From Wikipedia, the free encyclopedia
లె కార్బూజియె(ఆంగ్లం:Le Corbusier)గా ప్రసిద్ధి చెందిన ఛార్లెస్ ఎడ్వర్డ్ జెనరెట్(1887 అక్టోబర్ 6 - 1965 ఆగష్టు 27) స్విట్జర్లాండ్‌లో జన్మించిన ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్, డిజైనర్, అర్బన్ ప్లానర్, పెయింటర్, రచయిత. ఇతడు స్విట్జర్లాండ్‌లో జన్మించి 1930లో ఫ్రెంచి పౌరసత్వం స్వీకరించాడు. ఇతడు 5 దశాబ్దాలపాటు యూరప్, జపాన్, అమెరికా, భారత దేశాలలో పలు భవంతులకు డిజైన్ చేశాడు.
లె కార్బుజియె | |
---|---|
జననం | ఛార్లెస్ ఎడ్వర్డ్ జెనెరెట్ గ్రిస్[1] 1887 అక్టోబరు 6 లా షాక్స్ డి ఫాండ్స్, స్విట్జర్లాండ్ |
మరణం | 1965 ఆగస్టు 27 77) రాక్‌బ్రూన్ కాప్ మార్టిన్, ఫ్రాన్స్ | (వయసు
జాతీయత | స్విస్, ఫ్రెంచి |
వృత్తి | ఆర్కిటెక్ట్ |
పురస్కారాలు | ఎ.ఐ.ఎ.గోల్డ్ మెడల్(1961) లెజియన్ ఆఫ్ ఆనర్(1964) |
భవనాలు | విల్లా సావోయ్, పొయిసి విల్లా లా రోచ్, పారిస్, యునైటెడ్ హాబిటేషన్, మార్షల్లీ నార్టె డేమ్ డు హట్, రోన్ఛాంప్ చండీఘడ్‌లోని భవనాలు |
సంతకం | |
జనసమ్మర్దమైన నగరాలలో ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరచడానికి ఇతడు అర్బన్ ప్లానింగ్ రంగంలో అంకిత దృష్టితో పనిచేశాడు. ఇతడు ఇంటర్నేషనల్ మాడ్రన్ ఆర్కిటెక్చర్ కాంగ్రెస్ (CIAM)లో వ్యవస్థాపక సభ్యుడు. ఇతడు చండీగఢ్ నగరం మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ నగరంలోని పలు భవంతులకు ఇతడు డిజైన్ చేశాడు.
2016, జూలై 17న యునెస్కో ప్రకటించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో 17 ఇతడు చేపట్టిన ప్రాజెక్టులు కావడం మాడ్రన్ ఆర్కిటెక్చర్లో ఇతని కృషికి ఒక తార్కాణంగా పేర్కొనవచ్చు.[2]
ఛార్లెస్ ఎడ్వర్డ్ జెనెరెట్ 1887, అక్టోబరు 6వ తేదీన వాయువ్య స్విట్జర్లాండులోని 'లా షాక్స్ డి ఫాండ్స్ ' అనే చిన్న పట్టణంలో జన్మించాడు. ఈ పట్టణం స్విట్జర్లాండు దేశపు సరిహద్దులలో ఫ్రాన్స్ దేశానికి 5 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ పట్టణం గడియారాలు తయారు చేసే పరిశ్రమలకు ప్రసిద్ధి. ఇతని తండ్రి గడియారపు పరిశ్రమలో పనివాడు, ఇతని తల్లి పియానో పాఠాలు చెబుతుండేది. ఇతని అన్న ఆల్బర్ ఒక వయొలిన్ కళాకారుడు. [3] ఇతడు ఫ్రీడ్రిక్ ఫ్రోబెల్ పద్ధతులలో నడిచే కిండర్ గార్టెన్ లో చదివాడు.[4][5][6] ఇతడు 1920లో లె కార్బ్యూసియె" అనే కల్పిత నామాన్ని ధరించాడు.
