From Wikipedia, the free encyclopedia
రాష్ట్రపతి భవన్ (ఆంగ్లం: Rashtrapati Bhavan) భారతదేశపు రాష్ట్రపతి అధికారిక నివాస స్థలం. ఇది భారత దేశ రాజధానియైన కొత్త ఢిల్లీలో ఉంది.[1]
అప్పుడు వలస పాలకులైన బ్రిటిష్ వారి పరిపాలన క్రింద ఉంది భారతదేశం. అప్పటివరకు భారత దేశానికి రాజధానిగా వున్న కలకత్తా నుండి రాజధానిని 1911 వ సంవత్సరంలో ఢిల్లీకి మార్చాలని తలపెట్టాడు నాటి బ్రిటిష్ రాజు జార్జ్- 5. అప్పటికే ఢిల్లీలోని పురాతన భవనాలను, ఇతర కట్టడాలను చూసిన రాజు బ్రిటిష్ రాజ ప్రతినిధుల కొరకు ఒక నగరాన్ని వారి నివాసానికి ఒక అద్భుతమైన పెద్ద భవనాన్ని నిర్మించాలని తలపెట్టాడు. అతని ఆలోచన రూపమే ఢిల్లీ ప్రక్కనే నిర్మితమైన కొత్తఢిల్లీ నగరం.. అందులోని నేటి రాష్ట్రపతి భవనము. ఈ భవనాన నిర్మాణానికి రూప కల్పన చేసినది లుట్యెంస్. దీని నిర్మాణానికి హగ్ కీలింగ్ చీఫ్ ఇంజనీరుగా పనిచేశారు. దీని నిర్మాణంలో భారతీయ, మొగల్ నిర్మాణ రీతులు కనిపిస్తాయి. ఈ నిర్మాణంలో తలమానికమైన బారీ డోం. ఇది భౌద్ద నిర్మాణాలను తలపిస్తుంది.
స్వాతంత్య్రానంతరం ఈ భవనంలోనికి అడుగు పెట్టిన మొదటి వ్వక్తి అప్పటి మొదటి భారతీయ గవర్నర్ జనరల్ చక్రవర్తుల రాజగోపాలాచారి. ఆ తర్వాత భారతదేశం గణతంత్రంగా ఆవిర్బవించడంతో రాష్ట్ర పతి పదవి వచ్చింది. రాష్ట్ర పతి నివాసానికి కేటాయించిన ఈ భవనానికి నాడు రాష్ట్రపతి భవన్ గా నామ కరణం చేశారు. అప్పుడు రాజాజీ వుండిన గదుల్లోనే ఇప్పటికి వరకు రాష్ట్ర పతులందరు ఉంటున్నారు. బ్రిటిష్ వైస్రాయ్ లు ఉపయోగించిన గదులను మాత్రం నేడు.. దేశ పర్యటనకు వచ్చిన విదేశాధినేతలకు కేటాయిస్తున్నారు.
ఈ రాష్ట్రపతి భవనంలో మొత్తం 340 గదులుండగా.. దర్బాలు హాలు, అశోకాహాలు, డైనింగు హాలు, మొగల్ గార్డెన్ లను మాత్రమే సందర్శకులకు అనుమతిస్తారు. రంగు రంగు చలువ రాళ్లతో మనోరంజకంగా వుండే దర్బారు హాలులో జాతీయ అవార్డుల ప్రధానోత్సవాలకు ఉపయోగిస్తారు. అందమైన షాండియర్లు అలంకరించిన అశోకా హాలు మంత్రుల ప్రమాణ స్వీకరణోత్సవాలకు ఉపయోగిస్తారు. డైనింగు హాలో ఒకేసారి 104 మంది కూర్చొని బోజనం చేయవచ్చు. వారి భోజనానినికి వెండి పాత్రలను ఉపయోగిస్తారు.
