Remove ads
From Wikipedia, the free encyclopedia
సన్యాసాశ్రమం హిందూ వ్యవస్థలో చతురాశ్రమాలు అనే నాలుగు జీవిత దశల్లో నాలుగవది. మొదటి మూడు. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం.[1] జీవితపు చివరి సంవత్సరాలలో పురుషులు, స్త్రీలు సన్యాస జీవితం గడుపుతారు. అయితే బ్రహ్మచారులు గృహస్థ, వానప్రస్థ దశలను గడపకుండా ప్రాపంచిక, భౌతిక సుఖాలను త్యజించి, ఆధ్యాత్మిక సాధనల కోసం తమ జీవితాలను అంకితం చేసేందుకు నేరుగా సన్యాసాశ్రమం స్వీకరించే అవకాశం ఉంది.
సన్యాసం అనేది భౌతిక కోరికలను త్యజించి జీవించే దశ. భౌతిక జీవితం పట్ల నిరాసక్తత నిర్లిప్తతతో కూడుకుని ఉంటుంది. జీవితాన్ని శాంతియుతమైన, ఆధ్యాత్మిక సాధనలలో గడపాలనే ఉద్దేశంతో ఉంటుంది.[2][3] సన్యాసంలో ఉన్న వ్యక్తిని హిందూమతంలో సన్యాసి లేదా సన్యాసిని అని పిలుస్తారు. [note 1] ఇది అనేక విధాలుగా జైన సన్యాసం సాధు, సాధ్వి సంప్రదాయాలకు, బౌద్ధమతంలోని భిక్కులు, భిక్షుణులకు సమాంతరంగా ఉంటుంది.[5]
చారిత్రాత్మకంగా భారతీయ సంప్రదాయాలలో సన్యాసాశ్రమం త్యజించడం, అహింస, శాంతియుతమైన, సరళమైన జీవితం, ఆధ్యాత్మిక సాధనలతో కూడుకుని ఉండే దశ. అయితే, భారతదేశంలో ముస్లిం పాలన స్థాపన తర్వాత, 12వ శతాబ్దం నుండి బ్రిటిషు పాలన వరకూ, శైవ (గోసాయిలు), వైష్ణవ (బైరాగులు) సన్యాసులు సైనిక ధర్మాన్ని చేపట్టి, యుద్ధ కళలను అభివృద్ధి చేశారు, సైనిక వ్యూహాలను రూపొందించారు, గెరిల్లా యుద్ధాలు చేసారు.[6] ఈ యోధ సన్యాసులు భారత ఉపఖండంలో యూరోపియన్ వలస శక్తులు బలపడడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.[7]
సంస్కృత పదం సంన్యాసలో న్యాస అంటే శుద్ధి, సన్యాసము అంటే "అంతటా శుద్ధి" అని అర్థం.[8] సన్యాసానికి సాహిత్య అనువాదం అంటే "ప్రతిదీ, అన్నింటినీ అణిచివేయడం".[9]
సన్యాసిని లేదా సన్యాసిని అనుసరించాల్సిన జీవనశైలి లేదా ఆధ్యాత్మిక క్రమశిక్షణ, పద్ధతి గురించి హిందూ మతం అధికారికంగా ఏమీ చెప్పదు. ఇది వ్యక్తి ఇష్టాలు, ప్రాధాన్యతలకు వదిలివేయబడుతుంది.[10] ఈ స్వేచ్ఛ సన్యాసాన్ని స్వీకరించే వారి జీవనశైలిలో వారి లక్ష్యాలలో విభిన్నతకు, ముఖ్యమైన వ్యత్యాసాలకూ దారితీసింది. అయితే, కొన్ని సాధారణ పద్ధతులు ఉన్నాయి. సన్యాసంలో ఉన్న వ్యక్తి భౌతిక ఆస్తులు లేదా భావోద్వేగ అనుబంధాలు లేకుండా, సాధారణంగా నిర్లిప్తంగా, దేశసంచారం చేస్తూ, సాధారణ జీవితాన్ని గడుపుతారు. పసుపు, కుంకుమ, నారింజ, కావి లేదా మట్టి రంగు దుస్తులను ధరించి, చేతి కర్ర, పుస్తకం, కమండలం లేదా ఆహార పానీయాల కోసం పాత్ర పట్టుకుని ఉంటారు. పొడవాటి జుట్టు కలిగి ఉండవచ్చు. చిందరవందరగా కనిపిస్తారు. సాధారణంగా శాకాహారులై ఉంటారు.