ఇతడు తన సమకాలీకులైన ఫ్రాంక్ లాయిడ్ రైట్, లుడ్విగ్ మీస్ వ్యాండ్రో వలె వాస్తుశాస్త్రంలో అకాడమిక్ శిక్షణ పొందలేదు. ఇతడు తన 15వ యేట విజువల్ ఆర్ట్స్ పట్ల ఆకర్షితుడైనాడు. ఇతడు లా షాక్స్ డి ఫాండ్స్ గ్రామంలోని మునిసిపల్ ఆర్ట్ స్కూలులో చేరి గడియారాల తయారీకి సంబంధించిన అప్లైడ్ ఆర్ట్ నేర్చుకున్నాడు. మూడు సంవత్సరాల పిమ్మట ఛార్లెస్ అనే పెయింటర్ వద్ద అలంకరణలో ఉన్నత శిక్షణను తీసుకున్నాడు.[3]
లె కార్బుజియె గ్రంథాలయాలలో పుస్తకాలు చదవడం ద్వారా, సంగ్రహాలయాలను దర్శించడం ద్వారా, భవనాల బొమ్మలను గీయడం ద్వారా, భవనాలను నిర్మించడం ద్వారా స్వంతంగా వాస్తు శాస్త్రాన్ని అభ్యసించాడు. 1905లో మరో ఇద్దరు విద్యార్థులతో కలిసి రెనె చపాలజ్ అనే ఉపాధ్యాయుని పర్యవేక్షణలో ఇతడు లూయీ ఫాలెట్ అనే వ్యక్తి కొరకు తన మొదటి భవనం విల్లా ఫాలెట్ను డిజైన్ చేసి నిర్మించాడు.[7]
1907 సెప్టెంబరులో ఇతడు మొదటిసారి స్విట్జర్లాండు వదలి ఇటలీ, బుడాపెస్ట్, వియన్నాలు పర్యటించాడు. 1908-1910ల మధ్య ఇతడు ప్యారిస్ పర్యటించాడు.1910 అక్టోబరు, 1911 మార్చిల మధ్య ఇతడు జర్మనీ వెళ్ళాడు. 1911లో ఐదు నెలలపాటు ఇతడు సైబీరియా, బల్గేరియా, టర్కీ, గ్రీసు, రోము దేశాలను సందర్శించాడు. ఈ పర్యటనలలో ఇతడు అనేక మంది ప్రముఖ వాస్తుశిల్పులను కలిసి వారి నుండి మెలకువలను నేర్చుకున్నాడు. సుమారు 80 స్కెచ్ పుస్తకాలను తాను చూసిన భవంతుల స్కెచ్‌లతో నింపివేశాడు. తన పర్యటన అనుభవాలను అనేక పుస్తకాలలో వివరించాడు.[8]
1912లో ఇతడు తన గాఢకోరిక అయిన తల్లిదండ్రులకోసం కొత్త ఇంటిని నిర్మించడం ప్రారంభించాడు. జెనెరెట్ పెర్రెట్ హౌస్ నూతన పద్ధతులలో నిర్మించాడు.
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇతడు సైద్ధాంతిక వాస్తు శాస్త్రాన్ని ఆధునిక పద్దతులతో నేర్చుకున్నాడు.[9] 1914 డిసెంబరులో మాక్స్ డ్యుబోయిస్ అనే ఇంజనీరుతో కలిసి రి ఇన్ఫోర్స్డ్ కాంక్రీటును నిర్మాణ సామాగ్రిగా వినియోగించడంపై తీవ్రంగా అధ్యయనం చేశాడు. నిజానికి ఇతడు ప్యారిస్‌లో ఆగస్ట్ పెర్రెట్తో కలిసి పనిచేసినప్పుడే కాంక్రీట్ వినియోగాన్ని కనుగొన్నా ఇప్పుడు కొత్త పద్ధతులలో దానిని ఉపయోగించాలని భావించాడు.
ఈ అధ్యయనం డామినో హౌస్ (1914-15) ప్లాన్ చేయడానికి దోహదపడింది. ఈ నమూనాలో మూడు కాంక్రీట్ స్లాబులు 6 పలుచని ఆర్.సి.సి. స్థంబాల ఆధారంతో ప్రతి అంతస్తుకు ఒక వైపు మెట్ల దారి ఏర్పాటు చేయబడింది.[10] ఈ పద్ధతి మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఎక్కువ సంఖ్యలో తాత్కాలిక గృహాల నిర్మాణానికి తొలుత వాడబడింది. ఈ పద్ధతిలో స్లాబులు, కాలమ్స్, స్టెయిర్వేస్ మాత్రం ఏర్పాటు చేస్తారు. నివాసం ఉండేవారు చుట్టూ గోడలను లభ్యమయ్యే వస్తువులతో నిర్మించుకునేవారు.
