From Wikipedia, the free encyclopedia
ప్రాణాయామం అంటే ప్రాణశక్తిని విస్తరింపజేసి అదుపులో ఉంచడం. ప్రాణము అనగా జీవనము, ఆయామము అనగా పొడిగించుట లేదా పెంచుట. ప్రాణాయామం మనస్సును ఏకాగ్రం చేయడానికి, శరీరాంతర్గత నాడీ శుద్ధికి తోడ్పడుతుంది. పతంజలి మహర్షి ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలను అదుపులో ఉంచడం ప్రాణాయామమని నిర్వచించారు. స్వామీ ఘోరకనాథ్ శిష్యుడు యోగి స్వత్మరామ సంస్కృతములో రచించిన హఠయోగ ప్రదీపికలో, పాతంజలి యొగశాస్త్రంలో కూడా ప్రాణాయామం చెప్పబడెను.
ప్రాణాయామము ముఖ్యముగా త్రివిధములు. 1. కనిష్ఠ ప్రాణాయామము 2. మధ్యమ ప్రాణాయామము. 3. ఉత్తమ ప్రాణాయామము. సాధకులు ప్రథమములో ఉదయం నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని సుఖాసీనులై ఎడమ ముక్కుతో గాలిని నెమ్మదిగా పీల్చి రెండు ముక్కులను బంధించి, కుంభించి, పిమ్మట కుడి ముక్కుతో నెమ్మదిగా వదులుట ఒకటవ ఆవృతము తిరిగి కుడి ముక్కుతో నెమ్మదిగా బాగా గాలిని పీల్చి, కుంభించి, ఎడమ ముక్కుతో చాల నెమ్మదిగా వదిలివేయుట రెండవ ఆవృతము. ఇట్లు ఆరు ఆవృతములతో ఆరంభించి (అనగా ఒక మాత్ర) క్రమముగ పెంచుచు పూటకు 12 ఆవృతములు (రెండు మాత్రలు) చొప్పున మూడు పూటలా 3*12 = 36 ఆవృతములు చేయుట కనిష్ఠ ప్రాణాయామము. 72 ఆవృతములు చేయుట మధ్యమ ప్రాణాయామము. 108 ఆవృతములు చేయుట ఉత్తమ ప్రాణాయామము.
ప్రాణశక్తి ముఖ్యంగా ఐదు రకాలుగా పనిచేస్తుంది. ఇవి 1. ప్రాణం, 2. అపానం, 3. సమానం, 4. ఉదానం, వ్యానం.
ప్రథమ దశలో కుంభకము 50 సెకండ్ల వరకు; మధ్యమ దశలో కుంభకము 1-40 నిముషముల కున్ను, ఉత్తమ దశలో కుంభకము 2-30 నిముషములకున్ను పెరిగే సరికి కుంభక పూర్ణ స్థితి లభించునని యోగశాస్త్రము చెప్పుచున్నది.[1]
సమతలమై చక్కని ప్రాణవాయువు లభ్యమయ్యే బహిరంగ ప్రదేశమున, పద్మాసనము లేక వజ్రాసనము లేక సుఖాసనము ఏదో ఒక విధముగా కుర్చొని వెన్ను పామును, మెడను, శిరస్సును సమానముగా నిలబెట్టవలెను. ఎడమ చేతిని యోగ దండము వలె నిలబెట్టి రెండు భూజములను ఎగుపకు సమానముగ పెట్టవలెను. అప్పుడు కుడిచేతి బ్రొటన వ్రేలును - కుడి ముక్కు (అనగ సూర్యనాడి) పనను, ఉంగరపు వ్రేలును ఎడమముక్కు (అనగ చంద్రనాడి) మీదను, మధ్య వ్రేళ్ళను ముక్కు మీదను ఉంచవలెను. ఇప్పుడు ఊపిరితిత్తులలోని గాలిని ఎడమముక్కు