సౌర ఘటం
From Wikipedia, the free encyclopedia
సౌర ఘటం లేదా ఫోటోవోల్టాయిక్ ఘటం అంటే భౌతిక, రసాయనిక ధర్మమైన ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ ఆధారంగా కాంతి నుంచి నేరుగా విద్యుత్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ ఉపకరణం.[1] ఇది ఒక రకమైన ఫోటోఎలక్ట్రిక్ ఘటం. వీటిలో విద్యుత్ ప్రవాహం, వోల్టేజి, విద్యున్నిరోధం లాంటి గుణగణాలు కాంతి వాటిమీద పడ్డప్పుడు మార్పు చెందుతాయి. కొన్ని సౌరఘటాలను కలిపి ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ లేదా సౌర ఫలకాలను (సోలార్ ప్యానెల్స్) తయారు చేస్తారు. చాలా వరకు వాణిజ్యపరమైన సౌర ఘటాల్లో స్ఫటిక రూపంలోఉన్న సిలికాన్ ఉంటుంది. దీని మార్కెట్ షేరు సుమారు 95%. మిగతావి కాడ్మియం టెల్యురైడ్ థిన్ ఫిల్మ్ సౌర ఘటాలు.[2] ఒక సాధారణ సిలికాన్ సౌర ఘటం గరిష్టంగా సుమారు 0.5 నుంచి 0.6 వోల్టుల విద్యుత్ ను ఉత్పత్తి చేయగలదు.[3]

సౌర ఘటాలు సూర్యకాంతి కిందనే కాక కృత్రిమ కాంతి కింద కూడా పని చేస్తాయి. ఇవి శక్తిని ఉత్పత్తి చేయడానికే కాకుండా కాంతిని గుర్తించే (ఫోటోడిటెక్టర్) లాగా వాడతారు. ఉదాహరణకు పరారుణ కాంతి, ఇంకా దృశ్యకాంతికి దగ్గరగా ఉండే ఇతర విద్యుదయస్కాంత వికిరణాలను గుర్తించడానికి, లేదా కాంతి దీప్తిని కొలవడానికి వాడతారు.
అనువర్తనాలు
సౌర ఘటాలను కలిపి సౌర ఫలకాలు తయారు చేస్తారు. సౌర ఫలకాలు సూర్యకాంతిని ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. సోలార్ థర్మల్ మాడ్యూల్స్ ద్వారా నీటిని కూడా వేడి చేయవచ్చు. వాహనాలు నడపడానికి కూడా సౌరశక్తి ఒక ప్రత్యామ్నాయ వనరు. వాహనాలకు బిగించిన సౌర ఘటాల ద్వారా ఈ శక్తిని ఉత్పత్తి చేసి దానిని బ్యాటరీలో నిల్వ చేసి ఆ శక్తి నుంచి దానిని నడిపిస్తారు. సౌరఘటం నుంచి ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు అనేది ఉష్ణోగ్రత, పదార్థ లక్షణాలు, వాతావరణ పరిస్థితులు, ఇంకా ఇతర కారణాల మీద ఆధారపడి ఉంటుంది.[4]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.