుల కొకసారి ఒక తడి చొప్పున నీరు పెట్టాలి. వేసవి కాలంలో 2-3 రోజులకొకసారి తడి ఇవ్వాలి.
చిగురించిన తీగలను, పెరగడానికి మొదలైన 15 రోజులకు జమ్ముతో అవిశ మొక్కలను కట్టి ప్రాకించాలి. ఈ పనిని 15-20 రోజుల కొకసారి చేయాలి. వేగంగా వీచే గాలులకు అవిశ మొక్కలు వంగే ప్రమాదమం ఉండడం వలన వీటిని ఒకదానికొకటి తాడుతో కట్టి, సాలు చివర నాటిన వెదురు గడలకు కట్టాలి. సరిపడేటంత వెలుతురు, నీడ ఉండేలా అవిశ కొమ్మలను కత్తిరించుకోవాలి. తెగులు సోకిన ఆకులను, తీగలను ఎప్పటికప్పుడు ఏరి కాల్చివేయాలి. రెండు సంవత్సరాల కొకసారి మొక్కజొన్నతో పంట మార్పిడి చేయాలి.
తీగ నాటే ముందు దుక్కిలో ఎకరాకు 40 కిలోల సూపర్ ఫాస్ఫేట్ రూపంలో భాస్వరం, 40 కిలోల పొటాష్ వేయాలి. తీగ నాటిన 2 నెలల నుండి నత్రజనిని ఎకరాకు 80 కిలోలు, వేపపిండి + యూరియా 1:1 నిష్పత్తిలో సంవత్సరానికి 4 నుండి 6 దఫాలుగా వాడాలి. ఎకరాకు ఒక టన్ను చొప్పున జిప్సం వేసుకోవాలి.
నాటిన 2 నెలలకు ఆకులు కోతకు వస్తాయి. తర్వాత ప్రతి నెల ఆకులకు ఇనుప గోరు సహాయంతో కోయాలి. మొదటి సంవత్సరంలో తోట నుండి ఎకరాలు 30,000 నుండి 40,000 పంతాలు (పంతం అంటే 100 ఆకులు), రెండవ సంవత్సరంలో 40,000 పంతాల దిగుబడి వస్తుంది.
ఆంధ్ర దేశంలో తుని తమలపాకు సుప్రసిద్ధం. తునికి సమీపంలో ఉన్న సత్యవరంలో ఎన్నో తమలపాకు తోటలు ఉండేవి. ఈ సత్యవరం ఆకులు చిన్నగా, లేతగా (కవటాకులు) మృదువుగా, కొద్దిగా కారంగా ఉండి ఎంతో ప్రాముఖ్యం పొందాయి. కాకినాడనూర్జహాన్ కిళ్లీలో తుని తమలపాకు లేకపోతే అది నూర్జహాన్ కిళ్లీ కానేకాదు. విజయనగరం ఆకులు కొంచెం పెద్దగా, దళసరిగా, మృదుత్వం తక్కువ కలిగి ఉంటాయి.
ప్రపంచంలోనే అత్యంత పురాతన మతం హైందవ మతం. హిందూ సంస్కృతి ఏదో రూపంలో ప్రకృతిని పూజించటం. ఆరాధించటానికి ప్రాధాన్యతనిచ్చింది. మనకు సంబంధించిన ఏ పండుగ తీసుకున్నా అందులో ప్రకృతి ఆరాధన మిళితమై వుంటుంది. ఉగాది పండుగకు వేపచెట్టు, సంక్రాంతి పండుగకు ధాన్యరాశులు, పశు సంతతి పట్ల ప్రేమ చూపటం... అలాగే వినాయక చవితి అంటే నానావిధ ఫల.పత్ర, పుష్పాలతో స్వామిని అర్చించటం వుంటుంది. ఇలాంటి విశిష్ట సంస్కృతి మరి ఏ ఇతర మతంలోనూ కనబడదు. ఇక ప్రతి పండుగలో, ప్రతి శుభ సందర్భంలో తాంబూలానికి అగ్రస్థానం ఉంటుంది. హిందూ సంస్కృతిలో తాంబూలానికి - అంటే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొందరు దేవుళ్ళకి నిర్ణీత సంఖ్యలో తమలపాకులతో పూజలు చేస్తారు. తమలపాకుల తాంబూలం కూడా మన సంస్కృతిలో విశిష్ట స్థానం ఆక్రమించింది. ఇలా ఆయర్వేదం కూడా ఆరోగ్యానికి తమలపాకు సేవనాన్ని సూచిస్తుంది. అందరు దేవుళ్లకి తమలపాకులతో పూజలు చేయటం ఉన్నప్పటికి. ఆంజనేయస్వామికి ఆకు పూజ అత్యంత ప్రీతికరమైనది అని చెబుతారు. శత పత్ర పూజ చేస్తే వివిధ దోషాలకు పరిహారం చెల్లించినట్టే అని ఒక నమ్మకం ఉంది. వివిధ నోములు, వ్రతాలు, శుభ కార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు. వస్త్రంతో పాటు రెండు తమలపాకులు కూడా ఇస్తారు.