ద్వారా రేచించవలెను ( అనగ పూర్తిగా గాలిని బైటకు వదలి వేస్తూ తలను వంచవలెను). తరువాత గాలిని నెమ్మదిగా చంద్రనాడితో సగము ముక్కును మూసి ఒత్తిడిగా లోనికి ఒకే పట్టుతో ఊపిరితిత్తుల నిండా పీల్చుతూ తలను పైకి ఎత్తవలెను. తరువాత మెడను పూర్తిగా వంచి గడ్డము చాతికి ఆనించి వాయువును కుంభించివేయునది జాలంధర బంధనము. తరువాత పొట్టను వెనుకకు లాగిన ఉడ్యాణబంధము; ఆసనమును (Anus) బంధించిన మూల బంధము అంటారు. అనగ త్రిబంధములు వేసి వాయువును కుంభించవలెను. అప్పుడు ఈ క్రింది రేషియో ప్రకారం (పూరక కుంభక రేచకములను అనుసరించి కుంభించిన వాయువులను త్రిబంధములను సడలించి, కుడిముక్కుతో సగము బిగించి బహునెమ్మదిగా వాయువును రేచించి ఒదలి వేయవలెను. దీనినొక వృత్తము అంటారు. తిరిగి అదే విధముగ రేచించిన కుడి ముక్కుతో నెమ్మదిగా పురించి, మెడవంచి త్రివిధబంధములతో బంధించి, తిరిగి ఎడమ ముక్కుతో చాల నెమ్మదిగ రేచించుట మరియొక ఆవృతము అగును. ఇట్లు మూడు సార్లు చేయుట ఒక మాత్ర అగును.
1:4:2 నిష్పత్తిలో వాయువును బంధించవలెను. అనగ గాలిని 10 సెకండ్ల కాలము నెమ్మదిగా చంద్రనాడి వెంట లోనికి పీల్చి 40 సెకండ్లకాలము వరకు త్రివిధబంధములు వేసి కుంభించి తిరిగి సూర్యనాడితో 20 సెకండ్ల కాలములో బహు నెమ్మదిగా రేచించవలెను. ఈవిధముగ ఈ నిష్పత్తికి భిన్నము లేకుండా పూరక కుంభక రేచకములను నిర్ణయించుకొని పాణాయామము చేయుట మంచిది. ఇది ప్రథమములో 10 సెకండ్లతో పురకము ప్రారంభించిన దానిని 15 సెకండ్లకు అనగ 15:60:30 నిష్పత్తికి పెంచుకొని చేయవచ్చును.
త్రివిధబంధములతో కుంభక ప్రాణాయామము మాత్రం అనుభవజ్ఞల సమక్షములో అభ్యసించుట మంచిది.
ప్రాణాయామం ముఖ్యంగా ఎనిమిది రకాలు. ఇవి అష్టకుంభకాలు.
సూర్య భేదనం అనగా సూర్య నాడిని ఉద్ద్దీపన చేయుట
మెత్తని ప్రక్కపై, వజ్రాసనము లేక పద్మాసనముపై కూర్చొని కుడి ముక్కుతో (సూర్యనాడితో) వాయువును బాగుగా శక్తికొలది (అనగ పీల్చిన గాలి చర్మమునకు -రోమకూపముల ఉపరితలము వేడెక్కేలా) పీల్చి త్రివిధబంధములతో బంధించి- ఎడమ ముక్కుతో (చంద్రనాడితో) రేచించుట సూర్యభేదనమనిరి.
కపాలమును శోధించును. ఉదరగతమైన వాత; క్రిమిదోషములు హరించును. శ్వేద, స్నేహ, గ్రంథులను ఉజ్జీవింపజేయును. ప్రాణ శక్తిని పెంచును. ఫలితమెక్కువగా ఉన్న ఈ సుర్య భేదన ప్రాణాయామమును తరుచు చేయుట మచిది.
