రామరాజభూషణుడు

From Wikipedia, the free encyclopedia

రామరాజభూషణుడు
Remove ads
Remove ads

రామరాజభూషణుడు గా పేరుగాంచిన భట్టుమూర్తి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజాల లో ఒకడు. ఈయన 16వ శతాబ్దముకు చెందిన తెలుగు కవి, సంగీత విద్వాంసుడు. ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాయల ఆస్థానమునకు ఆభరణము వలె ఉండటము వలన ఈయనకు 'రామరాజభూషణుడు' అని పేరు వచ్చింది. ఒక గొప్ప ఆంధ్రకవి. ఈయన జన్మభూమి బల్లారికి సమీపము లోని పాలమండలము అను ప్రదేశంలో ఉండే భట్టుపల్లె. ఇతడు శాలివాహనశకము 13 వ శతాబ్ద మధ్యకాలమున జీవించి ఉన్నట్లు తెలుస్తున్నది. ఇతడు రచియించిన గ్రంథములు వసుచరిత్రము, హరిశ్చంద్ర నలోపాఖ్యానము, కావ్యాలంకారసంగ్రహము. అందు మొదటిది రెండవదానివలె శుద్ధశ్లేషమయము కాకపోయినను శ్లేషనే అనుజీవించి ఉండును. దీనివలె కఠినశైలి కలదిఁయు మధురము అయినదియు అగు శ్లేషకావ్యము మఱియొక్కటి తెలుగులో లేదు. రెండవది కేవలశ్లేషమయమై హరిశ్చంద్రుని యొక్కయు నలుని యొక్కయు చరిత్రములను తెలుపుచు ఉంది. మూడవది కావ్యాలంకార లక్షణములను తెలుపునది. తెనుఁగునందు మేలైన అలంకార శాస్త్రము ఇది ఒక్కటే కనబడుతూ ఉంది. ఈతని కావ్యములు మిక్కిలి శ్లాఘనీయములుగా ఉన్నాయి. అయినను అవి ఇంచుక మతాంతరలక్షణమును తెలుపును. ఇతనికి రామరాజభూషణుఁడు, భట్టుమూర్తి అను బిరుదాంకము కృష్ణదేవరాయలచే ఇయ్యఁబడెను.

Thumb
రామరాజభూషణుడు

నెల్లూరు ప్రాంతమునకు చెందిన భట్టుమూర్తి వసుచరిత్రము, హరిశ్చంద్ర, నలోపాఖ్యనము, నరసభూపాలీయము అని కావ్యములను రచించాడు. వీటన్నిటిలో వసుచరిత్ర చాలా ప్రసిద్ధమైనది. ఇందులోని శ్లేష ప్రయోగము ప్రశంసనీయము. ఆ తరువాత కాలములో వచ్చిన చేమకూరి వెంకటకవి భట్టుమూర్తి శైలిని అనుకరించాడు.

ఇతనిని గూర్చి పింగళి లక్ష్మీకాంతం ఇలా వ్రాసాడు - "ఈ కవి గాయకుడు. సంగీత కళానిధి. సంగీతమునకు, కవిత్వమునకు గల పొత్తును ఇతనివలె మరి యే కవియు గ్రహించలేదు. ఇతని పద్యములన్నియు లయ గమకములు గలవి. కీర్తనలవలె పాడదగినవి. అంతే గాక ఈ కవి గొప్ప విద్వాంసుడు. నానాశాస్త్ర నిష్ణాతుడైన బుద్ధిశాలి. పద్య రామణీయకత, ప్రౌఢ సాహిత్యము, విజ్ఞాన పటిమ ఇతని రచనలలో గోచరించును. .... ఇతనికి శ్లేష సహజము. రామరాజభూషణునివలె పద్యము వ్రాయగలవారు లేరు. .. కవులలోనింతటి లాక్షణికుడు లేడు.[1]

Remove ads

కావ్యాలంకారసంగ్రహము

భట్టుమూర్తి రచించిన మొదటి గ్రంథము కావ్యాలంకార సంగ్రహము. ఇది 5 ఆశ్వాసాల అలంకార శాస్త్రము. నరసభూపాలీయమని దీనికి మరో పేరు. ఇది సంస్కృతంలో విద్యానాథుడు రచించిన ప్రతాపరుద్రయశోభూషణమును అనుసరించి వ్రాయబడిన గ్రంథము. కావ్య ధ్వని రసాలంకారముల గురించి, నాయికానాయకులను గురించి, గుణదోషముల గురించి ఇందులో వివరించబడింది. నాలుక కదలనక్కరలేని అక్షరములతో రచించిన అలజిహ్వము_

భోగాంబువాహ వాహ విభాగేహాభావుకాంగభావభావమహా
భాగ మహీభాగమహాభోగావహబాహుభోగిపుంగవభోగా

అన్న పద్యంలో నాలుక కదపనక్కరలేని అక్షరాలున్నాయి. గర్భ కవిత్వము, బంధ కవిత్వము మొదలుగునవి కూడా నరసభూపాలీయములో భట్టుమూర్తి ప్రదర్శించాడు.

