Remove ads
కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధ జైన క్షేత్రం. ఇచట బాహుబలి లేదా గోమఠేశ్వర విగ్రహం కలదు. From Wikipedia, the free encyclopedia
'శ్రావణబెళగొళ' (కన్నడ: ಶ್ರವಣಬೆಳಗೊಳ Śravaṇa Beḷagoḷa) కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలోని చెన్నగరాయపట్టణానికి సమీపంలోని పట్టణం. ఇది బెంగుళూరుకు 158 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జైనులకు ప్రీతిపాత్రమైన బాహుబలి (గోమఠేశ్వరుడి) అతి ఎత్తైన విగ్రహం ఇక్కడ ఉంది. ఇక్కడ 2000 ఏళ్ళ సంవత్సరాలకు పూర్వమే జైన మతం ఉండినట్లు తెలుస్తుంది. పశ్చిమ గంగ సామ్రాజ్యపు శిల్ప, వాస్తు కళా నైపుణ్యానికి ఇది ఆలవాలం. మౌర్య రాజు చంద్ర గుప్త మౌర్యుడు యుద్ధ జీవితంతో విసిగి ఇక్కడికి వచ్చి ధ్యానంతో మనశ్శాంతిని పొందినట్లు తెలుస్తుంది. దక్షిణ కాశిగాను ఈ పట్టణాన్ని వ్యవహారిస్తారు. రాజస్థాన్‌లోని అబూ పర్వతం, ఒడిశాలోని ఉదయగిరి గుహలతో పాటు జైనులు శ్రావణబెళగొళను పరమ పవిత్ర స్థలంగా భావిస్తారు
శ్రావణబెళగొళ
ಶ್ರವಣಬೆಳಗೊಳ | |
---|---|
పట్టణం | |
దేశము | భారతదేశము |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | హసన్ జిల్లా |
Time zone | UTC+5:30 (IST) |
ఇది కర్ణాటకలోని హాసన్ జిల్లా, చెన్నగరాయపట్టణానికి ఆగ్నేయాన 13 కిలో మీటర్ల దూరంలోను, జిల్లా కేంద్రమైన హాసన్‌కు ఆగ్నేయంలో 51 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. బెంగుళూరు- మంగుళూరును కలిపే 48 వ జాతీయ రహదారికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యాత్రాస్థలాలైన హళేబీడు నుండి 78 కిలోమీటర్లు, బేలూరు నుండి 89 కిలోమీటర్లు, మైసూరు నుండి 83 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది.
పట్టణానికి మధ్యలో ఒక కొలను ఉంది. దీనికి శ్వేతకొలను లేదా దవళ సరోవరం అని పేరు. ఈ శ్వేతకొలనుకు కన్నడంలో బెళగొళ అని పేరు. శ్రవణుడి (గోమఠేశ్వరుడి) బెళగొళ కాబట్టి శ్రావణబెళగొళగా ఈ ప్రాంతానికి పేరు స్థిరపడిపోయింది.
వింధ్యగిరిపై రాజమల్ల మంత్రి చాముండిరాయ ఎన్నో ప్రయాసలు పడి గోమఠేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. ఈ విగ్రహానికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహామస్తకాభిషేకం జరిగేలా ఏర్పాటుచేశాడు. తొలినాళ్ళలో అభిషేకోత్సవం జరిపించాలని చాముండిరాయ నిర్ణయించాడు. గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన తనకు తప్ప వేరే ఎవరికి ఆ అభిషేకోత్సవంలో పాల్గొనే అవకాశం లేదని ప్రకటించాడు. బాహుబలి అభిషేకానికి అన్ని ద్రవ్యాలు తెప్పించాడు చాముండిరాయ. అభిషేకోత్సవం మొదలైంది. చాముండి తెప్పించిన అన్ని ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అన్నీ ఐపోయాయి. కాని అభిషేక ద్రవ్యాలు బాహుబలి పాదాలకు కూడా చేరలేదు. చాముండిరాయకు యేమిచేయాలో పాలుపోలేదు. చివరికి ఒక అజ్జి (ముసలవ్వ) గుల్లెకాయ (కొబ్బరికాయ) లో కొన్ని పాలు తీసుకొని వచ్చిందట. తనకు అభిషేకానికి అనుమతి ఇవ్వమని కోరిందట. భటులు ముందు అంగీకరించకపోయినా, చాముండిరాయ ఆజ్ఞతో అనుమతించారట. అవ్వ ఆ చిన్న కొబ్బరి చిప్పలోని పాలను బాహుబలి మస్తకంపై పోయగా, ఆ కొద్ది పాలే ఆశ్చర్యంగా బాహుబలి శిరస్సు నుండి పాదాలకు చేరి మొత్తం తడిపివేశాయట. అంతటితో ఆగకుండా ఆ విగ్రహం నుండి పాలు కొండ మీదికి, ఆ వింధ్యగిరి మీద నుండి కిందికి ధారాపాతగా ప్రవహించాయట. అలా పారిన ఆ పాలతో ఏర్పడినదే ఈ సరస్సు అని, అందుకే ఇది తెల్లగా ఉన్నదని, దానికి శ్వేతకొలను లేదా దవళసరోవరమని పేరొచ్చిందని చెబుతారు. చాముండిరాయ అవ్వ మహాత్యానికి అబ్బురపడి, క్షమించమని కోరాడట. ఆ అవ్వ ఎవరో కాదని జైన జాతి రక్షక దేవత అని, భగవంతుడి సేవాభాగ్యాన్ని అందరికి కలిపించాలని చాటి చెప్పి, చాముండిరాయ కళ్ళు తెర్పించడానికి వచ్చిందని జైనులు విశ్వసిస్తారు. ఆ అవ్వకు ఒక ఆలయాన్ని నిర్మిచారు. ఆ ఆలయాన్ని గుల్లెకాయ అజ్జి ఆలయంగా పిలుస్తారు.
