Remove ads
తెలంగాణ, రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మండలం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
వేములవాడ, తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మండలానికి చెందిన పురపాలకసంఘ పట్టణం.[2] దీని పరిపాలన నిర్వహణ వేములవాడ పురపాలక సంఘం నిర్వహిస్తుంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.[3] ఇది 2011 సెస్టెంబరు 3న వేములవాడ పురపాలకసంఘంగా ఏర్పడింది.[4] ఇది కరీంనగర్‌కు 32 కిమీ ల దూరంలో కరీంనగర్-కామారెడ్డి దారిలో ఉంటుంది.
వేములవాడ | |
---|---|
Nickname: ఎములాడ | |
Coordinates: 18°28′N 78°53′E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రాజన్న సిరిసిల్ల జిల్లా |
Founded by | చాళుక్యులు |
Government | |
• Type | పురపాలక సంఘం |
• Body | వేములవాడ పురపాలక సంఘం; వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ |
విస్తీర్ణం | |
• Total | 28.89 కి.మీ2 (11.15 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 33,706 |
• జనసాంద్రత | 1,200/కి.మీ2 (3,000/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 505302 |
లోక్ సభ నియోజకవర్గం | కరీంనగర్ |
శాసనసభ నియోజకవర్గం | వేములవాడ |
Website | http://www.vemulawadatemple.org |
వేములవాడని పూర్వం లేంబులవాటిక అని పిలిచేవారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం,ఇది పశ్చిమ చాళుక్యుల కాలం నుండి ఉన్నదని ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తోంది.రాష్ట్రకూటుల సామంతులు, వినయాదిత్య యుద్దమల్లుడి(750 CE - 775 CE) కాలంలో నిజామాబాద్ జిల్లా లోని బోధన్ ను రాజధానిగా పాలించిన చాళుక్యులు మొదటి అరికేసరి(775 CE - 800 CE) కాలంలో తమ రాజధానిని వేములవాడకు మార్చారు అందువలన వారిని వేములవాడ చాళుక్యులుగా పిలుస్తున్నారు.వీరి రాజ్యం మంజీర నుండి కాళేశ్వరం వరకు విస్తరించి ఉండేది,దీనిని ‘సాపదలక్ష దేశం’ అని పిలిచేవారు,అంటే లక్షాపాతికవేల బంగారు నాణేల ఆదాయం వచ్చే దేశం అని అర్థం.మొదటి అరికేసరి మనుమడైన బద్దెగుడు(850 CE - 895 CE) వేములవాడలో బద్దెగేశ్వరాలయంను నిర్మించాడు దీనిని ప్రస్తుత భీమేశ్వరాలయంగా చరిత్రకారులు గుర్తించారు.రెండవ నరసింహుడు(915 CE - 930 CE) వేములవాడలో జైన చౌముఖీలను చెక్కించాడు.రెండవ అరికేసరి(930 CE - 941 CE) వేయించిన ‘వేములవాడ సంస్కృత శాసనం’ ప్రకారం ఇతను రాష్ట్రకూట రాజైన నాల్గవ గోవిందుని ఓడించి సింహాసనంపై అతని దాయాదియైన బద్దెగను(రాష్ట్రకూట బద్దెగుడు) కూర్చోబెట్టాడు,ఇతను బోధన్ లో తనపేరుతో అరికేసరి జినాలయాన్ని మరియు వేములవాడలో ఆతిథ్య గృహాన్ని నిర్మించాడు.రెండవ బద్దెగుడు(భద్రదేవుడు)(941 CE - 946 CE) వేములవాడలో ప్రసిద్ధ జైన సమయాచార్యుడైన సోమదేవసూరి కొరకు ‘సుభధామ జినాలయము’ను నిర్మించి రేపాక అను గ్రామాన్ని ఆలయం కొరకు దానం చేశాడు,దీనిని ఇంకా గుర్తించవలసి ఉంది.వీరి కాలంలో కన్నడ ఆదికవిగా పేరుగాంచిన ప్రఖ్యాత కవి పంప,ఇతని సోధరుడు జినవల్లభుడు,మరొక కవి మల్లియరేచనుడు ఉండేవారు.పంప కవి జైనమతావలంబి,ఈయన మొదటి తీర్థంకరుడైన ఆదినాథుడి(వృషభనాథుడు) పేరుతో ‘ఆది పురాణము’, ‘విక్రమార్జున విజయము’ అనే రచనలు చేశాడు.పంపకవికి అరికేసరి ధర్మపురి అగ్రహారాన్ని ఇచ్చాడు.జినవల్లభుడు ధర్మపురిలో జైన ఆలయాన్ని నిర్మించాడు,ఈయన ‘మహావీరస్వామి స్తోత్రము’ ను రచించాడు,వేములవాడ దగ్గరలోని కుర్క్యాలలో తెలంగాణలోనే తొలి పద్య శాసనమైన ‘కుర్క్యాల బొమ్మలగుట్ట శాసనం’ను వేయించాడు.
పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడ ప్రసిద్ధి చెందింది. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది. ఆ బిరుదు పేరిట గాని, లేదా అతడు కట్టించినందువలన గాని ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. రాజాదిత్య మొదటి వినయాదిత్య యుద్ధమల్లుని మనుమడు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు ఉంది. గ్రామాన్ని ఆనుకుని ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు. వద్దేగేశ్వర స్వామి దేవాలయము కూడా ఇక్కడ ఉంది.మధ్యయుగాల్లో ఇది వేములవాడ చాళుక్యులకు రాజధానిగా ఉండేది. పుణ్యక్షేత్రంగానూ, వ్యాపార కేంద్రంగానూ కూడా వేములవాడ 11 శతాబ్ది నాటికే పేరొందింది.
1830ల్లో కాశీయాత్రలో భాగంగా నాటి నైజాం ప్రాంతాలలో మజిలీ చేస్తూ వెళ్ళిన ఏనుగుల వీరాస్వామయ్య ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి తన కాశీయాత్రచరిత్రలో ప్రస్తావించారు. తన యాత్రామార్గంలోని మజిలీల్లో ఇక్కడికి సమీపమైన మజిలీ జగనంపల్లి (డిచ్‌పల్లి సమీపంలోని గ్రామం) గురించి వ్రాస్తూ అక్కడికి 4 మజిలీల దూరంలో వేములవాడ ఉన్నదని వ్రాశారు. అది మహాక్షేత్రమని, రాజేశ్వర క్షేత్రమని పేర్కొన్నారు. అప్పట్లో ఈ ప్రాంతానికి పులుల భయం తీవ్రంగా ఉండేదని, కోడెలను పులులు బాధించేవని పేర్కొన్నారు.[5]
శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రివేళ దీపాలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన ఏర్పాట్లు చేస్తారు. ఇంకా, ఈ దేవాలయం ఇతర చిన్న ఆలయాలకు దానధర్మాలు చేస్తుంది.రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల దేవాలయాల్లో ఇది ఒకటి.దేవస్థానం గ్రామాభివృద్ధి నిమిత్తం సంవత్సరానికి రూ. 8 లక్షలు ఖర్చు పెడుతుంది దేవస్థానం.కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరం లను పావనం చేసిన తరువాత శివుడు వేములవాడ వేంచేసాడని పురాణ కథనం.ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజ రాజేశ్వర స్వామి అని, రాజన్న అనీ అంటారు. మూలవిరాట్టుకు కుడి పక్కన శ్రీ రాజ రాజేశ్వరీ దేవి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ధర్మగుండం కోనేటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి. మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి.
భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలవబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని స్థలపురాణం.
శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి.
హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు: ప్రజల ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికలకు, పథకాలకు సరైన ప్రాతిపదిక కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుకు సంబంధించిన పైలట్ కార్యక్రమాన్ని 2022, మార్చి 5న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ ఈ పట్టణంలో ప్రారంభించాడు. ఆ తరువాత పట్టణంలోని తిప్పాపురంలో 100 పడకల దవాఖాన, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన సీటీ స్కాన్, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్, చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పిడియాట్రిక్ వార్డు & పొలియేటివ్ కేర్ సెంటర్, టీబీ రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని కూడా ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[6]
వేములవాడ పట్టణంలోని నంది కమాన్ జంక్షన్, జిల్లా దవాఖానలో డయాలసిస్ సెంటర్, డీఈఐసీ సెంటర్, మాతృసేవా కేంద్రాలను, ఏరియా దవాఖాన సమీపంలో గోశాల ఆవరణలో రూ.31 లక్షలతో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంటు,[7] మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపంలో 47 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా చేపట్టిన రక్షిత మంచినీటి సరఫరా, మూల వాగు వద్ద అత్యాధునిక హంగులతో ఏర్పాటుచేసిన వాకింగ్ ట్రాక్, శ్యామకుంట జంక్షన్ వద్ద 3 కోట్లతో నిర్మించిన కూరగాయల మార్కెట్ లను 2023 ఆగస్టు 8న రాష్ట్ర ఐటీ-మున్సిపల్-పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు. అనంతరం చింతలతండా గ్రామపంచాయతీలో 42 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పత్రాలను లబ్ధిదారులకు అందజేశాడు.[8] గుడి చెరువు, బద్ది పోచమ్మ దేవాలయం అభివృద్ధి పనులకు, భక్తుల సౌకర్యార్థం 100 గదుల కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేశాడు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ బంధు పథకంలో భాగంగా 600 మందికి చెక్కులను పంపిణీ చేశాడు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[9]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.