Remove ads
ప్రజా ప్రయోజనాల రీత్యా కేసుకు సంబంధం లేనివారు కూడా కోర్టులో వేసే కేసు From Wikipedia, the free encyclopedia
ప్రజా ప్రయోజన వ్యాజ్యం (Public interest litigation - PIL, పిల్) అనేది ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు చేపట్టే వ్యాజ్యం. ఇది సామాజికంగా వెనుకబడిన పక్షాలకు న్యాయం అందుబాటులోకి తెస్తుంది. దీనిని జస్టిస్ పి.ఎన్ భగవతి ప్రవేశపెట్టారు. ఇది లోకస్ స్టాండి సాంప్రదాయ నియమానికి సడలింపు. 1980లకు ముందు భారత న్యాయవ్యవస్థ లోని కోర్టులు ప్రతివాది ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితమైన పక్షాల నుండి మాత్రమే వ్యాజ్యాన్ని స్వీకరించేవి. ఇవి తమ అసలు అధికార పరిధిలోని కేసులను మాత్రమే విచారించడం, నిర్ణయించడం జరిగేది. అయితే పిల్ వచ్చిన తరువాత సుప్రీంకోర్టు, ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఆధారంగా కూడా కేసులను అనుమతించడం ప్రారంభించింది, అంటే కేసులో ప్రత్యక్షంగా ప్రమేయం లేని వ్యక్తులు కూడా ప్రజా ప్రయోజన విషయాలను కోర్టుకు తీసుకురావచ్చు. పిల్ దరఖాస్తును స్వీకరించడం న్యాయస్థానపు హక్కు.
తొలి ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో ఒకటి జి. వసంత పాయ్ మద్రాసు హైకోర్టులో దాఖలుచేసినది. అప్పటి మద్రాసు హైకోర్టు సిట్టింగ్ ప్రధాన న్యాయమూర్తి ఎస్. రామచంద్ర అయ్యర్[1] 60 సంవత్సరాల వయస్సులో నిర్బంధ పదవీ విరమణను నివారించడానికి తన పుట్టినరోజును నకిలీ చేశారని తేలిన తర్వాత ఆయనపై వసంత మద్రాసు హైకోర్టులో కేసు వేశారు. రామచంద్ర అయ్యర్ తమ్ముడు తన 60వ పుట్టినరోజును జరుపడానికి ఆహ్వానాలను పంపాడు, పాయ్ రామచంద్ర అయ్యర్ అసలు వయసును చూపించే అసలు జనన రిజిస్టర్‌ను ఫోటో తీసి సాక్ష్యాలను కనుగొన్నాడు. ఈ కేసు న్యాయవ్యవస్థను దెబ్బతీస్తుందని అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి పిబి గజేంద్రగడ్కర్ అభ్యర్థన మేరకు రామచంద్ర అయ్యర్ రాజీనామా చేశారు.[2] ఈ కేసు విచారణకు రాకముందే ఆయన రాజీనామా చేయడంతో కేసు కొట్టివేయబడింది. [3]
1979 డిసెంబరులో, బీహార్ జైలులో నిర్బంధించబడి, వ్యాజ్యాలు కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఖైదీల పరిస్థితికి సంబంధించి కపిల హింగోరాణి ఒక పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై బీహార్ జైల్లోని ఖైదీలు సంతకం చేశారు. భారత సుప్రీంకోర్టులో జస్టిస్ పిఎన్ భగవతి నేతృత్వంలోని ధర్మాసనం ముందు కేసును దాఖలు చేసారు. హుస్సేనారా ఖాటూన్ అనే ఖైదీ పేరుతో ఈ పిటిషన్‌ను దాఖలు చేసారు. కాబట్టి ఈ కేసుకు హుస్సేనారా ఖాటూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని పేరు పెట్టారు. ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం, త్వరిత విచారణలు అందజేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఫలితంగా 40,000 మంది ఖైదీలు జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఇలాంటి కేసులు చాలా నమోదయ్యాయి. SP గుప్తా వ. యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భారత సుప్రీంకోర్టు భారతీయ సందర్భంలో "ప్రజా ప్రయోజన వ్యాజ్యం" అనే పదాన్ని నిర్వచించింది. ఈ కేసు కారణంగా కపిల హింగోరాణిని "మదర్ ఆఫ్ పిల్స్" అని పిలుస్తారు.[4]
