భారతీయ కేంద్రక భౌతిక శాస్త్రవేత్త From Wikipedia, the free encyclopedia
హోమీ జహంగీర్ భాభా (1909 అక్టోబరు 30 - 1966 జనవరి 24) భారతీయ కేంద్రక భౌతిక శాస్త్రవేత్త, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) సంస్థకు వ్యవస్థాపక డైరెక్టరు. ఆ సంస్థలో భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా పనిచేసాడు.[2] ఆయన అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్, ట్రోంబే (AEET) కు కూడా వ్యవస్థాపక డైరెక్టరు. అతని గౌరవార్థం ఆ సంస్థకు భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని పేరు పెట్టారు. భారత అణ్వాయుధాల అభివృద్ధి కార్యక్రమానికి ఈ రెండు సంస్థలూ మూలస్థంభాలుగా నిలిచాయి. ఈ కార్యక్రమాన్ని కూడా భాభా డైరెక్టరుగా పర్యవేక్షించాడు.[3] ఆయనను "భారత అణు కార్యక్రమానికి పితామహుడు" అని పిలుస్తారు.[3] ఆయన 1942 లో ఆడమ్స్ ప్రైజ్, 1954 లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నాడు. 1951, 1953 –1956లలో ఆయన భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యాడు.[4]
హోమీ జహంగీర్ భాభా | |
---|---|
జననం | బొంబాయి, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ముంబై) | 1909 అక్టోబరు 30
మరణం | 1966 జనవరి 24 56) మౌంట్ బ్లాంక్, ఆల్ఫ్స్ విమాన ప్రమాదం | (వయసు
జాతీయత | భారతీయుడు |
రంగములు | కేంద్రక భౌతిక శాస్త్రం |
వృత్తిసంస్థలు | అటామిక్ ఎనర్జీ కమీషన్ ఆఫ్ ఇండియా టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కావెండిష్ లాబొరేటరీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ |
చదువుకున్న సంస్థలు | కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం (బి.ఎస్, పి.హెచ్.డి) |
పరిశోధనా సలహాదారుడు(లు) | రాల్ఫ్ హెచ్. ఫోలెర్ |
ఇతర విద్యా సలహాదారులు | పాల్ డిరాక్ |
ప్రసిద్ధి | ఇండియన్ నూక్లియర్ ప్రోగ్రాం కాశ్మిక్ కిరణాల ప్రపాతి విధానము పాయింట్ పార్టికల్స్ భాభా ప్రతిక్షేపణము మౌన్ సిద్ధాంతిక అంచనా |
ముఖ్యమైన పురస్కారాలు | ఆడమ్స్ ప్రైజ్ (1942) పద్మభూషణ్ పురస్కారం (1954) రాయల్ సొసైటీ ఫెలోషిప్[1] |
హోమి జహంగీర్ భాభా సంపన్న పార్సీ కుటుంబంలో జన్మించాడు. వ్యాపారవేత్తలు దిన్షా మానెక్‌జీ పెటిట్, దొరాబ్జీ టాటాలు అతడికి బంధువులు. ఆయన 1909 అక్టోబరు 30 న జన్మించాడు. అతని తండ్రి జెహంగీర్ హోర్ముస్‌జీ భాభా న్యాయవాది. తల్లి మెహెరీన్.[5] అతను బొంబాయి కేథడ్రల్ అండ్ జాన్ కానన్ పాఠశాలలో తన ప్రారంభ విద్యను అభ్యసించాడు. 15 సంవత్సరాల వయస్సులో, సీనియర్ కేంబ్రిడ్జ్ పరీక్షలో ఆనర్స్ తో ఉత్తీర్ణత సాధించి, ఎల్ఫిన్‌స్టోన్ కళాశాలలో ప్రవేశించాడు.