ఈ పద్ధతిలో ఇంటి యొక్క నిర్మాణం బయటికి కనిపించకుండా గాజుగోడల వెనుక కప్పిపెట్టవచ్చు, లోపలివైపు ఆర్కిటెక్ట్ తనకు నచ్చిన విధంగా అమర్చవచ్చు.[11] ఈ పద్ధతిపై పేటెంట్ హక్కులు పొందిన తర్వాత లె కార్బ్యూసియె అనేక భవనాలను ఈ పద్ధతిని ఉపయోగించి డిజైన్ చేశాడు. [12]
1916 ఆగస్టులో స్విస్ గడియారాల తయారీదారు అనటోల్ స్క్వాబ్ కొరకు విల్లా నిర్మించడానికి ఇతనికి అవకాశం దక్కింది. విల్లా నిర్మాణానికి అయ్యే ఖర్చు విషయంలో, డిజైన్ విషయంలో, ఇంటీరియర్ డిజైనింగులో, ఫర్నీచర్ ఎంపికలో ఇతనికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు. ఇతడు ఆర్.సి.సి. ఉపయోగించి నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఖాళీ సందులలో ఇటుకలను ఉపయోగించాడు. ఇంటి మధ్యభాగంలో రెండు వైపులా రెండు సెమీకాలమ్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేశాడు. అతి పెద్ద హాలు మధ్యలో షాండ్లియర్ బిగించాడు. అయితే క్లయింట్ ఐడియాలతోను, బడ్జెట్ విషయంలోను ఇతనికి క్లయింటుతో విభేదాలు ఏర్పడటంతో ఇతని ఆ భవంతిని తీర్చిదిద్దడంలో అతని ఆశలు నెరవేరలేదు. స్క్వాబ్ కోర్టుకు వెళ్లి ఇతడిని ఆ భవనం దగ్గరకు రానీయలేదు. ఇతనిని ఆ ఇంటి ఆర్కిటెక్ట్‌గా పేర్కొనే హక్కును హరించాడు. దానికి ఇతడు స్పందించి "నీవు అంగీకరించినా అంగీకరించక పోయినా నీ యింటి ప్రతి కోణంలో నా ఉనికి కనబడుతుంది" అని సమాధానమిచ్చాడు. ఈ భవన నిర్మాణాన్ని గర్వంగా భావించి ఈ ఇంటి తాలూకు బొమ్మలను ఇతడు తన అనేక పుస్తకాలలో ప్రకటించాడు.[13]
లె కార్బుజియె చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టు, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు భారతదేశంలోని హర్యానా, పంజాబ్ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీఘర్‌ను నిర్మించడం.1951లో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఇతడిని సంప్రదించి ప్రాజెక్టును ప్రతిపాదించవలసిందిగా కోరాడు. అమెరికాకు చెందిన ఆల్బర్ట్ మేయర్ అనే ఆర్కిటెక్ట్ 1947లో 1.5 లక్షల జనాభాకు సరిపడా ఒక నగరాన్ని ప్లాన్ చేశాడు కానీ భారత ప్రభుత్వం అంతకంటే ఘనమైన, ప్రతిష్టాత్మకమైన నగరాన్ని నిర్మించాలని భావించింది. (ప్రస్తుతం ఈ నగర జనాభా 10 లక్షలను దాటింది.) లె కార్బుజియె అర్బన్ డిజైనింగులోను, ట్రోపికల్ క్లైమేట్ ఆర్కిటెక్చర్లోను నిష్ణాతులైన మాక్స్వెల్ ఫ్రై, జేన్ డ్రూ అనే ఇద్దరు బ్రిటిష్ ఆర్కిటెక్ట్‌లతో కలిసి ప్లాన్ చేశాడు. నిర్మాణ పనుల పర్యవేక్షణకు తన బంధువు పియరీ జెనెరెట్తో కలిసి భారతదేశానికి వచ్చాడు.
