తెలుగు వ్యాసాలు From Wikipedia, the free encyclopedia
సాక్షి వ్యాసాలు పానుగంటి లక్ష్మీనరసింహారావు (1865-1940) రచించిన ప్రసిద్ధ తెలుగు వ్యాసాల సంపుటి. ఈ వ్యాసములన్ని కూడా చిక్కనైన గ్రాంధిక భాషలో వ్రాయబడినాయి. తెలుగు మాతృభాష గల వారు కూడా అర్ధం చేసుకోవటానికి కొంత శ్రమ పడితేకాని అర్థం కావు. వ్యాసాలన్నీ కూడా కొంత వినోదపూర్వక భావంతోనే వ్రాయబడినప్పటికి, అప్పటి సామాజిక పరిస్థితులను ఎండగడుతూ ఉంటాయి. ప్రతి వ్యాసము ఏదో ఒక సామాజిక విషయాన్ని స్పృశిస్తూనే ఉంటుంది. వ్యాసాలన్నీ కూడ, 1913 - 1933 మధ్య కాలంలో వెలువడినాయి. 1711 - 12 లో స్పెక్టేటర్ అనే ఆంగ్ల పత్రికలో జోసెఫ్ అడ్డిసన్, రిచర్డ్ స్టీల్ వ్రాసిన స్పెక్టేటర్ పేపర్స్ వ్యాసాలతో ప్రేరణ పొందిన[1] పానుగంటి స్పెక్టేటర్ క్లబ్[2] తరహాలో సాక్షి సంఘం అని పేరుపెట్టాడు.
సాక్షి వ్యాసాల రచన 1913లో ప్రారంభమైంది. పానుగంటి లక్ష్మీనరసింహారావు అల్లుడు ద్రోణంరాజు వెంకటరమణారావు తణుకు నుండి నడిపిన "సువర్ణ లేఖ" (1905 - 1907) [3] అనే పత్రికలో సుమారు 28 వ్యాసాలు ప్రచురితమయ్యాయి. కొంత అంతరాయం తరువాత 1920 సెప్టెంబరు నుండి రెండు సంవత్సరాల పాటు ఆంధ్ర పత్రిక సారస్వతానుబంధంలో 82 వ్యాసాలను వారం వారం ప్రచురించారు. 1922 సెప్టెంబరు నుండి 1927 సెప్టెంబరు వరకు మళ్ళీ కొంత అంతరాయం కలిగింది. 1927 తరువాత 1928 మార్చి వరకు మరల ఆంధ్ర పత్రికలోనే పది వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 1933 మార్చిలో మళ్ళీ పునఃప్రారంభమై 20 వ్యాసాలు వచ్చాయి. పానుగంటి సాహిత్యంపై విశేష కృషి చేసిన ముదిగొండ వీరభద్రశాస్త్రి మొత్తం 140 వ్యాసాలున్నాయని చెప్పాడు. ... అయితే ప్రస్తుతం సాక్షి వ్యాసాల సంఖ్య 148గా కనిపిస్తున్నది. పత్రికకు సాక్షి వ్యాసాల పునరుద్ధరణకు వ్రాసిన లేఖలను కూడా వ్యాసాలుగా పరిగణించడం వలన, వివిధ సందర్భాలలో పానుగంటివారు స్వయంగా చేసిన ఉపన్యాసాలను కూడా కలపడం వలన వ్యాసాల సంఖ్య 148కి చేరింది.[4]
మొట్టమొదట వీటిని పిఠాపురం రాజా ముద్రింపించాడు. తరువాత వావిళ్ళవారు 1964-66 లలో ఆరు సంపుటాలుగా ప్రచురించారు. ఆ తరువాత, 1990లలో 3 సంపుటాలుగా ఒకసారి, 2 సంపుటాలుగా విజయవాడ అభినందన పబ్లిషర్స్ చే ప్రచురించబడినాయి. మూడు సంపుటాలుగా వెలువడిన సంపుటాలకు ముందుమాట, రచయిత, ఆకాశవాణి కళాకారుడు అయిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (ప్రముఖ రచయిత, వ్యాఖ్యాత ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి కుమారుడు) వ్రాశాడు. 2006లో విజయవాడ "అభినందన పబ్లిషర్స్" అన్ని వ్యాసాలను ఒకే సంపుటిగా ముద్రించారు. ఈ కంబైన్డ్ ఎడిషన్లో మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి పీఠిక, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ వివరణ, నవతరం పాఠకుల కోసం ప్రతి వ్యాసానికి నండూరి రామమోహనరావు పరిచయాలు ఉన్నాయి.