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని కైయస్ కాలేజీలో చేరడానికి ముందు 1927 లో రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో చదివాడు. భాభా కేంబ్రిడ్జ్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందాలని, తరువాత భారతదేశానికి తిరిగి రావాలని అతని తండ్రి, మామ దొరాబ్జీ పట్టుబట్టి ప్రణాళిక వేసినందువల్ల ఈ విద్య నభ్యసించాడు. అతను జంషెడ్‌పూర్‌లోని టాటా స్టీల్ మిల్స్‌లో మెటలర్జిస్టుగా చేరాడు.
తండ్రి, భాభా పరిస్థితిని అర్థం చేసుకుని గణితంలో అతడి అధ్యయనానికి ఆర్థిక సహాయం చేయడానికి, తన భార్యతో సహా అంగీకరించాడు. అతను తన మెకానికల్ సైన్సెస్ ట్రిపోస్ పరీక్షలో మొదటి తరగతిలో ఉత్తీర్ణుడవ్వాలనేది అందుకు వాళ్ళు పెట్టిన షరతు. భాభా 1930 జూన్ లో ట్రిపోస్ పరీక్ష రాసి మొదటి తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. తరువాత అతను, పాల్ డిరాక్ ఆధ్వర్యంలో తన గణిత అధ్యయనంలో రాణించి గణితంలో ట్రిపోస్ పూర్తి చేసాడు. ఈలోగా అతను, సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ కోసం పరిశోధనలు చేయడంలో భాగంగా కావెండిష్ ప్రయోగశాలలో పనిచేశాడు. ఆ సమయంలో ఆ ప్రయోగశాల శాస్త్రీయ పురోగతికి కేంద్రంగా ఉండేది. అక్కడే జేమ్స్ చాడ్విక్ న్యూట్రానును కనుగొన్నాడు. జాన్ కాంక్రాప్ట్, ఎర్నస్ట్ వాల్టన్ లిథియం మూలకాన్ని అధిక శక్తి ప్రోటాన్లతో పరివర్తన చేసారు. పాట్రిక్ బ్లాకెట్ట్, జియూసెప్పీ ఒచ్చియాలినేలు క్లౌడ్ ఛాంబర్స్ ను వాడి గామా రేడియేషన్ ద్వారా ఎలక్ట్రాన్ జంటలను, గామా రేడియేషను తుంపరలను ఉత్పత్తి చేసారు.
1931-1932 విద్యా సంవత్సరంలో, భాభాకు ఇంజనీరింగ్‌లో సాలమన్స్ స్టూడెంట్‌షిప్ పురస్కారం లభించింది. 1932 లో, అతను తన గణిత ట్రిపోస్‌పై మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. గణితంలో రౌస్ బాల్ ట్రావెలింగ్ స్టూడెంట్‌షిప్ పురస్కారాన్ని పొందాడు. ఈ సమయంలో, అణు భౌతిక శాస్త్రం గొప్పగొప్ప మేధావులను ఆకర్షించేది. సైద్ధాంతిక భౌతిక శాస్త్రంతో పోలిస్తే ఇది చాలా ముఖ్యమైన రంగాలలో ఒకటిగా ఉండేది. సైద్ధాంతిక భౌతికశాస్త్రం పట్ల వ్యతిరేకత ఈ క్షేత్రంపై ప్రభావం చూపింది. ఎందుకంటే ఇది ప్రయోగాల ద్వారా సహజ దృగ్విషయాన్ని ఋజువు చేయకుండా సిద్ధాంతాల పట్ల మొగ్గు చూపుతూ ఉండేది. అపారమైన రేడియేషన్‌ను విడుదల చేసే కణాలపై ప్రయోగాలు చేయడం భాభాకు జీవితకాల అభిరుచిగా మారింది. అతను ఈ రంగంలో చేసిన పరిశోధనలు, ప్రయోగాలూ భారతీయ భౌతిక శాస్త్రవేత్తలకు గొప్ప పురస్కారాలను తెచ్చాయి. కొందరు తమ ఆసక్తిని అణు భౌతిక శాస్త్ర రంగానికి మార్చుకుని రాణించారు. అలాంటి వారిలో ముఖ్యమైన వారిలో ఒకడు పియారా సింగ్ గిల్.
