From Wikipedia, the free encyclopedia
హారూన్ అల్-రషీద్ (ఆంగ్లము : Hārūn al-Rashīd) (అరబ్బీ, పర్షియన్ : هارون الرشيد ); ఇంకనూ హారూన్ అర్-రషీద్, హారూన్ అల్-రాషిద్, హారూన్ రషీద్ అని కూడా పలుకుతారు; మార్చి 17, 763 – మార్చి 24, 809) ఇరాన్, టెహ్రాన్ లోని రాయ్య్లో జన్మించాడు. ఇతను ప్రఖ్యాతిగాంచిన అబ్బాసీయ ఖలీఫా,
ఇతను 786 నుండి 809 వరకు పాలించాడు, ఇతని కాలంలో శాస్త్రీయ, సాంస్కృతిక, ధార్మిక విషయాలు ఉత్థాన దశలో వుండేవి. ఇతడి దూరదృష్టివలన కళలు, సంగీతం మున్నగునవి అభివృద్ధి చెందాయి. ఇతను ఓ పెద్ద గ్రంథాలయం బైతుల్ హిక్మాను స్థాపించాడు.
ఇతని జీవితం హుందాతనం, గౌరవం కలిగిన సభ (రాజ దర్బారు) మున్నగు విషయాలతో అనేక కథలు, కథనాలు వెలువడ్డాయి. కొన్ని నిజాలైతే కొన్ని కాల్పనికాలు. ప్రఖ్యాతమైన వెయ్యిన్నొక్క రాత్రులు లో ఇతడి ప్రాశస్తాన్ని కొనియాడుతూ వ్రాయబడింది. ఇతడి రాజదర్బారుతో ప్రేరణ పొంది ఈ కథలు ప్రాచుర్యం పొందాయని కూడా ప్రతీతి.
హారూన్ రషీద్ ఇరాన్ లోని టెహ్రాన్ లో జన్మించాడు. ఇతని తండ్రి అబ్బీసీయ మూడవ ఖలీఫా ఐన అల్-మహది, 775 నుండి 786 వరకు పాలించాడు. తల్లి యెమన్‌కు చెందిన బానిస యువతి 'అల్-ఖైజురన్', భర్తకు తగ్గ భార్య, తనయుడికి తగ్గ తల్లి, ఈమె ప్రేరణలతో భర్త, తనయుడు లబ్ధిపొందారు.
హారూన్, తన తల్లి ప్రేరణ, ప్రోత్బలంతో తన సామ్రాజ్యాన్ని విశాలీకరించాడు. తల్లి 789లో మరణించింది. తన వజీరు (ముఖ్యమంత్రి) యహ్యా బర్కమీద్, అతని కుమారుల సహకారంతో తన రాజ్యాన్ని నియంత్రించాడు. యహ్యా కుమారుడు జాఫర్, హారూన్ అనుంగుమిత్రుడు..
తన 20 ప్రాయంలో ఖలీఫా అయ్యాడు. తన సింహాసన అధిష్టాన రోజునే కొడుకు అల్ మామూన్ జన్మించాడు. తరువాత కొద్ది కాలానికి రెండవకుమారుడు అల్ అమీన్ జన్మించాడు. రెండవకుమారుడైన అల్-అమీన్, జుబైదా సంతానం. జుబైదా తండ్రి అల్ మన్సూర్ (బాగ్దాదు నగర స్థాపకుడు) మనుమరాలు.
హారూన్ రషీద్ కాలంలో బాగ్దాదు బాగా అభివృద్ధి చెందింది. అన్ని రంగాలూ అభివృద్ధికి నోచుకున్నాయి. ఖలీఫాల రాజధానిగా మారడంతో నిర్మాణాలు, కళలూ, జీవనశైలీ, అత్యాధునిక శాస్త్రాలు జీవం పోసుకున్నాయి.