ఇతని ప్లానులో నివాస, వాణిజ్య, పారిశ్రామిక స్థలాలు, పార్కులు, ప్రయాణ సదుపాయాలు ఉన్నాయి. నగరం మధ్యలో నాలుగు పెద్ద ప్రభుత్వ భవనాలు; ప్యాలెస్ ఆఫ్ ది నేషనల్ అసెంబ్లీ, హైకోర్ట్ ఆఫ్ జస్టీస్, ప్యాలెస్ ఆఫ్ సెక్రెటేరియట్, ప్యాలెస్ ఆఫ్ ది గవర్నర్ నిర్మించాలని భావించాడు కానీ ఆర్థిక, రాజకీయ కారణాల వల్ల గవర్నర్ ప్యాలెస్‌ను వదిలివేశారు.[14]ఇతని డిజైన్‌లో స్థానిక ప్రాకృతిక స్థలాలు, సూర్యకాంతి, నీడలు వంటి వాటిని ఉపయోగించి వాస్తువిలాసాలను సృష్టించడం వంటి అయిడియాలను వాడుకున్నాడు. ఇతనికి ఇష్టమైన చిహ్నం "తెరచిన చేయి"ని ప్రతిష్టాత్మకమైన స్మారక స్థూపంగా తన డిజైన్‌లో ముఖ్యమైన చోటులో ప్రతిపాదించాడు.[14] హైకోర్ట్ ఆఫ్ జస్టీస్ 1951లో ప్రారంభించబడి 1956లో పూర్తి అయ్యింది. సెక్రెటేరియట్ 1952 - 1958ల మధ్య నిర్మించబడింది. ప్యాలెస్ ఆఫ్ అసెంబ్లీ 1952-61ల మధ్య నిర్మించబడింది.
ఇతడు తన వైద్యుని సలహాను లెక్కచేయక 1965, ఆగష్టు 27వ తేదీన ఫ్రాన్స్ దేశంలోని రాక్‌బ్రూన్ కాప్ మార్టిన్ సమీపంలోని మధ్యధరా సముద్రంలో ఈతకు వెళ్లాడు. అప్పుడు ఇతనికి గుండెపోటు వచ్చి నీటిలో మునిగి మరణించాడు.ఇతని అంత్యక్రియలు అప్పటి ఫ్రాన్స్ దేశపు సాంస్కృతిక మంత్రి ఆధ్వర్యంలో 1965 సెప్టెంబరు 1న జరిగాయి. ఇతడిని తన భార్య సమాధి ప్రక్కనే సమాధి చేశారు.
ఇతని కృషిని భద్రపరచడానికి లె కార్బ్యూజియె ఫౌండేషన్ పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేశారు. ఇది ప్యారిస్‌లో ఒక మ్యూజియంను నడుపుతుంది.
ఈ సంస్థ 1963లో ఏర్పాటయింది. ఇది లె కార్బ్యూసియె 1933-65ల మధ్య నివసించిన అపార్ట్మెంటును, ఇతని తల్లిదండ్రుల కోసం 1924లో నిర్మించిన ఇంటిని స్వంతం చేసుకుంది.
ఈ మ్యూజియంలో 8,000 ఇతడు వేసిన నిజమైన డ్రాయింగులు,ప్లానులు, 450 పెయింటింగులు, 30 పింగాణి పెయింటింగులు, ఇతని రచనలు, ఫోటోగ్రాఫులు భద్రపరిచారు. లె కార్బ్యూసియెకు సంబంధించి ప్రపంచంలోని అతి పెద్ద సంగ్రహాలయం ఇదే.[15][16]
2016లో యునెస్కో 851 ప్రపంచ వారసత్వ ప్రదేశాలను గుర్తించింది. వాటిలో 17 లె కార్బుజియె నిర్మించినవి కావడం నూతన నిర్మాణరంగ ఉద్యమంలో ఇతని విశేషమైన ప్రతిభకు తార్కాణంగా భావించవచ్చు.[18]
స్విట్జర్లాండ్ ప్రభుత్వం 10 స్విస్ ఫ్రాంక్ కరెన్సీపై ఇతని బొమ్మను ముద్రించింది.
ఈ క్రింది ప్రదేశాలకు ఇతని పేరు పెట్టి గౌరవించారు.
ఇతడు తన రచనలను ఫ్రెంచి భాషలో చేశాడు. వాటి ఇంగ్లీషు పేర్లు క్రింద ఇవ్వబడ్డాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.