From Wikipedia, the free encyclopedia
తానాషా (దయామయ పాలకుడు) గా ప్రసిద్ధి చెందిన అబుల్ హసన్ కుతుబ్ షా దక్షిణ భారతదేశములో గోల్కొండను పాలించిన కుతుబ్షాహీ వంశానికి చెందిన ఏడవ, చివరి చక్రవర్తి. ఇతడు అబ్దుల్లా కుతుబ్ షా మూడవ అల్లుడు. ఈయన 1672 నుండి 1687 వరకు పాలించాడు.
అబుల్ హసన్ చిన్నతనంలో అబ్దుల్లా మహారాజు భవంతిలో ఉండేవాడు. అతను ఎవరి కుమారుడో తెలియకున్నా, అతనికీ రాజవంశానికి ఏదో సంబంధం ఉందని భావిస్తూ అందరూ కొద్దిపాటి గౌరవాన్ని ఇచ్చేవారు. చిన్నతనంలోనే తాగుబోతుగా మారి అల్లరిచిల్లరిగా జీవితాన్ని గడుపుతూండే అబుల్ హసన్ ఓసారి మహారాణినే ఆ మైకంలో అవమానించాడు. దానితో కోపించిన మహారాజు భవంతి నుంచి వెళ్ళగొట్టారు. అనంతరం అతను నగరంలో ప్రసిద్ధిచెందిన సూఫీ సన్యాసి షారాజు ఆశ్రమంలో చేరాడు. ఇబ్బంది కలిగించకుండా అక్కడ బ్రతికేవారందరికీ ఆశ్రయం, ఆహారం అందించే సన్యాసి వాడుక అతనికి వరమైంది. చివరకి కొన్నాళ్ళకు అబుల్ హసన్ షారాజుకు సన్నిహిత శిష్యుడయ్యాడు.
మహారాజు అబ్దుల్లా కుతుబ్షా మూడవ కుమార్తెకు వివాహం చేసే విషయంలో అంత:పురంలో కలహాలు తలెత్తాయి. అబ్దుల్లా రెండవ అల్లుడు నిజాముద్దీన్ అహమ్మద్ ప్రోద్బలంతో తన మూడవ కుమార్తెకు సయ్యద్ అహమ్మద్ అనే వ్యక్తిని ఇచ్చి పెళ్ళిచేసేందుకు నిశ్చయించారు. అయితే తదనంతర కాలంలో నిజాముద్దీన్ కీ, సయ్యద్ కీ నడుమ చోటుచేసుకున్న వివాదాల వల్ల నిజాముద్దీన్ ఈ వివాహం చేయవద్దని, అలా చేస్తే తాను ముఘలులతో కలిసిపోయి మరీ గోల్కొండపై దండెత్తిస్తానని బెదిరించసాగాడు. ఇంతలో వివాహం తరుముకొస్తోంది, వివాహం ఏర్పాట్లు అలాగే సాగనివ్వమని, మూడురోజుల తర్వాత వస్తే తాను సరైన వరుణ్ణి చూపి సమస్య పరిష్కరిస్తానని షారాజ్ అబ్దుల్లాను పంపారు. మూడురోజుల పాటుగా కోటలో సయ్యద్ అహమ్మద్ ని పెళ్ళికొడుకుని చేయడం వంటి లాంఛనాలు కొనసాగించారు. పెళ్ళివేళకు షారాజు తన ఆశ్రమంలోని తానాషాకి ఇచ్చి పెళ్ళిచేయమని, అతనే తదుపరి రాజ్యానికి వస్తాడని ఆదేశించారు. ఆ ప్రకారమే హఠాత్తుగా అతనికిచ్చి రాకుమార్తెను పెళ్ళిచేశారు మహారాజు.
మహారాజు అబ్దుల్లా కుతుబ్షా మరణించేలోపుగా తన ప్రవర్తనతో అందరినీ తానాషా ఆకట్టుకున్నారు. అబ్దుల్లా మరణశయ్యపైకి చేరాకా జరిగిన వారసత్వ యుద్ధంలో సైనికాధికారులు, మంత్రులు వంటివారందరినీ చాకచక్యం, మంచితనంతో ఆకట్టుకున్న తానాషా తన తోడల్లుడు నిజాముద్దీన్ మీద విజయం సాధించారు. అబ్దుల్లా అనంతరం గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించారు.[1]
ఇతర మతాలకు చెందిన ప్రజలను కూడా తారతమ్యాలు లేకుండా పరిపాలించిన ప్రభువుగా తానీషా చిరస్మరణీయుడు. ఈయన తన ఆస్థానములో మంత్రులు, సేనానులుగా అనేకమంది బ్రాహ్మణులను నియమించుకున్నాడు. ఉదాహరణకు తానీషా కొండవీడుకు చెందిన మాదన్న అనే తెలుగు బ్రాహ్మణున్ని ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు. తెలుగు సాహిత్యములో తానీషా, మాదన్న మేనల్లుడు రామదాసు (కంచర్ల గోపన్న) ను కారాగారములో బంధించిన చక్రవర్తిగా ప్రసిద్ధి పొందినాడు. పాల్వంచ తాలూకా నేలకొండపల్లి గ్రామ వాస్తవ్యుడైన కంచర్ల గోపన్నను తానీషా మాదన్న సిఫారుసుపై పాల్వంచ తాలూకాకు తాసీల్దారుగా నియమించాడు. గోపన్న ప్రజాధనాన్ని ప్రభువుకు ముట్టజెప్పకుండా భద్రాచలములో రామాలయము నిర్మించడానికి, సీతారామలక్ష్మణులకు నగలు చేయించడానికి వినియోగించగా ప్రజాధనాన్ని సొంతపనులకు ఉపయోగించుకున్నాడన్న అభియోగముపై గోపన్నను తానీషా గోల్కొండలోని కారాగారములో బంధించాడు. కథనం ప్రకారం ఆ తరువాత రామలక్షణులు తానీషాకు కనిపించి స్వయంగా డబ్బుతిరిగి ఇచ్చినారనీ, అందుచేత గోపన్నను విడుదల చేసినాడనీ ప్రతీతి.
