![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/48/Akirakurosawa-onthesetof7samurai-1953-page88.jpg/640px-Akirakurosawa-onthesetof7samurai-1953-page88.jpg&w=640&q=50)
అకీరా కురొసావా
జపనీస్ చిత్ర దర్శకుడు / From Wikipedia, the free encyclopedia
అకీరా కురొసావా (మార్చి 23, 1910 - సెప్టెంబరు 6, 1998) జపనీస్ సినీ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, ఎడిటర్. 57 సంవత్సరాల కెరీర్ లో 30 చలన చిత్రాలకు దర్శకత్వం వహించిన కురసోవా[note 1] సినిమా చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన, ముఖ్యమైన సినీ దర్శకుల్లో ఒకరుగా పేరొందారు. 1936లో కురసోవా జపనీస్ సినిమా పరిశ్రమలోకి ప్రవేశించారు. కొద్దికాలం పెయింటర్‌గా పనిచేశారు. సంవత్సరాల పాటు ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, స్క్రిప్ట్ రచయితగా పనిచేశాకా రెండో ప్రపంచ యుద్ధసమయంలో 1943లో పాపులర్ యాక్షన్ సినిమా సాన్షిరో సుగతా (అనే జూడో సాగా) ఆయన దర్శకునిగా తొలి సినిమా చేశారు. యుద్ధానంతరం విమర్శకుల ప్రశంసలు పొందిన డ్రంకెన్ ఏంజిల్ (1948). ఈ సినిమాతో కురసోవా జపాన్ లోని యువకులైన సినిమా దర్శకుల్లో అత్యంత ముఖ్యునిగా పేరొందారు. సినిమాలో అప్పటికి వర్ధమాన నటుడైన తొషిరో మిఫునే ప్రధాన పాత్ర ధరించారు. వీరిద్దరూ తర్వాత మరో 15 సినిమాలకు కలిసి పనిచేశారు. ఆయన భార్య యోకో యగుచి కూడా కురసోవా తీసిన ఒకానొక సినిమాలో నటిగా పనిచేశారు.
కురసోవా దర్శకత్వం వహించిన రషోమాన్ సినిమా 1950 ఆగస్టులో టోక్యోలో మొదట ప్రదర్శితమైంది. 1951 సెప్టెంబరు 10న వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అనూహ్యంగా గోల్డెన్ లయన్ పురస్కారాన్ని పొందింది, ఆ వెనువెంటనే ఐరోపా, ఉత్తర అమెరికాల్లో విడుదలైంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు, వ్యాపారాత్మక విజయం పొందడంతో మొట్టమొదటి సారి జపనీస్ సినిమా పరిశ్రమలో తయారైన సినిమాలకు పాశ్చాత్య సినీ మార్కెట్లు తెరచుకున్నాయి, తద్వారా జపనీస్ సినీ రూపకర్తలకు అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందింది. 1950 దశకమంతా, 1960ల మొదట్లోనూ, కురసోవా దాదాపుగా సంవత్సరానికి ఒక సినిమా చొప్పున దర్శకత్వం వహించారు. వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఇకిరు (1952), సెవెన్ సమురాయ్ (1954), యోజింబొ (1961) వంటి సినిమాలు కూడా ఉన్నాయి. 1960ల మధ్యభాగం తర్వాత కురసోవాకు అవకాశాలు తగ్గాయి అప్పటివరకూ సంవత్సరానికి ఒక సినిమా చొప్పున చేస్తూ వచ్చిన ఆయన సినిమాలు తగ్గిపోయాయి.[1] కానీ ఆ మలిదశలో చేసిన సినిమాల్లో ఆయన ఎపిక్స్ గా పరిగణించే కగెముష (1980), రాన్ (1985) ఉన్నాయి, అలానే పలు పురస్కారాలు కూడా గెలుచుకోవడం కొనసాగింది. వీటిలో జపాన్‌లో పల్మే డోర్ పురస్కారం (కగెముష సినిమాకు) కూడా ఉంది.
1990ల్లో ఆస్కార్ జీవిత సాఫల్యపురస్కారాన్ని అందుకున్నారు.[2][3] మరణానంతరం ఆసియన్ వీక్ పత్రిక, సి.ఎన్.ఎన్. సంయుక్తంగా తయారుచేసిన జాబితాలో "గత 100 సంవత్సరాల్లో ఆసియా మెరుగుదలకు కృషిచేసిన (ఐదుగురు) వ్యక్తుల్లో ఒకరిగా" పేర్కొంటూ "కళలు, సాహిత్యం, సంస్కృతి" విభాగం క్రింద "ఆసియన్ ఆఫ్ ది సెంచురీ"గా గుర్తించారు.[4]