From Wikipedia, the free encyclopedia
విశ్వనాథన్ - రామమూర్తి దక్షిణ భారతీయ సినిమా సంగీత దర్శక ద్వయం. ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె.రామమూర్తి జంటగా "విశ్వనాథన్ - రామమూర్తి" పేరుతో 1952 నుండి 1965 మధ్యకాలంలో 100కు పైగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలకు సంగీత దర్శకులుగా పనిచేశారు.
విశ్వనాథన్ - రామమూర్తి | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
సంగీత శైలి | సినిమా సంగీతం |
వృత్తి | సంగీత దర్శకులు |
క్రియాశీల కాలం | 1952 | –1965
1928లో కేరళలో జన్మించిన విశ్వనాథన్ సినిమాలలో నటించాలనే, పాటలు పాడాలనే కోరికతో మద్రాసు చేరుకున్నాడు. మొదట కొన్ని చిన్నచిన్న వేషాలు వేసి, సంగీత దర్శకుడు ఎం.ఎస్.సుబ్బయ్యనాయుడు వద్ద హార్మోనిస్టుగా చేరాడు. అక్కడ ఇతనికి టి.కె.రామమూర్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సి.ఆర్.సుబ్బురామన్ వద్ద సహాయకులుగా చేరారు. ఇతడు సుబ్బురామన్ వద్ద హార్మొనీ వాయించేవాడు.హార్మొనీతో పాటు ఇతడు పియానో కూడా వాయించేవాడు.
తిరుచిరాపల్లి కృష్ణస్వామి రామమూర్తి ఒక సంగీత కళాకారుల కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి కృష్ణస్వామి పిళ్ళై, తాత మలైకోట్టై గోవిందస్వామి పిళ్ళై తిరుచిరాపల్లిలో పేరుపొందిన వయోలిన్ విద్వాంసులు. బాల్యంలో ఇతడు తన తండ్రితో కలిసి అనేక కచేరీలలో పాల్గొన్నాడు. 1940 ప్రారంభంలో ఎ.వి.ఎం. స్టూడియోలో ఆర్. సుదర్శనం వద్ద అనేక సినిమాలలో వయోలిన్ సహకారం అందించాడు. తరువాత హెచ్.ఎం.వి. రికార్డింగ్ సంస్థలో వయోలినిస్టుగా చేరాడు. 1940వ దశకం చివరలో సి.ఆర్.సుబ్బురామన్ వద్ద సహాయకుడిగా చేరి అనేక సినిమాలలో పనిచేశాడు.
సి.ఆర్.సుబ్బురామన్ ట్రూపులో విశ్వనాథన్ హార్మోనియం, రామమూర్తి వయోలిన్ సహకారాన్ని అందించేవారు. వీరిద్దరూ సుబ్బురామన్‌ను తమ గురువుగా భావించేవారు. సుబ్బురామన్ 1952లో హఠాత్తుగా మరణించినప్పుడు అతడు సంగీత దర్శకత్వాన్ని పూర్తి చేయకుండా మిగిలి పోయిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిని వీరిద్దరూ చిత్తశుద్ధితో స్వరపరిచి సకాలంలో పూర్తి చేయగలిగారు. ఈ సందర్భంగా విశ్వనాథన్ హిందీ సినిమా సంగీత జంట శంకర్ - జైకిషన్ లాగా తాము కూడా జంటగా పనిచేద్దామని రామమూర్తికి ప్రతిపాదించాడు. మొదట రామమూర్తి అయిష్టత ప్రదర్శించినా తరువాత అంగీకరించాడు.[1]
1952 నుండి 1965 మధ్యలో వీరిద్దరూ కలిసి సుమారు 100 సినిమాలకు పైగా స్వరకల్పన చేశారు. వీరి సంగీత దర్శకత్వంలో పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, శీర్కాళి గోవిందరాజన్, ఎల్.ఆర్.ఈశ్వరి, ఘంటసాల, ఎం.ఎల్.వసంతకుమారి, రావు బాలసరస్వతీదేవి, పి.లీల, జిక్కి, కె.జమునారాణి, ఎ.పి.కోమల, కె.రాణి వంటి గాయకులు పాడారు. గాయక నటులు చిత్తూరు నాగయ్య, పి.భానుమతి, ఎస్.వరలక్ష్మి వంటి వారు కూడా ఈ జంట సంగీతదర్శకత్వంలో పాటలను పాడారు.
వీరు బి.ఆర్.పంతులు, బి.ఎస్.రంగా, కృష్ణన్ - పంజు, ఎ. భీమ్‌సింగ్, ఎ.సి.త్రిలోకచందర్, సి.వి.శ్రీధర్ వంటి దర్శకుల సినిమాలకు సంగీతాన్ని అందించారు.
