From Wikipedia, the free encyclopedia
వశిష్ఠ మహర్షి హిందూ పురాణాలలో ఒక గొప్ప ఋషి. మహాతపస్సంపన్నుఁడు. సప్త ఋషులలో వసిష్ఠ మహర్షి కూడా ఒకడు. వేదముల ప్రకారం ఇతను మిత్ర మహర్షి, వరుణా దంపతుల కుమారుడు.[1] సూర్యవంశానికి రాజపురోహితుడు. వైవస్వతమన్వంతరమున సప్తర్షులలో ఒకఁడు. ఇంద్రుడు వశిష్ట మహర్షి యొక్క యజ్ఞాలకు మెచ్చి కామధేనువు పుత్రిక అయిన శబల అనే గోవుని ఇస్తాడు. ఇది కామధేనువులాగే తన యజమానికి ఏది కోరితే అది ఇవ్వగలదు.
అందరు మహర్షులలాగా ఈయన ఒంటరి వాడు కాదు. ఈయనకు పరమ పతివ్రత, పతిభక్తి పరాయణురాలైన అరుంధతితో వివాహమైంది. వీరికి 100 మంది కుమారులు కలిగెను. వారిలో శక్తి మహర్షి జేష్టుడు. ఈతని భార్య అదృశ్యంతి. శక్తి మహర్షి పుత్రుడే పరాశరుడు.
ఇంకను వశిష్ఠుడు కుమారులుగా చిత్రకేతువు, పురోచిషుడు, విరచుడు, మిత్రుడు, ఉల్భకుడు, వసుబృద్ధాకుడు, ద్యుమన్తుడు అని ప్రసిద్ధ గ్రంథముల వలన తెలియు చున్నది.
ఈతఁడు దక్షప్రజాపతి కూఁతురు అగు ఊర్జను వివాహమాడి ఆమెయందు రజుఁడు, గోత్రుఁడు, ఊర్ధ్వబాహువు, సవనుఁడు, అనఘుఁడు, సుతపుఁడు, శుక్రుఁడు అని ఏడుగురు పుత్రులను పొందెను. వారు స్వాయంభువ మన్వంతరమున సప్తర్షులుగ ఉండిరి. ఇతఁడు తొలుత బ్రహ్మమానసపుత్రుఁడు అయి ఉండి నిమి శాపముచేత ఆ శరీరమునకు నాశము కలుగఁగా మిత్రావరుణులకు మరల జన్మించెను. ఒకప్పుడు మిత్రావరుణులకు ఊర్వసిని చూచి రేతస్సు స్ఖలితము అయి అది ఒక కుంభమునందు చేర్పఁబడఁగా అందుండి వసిష్ఠుఁడును, అగస్త్యుఁడును పుట్టిరి. కనుక వీరు ఇరువురును కుంభజులు అనఁబడుదురు.
సరస్వతీ నదీ తీరాన వశిష్ట మహర్షి ఆశ్రమం ఉండేది. ఇక్కడ దాదాపు పదివేల మంది శిష్యులకి విద్యాభ్యాసంతో పాటుగా భోజనం కూడా పెట్టేవాడు. అందువల్ల కులపతి అని పేరు వచ్చింది.
Seamless Wikipedia browsing. On steroids.