చట్టం సహాయంతో సత్వర సామాజిక న్యాయాన్ని అందించాలని, రక్షించాలని చెప్పే భారత రాజ్యాంగం ఆర్టికల్ 39A[5] లోని సూత్రాలకు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL, పిల్) సరిపోతుంది[lower-alpha 1]. 1980లకు ముందు, బాధిత పక్షం మాత్రమే న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించేది. ఎమర్జెన్సీ యుగం తర్వాత, హైకోర్టు ప్రజలను చేరుకుంది, ప్రజా ప్రయోజనం ప్రమాదంలో పడే సందర్భాల్లో ఏ వ్యక్తి (లేదా ప్రభుత్వేతర సంస్థ) అయినా న్యాయస్థానాన్ని ఆశ్రయించే మార్గాన్ని రూపొందించింది. కోర్టులో పిల్ ను అంగీకరించిన మొదటి న్యాయమూర్తులలో భగవతి, జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ ఉన్నారు.[6] పిల్ దాఖలు చేయడం సాధారణ చట్టపరమైన కేసు వలె గజిబిజిగా, భారంగా ఉండదు; కోర్టుకు పంపిన లేఖలు, టెలిగ్రామ్‌లను కూడా పిల్లుగా విచారించిన సందర్భాలు ఉన్నాయి.[7]
ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్ల లేఖను సుప్రీం కోర్టు స్వీకరించింది; అమానవీయమైన, అవమానకరమైన పరిస్థితులలో ఆగ్రాలోని రక్షణ గృహంలో నివసిస్తున్న వారి రాజ్యాంగ హక్కును అమలు చేయాలని ఆ లేఖలో అభ్యర్థించారు. మిస్ వీణా సేథి వర్సెస్ బీహార్ రాష్ట్రం కేసులో బీహార్‌లోని హజారీబాగ్‌లోని ఉచిత న్యాయ సహాయ కమిటీ కోర్టు న్యాయమూర్తికి పంపిన లేఖను కోర్టు పిటిషన్‌గా పరిగణించింది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అధ్యక్షుడు వర్సెస్ అస్సాం రాష్ట్రం, తదితరులు కేసులో ఉగ్రవాద, విద్వంసక కార్యకలాపాల (నివారణ) చట్టం (టెర్రరిస్ట్, డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ ఆక్ట్, TADA) ఖైదీల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని కులదీప్ నయ్యర్ (జర్నలిస్టు, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రెసిడెంట్ హోదాలో) ఆరోపిస్తూ కోర్టు న్యాయమూర్తికి రాసిన ఒక లేఖను కోర్టు స్వీకరించింది; ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద ఒక పిటిషన్‌గా పరిగణించబడింది. [8] [9]
పిల్ అనేది కోర్టులు ప్రకటించే న్యాయ నియమం. అయితే, పిటిషన్ ప్రజా ప్రయోజనానికి ఉపయోగపడుతుందనీ, ఆర్థిక లాభం కోసం పెట్టిన పనికిమాలిన వ్యాజ్యం కాదనీ పిటిషన్‌ను దాఖలు చేసే వ్యక్తి (లేదా సమూహం) కోర్టుకు సంతృప్తి కలిగేలా నిరూపించాలి. పనికిమాలిన పిల్ లను దాఖలు చేసేవారిపై గణనీయమైన "జరిమానా" విధించబడుతుందని 38వ భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్. హెచ్. కపాడియా పేర్కొన్నారు. ఆర్థిక లాభాల కోసం పనికిమాలిన పిల్లు ఎక్కువవుతుండడం వల్ల అతని ప్రకటన విస్తృతంగా ప్రశంసించబడింది. పిల్ ల దుర్వినియోగంపై హైకోర్టు బెంచ్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని అన్ని కోర్టులు పిల్లను విచారించేటప్పుడు పాటించవలసిన మార్గదర్శకాలను బెంచ్ జారీ చేసింది.
2008 సెప్టెంబరు లో చేసిన ప్రసంగంలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, పిల్ ల దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశాడు.