ఉజ్జాయి అనగ ఛిన్నపిల్లల గురక ద్వణి లాగ గాలిని ముక్కుద్వారా తీసుకొనువలెను.ఆసమయములో గొంతుక వద్ద ద్వని నెమ్మదిగ చేయవలెను.
సుఖమైన ఏదో ఒక ఆసనముపై కుర్చొని, నోరు ముసుకొని కంఠమును కుంచించి, రెండు ముక్కులతో గాలిని నెమ్మదిగా, ఊపిరితిత్తులు; కంఠము; సప్తపదవరకు నిండులాగున బాగుగా పీల్చి కుంభించి సుఖముగ ఆపగలిగినంతసేపు ఆపి నెమ్మదిగ చంద్రనాడితో రేచించుట ఉజాయినీ అంటారు.
ఇది ముఖ్యముగ శ్లేష్మ రోగులకు మంచిది. ఉబ్బసముచే బాధపడువారు తరచు ఉజ్జాయినీ చేయుట చాలా మంచిది. ఇది ఆయాసపడేవారు నిలబడి గూడా చేయవచ్చును. వెన్నుపామును, మెడను వంగకుండ నిగిడ్చి ఉంచుట మంచిది. శ్లేష్మ ప్రకోపముతో వచ్చు జలదోషములు, వ్యాధులు-జలోధరం, కాళ్ళకు నీరువాపులు గలవారుకూడ చేయుట మంచిది.
సుఖమైన ఏదో ఒక ఆసనముపై కుర్చొని నాలుక కొనను రెండు పెదవుల మధ్యను, ముని పళ్ళకు చేర్చి ఈలవేసినట్లు నాలుకను కుంచించి వంచి నాలుకద్వారా శీత్కార శబ్దముతో గాలిని లోనికి బాగుగ పీల్చి కుంభించి, బంధించి ఎడమ ముక్కుతో నెమ్మదిగా రేచించుట నది స్స్త్కారి అంటారు.
ఇది ముఖ్యముగ అలసత్వము (Dullness) తగ్గును. బలము ముఖ వర్చస్సు పెరుగును. దేహమునందు దుష్టవేడి తగ్గును.
శీతలి అనగా చల్లదనము.
సుఖమైన ఏదో ఒక ఆసనముపై కుర్చొని నాలుకను రెండు పెదవుల మధ్యగ బైటకు చాచి పై పెదవితో నాలుకను గొట్టము వలె మడిచి పట్టుకొని గాలిని ఆనాలుక గొట్టము ద్వారా నెమ్మదిగా పీల్చుట వలన చల్లని గాలి బాగుగా లోనికి ప్రవేశించిన మీదట కుంభించి కుడిముక్కుతోను, ఎడమముక్కుతోను రేచించునది శీతలి అంటారు.
ఇది ముఖ్యముగ అతివేడిని, పిత్తవికారములను తగ్గించును. విదాహమును, విషములను అరికట్టును, గాయములను మానుపును. చేయుట సులభము. ఫలితము ఎక్కువ. పాము-తేలు కాట్లకు, దెబ్బలు, గాయాలకు మేలు చేయును. అంతేగాక ఎక్కిళ్ళను అబద్భుతముగ అరికట్టును.
భస్త్రిక అనగ తొలుతిత్తి.
సుఖమైన ఏదో ఒక ఆసనముపై కుర్చొని కుడిముక్కును పూర్తిగా బంధించి, ఎడమముక్కుతో గాలిని కపాలమునకు అంటులాగున ఒత్తిడిగా శబ్దముతో లాగి తిరిగి వెంటనే దానితోనే రేచించుచు, 30-40 సార్లు చేసిన తరువాత చివరిగా గట్టిగా ఊపిరితిత్తులనిండా గాలిని పీల్చి త్రిబంధాలు చేసి కుంభించి తిరిగి నెమ్మదిగా కుడిముక్కుతో రేచించవలెను. అట్లే తరువాత ఎడమముక్కును బంధించి కుడిముక్కుతో చెసినమాదిరగానే ఎడమముక్కుతో దీర్ఘశ్వాసలు 30-40 సార్లు చేసి చివరికి, కుంభించి, నెమ్మదిగా ఎడమముక్కుతో రేచించవలెను.