తమలపాకులను పూజ చేయునప్పుడు దేవునిముందు వుంచు కలశములో ఉంచుతారు.
తాంబూలములో ఉపయోగిస్తారు. భోజనానంతరం తాంబూల సేవనము మన సంప్రదాయం.[7]
తమలపాకుల రసమును గొంతునొప్పి నివారణకు ఉపయోగిస్తారు.
శ్వాసకోశ వ్యాధుల నివారణకై ఈ ఆకులను నూనె రాసి కొద్దిగా వేడిచేసి ఛాతీపై ఉంచుతారు.
అపస్మారకమును నివారించుటకు తమలపాకుల రసమును పాలతో కలిపి త్రాగించెదరు.
ఆరోగ్యపరమైనవి
ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను పక్కన పెడితే, శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ - అంటే పీచు పదార్థం తమలపాకులో చాలా ఎక్కువగా వుంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే, అంతకంటే ఎక్కువగా పని చేస్తాయి. సున్నం, వాక్క తదితర కృత్రిమ పదార్థాలను చేరిస్తే మాత్రం తమలపాకు శరీరానికి హానికరంగా మారుతుందని గ్రహించాలి.[8]
తమలపాకు యాంటాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అంటే ముసలితనపు మార్పులను కట్టడి చేస్తుందన్నమాట.
నూనెలూ ఇతర తైల పదార్థాలూ ఆక్సీకరణానికి గురై చెడిపోవడాన్ని ‘ర్యాన్సిడిటి’ అంటారు. తమలపాకు ఈ ప్రక్రియను అడ్డుకుంటుంది- తైల పదార్థాలు చెడిపోవడానికి గురికాకుండా ఉంచుతుంది. నువ్వుల నూనె, ఆవనూనె, పొద్దుతిరుగుడు నూనె, వేరుశనగ నూనె... ఇలాంటి నూనెలు చెడిపోకుండా వుండాలంటే వాటిల్లో తమలపాకులను వేసి నిల్వచేయండి.
తమలపాకులో ‘చెవికాల్’ అనే పదార్థం ఉంటుంది. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను కట్టడి చేస్తుందని పరిశోధన.
తమలపాకులో ఉండే స్థిర తైలం (ఎసెంషియల్ ఆయిల్) ఫంగస్ మీద వ్యతిరేకంగా పనిచేసి, అదుపులో ఉంచినట్లు పరిశోధనల్లో తేలింది.
ఒక ముఖ్య విషయం. తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు గమనించారు. కాబట్టి సంతానంకోసం ప్రయత్నించేవారు తమలపాకును తొడిమ తొలగించి వాడుకోవాలి.
తమలపాకు ఔషధం లాంటిది. ఔషధాల మాదిరిగానే దీనినీ పరిమితంగానే వాడుకోవాలి. ఈ సందర్భంగా తమలపాకు నేపథ్యంగా జరిగిన ఒక అధ్యయనం గురించి ప్రస్తావించాలి. రోజుకు 5-10 తమలపాకులను 2 ఏళ్లపాటు తినేవారు తమలపాకులకు డ్రగ్స్ మాదిరిగా బానిసలవుతారని ఇటీవల జరిగిన తాజా అధ్యయనంలో తేలింది.
అధిక రక్తపోటు కలిగినవారు తాంబూలాన్ని యధేచ్ఛగా వాడకూడదు- తాంబూలాన్ని తయారుచేసేటప్పుడు సున్నం కలుపుతారు కాబట్టి ఈ పదార్థం రక్తనాళాల మీద, రక్తసరఫరామీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది.
తాంబూలానికి పొగాకును కలిపి తింటే ‘సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్’ వంటి ప్రమాదకరమైన నోటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్ అనేది నోటి క్యాన్సర్‌కి ముందు స్థితి.
తమలపాకు, సున్నం, వక్క... ఇవి మూడూ చక్కని కాంబినేషన్. సున్నంవల్ల ఆస్టియోపోరోసిస్ (ఎముకలు గుల్లబారటం) రాకుండా ఉంటుంది; తమలపాకు రసం సున్నంలోని క్యాల్షియాన్ని శరీరాంతర్గత భాగాల్లోకి చేరవేస్తే తమలపాకుకు చేర్చి వక్కపొడి లాలాజలాన్ని విడుదలయ్యేలా చేసి అరుగుదలకు సహాయపడుతుంది.[8][9]
ఔషధంగా తమలపాకుని వాడుకోదలిస్తే, రసం పిండి 1-2 చెంచాల మోతాదులో తీసుకోవాలి.