[10] కొన్ని చిన్న ఉపనిషత్తులు కొన్ని సన్యాసుల ఆదేశాలూ స్త్రీలు, పిల్లలు, విద్యార్థులు, నైతికంగా దిగజారిన వారు (నేర చరితులు), తదితరులను సన్యాసానికి అర్హత లేనివారిగా పరిగణిస్తాయి; ఇతర గ్రంథాల్లో ఇలాంటి పరిమితులే లేవు.[11] దుస్తులు, పరికరాలు, జీవనశైలి మొదలైనవి వివిధ సమూహాలను బట్టి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు, సన్యాస ఉపనిషత్తు 2.23 నుండి 2.29 శ్లోకాలలో, ఆరు రకాల త్యజకుల కోసం ఆరు జీవన విధానాలను గుర్తిస్తుంది.[12] వాటిలో ఒకటి, సన్యాసులకు క్రింది ఆస్తులుండవచ్చునని చెబుతుంది:[13]
కుండ, భిక్షాపాత్ర, కమండలం, ఒక జత పాదరక్షలు,
ఎండ, చలిల నుండి శరీర రక్షణ కోసం ఒక అంగ వస్త్రం, ఒక కటి వస్త్రం,
స్నానం చేసేందుకు గోచీ, చేతి కర్ర.
సన్యాసంలో ప్రవేశించిన వారు ఏదైనా సమూహంలో చేరాలా వద్దా అనేది ఎంచుకోవచ్చు. కొందరు ఎవరి తోటీ సంబంధం లేకుండా మారుమూల ప్రాంతాల్లో ఏకాంతంగా గడపడానికి ఇష్టపడతారు.[14] మరికొందరు తమ ఆధ్యాత్మిక యాత్రను కొనసాగించడానికి తోటి-సన్న్యాసులతో నివసిస్తారు, ప్రయాణిస్తారు, కొన్నిసార్లు ఆశ్రమాలు లేదా మఠాల్లో జీవిస్తారు.[14]
చాలా మంది హిందూ సన్యాసులు సన్యాసం ప్రారంభించినప్పుడు బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తారు. అయితే, శైవ తంత్ర సన్యాసం వంటి మినహాయింపులు ఉన్నాయి, ఇక్కడ లైంగికత విముక్తి ప్రక్రియలో భాగంగా పరిగణించబడుతుంది. సెక్స్ అనేది వ్యక్తిగతమైన సన్నిహిత చర్య నుండి అమూర్తమైనదిగా, సన్యసించినదిగా చూస్తారు.[15]
హిందూ సన్యాసి లక్ష్యం మోక్షం (విముక్తి).[16][17] మోక్షం అంటే ఏమిటి అనేది సంప్రదాయాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
నేనెవరు, నాలో ఉన్నదేమిటి? ఈ బాధల బంధం ఏమిటి?
భక్తి సంప్రదాయాల్లో విముక్తి అనేది దైవంతో ఐక్యమవడం, సంసార బంధాల (భవిష్యత్ జీవితంలో పునర్జన్మ) నుండి విడుదలవడం.[18] యోగ సంప్రదాయాలలో, విముక్తి అనేది అత్యున్నత సమాధి యొక్క అనుభవం.[19] అద్వైత సంప్రదాయంలో విముక్తి అంటే జీవన్ముక్తి - పరమాత్మ సక్షాత్కారం, ఆత్మ-సాక్షాత్కారం.[20][21] సన్యాసం అనేది ఒక సాధనం, ఒక ముగింపు కూడా. ఇది అన్ని రకాల సంబంధాలను తగ్గించుకోడానికి, చివరికి అంతం చేయడానికి ఒక సాధనం. ఇది ఆత్మకు అర్థానికీ ఒక సాధనం, అహం లేదా వ్యక్తిత్వాలకు కాదు. సన్యాసం సమాజాన్ని విడిచిపెట్టదు, అది సామాజిక ప్రపంచంలోని ఆచార వ్యవహారాలను, దాని అన్ని వ్యక్తీకరణలతో అనుబంధాన్ని వదిలివేస్తుంది.[22] విముక్తి, సంతృప్తి, స్వేచ్ఛ, ఆనందకరమైన ఉనికి దాని ముగింపు.[23][24]
సన్యాసుల విభిన్న లక్ష్యాల ఆధారంగా ఆశ్రమ ఉపనిషత్తు వివిధ రకాల సన్యాసులను గుర్తించింది:[25] కుటీచక - వాతావరణ ప్రపంచాన్ని కోరేవారు; బహుదక – స్వర్గ లోక వాసాన్ని కోరేవారు; హంస – తపో ప్రపంచాన్ని కోరేవారు; పరమహంస – సత్యాన్వేషకులు; తురియాతీతులు, అవధూతలు - జీవితంలో విముక్తిని కోరేవారు.