1933 జనవరిలో, భాభా తన మొదటి శాస్త్రీయ పరిశోధనా పత్రం "ది అబ్సార్‌ప్షన్ ఆఫ్ కాస్మిక్ రేడియేషన్"ను ప్రచురించిన తరువాత అణు భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పొందాడు. తన ప్రచురణలో భాభా, విశ్వ కిరణాలలో శోషణ లక్షణాలు, ఎలక్ట్రాన్ షవర్ ఉత్పత్తి గురించి వివరణ ఇచ్చాడు. ఈ పరిశోధనా పత్రంతో 1934 లో అతడు ఐజాక్ న్యూటన్ స్టూడెంట్‌షిప్ గెలుచుకున్నాడు. తరువాతి మూడు సంవత్సరాలు అతడే దీన్ని గెలుచుకున్నాడు. మరుసటి సంవత్సరం, అతను రాల్ఫ్ హెచ్. ఫౌలర్ ఆధ్వర్యంలో సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో డాక్టరల్ అధ్యయనాలను పూర్తి చేశాడు. తన విద్యార్థిగా ఉండగా తన సమయాన్ని కేంబ్రిడ్జ్‌లోను, కోపెన్‌హాగన్‌లో నీల్స్ బోర్‌తో కలిసి పని చేయడానికీ ఉపయోగించాడు. 1935 లో, భాభా ప్రొసీడింగ్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ, సిరీస్ Aలో ఒక పరిశోధనా పత్రాన్ని ప్రచురించాడు. దీనిలో ఎలక్ట్రాన్-పాసిట్రాన్ పరిక్షేపణ మధ్యచ్ఛేద వైశాల్యాన్ని నిర్ణయించే మొదటి గణనను చేశాడు. ఎలక్ట్రాన్-పాసిట్రాన్ పరిక్షేపణ తరువాతి కాలంలో అతను చేసిన సేవలకు గుర్తింపుగా "భాభా పరిక్షేపణ" (భాభా స్కాటరింగ్) అని పిలువబడింది.
1936 లో వాల్టర్ హీట్లర్‌తో కలిసి, అతను ప్రొసీడింగ్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ, సిరీస్ Aలో "ది పాసేజ్ ఆఫ్ ఫాస్ట్ ఎలక్ట్రాన్స్ అండ్ ది థియరీ ఆఫ్ కాస్మిక్ షవర్స్"ను సహ రచయితగా వ్రాసాడు.[6] భూస్థాయిలో గమనించిన కణాలను ఉత్పత్తి చేయడానికి బాహ్య అంతరిక్షం నుండి వచ్చే ప్రాథమిక విశ్వ కిరణాలు ఎగువ వాతావరణంతో ఎలా సంకర్షణ చెందుతాయో వివరించడానికి వారు తమ సిద్ధాంతాన్ని ఉపయోగించారు. భాభా, హీట్లర్ వేర్వేరు ఎలక్ట్రాన్ ప్రారంభ శక్తుల కోసం వేర్వేరు ఎత్తులలో క్యాస్కేడ్ ప్రక్రియ ద్వారా ఎలక్ట్రాన్ల సంఖ్యను సంఖ్యాపరంగా అంచనా వేశారు. కొన్ని సంవత్సరాలకు ముందు బ్రూనో రోస్సీ, పియరీ విక్టర్ అగెర్ లు చేసిన కాస్మిక్ రే షవర్ల ప్రయోగాత్మక పరిశీలనలతో ఈ లెక్కలు సరిపోలాయి. అటువంటి కణాల లక్షణాలను పరిశీలించడం ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సాపేక్షత సిద్ధాంతాన్ని సూటిగా ప్రయోగాత్మక ధ్రువీకరణకు దారితీస్తుందని భాభా తరువాత తేల్చాడు. 1937 లో, భాభాకు సీనియర్ స్టూడెంట్‌షిప్ ఆఫ్ ద 1851 ఎగ్జిబిషన్ పురస్కారం లభించింది. ఇది 1939 లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే వరకు కేంబ్రిడ్జ్‌లో తన పరిశోధనలు కొనసాగించడానికి సహాయపడింది.