1965లో ఈ జంట విడిపోయి వేరు వేరుగా సినిమాలకు సంగీతాన్ని అందించారు. తిరిగి 1995లో కలిసి ఒక తమిళ సినిమాకు సంగీతం అందించారు. వీరిద్దరూ కలిసి పనిచేసిన చిట్టచివరి సినిమా అది.
1963లో ఈ జంటకు శివాజీ గణేశన్ చేతుల మీదుగా "మెల్లిసై మన్నార్గళ్" (సంగీత చక్రవర్తులు) అనే బిరుదును మద్రాస్ ట్రిప్లికేన్ కల్చరల్ అకాడమీ అందజేసింది.[2] 2006లో సత్యభామ యూనివర్సిటీ ఈ జంటకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.[3] 2012లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ జంటకు "తిరై ఇసై చక్రవర్తి" అనే బిరుదును ప్రదానం చేసింది.[4][5][6]
సంవత్సరం | సినిమా పేరు | దర్శకుడు | నిర్మాణ సంస్థ | వివరాలు |
---|---|---|---|---|
1953 | అమ్మలక్కలు | డి.యోగానంద్ | కృష్ణ పిక్చర్స్ | సి.ఆర్.సుబ్బురామన్‌తో కలిసి |
1953 | దేవదాసు | వేదాంతం రాఘవయ్య | వినోదా పిక్చర్స్ | బ్యాక్‌గ్రౌండ్ సంగీతం |
1954 | ప్రజారాజ్యం | ఏ.కాశీలింగం | పరిమళం పిక్చర్స్ | |
1954 | మా గోపి | బి.ఎస్.రంగా | విక్రమ్ ప్రొడక్షన్స్ | గడి పాఠ్యం |
1955 | విజయగౌరి | డి.యోగానంద్ | కృష్ణ పిక్చర్స్ | జి.రామనాథన్‌తో కలిసి |
1955 | సంతోషం | సి.పి.దీక్షిత్ | జుపిటర్ పిక్చర్స్ | |
1956 | తెనాలి రామకృష్ణ | బి.ఎస్.రంగా | విక్రమ్ ప్రొడక్షన్స్ | |
1957 | భక్త మార్కండేయ | బి.ఎస్.రంగా | విక్రమ్ ప్రొడక్షన్స్ | |
1957 | కుటుంబ గౌరవం | బి.ఎస్.రంగా | విక్రమ్ ప్రొడక్షన్స్ | |
1958 | మహాదేవి | సుందరరావు నాదకర్ణి | శ్రీగణేశ మూవీటోన్ | |
1959 | రాజా మలయసింహ | బి.ఎస్.రంగా | విక్రమ్ ప్రొడక్షన్స్ | |
1961 | ఇంటికి దీపం ఇల్లాలే | వి.ఎన్.రెడ్డి | ఆర్.ఆర్.పిక్చర్స్ | |
1962 | ఆశాజీవులు | బి.ఎస్.రంగా | విక్రమ్ ప్రొడక్షన్స్ | |
1962 | పెళ్ళితాంబూలం | బి.ఎస్.రంగా | విక్రమ్ ప్రొడక్షన్స్ | |
1962 | ప్రజాశక్తి | ఎ.సి.త్రిలోక చందర్ | మురుగన్ బ్రదర్స్ | |
1963 | మంచి చెడు | టి.ఆర్.రామన్న | ఆర్.ఆర్.పిక్చర్స్ | |
1963 | విజయనగర వీరపుత్రుని కథ | రట్టిహళ్లి నాగేంద్రరావు | ఆర్.ఎన్.ఆర్.పిక్చర్స్ | జి.కె.వెంకటేష్‌తో కలిసి |
1964 | ఆదర్శ సోదరులు | ఎ. భీమ్‌సింగ్ | శ్రీ బాలాజీ ప్రొడక్షన్స్ | టి.వి.రాజుతో కలిసి |
1964 | దొంగనోట్లు | కె.శంకర్ | రమణి పిక్చర్స్ | పెండ్యాల శ్రీనివాస్‌తో కలిసి |
1965 | ఆడ బ్రతుకు | వేదాంతం రాఘవయ్య | జెమినీ స్టూడియో | |
1965 | మారని మనసులు | సి.వి.శ్రీధర్ | విశ్వశాంతి పిక్చర్స్ | పామర్తితో కలిసి |
1965 | సింగపూర్ సిఐడి | దాదా మిరాసి | శ్రీనివాసా మూవీస్ | పామర్తితో కలిసి |
1966 | సర్వర్ సుందరం | కృష్ణన్ - పంజు | టైగర్ ప్రొడక్షన్స్ | పామర్తితో కలిసి |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.