ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తుతోపాటు నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్) ను ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఓటు వేయాలంటే సదరు అభ్యర్థికో, పార్టీకో ఓ గుర్తు వుంటుంది. ఆ గుర్తుకు ఓటర్లు ఓటు వేస్తూ ఉంటారు. అయితే, ఈ దఫా మాత్రం ఇప్పుడు పోటీలో వున్నవాళ్ళెవరికీ నేను ఓటు వేయడం లేదు అనే ఆప్షన్‌ను ఈవీఎంలలో పొందుపరిచారు. ఆ బటన్ నొక్కితే సదరు ఓటరు ఓటు ఎవరికీ పడదు. కానీ ఓటు హక్కును NOTA వినియోగించుకున్నట్టే.

ఇలాంటి అవకాశం ఇప్పటికే చాలా దేశాల్లో ఓటర్లకు అందుబాటులో ఉండగా, అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో మాత్రం కాస్త ఆలస్యంగా ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ‘నోటా’ను అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్ 2009లో తొలిసారిగా సుప్రీంకోర్టుకు చెప్పింది. ప్రభుత్వం దీనికి వ్యతిరేకించినా, పౌర హక్కుల సంస్థ పీయూసీఎల్ దీనికి మద్దతుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఎట్టకేలకు ఎన్నికల్లో ‘నోటా’ను అమలులోకి తేవాలంటూ సుప్రీంకోర్టు 2013 సెప్టెంబర్ 27న రూలింగ్ ఇచ్చింది.

ఓటర్లకు ఇష్టం ఉన్నా లేకున్నా ఎవరికో ఒకరికి ఓటువేయాలనే ఉద్ధ్దేశంతో ఓటు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం నిలబడిన అభ్యర్థులు ఎవరూ తమకు నచ్చకపోతే నోటా ద్వారా తమ తీర్పును వెల్లడించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైన నియోజకవర్గంలో నిలబడిన అభ్యర్థులకు పడిన ఓట్లకన్నా నోటాకు ఎక్కువ మద్దతు పలికితే ఆ నియోజకవర్గం నుంచి తిరిగి ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వవలసి ఉంటుంది. అయితే నోటా అనేది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంపై ఉన్నదనే విషయం కనీసం ఓటరుకు తెలియదు. ఓటరు పోలింగ్ బూత్‌లోకి వెళ్లగానే ఈవీఎంలపై వివిధ పార్టీలకు చెందిన గుర్తులే కనిపిస్తాయి. అభిప్రాయాన్ని యువ ఓటర్లు వ్యక్తం చేస్తున్నారు.

అక్షరాస్యులకు ఎలాంటి సమస్య లేకపోయినా, నిరక్షరాస్యులకు ఇది ఇబ్బందికరమని, నోటా ఉందనే విషయం తెలిసే విధంగా ఏదైన గుర్తు కేటాయిస్తే బాగుంటుందనే ప్రముఖ రచయిత సౌదా అరుణ హైకోర్టులో ‘పిల్’ దాఖలు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హైకోర్టు, ‘నోటా’కు గుర్తు కేటాయించాలని, వీలైతే ఈ ఎన్నికల్లోనే కేటాయించాలని ఎన్నికల కమిషన్‌కు సూచించింది.

2024 భారత సార్వత్రిక ఎన్నికలలోనూ నోటా దేశవ్యాప్తంగా ప్రాధాన్యత చాటింది. తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో నోటాకు కూడా అధిక సంఖ్యలో ఓట్లు పోలయ్యాయి. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో 4,330 ఓట్లతో నోటా 6వ స్థానంలో నిలిచింది. మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలో అత్యధికంగా నోటాకు 13,366 ఓట్లు పోలయ్యాయి. అదిలాబాద్‌లో 11,762, ఖమ్మంలో 6,782, చేవెళ్లలో 6,423, సికింద్రాబాద్‌లో 5,166 ఓట్లు పోలయ్యి దాదాపుగా అన్నీ చోట్లా నోటా ప్రధాన పార్టీల చెంతన చేరింది.[1]

2019 ఎన్నికల్లో, బీహార్‌లోని గోపాల్ గంజ్‌లో నోటా సాధించిన రికార్డు 51,660 ఓట్లను ఈ ఎన్నికల్లో ఇండోర్ అధిగమించింది. ఇక్కడ 1.70 లక్షలకు పైగా ఓట్లు నోటాకు వచ్చాయి.[2]

నేపథ్యం

అమెరికా, ఫ్రాన్స్, బెల్జియం, బ్రెజిల్, గ్రీస్, ఉక్రెయిన్, చిలీ, రష్యా, బంగ్లాదేశ్, కొలంబియా, స్పెయిన్, స్వీడన్ తదితర దేశాల్లో ‘నోటా’ పద్ధతి అమలులో ఉంది. కాలిఫోర్నియాలోని శాంటా బార్బరా కౌంటీ ఎన్నికల్లో 1976లో తొలిసారిగా ‘నోటా’ విధానాన్ని ప్రవేశపెట్టారు. నిజానికి అభ్యర్థులెవరూ నచ్చకుంటే తిరస్కార ఓటు వేసే హక్కును భారత రాజ్యాంగం ఎప్పుడో కల్పించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 49 (ఓ) సెక్షన్ కింద ఓటర్లు ఈ హక్కును ఉపయోగించుకునే వీలుంది. పోలింగ్ బూత్‌లోని ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్దకు వెళ్లి, దీనికోసం 17-ఏ ఫారం తీసుకుని, ఫలానా అభ్యర్థిని తిరస్కరిస్తున్నానని పేర్కొంటూ సంతకం లేదా వేలిముద్ర వేసి బ్యాలెట్ పెట్టెలో వేయవచ్చు.

ఇది రహస్య బ్యాలెట్ విధానానికి విరుద్ధమైనదని, ఓటరు భద్రత దృష్ట్యా ఇది మంచి పద్ధతి కాదని విమర్శలు వచ్చాయి. అయితే, అప్పట్లో చాలామంది ఓటర్లకు దీనిపై అవగాహన ఉండేది కాదు. ఈవీఎంలు వాడుకలోకి రావడంతో ఎన్నికల కమిషన్ చొరవ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ‘నోటా’ అందుబాటులోకి వచ్చింది. దీనిపై విస్తృత ప్రచారం జరగడంతో గత ఏడాది ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది ఓటర్లు ‘నోటా’కు ఓటు వేశారు. కొన్నిచోట్ల గెలుపొందిన అభ్యర్థికి, ఓటమి పాలైన సమీప ప్రత్యర్థికి నడుమనున్న ఓట్ల వ్యత్యాసం కంటే ‘నోటా’కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఛత్తీస్‌గఢ్‌లో ‘నోటా’కు అత్యధికంగా 3.1 శాతం ఓట్లు పడ్డాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో 2 శాతం, ఢిల్లీలో 1 శాతం ఓట్లు ‘నోటా’కు పడ్డాయి.

మొదటి సమావేశం

Thumb
నోటా గుర్తు పై మేధో మథనం

ఆల్ ఇండియా నోటా వర్కింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 12, 2014న ఉదయం పది గంటల నుండి సాయంత్రం అయిదు గంటల వరకు హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్.టి.ఆర్ ఆడిటోరియంలో నోటా గుర్తుపై మేధోమథనం జరిగింది.

ఇందులో అధ్యక్షులు సౌదా అరుణ, మునికృష్ణ, భక్తవత్సలం, బమ్మిడి జగదీశ్వరరావు మరికొంతమంది పాల్గొన్నారు.

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.