ఊహాజనితమైన ఈ సంఘం సమాజంలోని దురాచారాలను చర్చించి నిశితంగా విమర్శించే సంఘం. దాదాపు వ్యాసాలన్నీ కూడా సాక్షి సంఘ సమావేశాలలో సంఘ సభ్యుడు జంఘాలశాస్త్రి చెప్తూండగా చదువరులకు తెలియుచేయబడుతాయి. కొన్ని సందర్భములలో కాలాచర్యుడో లేక వాణీదాసుడో ఎక్కడీకో వెళ్ళి అక్కడ తాము చూసిన విషయాలను లేఖద్వారా సంఘమునకు తెలియుపరుస్తారు, ఆ లేఖ చదువటం ద్వారా ఆ వ్యాసవిశేషాలు చదువరులకు తెలుస్తాయి.
"సాక్షి సంఘ నిర్మాణము" అనే మొదటి వ్యాసంలో ఆ సంఘం ఆశయాలు ఇలా చెప్పబడ్డాయి. రాజకీయ దండనము లేని నేరములకు - మనుజుల మాయాప్రచారములకు - సంఘదూషణ మావశ్యకమై యుండదా? ముఖ్యముగ నుండును. ఉండక తప్పదు. ఇట్టి నేరముల గూర్చియే మేమిక వ్రాయుచుందుము. నేరముల వెల్లడింతుము. వాని స్వభావముల విశదపరతుము. వానివలన సంఘముకు గల్గు హానిని స్పష్టపఱతుము. వానియందు జనుల కసహ్యము గల్గునట్లు సేయుటకై ప్రయత్నింతుము. నేరములనే మేము నిందింతుము . కాని యట్టి నేరములకు లోనయిన వారిని నిందింపము. వారినిఁ దలపట్టనైన దలపెట్టము. మాకు వారితో లేశమును బనిలేదు. ఇంతియేగాక మత విషయములను గూర్చియు, నారోగ్య విషయములను గూర్చియుఁ, గవితాద్యభిరుచి ప్రధానశాస్త్రములను గూర్చియు, సంఘదురాచారముల గూర్చియు, విద్యాభివృద్ధి సాధనముల గూర్చియు, జరిత్రాద్యంశములఁ గూర్చియు, రాజభక్త్యాదులఁ గూర్చియు, నావశకములని మాకు దోచిన యింక గొన్ని యితరాంశములను గూర్చియు వ్రాయుచుందుము. .. నేను, మరి నలుగురుఁ గలసి యొక చిన్న సంఘముగఁ జేరినాము. మీ రైదుగురుఁ జేరి, యిట్టి మహా కార్యము సేయగలరా? యని మీరడుగుదురేమో? ఉడుతలు దధినిఁ బూడ్చినట్లు చేసెదము. ... మేము ప్రతిరాత్రియు నొకచోఁ జేరుదుము. ఇప్పటి వరకు మాకు సొంత భవనము లేకుండుటచే నద్దె యింటిలోఁ జేరుదుము.
మాది సత్యపురము. మా సాక్షి స్థానము తపాలకచేరి కెదురుగ.
ఇట్లు విన్నవించు
సభ్యులందఱి బదులు
సాక్షి.
సాక్షి అనగా రచయిత పానుగంటి లక్ష్మీ నరసింహారావే అని ఒక వాదన. బొఱ్ఱయ్యసెట్టి మరణం తరువాత ఆ స్థానంలో సి. బాలనాగమ్మ అనే ఆమెను సభ్యురాలిగా చేర్చుకొన్నారు కాని ఆమె నామమాత్రపు సభ్యురాలే. మొదట్లో సాక్షి ఆధిక్యం గోచరించినా క్రమంగా సాక్షి ప్రతినిధిగా జంఘాలశాస్త్రి ఎదిగాడు.[4]
పై నియమములను పరిశీలిస్తే, ఈ సంఘము హాస్యమునకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నదని వ్యంగ ప్రధానమైనదని తెలుస్తుంది.
