శుక బ్రహ్మ వేద వ్యాసుని కుమారుడు. ఈ మహర్షి తన జీవితమంతయు సంచారియై ప్రతి గృహమునందు ఆవు పాలు పితికినంత సమయము మాత్రమే గడుపుచుండెడివాడు. కాని పరీక్షిత్తు మహారాజు అంత్యకాలమునందు అతని ఇంటిలో ఏడు దినములు గడిపి అతనికి శ్రీ మద్భాగవతము మొదలగు పురాణములు వినిపించాడు.

ఆకాశమార్గమున నిప్పు వలె వస్తున్న శుకుని చూస్తున్న వ్యాసాదులు

వ్యాస మహర్షి శివుని గురించి తపస్సు చేసి పరమశివుడు ప్రత్యక్షంకాగా సుపుత్రుని ప్రసాదించమని ప్రార్థించగా నీకు సుపుత్రుడు జన్మించగలడని పరమేశ్వరుడు పలికి అదృశ్యుడయ్యాడు. ఒకనాడు వ్యాసుడు అరణి మథించుచుండగా ఘృతాచి కనుపించింది. ఆమెను చూడగానే వ్యాసుడు కామవశుడై వీర్యస్థలనం చేసికొన్నాడు. ఘృతాచి తన్ను బుషి శపించునేమోయని చిలుక రూపం దాల్చి పొంచి యున్నది. అంత వ్యాస మహర్షి వీర్యం నుండి శుక బ్రహ్మ జన్మించాడు. పార్వతీ సహితుడై పరమశివుడు వచ్చి ఈ బాలునకు ఉపనయనం చేశాడు దేవేంద్రుడు కమండలం యిచ్చాడు. దేవతలు దివ్యవస్త్రం ప్రసాదించారు. తండ్రి అనుమతి తీసికొని శుక బ్రహ్మ బృహస్పతిని గురువు చేసికొని ధర్మశాస్త్రము, రాజనీతి నేర్చుకొన్నాడు. విద్య పూర్తి అయిన పిమ్మట శుకుడు తన తండ్రి యగు వ్యాసుని ఆశ్రమమునకు తిరిగి వచ్చాడు. వచ్చిన శుకుని కౌగలించుకుని గౌరవించాడు. మునిబాలకులతో శుక బ్రహ్మ ఆట పాటలతో కాలం వెల్లబుచ్చుతున్నాడు. అది గ్రహించి తండ్రి కుమారుని దగ్గరకు పిలిచి నాయనా నీవు జనకుని వద్దకు వెళ్ళి మోక్షమార్గం తెలిసికొని రమ్మని పంపాడు.

శుక బ్రహ్మ తిన్నగా మిథిలానగరం చేరి తన రాకను జనకునకు తెలియజేయండని ద్వారపాలకులను లోపలికి పంపాడు. వార్త తెలియగనే సపరివారంగా ఎదురేగి జనకరాజు శుకుని లోనికి ఆహ్వానించాడు. కాంచన సింహాసనం చూపాడు. కుసుమములచే అతని పూజించాడు. శుకుని రాకకు కారణం అడుగగా, శుకుడు జనక మహారాజ మా తండ్రి గారి ఆదేశానుసారం మీ వద్ద మోక్షమార్గం తెలిసికొనగొరి వచ్చాను అని మౌనం వహించాడు. జనకుడు శుకునకు అనేక విషయాలు తెలియజేశాడు. అంత శుకుడు పరమశాంతుడై జనకుని వద్ద సెలవు తీసికొని తిన్నగా తండ్రి గారి వద్దకు వచ్చాడు. శుకుడు వ్యాసుని వద్దనే వుండి కాలక్షేపం చేస్తున్నాడు.

శుక బ్రహ్మ కు వ్యాసమహర్షి సృష్టి రహస్యములను తెలిపాడు. ఎన్నో పరమ రహస్య విషయాలు తెలియజేశాడు. అంత శుకుడు అవధూతయై తండ్రి ఆజ్ఞగొని ఎచ్చలను ఉండక భూభాగమంత సంచరించసాగాడు.ఆ సంచారంలో అతడు పరీక్షన్నరేంద్రుని వద్దకు రాగా ఆ రాజు శుకుని పూజించి ఏడు దినములలో ముక్తి లభించునట్లు చేయని అర్ధించాడు.అంత శుక బ్రహ్మ తండ్రి గారిచే వ్రాయబడిన భాగవత కథను ఏడు రోజులు వినిపించి ఈ రాజును మోక్షమార్గుని చేశాడు.భాగవత కథా శ్రవణంలో పరీక్షిత్తు ముక్తినందాడు.శుక బ్రహ్మ సంచారం పూర్తిచేసికొని తిరిగి తండ్రి గారి ఆశ్రమమునకు చేరి ఆయన వద్దనే సుమంత మొదలైన వ్యాస శిష్యులతో గూడి వేదాధ్యయనం చేయసాగాడు.

ఇట్లుండ ఒకనాడు నారద మహర్షి వ్యాసాశ్రమమునకు రాగా శుక బ్రహ్మ ఆ నారద మహర్షికి సుఖాసనం చూపి మహర్షి ఈ లోకమున పుట్టిన వానికి హితమేదియో తెలియజేమండని అడిగాడు. నారదుడు వివరించి చెప్పగా శుకుడు యోగియైనాడు. శుక బ్రహ్మ ని చూచి అప్సరలు సిగ్గువిడిచి వలువలు విడిచి నగ్నంగా ఉండిపోయేవారు. అందుకు శుకుని యోగి ధర్మమే కారణము. కాని వ్యాసమహర్షిని చూచి వారు వలువలు ధరించేవారు. శుకుడు ఆసక్తత గలవాడనియూ తాను సక్తత గలవాడని వ్యాసుడు కుమారుని గొప్పదనమునకు ఆనందించే వాడు. పుత్రుడు మహాన్నతకు సంతోషపడేవాడు. శుకుని పోలిన తత్త్వజ్ఞుడు యోగీశ్వరుడు మూడు లోకాల లోన లేడు. ఇది త్రికాలబాధ్యమానమైన సత్యం. పరమశివుని వరప్రసాదంతో జన్మించిన శుకుడు పరమచయోగీశ్వరుడు. శుక బ్రహ్మ రూప సౌందర్యానికి ముగ్ధురాలై రంభ తనను అనుభవించి తృప్తిపరచమంది. శుకుడు తుచ్ఛ సుఖములు ఆశించనని ఆమెను నిరాకరించాడు. ఈ విషయం శుకరంభా సంవాద రూపమున లోకమందు ప్రసిద్ధి చెందింది.

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.