796 లో ఖలీఫా హారూన్ రషీద్ తన ప్రభుత్వాన్నీ, సభనూ, మధ్య-యూఫ్రేట్స్ లోనుండు 'అర్-రక్ఖహ్' కు మార్చాడు. ఇచ్చట 12 యేండ్లు గడిపాడు.
హారూన్ సాహిత్యానికి పెద్ద పీట వేశాడు, కవిత్వం, సంగీతం బాగా వర్థిల్లాయి. తాను స్వయంగా పండితుడు, కవి. తన దర్బారులో సాహితీవేత్తలూ, పండితులూ ఎల్లప్పుడూ గౌరవాలు పొందేవారు. ఇతర దేశాల రాయబారులు, వర్తకులు, యాత్రికులూ, తరచూ ఇతని దర్బారును సందర్శించేవారు. ఇలా ప్రపంచం మొత్తం ఇతడి పేరు ప్రాకింది. చరిత్రకారుడు అత్-తరాబీ (వీ. 30 పుట. 313) ప్రకారం, హారూన్ రషీద్ కు, వైద్యం చేయడానికి వైద్యులు భారతదేశం నుండి వచ్చేవారు. హారూన్ చైనాతో సత్సంబంధాలు కలిగివుండే వాడు.
806 లో బైజాంటియన్ సామ్రాజ్యం పై సైనిక బలగాలను పంపాడు, ఇందులో 1,35,000 సైన్యం పాల్గొంది. ఈ సైనిక చర్యతో లొంగిపోయిన బైజాంటియన్ అధినేతలు, 50,000 బంగారు నాణేలను చెల్లించి, 30,000 బంగారు నాణేలను కప్పంగా చెల్లించడానికి ఒప్పుకున్నారు. హి.శ. 181 (సా.శ. 797-798) లో, సిలీసియన్ గేట్స్ కు ఆవలగల 'ద విల్లోస్', హి.శ. 190 (సా.శ. 806-807) లో 'హిరాక్లియా' లను కైవసం చేసుకున్నాడు.
అత్-తరాబీ ప్రకారం, హారూన్, ధార్మికుడూ, దానవంతుడూ, ఉదాత్తుడూ, కవులను పోషించినవాడూ, ధార్మికంగా జరుగు విమర్శలనూ జగడాలనూ పరిసమాప్తి చేసినవాడు. ఇతడు న్యాయపరిపాలకుడు,. హారూన్ ఎన్నోసార్లు హజ్ కార్యక్రమాన్ని నిర్వర్తించాడు. అత్-తబరీ ప్రకారం "హారూన్ మరణించినపుడు, ఖలీఫా ఖజానా లో 90 కోట్ల దిర్హమ్లు వున్నాయి." v. 30 p. 335.
808లో హారూన్ ట్ర్రాన్స్ ఓక్సానియాలో ప్రయాణం చేస్తున్నపుడు, అనారోగ్యం పాలై మరణించాడు. ఇతనిని ఖోరాసాన్ (ఇరాన్) గవర్నరైన "హమీద్ ఇబ్న్ ఖహ్తబీ" భవనంలో ఖననం చేశారు. ఈ భవనం 'మష్హద్' (షహీదుల భవనం) గా పేరుచెందింది .[1]
అరబ్ సామ్రాజ్యంలో అబ్బాసీయ ఖలీఫాల లో హారూన్ రషీద్ సుప్రసిద్ధుడిగా పేరుగడించాడు. ఇతని కాలం రాజకీయంగానూ సాంస్కృతికంగానూ ఉచ్ఛదశకు చేరుకుంది. ఇతని కాలంలో ఇబ్నె కసీర్ వ్రాయబడింది, దీనితో ఇతను అందరికీ ఆదర్శవంతుడిగా మారాడు. సైనిక పరంగా, మేథోపరంగానూ పేరుప్రఖ్యాతులు గడించాడు. వెయ్యిన్నొక్క రాత్రులు, చారిత్రకంగా ఇతనినే మూలంగా చేసుకుని వ్రాయబడిందనేది సత్యమని భావించబడుతుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.