మొదటి సంపుటం
|
రెండవ సంపుటం
|
మూడవ సంపుటం
|
|
(స్త్రీ స్వాతంత్ర్యము) -- పదాలు గుప్పించడంలోను, ఒకమాటకు పది మాటలు వాడి వ్యంగ్యాన్ని, వర్ణనను, హాస్యాన్ని రంగరించడంలోను జంఘాలశాస్త్రి ఉద్ధండుడు. మహిళలంతా ఓచోట గుమికూడితే ఎలా ఉంటుందో చెప్పడంలో జంఘాలశాస్త్రి ఇలా రెచ్చిపోయాడు. -- 'ఎక్కడ వినిన గాజుల గలగల, అందెల ఝణఝణ, కాంచీఘంటికల గణగణ, ఎక్కడజూచిన జెక్కుటద్దముల తళతళ, గుబ్బిగుబ్బిల పెళఫెళ, తారాహారముల మిలమిల, వేణీభారముల జలజల, ముద్దుమొగాముల కలకల, ఎక్కడకు బోయిన నగరు ధూపముల గమగమ, చందన చర్చల ఘుమఘుమ, మృగమదలేపముల ఘుమఘుమ... --- కొర్నాటి చీరలవారు, బనారసుకోకలవారు, బరంపురపు పీతాంబరములవారు, సన్నకుసుంబాచీరలవారు, గోచికట్లవారు, గూడకట్లవారు, చుట్టుత్రిప్పులవారు, మేలిముసుగులవారు, వ్రేలుముళ్ళవారు, జడచుట్లవారు, వంకకొప్పులవారు ....
(తోలు బొమ్మలు) -- తోలుబొమ్మలాటను చూడడంలోకంటే ప్రేక్షకులను పరిశీలించడంలో వాణీదాసునికి ఆసక్తి ఎక్కువ -- ఎన్నియోబొమ్మలను ముగ్గురో నల్వురో తెరలోపల నాడించుచుండ నొక్కబొమ్మను వీరందఱు తెరవెలుపల నాడించుచున్నారు. ఇంత శ్రమపడి బొమ్మలాట నేల చూడవలయు నని మీరు నన్నడుగుదురేమో! జనులు విశేషముగ జేరియుండినచోటికి బోవుటకు నాకు మొదటినుండియు నుత్సాహము. జనుల ముఖభేదముల బరిశీలించుట, కంఠరవములను శోధించుట, మాటలతీరులను గనిపెట్టుట, వానికిగారణములగు హృదయరసములను విమర్శించుట, స్వభావభేదములను గుర్తెఱుగుట-యిట్లు ప్రకృతిజ్ఞానమును సంపాదించుటయే నాముఖ్యోద్దేశము. పందిటిక్రింద నాడింపబడుచున్న నిర్జీవపు దోలుబొమ్మలను జూచుటకై పోయిన వాడ గాను. బయటనాడుచున్న ప్రాణమున్న తోలుబొమ్మలయాట జూడ బోయితిని.
(స్వభాష) - ఒక తెలుగువాడు తెలుగు శ్రోతలతో ఆంగ్లంలో ప్రసంగించేసరికి జంఘాలశాస్త్రి ఉద్వేగభరితుడై ఇలా అంటాడు. -- మ్యావుమని కూయలేని పిల్లి యెచ్చటైననుండునా? కిచకిచలాడలేని కోతిని మీరెక్కడైన చూచితిరా? ... అయ్యయ్యో. మనుజుడే. అంత మనుజుడే. ఆంధ్ర మాతాపితలకు బుట్టినవాడే. .. అట్టివాడాంగ్లేయభాషనభ్యసించినంత మాత్రమున ఇప్పుడాంధ్రమున మాట్లాడలేకుండునా? ఆశ్చర్యము, అవిశ్వసనీయము. అసత్యము. ఆంధ్రమున మాటాడకుండ చేసినది అశక్తికాదు. అనిష్టత. అసహ్యత. అది శిలాక్షరమైన మాట. .. తెలుగుబాస యంత దిక్కుమాలిన బాస లేదనియే యా యాంగ్లేయ తేజస్సు నమ్మకము.
Seamless Wikipedia browsing. On steroids.