ఈ పట్టణంలో చంద్రగిరి, వింధ్యగిరి అను రెండు కొండలు ఉన్నాయి. ఇక్కడ ఆచార్య బద్రబాహు, అతని శిష్యుడు చంద్రగుప్త మౌర్యుడు తపస్సు ఆచరించినట్లు తెలుస్తుంది[1]. క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దిలో అశోకడు ఇక్కడ చంద్రగుప్తుని పేరుతో మఠాన్ని ఏర్పాటు చేశాడు. చంద్రగిరిపై గొప్ప ఆలయం ఉంది. దీనిని గంగ రాజు రాజమల్ల మంత్రి, నేమిచంద్రుని శిష్యుడిగా చెప్పబడె చాముండిరాయ నిర్మించాడు.
పట్టణంలోని వింధ్యగిరిపై 58 అడుగుల ఎత్తైన ఆకర్షణీయమైన గోమఠేశ్వరుడి ఏకశిలా విగ్రహం ఉంది[2]. దీనికి ప్రపంచంలో అతి పొడవైన ఏకశిలా విగ్రహంగా గుర్తింపు ఉంది. ఈ విగ్రహం యొక్క పీఠంపై కన్నడ, ప్రాచీన కొంకణి, సంస్కృత సమ్మిళితమైన లిపిలో ఒక శాసనం ఉంది. ఈ శాసనం సా.శ.981 నాటిదిగా చెప్పబడింది[3]. ఈ విగ్రహాన్ని కన్నడ ప్రజలు గోమఠేశ్వరుడిగా పిలుస్తే, జైనులు బాహుబలిగా కొలుస్తారు. భారతదేశపు ఏడు అద్భుతాల జాబితా కొరకు టైంస్ ఆఫ్ ఇండియా (ఆంగ్ల దినపత్రిక)2007 ఆగస్టులో ఒక సర్వేను నిర్వహించింది. అందులో 49 శాతం మంది గోమఠేశ్వర విగ్రహానికి తమ మద్ధతు తెలిపి మొదటి స్థానాన్ని కట్టబెట్టారు.[4] ఈ గోమఠేశ్వరుడికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహామస్తకాభిషేక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ సందర్భంగా పాలు, పెరుగు, నెయ్యి, కుంకుమపూలు, బంగారు నాణేలతో అభిషేకం చేస్తారు. ఈ ఉత్సవానికి దేశ నలుమూలల నుండి వేలకొలది జైనులు తరిలివస్తారు. 2030 లో మరల మహామస్తకాభిషేకం జరుగనుంది.
శ్రావణబెళగొళలో సా.శ.600 నుండి 1830 మధ్య వివిధ కాలాలకు చెందిన దాదాపు 800 శాసనాలు ఇక్కడ లభించాయి. ఈ శాసనాలు చంద్రగిరి, ఇంద్రగిరి పర్వతాలపై, పట్టణంలోని వివిధ ప్రాంతాలలో లభించాయి. వీటిలో ఎక్కువ భాగం చంద్రగిరి పర్వతం మీద లభించగా, ఇవన్నీ కూడా సా.శ. 10 వ శతాబ్దికి ముందువే కావడం విశేషం. ఈ శాసనాలు కన్నడ, కొంకిణి, మరాఠి, తమిళ, సంస్కృత, మహాజనీ, మర్వారి భాషల్లో ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం ప్రాచీన కన్నడలో ఉన్నాయి. వీటిలో చాలా శాసనాలు పశ్చిమ గంగ, రాష్ట్ర కూట, హొయసల, విజయనగర, ఒడయార్ సామ్రాజ్యాల ఉత్థానపతనాలను సూచిస్తాయి[5]. అదేవిధంగా కన్నడ భాష, సాహిత్యాల స్వభావం, పరిణామ క్రమాన్ని అధ్యనం చేయడానికి, అర్థం చేసుకోవడానికి ఆధునిక పరిశోధకులకు ఈ శాసనాలు ఓ గొప్ప సంపద.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.