ఈ భవనాన్ని రాంత్రింబవళ్లు కాపలాకాయడానికి వెయ్యి మంది ఢిల్లీ పోలీసులుంటారు. బ్లాక్ కమెండోలు కూడా వుంటారు. ఈ కాపలా దారులంతా అశ్వ, నావిక, వైమానిక దళాలో శిక్షన పొంది వుండాలి. వీరందరు ఆరడుగుల పైనే పొడవుండాలి. రాష్ట్రపతి ఈ భవనం నుండి బయట కాలు పెడితె చాలు.. అది అరగంట పనైనా.. సుదీర్ఘ విదేశ పర్యటన అయినా.. అతను బయటకు వెళ్లే టప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు.. వీడ్కోలు, పలకడానికి, వచ్చినప్పుడు ఆహ్వానము పలకడానికి 150 మంది సిక్కు సైనిక దళం సర్వ వేళలా సిద్దంగా వుంటుంది. ఇతర దేశాధిపతులకు కూడా వీరె ఆహ్వానం, వీడ్కోలు పలుకుతారు.
రాష్ట్రపతి కుటుంబానికి, అక్కడికి వచ్చే అతిధులకు అవసరమైన వంటకాలను తయారు చేయడానికి 18 మంది వంట మనుషులు, వడ్డించడానికి 10 మంది బట్లర్లు వుంటారు. గదులను ఊడ్చడానికి శుభ్రంగా వుంచడానికి 110 మంది పని వాళ్లుంటారు. అంతేగాక 10 మంది డ్రైవర్లు, ఐదుగురు మెకానిక్కులు, 180 మంది అంగ రక్షకులు, ఇంకా డాక్టర్లు, సెక్రెటరీలు, క్లర్కులు.. మొదలగు వారందరూ కలిపి 1000 మంది పైగానె పనిచేస్తుంటారు. రాష్ట్రపతి ప్రయాణించ డానికి ఎస్ క్లాస్ 600 పుల్ ల్మన్ గార్డ్ మెర్సిడెజ్ కారును ఉపయోగిస్తారు. ఈ రాష్ట్ర పతి భవన్ నిర్వహణ ఖర్చు ఏడాదికి వంద కోట్ల రూపాయలకు పైనే వుంటుంది.
ఈ రాష్ట్ర పతి భవన ఆవరణములో అందమైన వుద్యాన వనాలున్నాయి. అవి మొఘల్ గార్డెన్, హెర్బెల్ గార్డెన్, న్యూట్రిషన్ గార్డెన్, స్పిరిచ్యుల్ గార్డెన్ వంటివి ఉన్నాయి. వాటి బాధ్యతలను చూడడానికి 150 మంది తోట పని వారుంటారు. ఈ ఉద్యాన వనాల్లోకంతా ప్రధానాకర్షణ మొగల్ గార్డెన్. ఇందులో మామిడి, సపోట, జామ, అరటి వంటి పండ్ల చెట్లే గాక వేప, మర్రి, రావి లాంటి వృక్షాలు కూడా ఉన్నాయి. ఈ గార్డెన్ లో 8 టెన్నిస్ కోర్టులు, ఒక గోల్పు మైదానము, ఒక క్రికెట్ మైదానము కూడా ఉన్నాయి. అబ్దుల్ కలాం పదవీ కాలంలో రాష్ట్రపతి భవన్ లో అదనంగా సైన్స్ మ్యూజియం, చిల్డ్రన్ గ్యాలరి, కిచెన్ మ్యూజియం, హెర్బల్ గార్డెన్ అధనంగా చేరాయి.
కాగా మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్ గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం 2023 జనవరి 28న నిర్ణయం తీసుకుంది. దీనిని ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జనవరి 29న ప్రారంభిస్తారు. ప్రజల సందర్శన నిమితం ఈ అమృత్ ఉద్యాన్ ను జనవరి 31 నుంచి మార్చి 26 వరకు తెరిచి ఉంచుతారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.