ప్రతిరోజూ 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీళ్లతో తీసుకుంటే బోధ వ్యాధిలో చక్కని ఫలితం కనిపిస్తుంది.
ప్రతిరోజూ రెండు నెలలపాటు ఒక తమలపాకును పది గ్రాముల మిరియం గింజలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయులు సన్నగా నాజూగ్గా తయారవుతారు.
స్వర్ణక్షీరి, విడంగాలు, ఇంగిలీకం, గంధకం, చక్రమర్ధ, చెంగల్వకోష్టు, సింధూరం వీటిని ఉమ్మెత్త ఆకులతోనూ, వేప చెట్టు బెరడుతోనూ, తమలపాకుతోనూ కలిపి ముద్దగా నూరి చర్మంమీద లేపనం చేస్తే ఎగ్జిమా, తామర, దురదలు వంటి చర్మవ్యాధుల్లో ఉపశమనం లభిస్తుంది.
చెవుల మీద తమలపాకులను వేసి కట్టుకుంటే తలలో చేరిన వాతం శాంతించి తల నొప్పి తగ్గుతుంది.
తమలపాకు రసాన్ని పాలతో కలిపి తీసుకుంటే మహిళల్లో కనిపించే పిశాచ బాధలు, క్షణికావేశాలు తగ్గుతాయి.
తమలపాకు రసాన్ని రెండు కళ్లల్లోనూ చుక్కలుగా వేస్తే రేచీకటి సమస్య తగ్గుతుంది. (వైద్య పర్యవేక్షణ అవసరం)
గుండె అపసవ్యంగా, అపక్రమంగా కొట్టుకుంటున్నప్పుడు తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదుగా తాగుతుంటే హితకరంగా ఉంటుంది.
తమలపాకు షర్బత్‌ని తాగితే గుండె బలహీనత తగ్గుతుంది. కఫం, మందాగ్ని దూరమవుతాయి.
ఏ కారణం చేతనైనా పసిపాపాయికి పాలివ్వలేకపోతే రొమ్ముల్లో పాలు నిలిచిపోయి గడ్డలుగా తయారై నొప్పిని కలిగిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తమలపాకు కొద్దిగా వేడిచేసి స్తనాలమీద కట్టుకుంటే వాపు తగ్గి ఉపశమనం లభిస్తుంది.
చిన్న పిల్లలకు చీటికిమాటికి జలుబు చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు తమలపాకును వేడిచేసి, కొద్దిగా ఆముదాన్ని రాసి, ఛాతిమీద వేసి కడితే హితకరంగా ఉంటుంది.
తమలపాకు కాండాన్ని (కులంజన్), అతిమధురం చెక్కను నూరి తేనెతో కలిపి తీసుకుంటే ఇన్ఫెక్షన్తో కూడిన జలుబు (దుష్టప్రతిస్యాయం) తగ్గుతుంది.
పాటలు పాడేవారు, ఉపన్యాసాలను ఇచ్చేవారు తమలపాకు చెట్టు కాండాన్ని చిన్న ముక్క తీసుకొని బుగ్గనుంచుకొని చప్పరిస్తుంటే అమితమైన ప్రయోజనం కనిపిస్తుంది. చక్కని శ్రావ్యమైన కంఠం వస్తుంది.
హిస్టీరియాలో కంఠం పూడుకుపోయి మాట పెగలకపోతే తమలపాకు రసం తీసుకుంటే కంఠం పెగులుతుంది. మాట స్పష్టతను సంతరించుకుంటుంది. కఫం తెగి వెలుపలకు వచ్చేస్తుంది. 2-5 తమలపాకులను వేడి నీళ్లకు కలిపి మరిగించి పుక్కిటపడితే కూడా హితకరంగా ఉంటుంది.
తమలపాకును తింటే శ్లేష్మం కరిగి పెద్ద మొత్తాల్లో స్రవిస్తుంది. దీంతో అరుగుదల తేలికగా జరుగుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. తిన్న వెంటనే ఆయాసం రాకుండా ఉంటుంది. మాటలో స్పష్టత వస్తుంది. అలాగే చెడు వానలు కురిసే రోజుల్లో, జలవాయు కాలుష్యాలవల్ల చెడిపోయిన ఆహారాన్ని ఇది శుద్ధపరుస్తుంది.
తమలపాకును తినడంవల్ల లాలాజలం విడుదలై దప్పిక తీవ్రత తగ్గుతుంది.
తమలపాకు తొడిమకు ఆముదం రాసి చిన్న పిల్లల్లో మల ద్వారంలోనికి చొప్పిస్తే మలనిర్హరణ జరుగుతుంది. (వైద్య పర్యవేక్షణ అవసరం)