తానీషా కంటే ముందు చక్రవర్తిగా ఉన్న తానీషా మామ, అబ్దుల్లా కుతుబ్ షాను దక్కన్లో మొఘల్ సేనానిగా ఉన్న ఔరంగజేబు ఓడించి మొఘల్ చక్రవర్తి షాజహాను యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించి కప్పం కట్టే విధంగా ఒప్పందం కుదిర్చాడు. మొగలుల దండయాత్రల నుండి గోల్కొండను రక్షించడానికి మహారాష్ట్ర నాయకుడైన శివాజీతో అబుల్ హసన్ సంధి కుదుర్చుకున్నాడు. 1680లో శివాజీ మరణం తరువాత 1685లో ఔరంగజేబు తన కుమారుడైన షా ఆలం నాయకత్వంలో గోల్కొండ పైకి దండయాత్ర చేశాడు. మొదట గోల్కొండకే విజయం లభించినా, చివరకు కొందరు సేనానుల నమ్మకద్రోహం వలన గోల్కొండ సైన్యాలు ఓడిపోయాయి. పర్యవసానంగా అబుల్ హసన్ మొగలులతో సంధి చేసుకున్నాడు. సంధి షరతుల ప్రకారం అబుల్ హసన్ బకాయిల క్రింద కోటి హొన్నులు చెల్లించాలి. సంవత్సరానికి రెండు లక్షల హొన్నులు కప్పం చెల్లించాలి. మల్ఖేడు ప్రాంతాన్ని మొగలాయిలకు అప్పగించాలి. అక్కన్న, మాదన్నలను ఉద్యోగాల నుండి తొలగించాలి.
మొగలు సైన్యం నిష్క్రమించిన తరువాత అక్కన్న, మాదన్నలను తొలగించడానికి అబుల్ హసన్ జాప్యం చేశాడు. ఔరంగజేబు కోపానికి కారణం వీరేనని భావించిన కొందరు ముస్లిం సర్దారులు, అంతఃపుర స్త్రీల ప్రోత్సాహంతో షేక్ మిన్హాజ్ నాయకత్వంలో అక్కన్న మాదన్నల హత్యకు కుట్ర పన్నారు. 1686 మార్చి 24వ తేదీ రాత్రి సుల్తానుతో సంప్రదించి ఇంటికి వెళుతున్న వారిని గోల్కొండ నడివీధిలో హత్య చేశారు.
1683 ప్రాంతంలో అబుల్ హసన్ మొఘల్ చక్రవర్తులకు కట్టవలసిన పన్నులను సకాలములో చెల్లించలేదు. దీని పర్యవసానంగా గోల్కొండపై మొఘలుల ఆధిపత్యాన్ని పటిష్ఠపరచేందుకు బీజాపూర్ ఆక్రమణ పూర్తయిన తరువాత ఔరంగజేబు స్వయంగా గోల్కొండపై 1687 ఫిబ్రవరి 7న దండయాత్ర చేశాడు. తానీషా గోల్కొండ కోటపై ఔరంగజేబు దాడిని ఎనిమిది నెలలపాటు నిలువరించాడు. కానీ 1687 అక్టోబర్ 3వ తేదీన ఔరంగజేబు లంచం ఇచ్చి కోటలు తలుపులు తెరిపించి, గోల్కొండ కోటను వశపరచుకున్నాడు. తానీషాను బందీగా తీసుకొని వెళ్ళి దౌలతాబాదు కోటలో 13 సంవత్సరాలు (అనగా సా.శ. 1700) మరణించేవరకు బంధించి ఉంచారు.
తానీషా ఓటమితో గోల్కొండ కుతుబ్ షాహీ వంశము అంతమొంది దక్కన్లో మొఘలుల ఆధ్వర్యములో నిజాం పాలన సా.శ. 1701 నుండి ప్రారంభమయ్యింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.