Remove ads

వసుచరిత్రము

ఇది భారతములోని ఉపరిచర వసువు కథ, ఇది కవిత్రయము రాసిన మహా భారతంలో 45 పద్యాలలో ఉన్నది, దీనిని రామరాజభూషణుడు విస్తరిస్తూ ఆరు ఆశ్వాసాలు కల ఒక ప్రత్యేక గ్రంథంగా మలిచారు, తిరుమల నాయునికి ఈ కృతి అంకితమివ్వబడింది.

ఉపరిచర వసువు, మహా తపస్సు చేస్తాడు, ఆ తపస్సుకి ఇంద్రుడు ప్రత్యక్షమై ఒక దివ్యవిమానాన్ని ఇచ్చి అప్పుడప్పుడూ తన లోకానికి రమ్మన మంటాడు, దీనికి ప్రతిగా ఉపరిచర వసువు తన రాజ్యంలో పూజలు చేసే ఏర్పాటూ చేస్తాడు. అధిష్ఠానపురం రాజధానిగా చేసుకుని పరిపాలిస్తాడు. కోలాహలుడు అనే పర్వతము, శుక్తిమతి అనే నది ప్రేమలో పడతారు. కోలాహలునికి, శుక్తిమతికి ఒక కూతురు, ఒక కొడుకు పుడతారు. కూతురి పేరు గిరిక, కొడుకు వసుపదుడు. గిరికను వసు మహారాజు చూసి తనను గాంధర్వ విధిన వివాహం చేసుకుంటాడు. వసుపదుని సేనాధిపతిగా నియమిస్తాడు. ఇదీ వృత్తాంతం.

వసుచరిత్రలో శుక్తిమతీ కోలాహల వృత్తాంతం అత్యంత రమణీయమైన ఘట్టం. ఈ సందర్భంలో కవి నదీ పర్వతాలకు దైవీరూపాన్ని ఆపాదించి రచించాడు.ఇలా రచించడం చమత్కారానికి మాత్రమే కాదు లౌకికానుభవానికి సంబంధించిన రాగబంధు రీతులను తెలియపరచాడానికి అని అనవచ్చును. ఇంకా భౌగోళిక సంబంధాన్ని మానవ దృష్టితో పరిశీలించి విమర్శించడం కోసం అని కూడా అనుకోవచ్చును. శుక్తిమతి యొక్క నిత్యనిర్మలాకార కాంతిధార కు కోలాహలుడు వశుడవడం విచిత్రమైన మనోవిలాసం. శుక్తిమతి తనని ఆదరిస్తుందని కోలాహలుని నమ్మకం. ఆమె అభిమతం తెలుసుకోకుండా ఆమెను పొందడానికి నిశ్చితాత్ముడు అవుతాడు కోలాహలుడు. కావ్యదృష్టితో పరికించేవారు శుక్తిమతీ కోలాహల వృత్తాంతాన్ని రసాభాసమన్నారు.ఏకత్రైనురాగం కారణంగా ఈ సన్నివేశంలో పోషింపబడినది రసాభాసమనడం సమ్మతమే. ఇందుకు ఇంకొక కారణం కూడా ఉన్నది: నదులకు, పర్వతాలకు ప్రణయం పొసగదని శుక్తిమతి ఇందులో వాచ్యం చేస్తుంది.పర్వతాలకు, నదులకు సఖ్యమా? వినటానికే యుక్తంగా లేదు పర్వతాల నుండి నదులు పల్లానికి ప్రవహిస్తాయి.ఆ నదీ జలం పర్వతానికెక్కడం ప్రకృతి విరుద్ధం. జన్య జనక సంబంధంలో పుత్రికా వాత్సల్యం ఉండాలి కాని అనుచతిమైన ప్రణయానురాగం ఉండకూడదని శుక్తిమతి ఉగ్గడిస్తుంది.వావి వరసలు తెలిసి వర్తించాలని బోధిస్తుంది. మదనవికారంలో గౌరవాన్ని మరచిపోకూడదు అంటుంది. పుణ్యదేశాలు తిరిగి భర్తృవియోగ తపనంచేత శరీరం కృశించగా, భర్తను (సముద్రుని) వెదకికొనిపోయె అభిసారికనని వాచ్యం చేస్తుంది. నదులు కొండలలో పుట్టి పుణ్యప్రదేశాలలో ప్రవహించి సముద్రాన్ని చెందుట లక్షణం. ఇటువంటి తనపై ఉద్దతి పనికిరాదని అతడు తరుణులైన రంభాదులను ఆశ్రయించడం యుక్తమని శుక్తిమతి చెబుతుంది. దీనికి కోలాహలుడు తనది పూర్వజన్మజన్మలప్రేమ అని అతడు చివరికి బలముతో పొందుతాడు.అందుకే వసురాజు దీనిని ఖలగోత్ర ధ్వంసనం అంటాడు. ఇది ఇలా ఉండగా రామరాజభూషణుడి వర్ణన, కవిత్వ పటిమ ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది.