త్రిదోషములను సమరస పరచును. కఫాలము - సప్తపదలయందుగల దోషములను- కఫములను వెలువరించును. హరించును. కుంభకవ్యవధిని పెంచును. శ్లేష్మ గతములైన ముక్కు దిబ్బడ, జలుబు, తుమ్ములు, ఎలర్జీ, సైనోసెటీస్ లాంటి వ్యాధులను నివారించును. సుషుమ్నా నాడిని శుద్ధిచేసి కుండలినీ శక్తిని మేలుకొల్పును.
భ్రామరి అనగా తుమ్మెద.
భ్రమరము అంటే తుమ్మెద. కుడిముక్కును బంధించి ఎడమముక్కుతొ గాలిని పీల్చు ముక్కు పుటము పైనున్న వ్రేలుతో అవరోధము కల్పిస్తూ తుమ్మెదల ఝుంకార శబ్దము వచ్చులాగున పూరించి ఎడమముక్కును బంధించి, తిరిగి కుడిముక్కుతో అదేశబ్దము తుమ్మెద ఝుంకారము వచ్చులాగున అవరోధముతో గాలిని రేచించుచు చేయునది భ్రమరిక ప్రాణాయామము అంటారు. ఈవిధముగ మార్చి మార్చి 20 to 30 సార్లు చేయవలెను.
సుశబ్దముచే చిత్తము రంజిల్లును. శరీరము వేడెక్కుచు చల్లబడుట వలన సుఖముగా నుండును.
మూర్ఛ అనగా మతిభ్రమించుట.
రెండు ముక్కులతో గాలిని బాగుగా ఊపిరితిత్తులలోనికి నిండుగ పీల్చుకొని, త్రివిధబంధములతో వాయువును బంధించుట వలన శరీరము వేడెక్కును. అట్లు చేయుటవలన క్రమముగ డస్సి మూర్చస్థితికి చేరేసరికి, రోమకూపములు వికసించి, స్తంభించిన వాయువులను చర్మరంధ్రముల ద్వారా వెలువరించుటను మూర్చ అంటారు. ఇది కష్ట సాధ్యము. అందువల్ల దీనిని అభ్యసించువారు చాలా అరుదు.
చర్మదోషములుతొలగి, శరీరము కాంతివంతమగును. ప్రాణశక్తి పెరుగును.
ప్లావని అనగా తేలుట .
నోటితో గాలిని కొంచెం, కొంచెంగా పీల్చుకొంటూ కడుపులోనికి మింగుచుండవలెను. బాగుగా పొట్టనిండా గాలి చేరి, పొట్ట వుబ్బిన తరువాత ( ఈ స్థితిలో పొట్టపైన కొడితే ఢమరుకమువలె మోగును) కుంభించి తిరిగి నెమ్మదిగ, నెమ్మదిగ - నోటితోగాని - ముక్కులతోగాని గాలిని వెలువరించవలెను. ఇది చాలా శ్రమతో గూడిన విధానము కనుక గురు ముఖతా అభ్యసించుట మంచిది.
ఇది బాగుగా అభ్యాసమైన వారికి శరీరమును నీటిపై తెప్పవలె తేల్చుటకు ఎంతగానో ఉపకరించును. నీటిపై వెల్లకిల పరుండి పద్మాసనము వేసి గాలిని కడుపునిండా కుంభించుటవలన్ శరీరము నీటిపై తేలిపోవును. ప్రవాహము గల కాలువలో వేస్తే శవము వలే తేలి కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళవచ్చునని పెద్దలు చెప్పుదురు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.