సన్యాసోపనిషత్తు వంటి కొన్ని గ్రంథాలలో,[12] సన్యాసినులు కలిగి ఉండే వస్తువులు, వారి జీవనశైలిని బట్టి సన్యాసులను వర్గీకరించాయి. ఉదాహరణకు, కుటీచక సన్యాసులు త్రిశూలాన్ని, హంస సన్యాసులు ఏక శూలాన్నీ కలిగి ఉంటారు, పరమహంసల వద్ద అవేమీ ఉండవు. చిహ్నాల ఆధారంగా చేసే ఈ వర్గీకరణ పద్ధతి వివాదాస్పదమైంది, ఇది త్యజించే ఆలోచనకు వ్యతిరేక నేపథ్యంగా మారింది. నారద పరివ్రాజక ఉపనిషత్తు వంటి తరువాతి గ్రంథాలు, త్యజించే పద్ధతులన్నీ ఒక్కటే అని పేర్కొంటూ, కానీ ప్రజలు వివిధ కారణాల వల్ల సన్యాస స్థితిలోకి ప్రవేశిస్తారు - నిర్లిప్తత, వారి నిరర్థక ప్రపంచం నుండి దూరంగా ఉండటం, జీవితంలో జ్ఞానం, అర్ధం కోసం, సన్యాస ఆచారాలను గౌరవించడం కోసం సన్యాసాన్ని స్వీకరిస్తారు అని చెప్పాయి.
బౌధాయన ధర్మసూత్రం,[26] II.10.17.2 శ్లోకంలో బ్రహ్మచర్య (విద్యార్థి) జీవిత దశను పూర్తి చేసిన ఎవరైనా వెంటనే సన్యాసి కావచ్చని, II.10.17.3లో సంతానం లేని దంపతులు కోరుకున్నప్పుడు ఎప్పుడైనా సన్యాసంలో ప్రవేశించవచ్చనీ పేర్కొంది, అయితే శ్లోకం II.10.17.4 ప్రకారం వితంతువు సన్యాసాన్ని ఎంచుకోవచ్చని చెబుతుంది. కానీ శ్లోకం II.10.17.5, 70 ఏళ్లు పూర్తయిన తర్వాత, పిల్లలు జీవితంలో స్థిరపడిన తర్వాత సన్యాసం తీసుకోవచ్చని చెబుతుంది.[26] ఇతర గ్రంథాలు 75 సంవత్సరాల వయస్సును సూచిస్తున్నాయి.[27]
వశిష్ట, ఆపస్తంబ ధర్మసూత్రాలు, ఆ తరువాతి మనుస్మృతి, ఆశ్రమాలను వరుస దశలుగా వర్ణించాయి. వీటిప్రకారం మానవుని జీవనం విద్యార్థి నుండి గృహస్థుని నుండి వానప్రస్థం నుండి సన్యాసానికి సాగుతుంది.[28] అయితే, ఈ గ్రంథాలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు, యాజ్ఞవల్క్య స్మృతి, మనుస్మృతికి భిన్నంగా ఉంటుంది. 3.56 శ్లోకంలో గృహస్థు వానప్రస్థ దశను దాటవేసి నేరుగా సన్యాసానికి వెళ్లవచ్చని పేర్కొంది.
