Remove ads
భారత ఇంజనీర్, పండితుడు, రాజనీతిజ్ఞుడు మరియు మైసూర్ దివాన్ From Wikipedia, the free encyclopedia
మోక్షగుండం విశ్వేశ్వరయ్య - MV - (సెప్టెంబర్ 15, 1861 — ఏప్రిల్ 12, 1962), భారతదేశపు ఇంజనీరు, పండితుడు, రాజనీతిజ్ఞుడు. మైసూరు సంస్థానానికి 1912 నుండి 1918 దివానుగా పనిచేశాడు. 1955లో ఆయనకు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న లభించింది. అతను ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఐదవ కింగ్ జార్జి నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ (Knight commander of the order of Indian empire (KCIE)) బిరుదునిచ్చి సత్కరించాడు. భారతదేశంలో ఆయన జన్మదినమైన సెప్టెంబరు 15ను ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు. మైసూరులో గల ఆనకట్ట కృష్ణరాజ సాగర్ కు అతను ఛీఫ్ ఇంజనీరుగా పనిచేశాడు. హైదరాబాదును మూసీ నది వరదల నుంచి రక్షించడానికి పథకాలను రూపొందించాడు.
సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య KCIE | |||
పదవీ కాలం 1912 – 1918 | |||
చక్రవర్తి | కృష్ణరాజ ఒడయార్ IV | ||
ముందు | టి. ఆనందరావు | ||
తరువాత | ఎం. కాంతరాజ్ అరస్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | ముద్దేనహళ్ళి చిక్కబళ్ళాపూర్ మైసూర్ రాజ్యం (ప్రస్తుత కర్ణాటక) | 1861 సెప్టెంబరు 15||
మరణం | 1962 ఏప్రిల్ 14 101) బెంగుళూరు | (వయసు||
జాతీయత | భారతీయుడు | ||
పూర్వ విద్యార్థి | COEP | ||
వృత్తి | ఇంజనీరు, దివాను | ||
వృత్తి | ఇంజనీరు | ||
మతం | హిందూ |
విశ్వేశ్వరయ్య 1861, సెప్టెంబరు 15న బెంగుళూరు నగరానికి 60 మైళ్ళ దూరంలో గల చిక్కబళ్ళాపూర్ తాలూకా, ముద్దెనహళ్ళి అనే గ్రామంలో మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి, వెంకటలక్ష్మమ్మ అనే బ్రాహ్మణ దంపతులకి జన్మించారు. వీరి పూర్వీకులు ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మోక్షగుండం గ్రామానికి చెందిన వారు. మూడు శతాబ్దాల కిందట వారు మైసూరు రాష్ట్రానికి వలస వెళ్ళారు. కాబట్టి వీరు తెలుగు మాట్లాడగలిగే వారు.[1] అతని తండ్రి సంస్కృత పండితుడు, హిందూ ధర్మశాస్త్ర పారంగతుడే కాక ఆయుర్వేద వైద్యుడు కూడా. విశ్వేశ్వరయ్యకు 12 సంవత్సరాల వయసులో తండ్రి మరణించాడు. చిక్కబళ్ళాపూరు లో ప్రాథమిక విద్య, బెంగుళూరులో ఉన్నతవిద్య పూర్తి చేసాడు. 1881లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ., తరువాత పుణె సైన్సు కాలేజి నుండి సివిలు ఇంజనీరింగులో ఉత్తీర్ణుడయ్యాడు.[2]
పుణెలో ఇంజనీరింగు పూర్తయిన తరువాత తన 23వ యేట బొంబాయి ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా చేరిన తరువాత, భారత నీటిపారుదల కమిషనులో చేరవలసినదిగా ఆహ్వానం వచ్చింది. అతను దక్కను ప్రాంతంలో చక్కని నీటిపారుదల వ్యవస్థను రూపొందించాడు. నీటి ప్రవాహానికి తగినట్లుగా ఆనకట్టకు ఎటువంటి ప్రమాదం కలగకుండా నీటిని నిల్వచేయగలిగిన ఆటోమాటిక్ వరద గేట్ల వ్యవస్థను అతను రూపొందించాడు. 1903లో మొదటిసారిగా దీనిని పుణె దగ్గరి ఖడక్వాస్లా వద్ద నెలకొల్పారు. వరద సమయంలో ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధిక నీటి నిల్వ చేసే విధానం ఇది. దీని తరువాత గ్వాలియర్ వద్ద అల తిగ్రా వద్ద, మైసూరు వద్ద గల కృష్ణరాజ సాగర్ ఆనకట్టలలోను దీనిని వాడారు.