1939 సెప్టెంబరు లో, రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు భాభా సెలవు తీసుకొని భారతదేశంలో కొద్ది కాలం ఉండటానికి వచ్చాడు. తరువాత అతను ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. భారతీయ భౌతిక శాస్త్రవేత్త సి. వి. రామన్ నేతృత్వంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ భౌతిక శాస్త్ర విభాగంలో రీడర్‌గా పనిచేసే ప్రతిపాదనకు అతను అంగీకరించాడు. అతను సర్ దొరాబ్ టాటా ట్రస్ట్ నుండి ప్రత్యేక పరిశోధన గ్రాంటును పొందాడు. దానిని ఇన్‌స్టిట్యూట్‌లో కాస్మిక్ కిరణాల పరిశోధనా విభాగాన్ని స్థాపించడానికి ఉపయోగించాడు. భాభా తనతో కలిసి పనిచేయడానికి హరీష్ చంద్రతో సహా కొద్దిమంది విద్యార్థులను ఎంపిక చేశాడు. తరువాత 1941 మార్చి 20న రాయల్ సొసైటీకి ఫెలోగా ఎంపికయ్యాడు. జె.ఆర్.డి.టాటా సహాయంతో అతను ముంబైలో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ స్థాపనలో కీలక పాత్ర పోషించాడు.
బ్రిటన్‌లో అణు భౌతిక శాస్త్రంలో పరిశోధనా వృత్తిని ప్రారంభించిన భాభా, 1939 సెప్టెంబరులో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే ముందు తన వార్షిక సెలవుల కోసం భారతదేశానికి తిరిగి వచ్చాడు. యుద్ధం కారణంగా అతడు భారతదేశంలోనే ఉండిపోయాడు. అతను నోబెల్ బహుమతి గ్రహీత సి. వి. రామన్ నేతృత్వంలో బెంగళూరులో నడుస్తున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లోని భౌతికశాస్త్రం విభాగంలో రీడర్ పోస్టును చేయటానికి అంగీకరించాడు.[7] ఈ సమయంలో ప్రతిష్ఠాత్మక అణు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను, ముఖ్యంగా భారతదేశపు మొదటి ప్రధానిగా పనిచేసిన జవహర్ లాల్ నెహ్రూను ఒప్పించడంలో భాభా కీలక పాత్ర పోషించాడు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆ సంస్థలో కాస్మిక్ కిరణాల పరిశోధనా విభాగాన్ని అతను స్థాపించాడు. అతను పాయింట్ కణాల కదలిక సిద్ధాంతంపై పనిచేయడం ప్రారంభించాడు. స్వతంత్రంగా 1944 లో అణ్వాయుధాలపై పరిశోధనలు చేశాడు.[3] 1945 లో, అతను బొంబాయిలో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, 1948 లో అటామిక్ ఎనర్జీ కమిషన్‌ను స్థాపించాడు, వాటికి మొదటి ఛైర్మన్‌గా పనిచేశాడు.[3]
1948 లో, నెహ్రూ భాభాను అణు కార్యక్రమానికి డైరెక్టర్‌గా నియమించాడు. త్వరలోనే భాభాకు అణ్వాయుధాలను అభివృద్ధి చేయటానికి బాధ్యత వహించాడు. 1950 వ దశకంలో, భాభా IAEA సమావేశాలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 1955 లో స్విట్జర్లాండ్లోని జెనీవాలో అణుశక్తి శాంతియుత ఉపయోగాలపై ఐక్యరాజ్యసమితిలో జరిగిన సమావేశానికి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈ సమయంలో, అతను అణ్వాయుధాల అభివృద్ధి కోసం తన ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. భారత చైనా యుద్ధం తరువాత, భాభా దూకుడుగా, బహిరంగంగా అణ్వాయుధాల కోసం పిలుపునిచ్చాడు.