ఏ వర్ణానికి చెందినవారు సన్యసించవచ్చు, ఏ వర్ణస్థులు చెయ్యకూడదు అని ప్రాచీన, మధ్యయుగ ధర్మ సాహిత్యంలో చెప్పలేదు. ఆధునిక ధర్మశాస్త్ర గ్రంథాలు మాత్రం ద్విజ పురుషుల సన్యాసం గురించి చర్చిస్తాయి.[29] ఏది ఏమైనప్పటికీ, ధర్మశాస్త్ర గ్రంథాలు అన్ని కులాల వారితో పాటు స్త్రీలు కూడా సన్యాసం లోకి ప్రవేశించవచ్చునని చెప్పాయి.[30]
ప్రపంచాన్ని త్యజించిన తరువాత, సన్యాసి ఆర్థిక బాధ్యతలు, ఆస్తి, అప్పుల బాధ్యతలు ఎవరు స్వీకరించాలనేది రాజ్యం నిర్ణయిస్తుంది.[31] ఉదాహరణకు, విష్ణు స్మృతి 6.27 శ్లోకంలో, రుణగ్రహీత సన్యాసం తీసుకుంటే, అతని కుమారులు లేదా మనుమలు అతని అప్పులను తీర్చాలని పేర్కొంది.[32] త్యజించిన తర్వాత సన్యాసి సేకరించే లేదా కలిగివుండే కొద్దిపాటి ఆస్తికి సంబంధించి, కౌటిల్యుని అర్థశాస్త్రం III వ పుస్తకం, అధ్యాయం XVI లో సన్యాసులు (వానప్రస్థ), సన్యాసులు (యతి, సన్యాసం), విద్యార్థి బ్రహ్మచారి (బ్రహ్మచారి) వారి మరణం తర్వాత వారి ఆస్తి వారి గురువు, శిష్యులు, వారి ధర్మభ్రాత్రి (సన్యాసంలో సోదరుడు) లేదా సహవిద్యార్థుల స్వాధీనం అవుతుందని పేర్కొంది. .[33]
సన్యాసి బాధ్యతలు, ఆస్తి హక్కులు తిరిగి కేటాయించబడినప్పటికీ, వారికి ఇతరులు చేసే హాని నుండి రక్షణ, ప్రయాణించే స్వేచ్ఛ వంటి ప్రాథమిక మానవ హక్కులు ఉంటాయి. అదేవిధంగా, సన్యాసులు సాధారణ పౌరుల వలె అదే చట్టాలకు లోబడి ఉంటారు; సన్యాసి దొంగిలించడం, హాని చేయడం లేదా చంపడం అన్నీ కౌటిల్య అర్థశాస్త్రంలో తీవ్రమైన నేరాలు.[34]
చారిత్రికంగా సన్యాసి జీవితం అంటే పరిత్యాగం, అహింస, ఆధ్యాత్మిక సాధన. అయితే, భారతదేశంలో, ఇది ఎల్లప్పుడూ అలా లేదు. ఉదాహరణకు, 12వ శతాబ్దంలో మంగోలు, పెర్షియన్ ఇస్లామిక్ దండయాత్రలు, ఢిల్లీ సుల్తానేట్ స్థాపన తర్వాత, హిందూ-ముస్లిం విభేదాలు భారతదేశంలో హిందూ సన్యాసులలో సైనిక సంప్రదాయం ఏర్పడడానికి ప్రేరేపించాయి.[6][7] ఈ యోధ సన్యాసులు ''అఖారాలు'' అనే పారామిలిటరీ సమూహాలను ఏర్పరచారు. వారు అనేక రకాల యుద్ధ కళలను కనుగొన్నారు.[6]