భారత రాజ్యాంగం లోని పార్ట్ III కింద హామీ ఇచ్చిన సమానత్వం, జీవితం, వ్యక్తిత్వానికి సంబంధించిన హక్కులకు ప్రజా ప్రయోజన వ్యాజ్యం విస్తృత వివరణ ఇస్తుంది. పిల్ సమాజంలో మార్పులకు లేదా సామాజిక సంక్షేమానికి సమర్థవంతమైన సాధనంగా కూడా పనిచేస్తుంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా, ఎవరైనా ప్రజానీకం లేదా వ్యక్తి పిల్ వేసి, అణగారిన వర్గం తరపున పరిహారానికి ప్రయత్నించవచ్చు. [10]
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, పురపాలక సంఘం, ప్రైవేటు పార్టీలు వగైరాలకు వ్యతిరేకంగా పిల్ దాఖలు చేయవచ్చు. పిల్లో 'ప్రతివాది'గా ప్రైవేట్ పార్టీని చేర్చవచ్చు. అంటే హైదరాబాదు లోని ఒక ప్రైవేట్ పరిశ్రమ కాలుష్యానికి కారణమవుతోంటే, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి, ఈ వ్యాజ్యంలో రాష్ట్ర కాలుష్య కేంద్ర బోర్డును, ఆ ప్రైవేట్ పరిశ్రమను కూడా చేర్చవచ్చు. [11]
బాధిత వ్యక్తి నేరుగా గాని, పరిష్కారం కోసం కోర్టును సంప్రదించలేని ఏ వ్యక్తి/పార్టీకి తరపునైనా ప్రజాసంక్షేమ స్ఫూర్తి గల వ్యక్తి లేదా ఓ సామాజిక కార్యాచరణ బృందం గానీ చట్టపరమైన లేదా రాజ్యాంగ హక్కుల అమలు కోసం దాఖలు లేఖను సమర్పించవచ్చు. ఆ పిటిషను ఈ ప్రాథమిక ప్రమాణాలకు అనుగుణంగా ఉందని కోర్టు సంతృప్తి చెందాలి. ఏ పౌరుడైనా కింది చట్టాల కింద పిటిషన్ దాఖలు చేయడం ద్వారా పబ్లిక్ కేసును దాఖలు చేయవచ్చు:
కార్యాలయంలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఈ కేసు 1997లో దాఖలైంది. రాజస్థాన్ గ్రామీణ ప్రాంతంలో ఒక సంవత్సరం బాలిక వివాహాన్ని ఆపడానికి ప్రయత్నించిన భన్వారీ దేవిపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. న్యాయం కోసం ఆమె చేసిన ప్రయత్నంలో అనేక సమస్యలను ఎదుర్కొంది. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను సవాల్ చేస్తూ విశాఖ అనే సామూహిక వేదిక కింద అనేక మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
కేసు తీర్పులో లైంగిక వేధింపులు 14, 15, 21 అధికరణాల్లోని ప్రాథమిక రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనగా గుర్తించబడ్డాయి. లైంగిక వేధింపుల నివారణకు కూడా మార్గదర్శకాలు నిర్దేశించబడ్డాయి. [13]
ఢిల్లీలోని శ్రీరామ్ ఫుడ్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ కాంప్లెక్స్ నుండి ఓలియం గ్యాస్ లీక్ అయి ప్రమాదం జరిగిన తర్వాత ఈ కేసు 1980లలో నమోదైంది. భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగిన వెంటనే ఈ గ్యాస్ లీక్ సంభవించి ఢిల్లీలో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరికొంత మంది ఆస్పత్రి పాలయ్యారు.
తమ వ్యర్థాలను సక్రమంగా శుద్ధి చేసి విడుదల చేయాల్సిన బాధ్యత పరిశ్రమలకు ఉందని కోర్టు పేర్కొంది. ముఖ్యంగా గంగా పరీవాహక ప్రాంతాల్లో నీటి కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, పరిశ్రమలను పర్యవేక్షించాలని సంబంధిత పురపాలిక, నగరపాలికలకు ఆదేశాలు జారీ చేసింది. [14][15]
2011లో, జస్టిస్‌లు జి. ఎస్. సింఘ్వీ, అశోక్ కుమార్ గంగూలీలతో కూడిన ధర్మాసనం రాజ్యాంగ ప్రవేశికలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి రూపొందించిన చట్టాలు సరిపోలేదని ఎత్తి చూపింది; చట్టంలో పొందుపరిచిన సంక్షేమ చర్యల ప్రయోజనాలు లక్షలాది మంది పేద ప్రజలకు చేరలేదు, ధనికుల-పేదల మధ్య అంతరాన్ని తగ్గించడానికి చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.
మురుగు కార్మికులకు సంబంధించిన ఈ కేసులో సింఘ్వీ ఇలా వ్రాశాడు: “ఈ దృష్టాంతంలో అత్యంత దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, రాజ్యం లోని మూడు విభాగాలలో ఒకటైన న్యాయవ్యవస్థ - పేదరికం, నిరక్షరాస్యత, అజ్ఞానం వంటి వైకల్యాలతో బాధపడుతున్న వారికి సమానత్వం, జీవితం, స్వేచ్ఛ హక్కులు ఉండాలని నిర్ధారించడానికి ఆదేశాలు జారీ చేసినప్పుడల్లా, శాసనసభ రూపొందించిన చట్టాలను పేదల కోసం అమలు చేయమని ఆదేశాలు ఇచ్చినపుడల్లా, న్యాయపరమైన క్రియాశీలత అనో కోర్టుల అతి జోక్యం అనో సైద్ధాంతిక చర్చ మొదలవుతుంది".[16]
తమ హక్కులను పరిరక్షించుకోలేని పేదల కోసం అత్యున్నత న్యాయస్థానాలు పిల్ పిటిషన్లను స్వీకరించడం ద్వారా, వారి అధికార పరిధి హద్దులను దాటుతున్నాయని కొందరి అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని తుడిచెయ్యాల్సిన అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతి పౌరుడి హక్కులను పరిరక్షించడంతోపాటు అందరూ గౌరవంగా జీవించేలా చూడడం న్యాయవ్యవస్థ కర్తవ్యమని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.