[7] ఎలక్ట్రాన్ల ద్వారా పాజిట్రాన్లను పరిక్షేపణం యొక్క సంభావ్యతకు సరైన వ్యక్తీకరణ పొందిన తరువాత భాభా అంతర్జాతీయ ప్రాముఖ్యతను పొందాడు. ఈ ప్రక్రియను ఇప్పుడు భాభా పరిక్షేపణం అని పిలుస్తారు. అతని ప్రధాన పరిశోధనలు కాంప్టన్ పరిక్షేపణం, ఆర్-ప్రాసెస్, అణు భౌతికశాస్త్రం పురోగతి వంటి అంశాలపై కొనసాగాయి. ఆయనకు 1954 లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం బహూకరించింది.[8] తరువాత అతను భారత క్యాబినెట్ శాస్త్రీయ సలహా కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. అంతరిక్ష పరిశోధన కోసం భారత జాతీయ కమిటీని ఏర్పాటు చేయడంలో విక్రమ్ సారాభాయ్‌కు తోడ్పాటు నిస్తూ కీలక భూమిక పోషించాడు. 1966 జనవరి లో, అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ నిర్వహిస్తున్న సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి ఆస్ట్రియాలోని వియన్నాకు వెళుతుండగా, మోంట్ బ్లాంక్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో భాభా మరణించాడు.[7]
హోమి జహంగీర్ భాభా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో పనిచేస్తున్నప్పుడు, కేంద్రక భౌతిక శాస్త్రం, కాస్మిక్ కిరణాలు, హై ఎనర్జీ ఫిజిక్స్, ఇతర హద్దులలో భౌతిక శాస్త్ర జ్ఞానం పరిశోధనలకు అవసరమైన సదుపాయాలు కలిగిన సంస్థ ఏదీ భారతదేశంలో లేదు. ఇది 'ప్రాథమిక భౌతిక శాస్త్రంలో శక్తివంతమైన పరిశోధనా పాఠశాల' ను స్థాపించడానికి దోహదపడింది. దీని ఫలితంగా 1944 మార్చిలో సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు ఒక ప్రతిపాదనను పంపడానికి అతనిని ప్రేరేపించింది.
తన ప్రతిపాదనలో అతను ఇలా వ్రాశాడు:
“ | భౌతికశాస్త్ర ప్రాథమిక సమస్యలలో సైద్ధాంతిక, ప్రయోగాత్మక పరిశోధనలకోసం భారతదేశంలో పెద్ద పరిశోధన పాఠశాల లేదు. అయితే, పరిశోధకులున్నారు. వాళ్ళు దేశమంతటా చెల్లాచెదురుగా ఉన్నందున సరైన పరిశోధనలు చేయడం లేదు. వారందరూ సరైన దిశలో ఒకే చోట కలిసి చేసేంత మంచి పని ఇప్పుడు చేయడం లేదు. ప్రాథమిక భౌతిక శాస్త్రంలో శక్తివంతమైన పరిశోధనా పాఠశాల ఒకటి, ఇప్పుడు భారతదేశానికి ఖచ్చితమైన అవసరం. ఎందుకంటే అటువంటి పాఠశాల భౌతికశాస్త్రం తక్కువ అభివృద్ధి చెందిన శాఖలలోనే కాకుండా, పరిశ్రమలో తక్షణ ఆచరణాత్మక అనువర్తన సమస్యలలో కూడా పరిశోధనలకు ముందడుగు వేస్తుంది. ఈ రోజు భారతదేశంలో చేసిన చాలా అనువర్తిత పరిశోధనలు నిరాశపరిచేలా, లేదా చాలా తక్కువ నాణ్యత కలిగి ఉండటానికి కారణం, మంచి పరిశోధన ప్రమాణాలను నిర్దేశిస్తూ, డైరెక్టింగ్ బోర్డులలో పనిచేసే అత్యుత్తమ, స్వచ్ఛమైన పరిశోధనా కార్మికులు తగినంత సంఖ్యలో లేకపోవడమే. అంతేకాకుండా, మరో రెండు దశాబ్దాల తరువాత విద్యుత్ ఉత్పత్తి కోసం అణుశక్తిని