ఇది మూడు రోజుల్లో జరిగే కథ.

  1. ప్రథమాశ్వాసము: కృతిభర్త వంశచరిత్ర, కోలాహలం శుక్తిమతి నదికి అడ్డంపడటం.
  2. ద్వితీయాశ్వాసము: కోలాహలం శుక్తిమతుల ప్రేమ.
  3. తృతీయాశ్వాసము: గిరిక, వసుపదుల పుట్టుక
  4. చతుర్థాశ్వాసము:
  5. పంచమాశ్వాసము:
  6. షష్ఠమాశ్వాసము:
Remove ads

హరిశ్చంద్రనలోపాఖ్యానము

ఇది ఒక ద్వ్యర్థి కావ్యము అంటే ఒకే పద్యములో రెండు అర్థాలు వస్తాయి, ఒకటి నలుని పరంగా ఒకటి హరిశ్చంద్రుడి పరంగా అన్వయించుకొని చదవాలి.

ఉదాహరణ పద్యాలు

మ. హరిదం భోరుహ లోచనల్ గగన రంగాభోగ రంగత్తమో
     భర నేపథ్యము నొయ్య నొయ్య సడలింపన్ రాత్రి శైలూషికిన్
     వరుసన్మౌక్తిక పట్టమున్ నిటలమున్ వక్త్రంబునున్ దోఁచె నా
     హరిణాం కాకృతి వొల్చె రేకయి సగంబై బింబమై తూర్పునన్

గగన రంగాభోగం వేదిక. ఆభోగం అంటే విశాలమైనది. తమోభర నేపథ్యం అంటే చీకటి యవనిక. రాత్రి అనే శైలూషి (అంటే నటి). దిక్కులు అనే స్త్రీలు - హరిదంభోరుహ లోచనల్, హరిత్తులు అంటే దిక్కులు - ఆ చీకటి తెరనూ కొంచెం కొంచెం దించుతున్నారు. ముందు నిశాశైలూషి మౌక్తిక పట్టం కనిపించింది. తరువాత నొసరు కనిపించింది. ఆపైన ముఖం పూర్తిగా కనిపించింది. అలా క్రమక్రమంగా చంద్రబింబపు ఆకారం, ముందు రేఖలాగా, తర్వాత అర్ధచంద్రుని లాగా, ఆ తర్వాత పూర్ణబింబంగా తూర్పు దిక్కున కనిపించింది. నటీమణులు నొసటిపైన ముత్యాల పట్టీ ధరించడం ప్రసిద్ధం. స్త్రీ నొసరు చంద్రరేఖలా ఉండడం, స్త్రీ వదనం పూర్ణ చంద్రునిలా ఉండడం కూడా ప్రసిద్ధ కవి సమయాలే. తాను నాటకాల్లో చూసిన నటీమణి రంగప్రవేశాన్ని మనసుకు తెచ్చుకొని, కవిత్వంలో దానికి అందంగా చంద్రోదయంతో పోలిక సంధించాడు, రామరాజ భూషణకవి. చాలా సహజంగా ఉంది కదా, పోలిక! జానపదుల నిత్యానుభవ దృశ్యాలు ప్రతిబింబించిన కవిత్వం ఎంత నిసర్గంగా ఉంటుందో ఈ పద్యం చెప్పకనే చెపుతున్నది.[2]

Remove ads

మూలాలు

Loading content...

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads