అక్సాయ్ చిన్
చైనా ఆక్రమణలో ఉన్న భారత్ లోని లడఖ్ భూభాగం From Wikipedia, the free encyclopedia
చైనా ఆక్రమణలో ఉన్న భారత్ లోని లడఖ్ భూభాగం From Wikipedia, the free encyclopedia
అక్సాయ్ చిన్, ఆక్సాయ్ కిన్ లేదా అకేసాయికిన్, పశ్చిమ కున్లూన్ పర్వతాలకు ఉత్తరంగా, టిబెట్ పీఠభూమి వాయవ్య ప్రాంతంలో ఉన్న వివాదాస్పద ప్రదేశం.[2] ఈ ప్రాంతమంతా షిన్జాంగ్ స్వయంపాలిత ప్రాంతం యొక్క హోటాన్ ప్రిఫెక్చర్ లోని హోటన్ కౌంటీలో భాగంగా, చైనా ఆక్రమణలో ఉంది. అయితే, భారతదేశం దీనిని తన లఢఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో భాగంగా పరిగణిస్తుంది. భారత, చైనా దేశాల మధ్య ఉన్న రెండు ముఖ్యమైన వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలలో అక్సాయ్ చిన్ ఒకటి. రెండవది భారతదేశ పరిపాలనలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్. భారతదేశం అక్సాయ్ చిన్ ను, మాజీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రపు తూర్పు ప్రాంతంగా ప్రస్తావించేది. ఇప్పుడది లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో భాగం. జమ్మూ, కాశ్మీర్ లోని భారత-పాలిత ప్రాంతాలను అక్సాయ్ చిన్ నుండి వేరు చేసే రేఖను, వాస్తవాధీన రేఖ అంటారు. ఇది ప్రస్తుతం చైనా అక్సాయ్ చిన్ ప్రస్తావన రేఖతో ఏకీభవిస్తోంది (అనగా, అక్సాయ్ చిన్ యొక్క పశ్చిమ సరిహద్దు)
అక్సాయ్ చిన్ | |
---|---|
జింజియాంగ్, టిబెట్లలో భాగంగా, చైనా ఆక్రమణలో ఉంది. | |
Coordinates: 35°7′N 79°8′E | |
ఆక్రమించిన దేశం | China |
విస్తీర్ణం | |
• Total | 38,850 కి.మీ2 (15,000 చ. మై) |
అక్సాయ్ చిన్ పేరులో చిన్ అన్న పద వ్యుత్పత్తిపై స్పష్టత లేదు. తుర్కిక్ భాషా జాతి పదమైన అక్సాయ్ యొక్క నైంఘటికార్ధం తెల్లని సెలయేరు. చిన్ అన్న పదం చైనాని సూచిస్తుందా లేక కొండమార్గాన్ని చూసిస్తుందా అన్నది వివాదాస్పదం. చైనా భాషలో ఈ ప్రాంతపు పేరు, సంజ్ఞల అర్ధాలతో పనిలేకుండా, కేవలం ఉఛ్ఛారణను ప్రతిఫలించే విధంగా కూర్చబడింది.[3]
37250 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న అక్సాయ్ చిన్‌లో అధిక భాగం అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న విశాలమైన ఎడారి. సముద్రమట్టానికి 4,300 మీటర్ల ఎత్తులో ఉన్న కరకష్ నది, అక్సాయ్ చిన్‌లో కెల్లా అత్యల్ప ఎత్తున ఉన్న ప్రదేశం.
భౌగోళికంగా, అక్సాయ్ చిన్, టిబెట్ పీఠభూమిలో భాగం. నైరుతి భాగంలో డిప్సాంగ్ మైదానాల నుండి ఆగ్నేయం వైపు విస్తరించి ఉన్న కారకోరం శ్రేణిలోని పర్వతాలు అక్సాయ్ చిన్, భారత నియంత్రిత కాశ్మీర్ లకు మధ్య వాస్తవాధీన రేఖగా ఉంది. ఈ సరిహద్దు మధ్యభాగంలో ఉన్న హిమానీనద శిఖరాలు 6950 మీటర్ల ఎత్తు దాక ఉంటాయి.
ఉత్తరదిశలో, కున్లున్ శ్రేణి, అక్సాయ్ చిన్ను తారిమ్ పరీవాహక ప్రాంతంలో ఉన్న మిగిలిన హోటాన్ కౌంటీ ప్రాంతం నుండి వేరు చేస్తుంది. ఇటీవల రూపొందించబడిన ఒక సవివరమైన చైనా పటం ప్రకారం, హోటాన్ ప్రిఫెక్చర్లో కున్లున్ శ్రేణి గుండా ఏ విధమైన రహదారులు లేవు. కేవలం ఒక త్రోవ మాత్రం హిందుతాష్ మార్గం మీదుగా వెళుతుంది.[4]
సోడా మైదానంగా వ్యవహరించబడే అక్సాయ్ చిన్ యొక్క ఉత్తర భాగం, అక్సాయ్ చిన్ యొక్క అతి పెద్ద నది అయిన కరకష్ నదిని కలిగి ఉంది, అనేక హిమానీనదాలు కరిగిన నీటితో ఏర్పడిన ఈ నది, వాయవ్య దిశలో కున్లున్ ను దాటి పిషన్ కౌంటీలోకి ప్రవేశించి అక్కడనుండి తారిం పరీవాహకప్రాంతం చేరుతుంది, అక్కడ ఇది కారకక్స్, హోటన్ కౌంటీలలో ముఖ్యమైన నీటివనరులలో ఒకటిగా ఉంటుంది.
ఈ ప్రదేశం యొక్క తూర్పు భాగం అనేక చిన్న అంతర్గత పరీవాహక జలవనరులు కలిగి ఉంది. వీటిలో అత్యంత పెద్దది అక్సాయ్ చిన్ సరస్సు. దీనికి అదేపేరుతో గల నది నుండి నీరు ప్రవహిస్తుంది. భారతభూభాగం నుండి వచ్చే ఋతుపవనాలను హిమాలయాలు, కారకోరం పర్వత శ్రేణులు అడ్డగించడం వలన ఈ ప్రాంతంలో అవపాతం చాల తక్కువగా ఉంటుంది.
ఈ ప్రాంతంలో పెద్ద జనావాసాలు కానీ, స్థిర స్థావరాలు దాదాపుగా లేవు. చైనా సైన్యపు దళాలకు చెందిన అధికారులను మినహాయించి, ఇక్కడ నివసించే ప్రజల్లో బకర్వాల్ అనే సంచార తెగకు చెందిన ప్రజలు ఈ ప్రాంతంలో తరచూ సంచరిస్తూ ఉంటారు. జనావాసాల్లో టియన్షుయ్హయ్ పట్టణం, టైలాంగ్టాన్ గ్రామం చెప్పుకోదగినవి.
ఐదు వేల మీటర్ల ఎత్తులో, మారుమూల ప్రదేశమైన అక్సాయ్ చిన్కు, వేసవికాలంలో షిన్జాంగ్, టిబెట్ల మధ్య జడలబర్రెలపై వస్తువుల రవాణాకు అవకాశం కల్పించే పూర్వపు వర్తక మార్గంగా తప్పించి, పెద్దగా మానవీయ ప్రాధాన్యత లేదు.
అక్సాయ్ చిన్ చారిత్రకంగా హిమాలయ రాజ్యమైన లడఖ్ లో భాగంగా ఉండేది [ఆధారం చూపాలి] 19వ శాతాబ్దంలో స్థానిక నామ్‌గ్యాల్ వంశం పరిపాలన నుండి డోగ్రాలు, కాశ్మీర్ యొక్క రాచరిక రాజ్యంలో కలుపబడేవరకు ఇది కొనసాగింది. పశ్చిమ ప్రాంతంలో తొట్టతొలి సరిహద్దు ఒప్పందం 1842లో కుదిరింది. 1834లో పంజాబ్ ప్రాంతానికి చెందిన సిక్ఖు రాజవంశం లడఖ్ ను తమ రాజ్యంలో కలుపుకున్నారు. 1841లో సైన్యంతో టిబెట్‌పై దండెత్తారు. చైనా బలగాలు సిక్ఖు సైన్యాన్ని ఓడించి, లడఖ్‌లో ప్రవేశించి, లేను ఆక్రమించుకున్నారు. సిక్ఖు సైన్యం అడ్డుపడటంతో, 1842 సెప్టెంబరులో చైనీయులు, సిక్ఖులు సంధి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో ఒకరి రాజ్యంలో మరొకరు ప్రవేశించమని, రాజ్య వ్యవహారాల్లో కలుగజేసుకోమని అంగీకరించారు.[5] 1846లో జరిగిన రెండవ సిక్ఖు - బ్రిటీషు యుద్ధపు పర్యవసానంగా, లడఖ్ పై ఆధిపత్యం బ్రిటీషు వారి చేతుల్లోకి వచ్చింది. అప్పడు బ్రిటీషు అధికారులు తమ సరిహద్దును చైనా అధికారులతో కలిసి చర్చించేందుకు ప్రయత్నించారు. కానీ ఇరుపక్షాలు సహజసిద్ధమైన తమ సాంప్రదాయక సరిహద్దులతో సముఖంగా ఉండటంతో సరిహద్దు కచ్చితంగా నిర్వచింపబడలేదు.[5] అక్సాయ్ చిన్ కు ఒక వైపు ఉన్న పంగాంగ్ సరస్సు, మరో వైపు ఉన్న కారకోరం కనుమ వరకు సరిహద్దు కచ్చితంగా నిర్వచించబడింది కానీ కేవలం అక్సాయ్ చిన్ ప్రాంతంలో మాత్రం అనిశ్చితంగానే మిగిలిపోయింది.[6][7]
1865లో విలియం జాన్సన్ అనే సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన బ్రిటీషు ప్రభుత్వ అధికారి జాన్సన్ రేఖను ప్రతిపాదించాడు. ఈ రేఖ ఆక్సాయ్ చిన్ ను కాశ్మీరులో భాగంగా చూపిస్తుంది.[8] అది దుంగన్ తిరుగుబాటు జరుగుతున్న కాలం (1862–1877). అప్పట్లో చైనాకు షిన్జాంగ్ యొక్క చాలామటుకు భూభాగంపై ఆధిపత్యం లేదు.అందువల్ల ఈ రేఖ ప్రతిపాదన చైనాకు సమర్పించబడలేదు.[8] జాన్సన్ తన ప్రతిపాదనను కాశ్మీరు మహారాజుకు చూపించాడు. దీని ప్రకారం కాశ్మీరు మహారాజు, రేఖ లోపల ఉన్న 18,000 చ.కి.మీల భూభాగాన్ని, [8] కొన్ని కథనాల ప్రకారం రేఖకు ఆవల ఉత్తరాన కున్లున్ పర్వాతాల్లోని సంజూ కనుమ వరకు తన రాజ్యంగా ప్రకటించుకున్నాడు. జాన్సన్ పని తప్పులతడకగా తీవ్ర విమర్శలకు గురైంది. ఈయన గీసిన సరిహద్దు అసహేతుకమైనదిగా విమర్శించబడింది.[9] బ్రిటీషు ప్రభుత్వంచే మందలించబడి జాన్సన్ సర్వే శాఖలో ఉద్యోగానికి రాజీనామా చేశాడు.[8][9][10] కాశ్మీరు మహారాజు షాహిదుల్లా (ఆధునిక షైదుల్లా) లో ఒక కోట నిర్మించి, వర్తక రవాణాను కాపాడటానికి అక్కడ కొన్ని సంవత్సరాల పాటు కొంత సైనిక దళాన్ని ఉంచాడు.[11] తదనంతరకాలంలో, అనేక మూలాలు షాహిదుల్లాను, కరకష్ నది యొక్క పైభాగాన్ని కచ్చితంగా షిన్జాంగ్ ప్రాంతంలో భాగంగా చూపించాయి (ఇక్కడ ఇవ్వబడిన పటం చూడండి). ఈ ప్రాంతాన్ని 1880 దశకపు చివరిలో సంచరించిన ఫ్రాన్సిస్ యంగ్‌హస్బెండ్ ప్రకారం తను అక్కడ ఉన్నప్పుడు ఒక నిర్జనమైన కోట తప్పించి, ఒక జనావాసం కూడా లేదు. ఇది కేవలం మార్గమధ్యంలో తాత్కాలికంగా బస ఏర్పాటుచేసుకోవటానికి, సంచార కిర్గిజ్ తెగలకు అనువుగా ఉండేది.[12] ఆ నిర్జనమైన కోట, అప్పటికి కొన్న సంవత్సరాలకు ముందు కాశ్మీరీలు కట్టినదిగా భావించబడింది.[13] 1878లో చైనా, షిన్జాంగ్ ప్రాంతంపై తిరిగి ఆధిపత్యం సాధించింది. 1890 కల్లా సరిహద్దు విషయం వచ్చేవరకు అప్పటికే షాహిదుల్లా చైనా ఆధిపత్యంలో ఉంది.[8] 1892 కల్లా, చైనా కారకోరం కనుమ వద్ద సరిహద్దు సూచక గుర్తులను నిలబెట్టి ఉంది.[9]
1897లో సర్ జాన్ ఆర్డఘ్ అనే బ్రిటీషు సైనికాధికారి, యార్ఖండ్ నదికి ఉత్తరంగా కున్లున్ పర్వతపు శిఖరాగ్రాల వెంట ఒక సరిహద్దు రేఖను ప్రతిపాదించాడు.[11] అప్పట్లో చైనా బలహీన స్థితిలో ఉన్నందున, బ్రిటన్, రష్యా యొక్క రాజ్యవిస్తరణ గురించి ఆందోళనతో ఉంది. ఆర్డఘ్ తను ప్రతిపాదించిన సరిహద్దు రేఖ రక్షణకు మరింత అనువైనదిగా వాదించాడు. ఆర్డఘ్ రేఖ, జాన్సన్ రేఖకు కొద్దిపాటు మార్పులతో ప్రతిపాదించినది కావున, జాన్సన్ - ఆర్డఘ్ రేఖగా పేరుపొందింది.
1893లో హుంగ్ తా-చెన్ అనే చైనా అగ్రప్రభుత్వాధికారి, కష్గర్ వద్ద, చైనా ప్రతిపాదించిన సరిహద్దు రేఖతో కూడిన పటాన్ని, కష్గర్లో అప్పటి బ్రిటీషు దౌత్యాధికారి అయిన జార్జి మెకార్ట్నీకి సమర్పించాడు. ఈ సరిహద్దు రేఖ, జాన్సన్ రేఖతో అంగీకరిస్తుంది.[14] 1893లో మెకార్ట్నీ కొత్త ప్రతిపాదన చేసాడు బ్రిటీషిండియా ప్రభుత్వానికి పంపించాడు. ఈ సరిహద్దు రేఖ, లక్‌త్సాంగ్ శ్రేణికి దక్షిణాన ఉన్న లింగ్జీ టాంగ్ మైదానాలను భారత దేశంలోనూ, లక్‌త్సాంగ్ శ్రేణికి ఉత్తరాన ఉన్న ప్రధాన అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనాలోను సూచిస్తుంది. కారకోరం పర్వతాల వెంట ఉన్న ఈ సరిహద్దును బ్రిటీషు అధికారులు ప్రతిపాదించడానికి, మద్దతివ్వటానికి అనేక కారణాలున్నాయి. కారకోరం పర్వతాలు సహజసిద్ధమైన సరిహద్దు. దీనివళ్ళ సింధూ నదీ పరీవాహక ప్రాంతం వరకూ బ్రిటీషిండియాలోనూ, తారిం నదీ పరీవాహకప్రాంతం చైనా ఆధీనంలోనూ ఉంటుంది. ఈ ప్రాంతం చైనా ఆధీనంలో ఉండటం, మధ్య ఆసియాలో రష్యా సామ్రాజ్యపు విస్తరణకు అవరోధం ఏర్పరుస్తుంది.[10] బ్రిటీషు ప్రభుత్వం, మెకార్ట్నీ–మెక్డానల్డ్ రేఖ అనబడే ఈ సరిహద్దు రేఖను 1899లో సర్ క్లాడ్ మెక్డానల్డ్ యొక్క ఉత్తర్వులో భాగంగా చైనాకు సమర్పించింది. చైనాలో రాజ్యమేలుతున్న చింగ్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు సమాధానమివ్వలేదు. చైనా యొక్క మౌనాన్ని బ్రిటీషు ప్రభుత్వం, చైనా విధిలేక అంగీకరించినట్టుగా భావించింది.[8] అధికారింగా సరిహద్దు రేఖపై ఎన్నడూ చర్చలు జరగలేదు. అయినా, చైనా మాత్రం ఇది అంగీకరించబడిన సరిహద్దుగా భావించింది.[15][16]
భారతదేశం యొక్క బ్రిటీషు పటాల్లో జాన్సన్-ఆర్డఘ్ రేఖ, మెకార్ట్నీ–మెక్డానల్డ్ రేఖలు రెండింటినీ సూచించబడ్డాయి.[8] దాదాపు 1908 వరకు, బ్రిటీషు ప్రభుత్వం మెక్డానల్డ్ రేఖను సరిహద్దుగా భావించింది.[17] 1911లో జరిగిన షిన్హాయ్ తిరుగుబాటుతో చైనాలో కేంద్రపాలన కుప్పకూలిపోవటం వంటి పరిణామాలతో, మొదటి ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి బ్రిటీషు ప్రభుత్వం జాన్సన్ రేఖను అధికారిక సరిహద్దుగా భావించండం ప్రారంభించింది. అయితే దీన్ని ప్రతిఫలిస్తూ సరిహద్దు స్థావరాలు ఏర్పాటుచెయ్యటం కానీ, అక్కడ భూమిపై వాస్తవికాధికారం ప్రకటించే చర్యలు కానీ చేపట్టలేదు.[9] 1927లో బ్రిటీషు ప్రభుత్వం జాన్సన్ రేఖను త్యజించి, మరింత దక్షిణాన ఉన్న కారకోరం శ్రేణి వెంట ఉన్న రేఖను సరిహద్దుగా సముఖత చూపడంతో మరోసారి సరిహద్దు రేఖలు మారాయి.[9] కానీ పటాలను మాత్రం మార్చలేదు. అవి ఇంకా జాన్సన్ రేఖనే సరిహద్దుగా చూపించాయి.[9]
1917 నుండి 1933 వరకు, పెకింగ్‌లోని చైనా ప్రభుత్వం ప్రచురించిన "పోస్టల్ అట్లాస్ ఆఫ్ చైనా" పటంలో అక్సాయ్ చిన్ ప్రాంతంలో సరిహద్దును జాన్సన్ రేఖకు అనుగుణంగా కున్లున్ పర్వతాల వెంట చూపించబడింది.[14][16] 1925లో ప్రచురించబడిన "పెకింగ్ యూనివర్సిటీ అట్లాస్" కూడా అక్సాయ్ చిన్ను భారతదేశంలో భాగంగానే చూపింది.[18] 1940-41లో బ్రిటీషు అధికారులు, షిన్జాంగ్ స్థానిక సైనికముఠానాయకుడైన షెంగ్ షికాయ్ కొరకు సోవియట్ అధికారులు అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని సర్వే జరుపుతున్నారని తెలుసుకొని, తిరిగి జాన్సన్ రేఖనే సరిహద్దుగా వాదించడం ప్రారంభించారు.[8] ఈ తరుణంలో కూడా బ్రిటీషు ప్రభుత్వం సరిహద్దుపై సరిహద్దుపై స్థావరాలు ఏర్పరచడం కానీ, వాస్తవాధికార చర్యలు కానీ చేపట్టలేదు కదా, ఈ విషయాన్ని చైనా, టిబెట్ ప్రభుత్వాలతో కూడా ఎన్నడూ చర్చించలేదు. భారతదేశపు స్వాతంత్య్రం నాటికి సరిహద్దు అనిశ్చితంగానే ఉండిపోయింది.[8][9]
1947 లో భారత స్వాతంత్య్రం తర్వాత, భారత ప్రభుత్వం జాన్సన్ రేఖ ఆధారంగా పశ్చిమప్రాంతంలో అధికారిక సరిహద్దును నిర్వచించింది. ఇది అక్సాయ్ చిన్ ను భారతదేశంలో భాగంగా చూపిస్తుంది.[9] వివాదరహితమైన కారకోరం కనుమ నుండి, భారత క్లెయిం రేఖ కారకోరం పర్వతాలకు ఈశాన్యంగా, అక్సాయ్ చిన్ ఉప్పు కయ్యల గుండా విస్తరిస్తూ, కొంత కరకష్, యార్ఖండ్ నదీ పరీవాహకప్రాంతాలను కలుపుకొని, కున్లున్ పర్వతాల దాకా వెళుతుంది. అక్కడి నుండి కున్లున్ పర్వతాల వెంట తూర్పుగా వెళ్ళి, నైఋతి దిశగా మలుపుతిరిగి అక్సాయ్ చిన్ ఉప్పుకయ్యలు, కారకోరం పర్వతాల గుండా పంగాంగ్ సరస్సును చేరుతుంది.[6]
1954, జూలై 1 న, ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దేశపు అన్ని సరిహద్దులలోనూ కచ్చితమైన సరిహద్దు రేఖలను సూచిస్తూ పటాలను మార్చవలసినదిగా ఒక ఉత్తర్వు జారీ చేశాడు. అప్పటిదాకా భారతదేశపు పటాలు అక్సాయ్ చిన్ ప్రాంతంలో సరిహద్దును అనిశ్చితంగా చూపించేవి.[10]
1950వ దశకంలో చైనా, షిన్జాంగ్ ను పశ్చిమ టిబెట్‌తో కలుపుతూ, 1200 కిలోమీటర్ల రోడ్డుమార్గాన్ని, జాన్సన్ రేఖకు దక్షిణంగా అక్సాయ్ చిన్ గుండా నిర్మించింది. ఈ రోడ్డు భారతదేశం తనదని చాటుకున్న ప్రాంతం గుండా వెళుతుంది.[6][8][9] కారకోరం పర్వతాలకు ఆవల ఉన్న అక్సాయ్ చిన్ చేరుకోవటం భారతదేశానికి అనుకూలంగా లేదు, కానీ చైనా సులువుగా చేరుకునేలా ఉంది.[6] భారతీయులకు ఈ రోడ్డు యొక్క ఉనికి 1957 దాకా తెలియలేదు. 1958లో ప్రచురించిన చైనా పటాలతో ఈ విషయం ధ్రువపడింది.[19]
ప్రధానమంత్రి నెహ్రూ వెల్లడించిన ప్రకారం, శతాబ్దాలుగా అక్సాయ్ చిన్ భారతదేశపు లడఖ్ ప్రాంతపు భాగమని, దాని ఉత్తర సరిహద్దు ఎవ్వరితోనూ చర్చకుతావులేని విధంగా దృఢమైనది, నిశ్చితమైనదని భారతీయుల వాదన.[6]
చైనా మంత్రి చౌ ఎన్లాయ్, పశ్చిమ సరిహద్దు ఎన్నడూ స్పష్టంగా నిర్వచింపబడలేదని, అక్సాయ్ చిన్ ను చైనాలో భాగంగా చూపించే మెకార్ట్నీ-మెక్డానల్డ్ రేఖ మాత్రమే చైనా ప్రభుత్వంతో ప్రతిపాదించబడినదని, అక్సాయ్ చిన్ ఇప్పటికే చైనా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నదని, ఎలాంటి చర్చలైనా యధాస్థితిని పరిగణలోకి తీసుకోవాలని వాదించాడు.[6]
కారకోరం కనుమకు పశ్చిమాన, చైనాకు పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్ తో సరిహద్దు ఉన్న ప్రాంతంలో జాన్సన్ రేఖ ఉపయోగించలేదు. 1962, అక్టోబరు 13 న చైనా, పాకిస్తాన్ కారకోరం కనుమకు పశ్చిమవైపు సరిహద్దుపై చర్చలు ప్రారంభించాయి. 1963లో ఇరుదేశాలు తమ సరిహద్దును చాలామటుకు మెకార్ట్నీ-మెక్డానల్డ్ రేఖకు అనుగుణంగా పరిష్కరించుకున్నాయి. ఈ ఒప్పందంతో ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్ చైనా ఆధీనంలోకి వచ్చింది. అయితే కాశ్మీరు వివాదం పరిష్కారమైన పక్షంలో ఈ ఒప్పందాన్ని తిరిగి చర్చించే అవకాశాన్ని ఈ ఒప్పందంలో చేఋచారు. భారతదేశం, చైనాకు పాకిస్తాన్‌కూ సరిహద్దు ఉన్నట్టు గుర్తించడం లేదు. ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్ స్వాతంత్ర్యపు పూర్వపు జమ్మూ కాశ్మీరులో భాగంగా భావిస్తుంది. అయితే భారతదేశం తనదిగా ప్రకటించుకున్న భూభాగం కారకోరం పర్వతాల్లో జాన్సన్ రేఖ అంత ఉత్తరం దాకా లేదు.