విజయవంతంగా వాడినప్పుడు, భారతదేశం నిపుణుల కోసం విదేశాలను చూడవలసిన అవసరం ఉండదు, వాళ్ళు చేతిలో సిద్ధంగా ఉంటారు. ఇతర దేశాలలో శాస్త్రీయ అభివృద్ధి గురించి తెలిసిన వారెవరైనా, నేను ప్రతిపాదించిన పాఠశాల అవసరాన్ని ఖండిస్తారని నేను అనుకోను. సైద్ధాంతిక భౌతిక శాస్త్రం, ముఖ్యంగా ప్రాథమిక సమస్యలపై, విశ్వ కిరణాలతో పాటు అణు భౌతిక శాస్త్రానికి ప్రత్యేక సూచనలు, విశ్వ కిరణాలపై ప్రయోగాత్మక పరిశోధనలు అక్కడ బోధించే అంశాలు. అణు భౌతిక శాస్త్రం, విశ్వ కిరణాలు రెండూ సిద్ధాంతపరంగా అనుసంధానించబడి ఉన్నాయి. వీటిని వేరు చేయడం సాధ్యం కాదు, అది అభిలషణీయమూ కాదు.[9] | ” |
సర్ దొరాబ్జీ జంషెట్జీ టాటా ట్రస్టు ధర్మకర్తలు 1944 ఏప్రిల్ లో ఒక సంస్థను ప్రారంభించడానికి భాభా ప్రతిపాదనను అంగీకరించి, ఆర్థిక బాధ్యతను స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. ఉమ్మడి వ్యవస్థాపకునిగా ఉండేందుకు బొంబాయి ప్రభుత్వం ఆసక్తి చూపడంతో ప్రతిపాదిత సంస్థను బొంబాయిలో స్థాపించాలని నిర్ణయించారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనే ఈ సంస్థను 1945 లో 540 చదరపు మీటర్ల అద్దె స్థలంలో ఉన్న భవనంలో ప్రారంభించారు. 1948 లో ఇనిస్టిట్యూట్‌ను రాయల్ యాట్ క్లబ్ పాత భవనాల్లోకి మార్చారు. అణు ఇంధన కార్యక్రమానికి అవసరమైన సాంకేతిక అభివృద్ధిని ఇకపై TIFR లోపల చేయలేమని భాభా గ్రహించినప్పుడు, అందుకోసం పూర్తి వనరులతో కొత్త ప్రయోగశాలను నిర్మించాలని ఆయన ప్రభుత్వానికి ప్రతిపాదించాడు. ఇందుకోసం ట్రోంబే వద్ద 1200 ఎకరాల భూమిని బొంబాయి ప్రభుత్వం నుంచి తీసుకున్నారు. ఆ విధంగా అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్, ట్రోంబే (AEET) 1954 లో పనిచేయడం ప్రారంభించింది. అదే సంవత్సరం అటామిక్ ఎనర్జీ విభాగాన్ని (DAE) కూడా స్థాపించారు.[10] అతను అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఫోరమ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 1955 లో స్విట్జర్లాండ్లోని జెనీవాలో అణుశక్తి యొక్క శాంతియుత ఉపయోగాలపై ఐక్యరాజ్యసమితి సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అతను 1958 లో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కు విదేశీ గౌరవ సభ్యునిగా ఎన్నికయ్యాడు.[11]
భాభా భారత అణుశక్తికి పితామహుడిగా గుర్తించబడ్డాడు. అంతేకాకుండా, యురేనియం నిల్వల కంటే దేశంలోని విస్తారంగా లభ్యమవుతున్న థోరియం నిల్వల నుండి శక్తిని వెలికి తీయడంపై దృష్టి సారించే వ్యూహాన్ని రూపొందించిన ఘనత ఆయనకు ఉంది.[12][13] ఈ థోరియం కేంద్రీకృత వ్యూహం ప్రపంచంలోని అన్ని దేశాల వూహాల కంటే భిన్నంగా ఉంది. ఈ వ్యూహాత్మక లక్ష్యాన్ని సాధించడానికి భాభా ప్రతిపాదించిన విధానం భారతదేశం యొక్క మూడు దశల అణు విద్యుత్ కార్యక్రమంగా మారింది.