1906-1907 మధ్య కాలంలో అతన్ని భారత ప్రభుత్వం యెమెన్ లోని ఆడెన్ కి పంపించి అక్కడి నీటి పారుదల వ్యవస్థనూ, మురికి కాలువల వ్యవస్థను రూపకల్పన చేయమని కోరింది. అతను నిర్దేశించిన పథకం ప్రకారం అక్కడ మంచి ప్రాజెక్టు విజయవంతంగా పూర్తిచేయబడింది.[3]
హైదరాబాదు నగరాన్ని వరదల నుండి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించినపుడు, ఆయనకు గొప్ప పేరు వచ్చింది. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా ఆయన పాత్ర ఉంది.[4] కావేరీ నది పై నిర్మించిన కృష్ణరాజసాగర్ ఆనకట్ట ఆది నుంచి అంతం వరకు అతని పర్యవేక్షణలోనే జరిగింది. అప్పట్లో కృష్ణరాజ సాగర్ ఆనకట్ట ఆసియా ఖండంలోనే అతిపెద్దది.[5]
1908లో స్వచ్ఛంద పదవీ విరమణ తరువాత, మైసూరు సంస్థానంలో దివానుగా చేరి సంస్థాన అభివృద్ధికి కృషి చేసాడు. క్రింద పేర్కొన్న సంస్థల ఏర్పాటులో అతను కీలక పాత్ర పోషించాడు.
1917లో బెంగుళూరులో ప్రభుత్వ ఇంజనీరింగు కాలేజి స్థాపించడంలో ముఖ్యపాత్ర వహించాడు. తరువాత ఈ కళాశాలకు అతని పేరే పెట్టడం జరిగింది. ఈనాటికి యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కర్ణాటక లోని పేరున్న విద్యా సంస్థల్లో ఒకటి. మైసూరు విశ్వవిద్యాలయం నెలకొల్పటంలో కూడా అతని పాత్ర ఉంది. పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాడు. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు ఏర్పాటులో కూడా అతని పాత్ర ఉంది. హైదరాబాదులోని పత్తర్‌గట్టి నిర్మాణానికి డిజైన్ ను అందించాడు.
1911లో అతను కంపేనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ (companion of the order of Indian empire) గా నియమితుడయ్యాడు. 1915 లో మైసూరు దివానుగా ఉండగా అతను ప్రజలకు చేసిన ఎన్నో సేవలకు గాను బ్రిటిషు ప్రభుత్వం నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ అనే బిరుదును ఇచ్చింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1955 లో భారత దేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రధానం చేశారు.[6]
లండన్ లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ [7] యాభై సంవత్సరాల పాటు, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆయనకు గౌరవ సభ్యత్వాన్నిచ్చాయి. భారతదేశంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1923లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (Indian science congress)కు అతను అధ్యక్షుడిగా వ్యవహరించాడు.
విశ్వేశ్వరయ్యకు అనేక రంగాలలో విశేషమైన గుర్తింపు లభించింది. అందులో ప్రధానమైనవి విద్యారంగం, ఇంజనీరింగ్. కర్ణాటకలోని అత్యధిక ఇంజనీరింగు కళాశాలలు అనుబంధమై ఉన్న బెల్గాంలోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్శిటీ అతను పేరు మీద నెలకొల్పబడింది. ఇంకా బెంగుళూరులోని యూనివర్శిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సర్ ఎమ్. విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పుణెలోని నాగపూర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (Nagpur college of engineering) అతని పేరు మీదుగా పిలవబడుతున్నాయి. పుణెలో అతని నిలువెత్తు విగ్రహాన్ని చూడవచ్చు.[8] అతను జన్మశతి సంవత్సరంలో బెంగుళూరులో విశ్వేశ్వరయ్య పారిశ్రామిక, సాంకేతిక ప్రదర్శనశాల నెలకొల్పబడింది.
అతను స్వస్థలమైన ముద్దెనహళ్ళిలో విశ్వేశ్వరయ్య మెమోరియల్ ట్రస్టు వారు ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఇది అతను నివసించిన ఇంటి పక్కనే నెలకొల్పబడింది. ఇందులో అతను సాధించిన పతకాలు, బిరుదులు, అతను వాడిన కళ్ళద్దాలు, కప్పులు, వెబ్ స్టర్ డిక్షనరీ, అతను విజిటింగు కార్డును ముద్రించే పరికరం లాంటి వస్తువులు ప్రదర్శనకు ఉంచారు. అంతే కాకుండా అతను రూపకల్పన చేసిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అయిన కృష్ణరాజ సాగర్ ఆనకట్ట నమూనాను కూడా సందర్శించవచ్చు. అక్కడి ప్రజలు దాన్ని ఓ దేవాలయంగా భావిస్తుంటారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.