[6] ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్ ను పీపుల్స్ రిపబ్లిక్ అఫ్ చైనాకు ఇచ్చిన 1963 చైనా-పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందం అక్సాయ్ చిన్ స్థాయిపై ఏ విధమైన ప్రకటన చేయలేదు. తరువాత రూపొందిన భారత-పాకిస్తానీ ఒప్పందాలు కూడా దానిపై ఏ ప్రకటన చేయలేదు. ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్, అక్సాయ్ చిన్ లకు పరస్పరం సరిహద్దులు లేవు. 1963 చైనా-పాకిస్తాన్ సరిహద్దు రేఖ కారకోరం పాస్ వద్ద, అక్సాయ్ చిన్ కు అత్యంత పశ్చిమాగ్రంలో తొమ్మిది కిలోమీటర్లు పశ్చిమాన ముగుస్తుంది. అంతేకాక 1947 నుండి భారత ఆధీనంలో ఉన్న భూభాగంలో తూర్పు దిశగా రేఖను గీయడం వలన ఫలితం లేనిదని ఈ రెండు దేశాలు భావించాయని, కారకోరం కనుమకు పశ్చిమ విభాగంలో వలె భూమిపై భౌతిక విభజన అసాధ్యమని సూచించింది. ఇంటర్ నెట్ ఊహలు దీనికి విరుద్ధంగా ఉన్నప్పటికీ, 1963 ఒప్పందం యొక్క రచన అక్సాయ్ చిన్ గురించి ఏ విధమైన సూచన చేయలేదు.[20]
చైనా జాతీయ రహదారి 219 అక్సాయ్ చిన్ ద్వారా వెళుతూ టిబెట్ స్వయంప్రతిపత్త ప్రాంతంలోని లాజిని, షిన్జాంగ్ తో కలుపుతుంది. ఈ ప్రాంతంలో దాదాపుగా జనావాసాలు, వనరులు లేకపోయినప్పటికీ, అది టిబెట్, షిన్జాంగ్ లను కలపడం వలన చైనాకు వ్యూహాత్మక ప్రాముఖ్యతగా మారింది. 1951లో ప్రారంభమైన ఈ రహదారి నిర్మాణం 1957లో పూర్తయింది. 1962 నాటి భారత - చైనా యుద్ధానికి దారితీసిన కారణాల్లో ఈ రహదారి నిర్మాణం కూడా ఒకటి. 50 సంవత్సరాల్లో తొలి సారిగా జరిగిన రహదారి యొక్క రీపేవింగ్ 2013లో పూర్తయ్యింది.
2006 జూన్‌లో, గూగుల్ ఎర్త్ ఉపగ్రహ చిత్రాలు 1:150[21] స్కేల్లో ఉన్న అక్సాయ్ చిన్ తూర్పు ప్రాంతం, దాని పరిసరాల్లో ఉన్న టిబెట్ ప్రాంతం యొక్క భూభాగ నమూనాను వెల్లడించాయి. ఇది చైనాలోని నింగ్షా స్వయంప్రతిపత్త ప్రాంతపు రాజధాని యిన్చువాన్ కు 35 కిలోమీటర్లు నైఋతిగా, హువాంగ్యాంగ్టాన్ పట్టణ సమీపంలో నిర్మించబడింది.[22] ప్రక్క ప్రక్కన పెట్టి పోలిస్తే అక్సాయ్ చిన్ యొక్క సవివరమైన నకలును ఈ స్థావరంలో సృష్టించినట్టు తెలుస్తుంది.[23] ఈ 900 x 700 మీటర్ల నమూనా చుట్టూ ఎరుపురంగు పైకప్పు కలిగిన భవనాల వరుసలు, పెద్ద సంఖ్యలో ఆలివ్-రంగు ట్రక్కులు, ఉన్నతమైన పరిశీలనా స్థావరాలు, ఒక పెద్ద సమాచార టవర్ కలిగిన విశాలమైన ఆవరణ ఉన్నాయి. ఈ విధమైన భూభాగ నమూనాలు సైనిక శిక్షణ, అనుకరణలలో వాడతారు కానీ ఈ నమూనా సాధారణంగా ఉండే నమూనాలంటే కంటే చాలా పెద్దది. నింగ్షాలోని స్థానిక అధికారులు, ఈ అక్సాయ్ చిన్ నమూనా 1998 లేదా 1999లో నిర్మించిన ట్యాంక్ శిక్షణా స్థలంలో భాగంగా పేర్కొంటారు.[21]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.