1966 జనవరి 24 న మోంట్ బ్లాంక్ సమీపంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 101 కూలిపోవడంతో హోమి జె. భాభా మరణించాడు[14] పర్వతం సమీపంలో విమానం స్థానం గురించి జెనీవా విమానాశ్రయానికీ, పైలట్‌కూ మధ్య అపార్థం ఏర్పడటం ప్రమాదానికి అధికారిక కారణంగా చెప్పబడింది.
భారత అణు కార్యక్రమాన్ని స్తంభింపజేయడానికి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సిఐఎ) ప్రమేయం ఉందనే వాదనతో సహా వైమానిక ప్రమాదానికి అనేక సిద్ధాంతాలు ముందుకు వచ్చాయి.[15] 2012 లో విమానం కూలిన ప్రాంత సమీపంలో క్యాలెండర్లు, వ్యక్తిగత లేఖ కలిగిన భారతీయ దౌత్య సంచిని స్వాధీనం చేసుకున్నారు.[16][17]
గ్రెగొరీ డగ్లస్ అనే జర్నలిస్టు తాను మాజీ సిఐఎ ఆపరేటర్ రాబర్ట్ క్రౌలీతో నాలుగేళ్ళుగా చేసిన ఇంటర్వ్యూలను రికార్డు చేసి తరువాత ఆ సంభాషణలను "కాన్వర్‌సేషన్ విత్ ద క్రో" అనే పుస్తకంలో ప్రచురించాడు. హోమిభాభాను హత్య చేయడానికి సిఐఎ కారణమని క్రౌలీ అందులో రాశాడు.[18][19]. విమానపు కార్గో విభాగంలో ఒక బాంబు ఉందని, అది గాలిలో పేలడంతో ఆల్ఫ్స్ పర్వతాల్లో వాణిజ్య బోయింగ్ 707 విమానం కూలిపోయింది. వెలికితీయడానికి పెద్దగా శకలాలు కూడ్ దొరకలేదని క్రౌలీ వ్రాశాడు. భారత అణు పురోగతి గురించి అమెరికాకు తెలుసునని క్రౌలీ పేర్కొన్నాడు.[20]
ఆయన మరణానంతరం, అతని గౌరవార్థం ముంబైలోని అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్‌మెంటును భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌గా మార్చారు. భారతదేశంలోని ఊటీలో రేడియో టెలిస్కోప్ నెలకొల్పడం అతని చొరవ కారణంగా 1970 లో వాస్తవ రూపం దాల్చింది. హోమి భాభా ఫెలోషిప్ కౌన్సిల్ 1967 నుండి హోమి భాభా ఫెలోషిప్లను ఇస్తోంది. అతని పేరుతో ఇండియన్ డీమ్డ్ విశ్వవిద్యాలయానికి హోమి భాభా నేషనల్ ఇన్‌స్టిట్యూట్. గా ముంబైలో హోమి భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ లు ప్రారంభమైనాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.