క్రీ.శ. 12వ శతాబ్దానికి చెందిన నాథ సిద్ధులు, ముస్లింల ఆక్రమణ తర్వాత సైనిక ప్రతిస్పందనను ఆశ్రయించిన తొలి హిందూ సన్యాసులు కావచ్చు. ఈ సన్యాసులు తిరుగుబాటుకే అంకితమైనందున, వారు గూఢచర్యం, లక్ష్యం కోసం వివిధ సాంకేతికతలను అభివృద్ధి చేశారు. వారు ముస్లిం ప్రభువులు, సుల్తానేట్ రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధ వ్యూహాలను అనుసరించారు. ఈ సమూహాలలో చాలా మంది మహాదేవుని భక్తులు. వారిని మహంతులు అని పిలుస్తారు.[6] వారి ఇతర పేర్లు సన్యాసిలు, యోగులు, నాగాలు, బైరాగులు (విష్ణు భక్తులు). 16 నుండి 19వ శతాబ్దాల వరకు గోసైన్లు ; కొన్ని సందర్భాల్లో ఈ హిందూ సన్యాసులు, ముస్లిం సూఫీ ఫకీర్లకు సహకరించారు.[7]
వారియర్ సన్యాసులు మొఘల్ సామ్రాజ్యం కాలంలో కూడా తమ తిరుగుబాటును కొనసాగించారు. బ్రిటిష్ రాజ్ ప్రారంభ సంవత్సరాల్లో రాజకీయ శక్తిగా మారారు. కొన్ని సందర్భాల్లో, సైనిక సన్యాసుల ఈ రెజిమెంట్లు గెరిల్లా యుద్ధాల నుండి యుద్ధ పొత్తులకు మారాయి. బ్రిటు వారు భారతదేశంలో బలపడడంలో ఈ హిందూ యోధ సన్యాసులు కీలక పాత్ర పోషించారు.[35] 19వ శతాబ్దం చివరలో బ్రిటీష్ రాజ్య ఏకీకరణతో, మహాత్మా గాంధీచే అహింసా ఉద్యమం పెరగడంతో యోధ సన్యాసుల ప్రాముఖ్యత వేగంగా క్షీణించింది.[6]
ముక్తికాలోని 108 ఉపనిషత్తులలో, అతిపెద్ద భాగం సన్యాసానికి, యోగాకు అంకితం చేయబడింది. పరిత్యాగానికి సంబంధించిన గ్రంథాలను సన్యాస ఉపనిషత్తులు అంటారు.[36] ఇవి క్రింది విధంగా ఉన్నాయి:
పదమూడు ప్రధానమైన ఉపనిషత్తులలో, చాలా వరకు సన్యాసానికి సంబంధించిన విభాగాలు ఉన్నాయి. ఉదాహరణకు, సన్యాసి ప్రేరణలు, స్థితి లను మైత్రాయణి ఉపనిషత్తు ప్రస్తావించింది. ఇది, రాబర్ట్ హ్యూమ్ తన హిందూ మతం యొక్క "పదమూడు ప్రధాన ఉపనిషత్తుల" జాబితాలో చేర్చిన ఒక శాస్త్రీయ ప్రధాన ఉపనిషత్తు.[39] మైత్రాయణి ప్రశ్నతో మొదలవుతుంది, "జీవిత స్వభావాన్ని బట్టి, ఆనందం ఎలా సాధ్యమవుతుంది?" "మోక్షం (విముక్తి) ఎలా సాధించగలరు?"; తరువాతి విభాగాలలో ఇది సాధ్యమైన సమాధానాలు ఇస్తూ, సన్యాసంపై దాని అభిప్రాయాలపై చర్చను అందిస్తుంది.[40]
కామ, క్రోధ, భయ, మోహ, మద, మాత్సర్యాల తోటి, వాంఛనీయమైన వాటికి దూరంగాను, అవాంఛనీయాలకు దగ్గరగానూ ఉంటూ, ఆకలి, దాహం, వార్థక్యం, రోగం, బాధ మొదలైనవాటితో కూడుకున్న ఈ దేహంలో ఉంటూ కేవలం ఆనందాన్ని మాత్రమే అనుభవించడం ఎలా? – శ్లోకం I.3 మహాసముద్రాలు ఇగిరిపోవడం, పర్వతాలు కూలిపోవడం, ధ్రువ నక్షత్రం చలించడం, భూమి కుంగి మునిగిపోవడం, దేవతలు తమ స్వస్థానాల నుండి పడిపోవడం లాంటివి జరిగే ఈ లోకంలో ఆనందాన్ని మాత్రమే అనుభవించడం ఎలా?! – శ్లోకం I.4
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.