From Wikipedia, the free encyclopedia
వడ్డాది సుబ్బరాయుడు (జూలై 30, 1854 - మార్చి 2, 1938) నాటక రచయిత, తొలి తెలుగు నాటకకర్తలలో ఇతనికి విశిష్ట స్థానము ఉంది. వసురాయకవిగా పేరుపొందాడు.
సుబ్బరాయుడు 1854, జూలై 30న తూర్పు గోదావరి జిల్లా లోని పాసర్లపూడి గ్రామంలో (ఆనంద నామ సంవత్సర శ్రావణ శుద్ధ పంచమి ఆదివారం నాడు) జన్మించాడు. చిన్నతనంలోనే సుబ్బరాయుడు తల్లిదండ్రులు మరణించారు. ఈయన బడిలో చదివి పాసయిన పరీక్ష ఒక్కటీ లేదని చెబుతారు. అయినప్పటికీ, తన 14వ ఏట నుండే భజగోవింద శ్లోకాలను తెలుగులోకి అనువదించడంతో కవిత్వం చెప్పడం మొదలెట్టారు. 1874లో రాజమండ్రి చేరి అక్కడ ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేశాడు. సమకాలీకులైన వావిలాల వాసుదేవశాస్త్రి, కందుకూరి వీరేశలింగంతోపాటు ఇతన్ని కలిపి రాజమండ్రి త్రయం అని పిలిచేవారు. సుబ్బరాయుడు చాటు పద్యాలు చెప్పడంలో గొప్ప ఆసక్తి కనబరచేవాడు. 1875లో ప్రారంభమైన ఈయన కవితా వ్యాసంగం మరణించేవరకూ సాగింది. ఈయన చెప్పిన చాటు పద్యాలు వసురాయ చాటు ముక్తావళి, వసురాయ చాటు ప్రబంధం అనే సంపుటాలుగా వెలువడ్డాయి. ఈయన ప్రతిభకు ముగ్ధులైన పుర ప్రముఖులు గండపెండేరం తొడిగి, సూక్తి సుధానిధి అనే బిరుదునిచ్చి సత్కరించారు.[1]
సుబ్బరాయుడు ముఖ్యంగా శతక రచనకు పేరొందాడు. ఇతడు నామనందన శతకం (1877), భక్త చింతామణి శతకం (1883), ఆర్త రక్తమణి శతకం (1933) మొదలైన శతకాలు వ్రాసాడు. ఇందులో భక్త చింతామణి శతకం అన్నింటికంటే ఉతృష్టమైనది. ఈ శతకంలో చిన్నపిల్లలు ఇసుకలో గూళ్లు కట్టి, వాటితో కొద్దిసేపు ఆడుకొని, వెళ్ళేటప్పుడు తొక్కేసి వెళ్ళినట్టే, సృష్టి కర్త కూడా జీవితాన్ని ఇచ్చి, కొన్నాళ్లు ఆడించి, తుదకు చెరిపేస్తాడని సృష్టికర్త లీలను మూడు వందల యాభైకి పైగా పద్యాల్లో వర్ణిస్తాడు. ఆర్త రక్తమణి శతకం రామున్ని కీర్తిస్తూ వ్రాసినది.
భక్తచింతామణి శతకం తరువాత వసురాయకవి గారికి అంతగా పేరుతెచ్చినది ‘వేణీ సంహారం’ నాటకం. ఇది సంస్కృత నాటకానికి రసవంతమైన తెలుగు అనువాదం. వసురాయకవి దీనిని రచించి ఊరుకోకుండా, రంగస్థలం మీదికి కూడా ఎక్కించి, అందులో భీముని పాత్రను గూడా పోషించేవారని చెబుతారు.
1875లో సావిత్రీ చరిత్రను ద్విపదలో వ్రాశాడు. ఈయన ఇతర రచనలలో సుగుణ ప్రదర్శనం (1880), సూక్తి వసు ప్రకాశం (1882), కాళిదాసు మేఘదూత అనువాదం (1884).
ఈయన మొత్తం 7 నాటకాలను రచించాడు. ఈ నాటకాలన్ని సంస్కృ తానువాదాలే, అన్ని పాఠ్యగ్రంథాలుగా నిర్ణయించబడినవే.
1. వేణిసంహారం (రచన-1883, ప్రచురణ-1886) 2. విక్రమోర్వశీయం (రచన-1884, ప్రచురణ-1889) 3. ప్రబోధ చంద్రోదయం (రచన-1891, ప్రచురణ-1893) 4. చండ కౌశికము (1900) 5. అభిజ్ఞాన శాకుంతలము (1906) 6. మల్లికామారుత ప్రకరణము (1903, 1929) 7. ఆంధ్రకుందమాల (రచన-1931, ప్రచురణ-1932).
"కరుణ ఏవ ఏకో రసః-కరుణ ఒక్కటే రసం" అన్న సంస్కృత కవి భవభూతి. ఆయన కాళిదాసు తర్వాత సంస్కృత సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందినవాడు. ఆయన రచించిన మాలతీ మాధవం ను అనుకరిస్తూ వచ్చిన ప్రకరణాలలో మల్లికా మారుత ముఖ్యమైనది. దీనిని కాంచీపురానికి చెందిన ఉద్దండిని (15వ శతాబ్దానంతర కాలం) రాసాడు.[2] దీనినే 1903లో వడ్డాది సుబ్బారాయుడు మల్లికా మారుత ప్రకరణం పేరుతొ అనువదించడం జరిగింది. [3] దీని ప్రథమాంకము యొక్క తొలికూర్పు సరస్వతీ ముద్రాక్షరశాల, కాకినాడ యందు 1903 లో ముద్రించబడింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.